"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అడబాల

From tewiki
Jump to navigation Jump to search
కందిమళ్ళ సాంబశివరావు
దస్త్రం:అడబాల.jpg
జననంఫిబ్రవరి 9, 1936
మరణంమార్చి 14, 2013
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, రూపశిల్పి, అధ్యాపకుడు
తల్లిదండ్రులువెంకన్ననాయుడు, సత్యమ్మ

అడబాల (ఫిబ్రవరి 9, 1936 - మార్చి 14, 2013) రంగస్థల నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకుడు.[1]

జననం

ఈయన 1936, ఫిబ్రవరి 9తూర్పు గోదావరి జిల్లాలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు సత్యమ్మ, వెంకన్ననాయుడు.

రంగస్థల ప్రస్థానం

నాటకరంగానికి రూపశిల్పిగా సుపరిచితులు. ఆ శాఖలో లోతుపాతులు కూలంకషంగా, శాస్త్రీయ పద్ధతులలో అధ్యయనం చేసి నైపుణ్యం సంపాదించాడు. జాతీయ స్థాయిలో నాటక విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆహార్యంలో మెళకువలు బోధించాడు. సీనియర్ మేకప్ ఆర్టిస్టులలో ఆడబాల ముఖ్యులు. ఈయన బి.ఏ పట్టభద్రుడు. డాక్టర్ గరికపాటి రాజారావు వద్ద నటనలోను, ఆదర్శ నాట్యమండలి, పాలకొల్లుకి చీఫ్ మేకప్ ఆర్టిస్టు అయిన మెషక్‌ వద్ద మేకప్‌లోనూ శిక్షణ పొందాడు.[2]

అడబాల బాల్యదశ నుండే నాటకాల్లో వేషాలు వేశాడు. విద్యార్థి దశలో భమిడిపాటి ఇప్పుడు అనే నాటికలో శానయ్య పాత్ర ధరించి శభాష్ అనిసించుకున్నాడు. 1940 నుంచీ పినిసెట్టి శ్రీరామమూర్తి నిర్వహించిన ఆదర్శ నాట్యమండలి పక్షాన ప్రదర్శించిన పల్లెపడుచు, అన్నాచెల్లెలు తదితర నాటకాల్లో పాల్గొన్నాడు. మద్రాస్లో రైల్వేశాఖ ఉద్యోగం కె. వేంకటేశ్వరరావు శిక్షణలో ర.స.న సమాఖ్యలో ఫణి, రాగరాగిణి వంటి ప్రతిష్ఠాత్మక నాటకాలలో పాల్గొన్నాడు. పలుచోట్ల ఉత్తమ నటుడిగానూ, హాస్య నటుడిగానూ బహుమతులు అందుకున్నాడు. 1966లో సికింద్రాబాద్ వచ్చిన అడబాల 1967లో ఆంధ్ర లలిత కళాసమితిని స్థాపించిన వ్యవస్థాపక సభ్యుడు. ఎ.ఆర్. కృష్ణ ఆధ్వర్యంలో చాలా నాటకాల్లో పాల్లొన్నాడు. అందులో ముఖ్యమైనది మాలపల్లి. నేరము- శిక్ష, కప్పలు, నీలా తెరలు, లేపాక్షి, ఆశ్రయం, అరణి, వీలునామా మొదలైన నాటకాలు, మానవుడు, పెళ్ళిచూపులు, పగ, అమ్మ, రాజీవం, రాతిమనిషి మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి. అడబాల కొన్ని టీవీ సీరియల్స్‌లో, అగ్నిప్రవేశం, స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ మొదలైన చిత్రాల్లో కూడా నటించాడు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి విజిటింగ్ ఫాకల్టీగా చేశాడు. ఉస్మానియా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని రంగస్థల కళల శాఖలో విజిటింగ్ లెక్చరర్ గా పనిచేశాడు. ఇతని శిక్షణలో అనేక మంది శిష్యులు ఆహార్యంలో నైపుణ్యం సంపాదించారు.

రూపశిల్పిగా

ఆదర్శ నాట్యమండలి నాటకాలకు అప్పట్లో మేకప్ చేస్తున్న మాస్టారు అడబాల అసక్తిని గమనించి, మేకప్ లో తొలి పాఠాలు నేర్పి ప్రోత్సహించాడు. ఆనాటి నుండి అటు నటన, ఇటు రూపశిల్పం రెండీంటినీ నిర్వహిస్తూ వచ్చాడు.

మరణం

ఈయన మార్చి 14, 2013న మరణించాడు.

మూలాలు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.184.
  2. కళారూపశిల్పి అడబాల - ఆంధ్రభూమి 19/04/2012[permanent dead link]