"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అంజు బాబీ జార్జ్

From tewiki
Jump to navigation Jump to search
అంజు బాబీ జార్జ్
15Anju-Bobby-George1.jpg
అంజు బాబీ జార్జ్
వ్యక్తిగత సమాచారం
జననం (1977-04-19) 19 ఏప్రిల్ 1977 (వయస్సు 43)
Changanassery, కేరళ, India
క్రీడ
దేశం భారతదేశం
క్రీడAthletics
పోటీ(లు)Long jump
Triple jump
సాధించినవి, పతకాలు
వ్యక్తిగత అత్యుత్తమ(s)Long jump: 6.83 m NR
(Athens 2004)
Triple jump: 13.67 (Hyderabad 2002)
Updated on 10 July 2013.

అంజు బాబీ జార్జ్ (Anju Bobby George) (మళయాలం :അഞ്ജു ബോബി ജോര്‍ജ്ജ്)భారతదేశానికి చెందిన ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఈమె 1977 ఏప్రిల్ 19న జన్మించింది. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ పోటీలలో కాంస్య పతకం సాధించి భారత అథ్లెటిక్స్‌లోనే చరిత్ర సృష్టించింది. లాంగ్‌జంప్‌లో 6.70 మీటర్లు దూరం దాటి ప్రపంచ ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ పోటీలలో పతకం సాధించిన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు స్థాపించింది. 2005లో ఐ.ఎ.ఎ.ఎఫ్. ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో రజత పతకం సాధించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారాలలో ఒకటైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా ఆమెకు బహుకరించారు.

బాల్యం

అంజు 1977, ఏప్రిల్ 19న కేరళలోని చంగనాస్సరిలో కోచిపరాంబిల్ కుటుంబంలో జన్మించింది. అంజు తండ్రి ప్రోత్సాహం, పాఠశాల శిక్షకుడు తోడ్పాటుతో అథ్లెటిక్ రంగంలోకి ప్రవేశించింది. ఆమె పాఠశాల విద్య సి.కె.ఎం. కొరుథోడ్ పాఠశాల నుంచి, డిగ్రీని విమలా కళాశాల నుంచి పూర్తిచేసింది.1991-92లో జరిగిన పాఠశాల అథ్లెటిక్ మీట్‌లో 100 మీటర్ల హార్డిల్స్, రిలేలలో విజయం సాధించింది. లాంగ్‌జంప్, హైజంప్‌లలో ద్వితీయ స్థానంలో నిల్చింది. దాంతో ఆమె మహిళా ఛాంపియన్‌గా ఎన్నికైంది. జాతీయ పాఠశాల క్రీడోత్సవాలలో అంజు 100 మీటర్ల హార్డిల్స్‌లో, 4x100 హార్డిల్స్ రిలేలో మూడో స్థానంలో నిల్చింది. అయిననూ ఆమె ప్రతిభను పలువురు గుర్తించడంతో ఆ తర్వాత ఆమె దశ మారింది.

క్రీడా జీవితం, మైలురాళ్ళు

  • ఆమె హెప్టాథ్లాన్‌లో క్రీడాజీవితం ప్రారంభించినా ఆ తర్వాత లాంగ్‌జంప్, హైజంప్‌లపై శ్రద్ధ చూపించి 1996లో ఢిల్లీలో జరిగిన జూనియన్ ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌లో స్వర్ణపతకం సాధించింది. 1999లో బెంగుళూరులో జరిగిన ఫెడరేషన్ కప్ క్రీడలలో అంజు ట్రిపుల్‌జంప్‌లో జాతీయ రికార్డు సృష్టించింది.
  • 1996లో నేపాల్‌లో జరిగిన దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడలలో రజత పతకం సాధించింది. 2001లో తిరువనంతపురంలో జరిగిన నేషనల్ సర్క్యూట్ మీట్‌లో అంజు లాంగ్‌జంప్‌లో 6.74 మీటర్లు దుమికి తన రికార్డును మెరుగుపర్చుకుంది.
  • 1996లో లుధియానాలో జరిగిన జాతీయ క్రీడలలో ట్రిపుల్‌జంప్‌లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత హైదరాబాదులో జరిగిన జాతీయ క్రీడలలో కూడా అంజు తన ప్రతిభను చాటిచెప్పింది. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో అంజు 6.49 మీటర్లు లాంగ్‌జంప్ చేసి కాంస్యపతకం గెల్చింది.
  • బుసాన్లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించి పెట్టింది. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ పోటీలలో 6.70 మీటర్ల దూరం దుమికి కాంస్య పతకం సాధించి దేశ అథ్లెటిక్ చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలలో పతకం గెల్చిన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించింది.
  • 2004 ఒలింపిక్ క్రీడలలో 6వ స్థానం వచ్చిననూ 6.83 మీటర్లు దుమికి తన రికార్డును మెరుగుపర్చుకుంది. 2005లో దక్షిణ కొరియాలోని ఇంచెయాన్‌లో జరిగిన 16వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 6.65 మీటర్ల దూరంతో బంగారుపతకం గెల్చింది. అదే సంవత్సరం ఐ.ఎ.ఎ.ఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో 6.75 మీటర్లు దుమికి రజిత పతకం సాధించింది. ఇదే ఆమె ఆఖరి అత్యున్నత ప్రతిభ. 2006లో దోహలో జరిగిన 15వ ఆసియా క్రీడలలో లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించింది. 2008, ఫిబ్రవరి 14న దోహాలో జరిగిన ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ పోటీలలో రజతపతకం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో రజత పతకం సాధించడం అంజుకు ఇదే తొలిసారి.

అవార్డులు, గుర్తింపులు

  • 2002-03లో అంజు ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అర్జున అవార్డును ప్రధానం చేసింది.
  • 2003-04లో క్రీడారంగంలో అత్యున్నతమైన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు కూడా అంజు జార్జ్ కు ప్రధానం చేశారు.
  • 2004లో భారతదేశంలో నాల్గవ అత్యున్నతమైన పౌర పురస్కారమైన పద్మశ్రీని స్వీకరించింది.
  • 2007 ఫిబ్రవరి 12 నాటికి ఐ.ఎ.ఎ.ఎఫ్ విడుదల చేసిన ర్యాంకు ప్రకారం ఆమె 28వ స్థానంలో ఉంది. ఒక దశలో ఆమె 4వ స్థానం కూడా సంపాదించింది.

వ్యక్తిగత జీవితం

అంజు జార్జి భర్త, బాబీ జార్జ్ కూడా క్రీడాకారుడే. మెకానికల్ ఇంజనీర్ అయిన అతడు ట్రిపుల్ జంప్‌లో జాతీయ క్రీడల చాంపియన్. అంజుకు క్రీడలలో ప్రాత్సాహమే కాకుండా మంచి శిక్షణ కూడా ఇచ్చాడు. అంజు ఈ ఘనత సాధించడానికి ఆమె భర్త కూడా కారకుడే. 1998 నుంచి అంజుకు పూర్తి కాలపు కోచ్‌గా వ్యవహరించాడు. బాబీ జార్జి ఉన్నత క్రీడారంగానికి చెందిన కుటుంబానికి చెందినవాడు. అతని సోదరుడు జిమ్మీ జార్జ్ ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు. ప్రస్తుతం అంజు, బాబీ జార్జ్ కర్ణాటకలోని బెంగుళూరులో నివసిస్తున్నారు. అంజు వృత్తి కస్టమ్స్ శాఖ కాగా, బాబీ కేరళ ప్రభుత్వపు పబ్లిక్ వర్క్స్ శాఖలో పనిచేస్తున్నాడు.

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).