"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆదిశేషుడు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Vishnu and Lakshmi on Shesha Naga, ca 1870.jpg
శేషశయనంపై లక్ష్మీ సమేత శ్రీ మహా విష్ణువు

హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు. సర్పాలకు ఆద్యుడు, రారాజు. ఈతని అంశలోనే రామాయణంలో లక్ష్మణుడు జన్మించాడు. పురాణాల ప్రకారం సమస్త భూమండలాలు ఆదిశేషుడు తన పడగపై మోస్తున్నాడు. వేయి పడగల నుంచీ నిత్యం విష్ణు కీర్తి వినిపిస్తూ ఉంటుంది. ఈ సర్పానికే అనంత శేషుడనే పేరు కూడా ఉంది.

కశ్యపప్రజాపతికిని కద్రువకును పుట్టిన పుత్రులలో జ్యేష్ఠుఁడు. ఇతఁడు తన తల్లియైన కద్రువ వినతయెడల చేసిన యక్రమమునకు ఓర్వ చాలక, (చూ|| కద్రువ) గంధమాదనము, బదరికాశ్రమము, గోకర్ణము మొదలగు దివ్యక్షేత్రములయందు మహాతపమాచరింపఁగా బ్రహ్మ అతని సత్యనిష్ఠకును ధైర్యమునకును మెచ్చి భూభారమును వహించునట్టి శక్తిని ప్రసాదించి గరుడునితో సఖ్యముగలిగి ఉండుము అని చెప్పెను. అతఁడు అట్లే చేయుచు ఉండెను. మఱియు అతఁడు ఈశ్వరప్రసాదముచే విష్ణువునకు పానుపై వేయిపడగలతో భూమిని మోయుచు నాగులకు అందఱకు రాజై ఉండును. ఇతనికి భృగుమహర్షి శాపమువలన బలరామావతారము కలిగెను.

స్వరూపం

అనంత విశ్వంలో గానీ లేదా అనంత సాగరంలోగానీ చుట్టలు చుట్టలుగా పడుకుని శ్రీ మహావిష్ణువుకు శయ్యగా ఉన్నట్లు ఆదిశేషుని గురించి పురాణాల్లో వర్ణించబడి ఉంటుంది. కొన్ని చోట్ల ఐదు తలలు, కొన్ని చోట్ల ఏడు తలలు ఉన్నట్లు చూపించినా సాధారణంగా ఆదిశేషుడికి కొన్ని వందల తలలు ఉంటాయి.

దేవాలయాలు

  • తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి ఆదిశేషుని మీద శయనిస్తున్న విష్ణుమూర్తి నేత్రానందకరంగా దర్శనమిస్తారు.
  • తిరువళ్ళూరులో శ్రీ మహావిష్ణువు శేషపానుపు పై పయనించిన వీరరాఘవ స్వామిగా దర్శనమిస్తాడు.
  • నెల్లూరులో రంగనాయకుల స్వామి కూడా ఆదిశేషుడిపై శయనించినట్లుగా ఉంటుంది.

విశేషాలు

  • భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకచోట సర్పాలలో ఆదిశేషుడు ఆయన అంశే అని చెబుతాడు.
  • రామాయణంలో లక్ష్మణుడు ఆదిశేషుని అంశగా చెబుతారు. అలాగే బలరాముడు, నిత్యానంద ప్రభువు, పతంజలి కూడా ఆదిశేషువు అంశలే అని చెప్పబడుతున్నాయి.
  • మహాభారతం లోని ఆది పర్వం ప్రకారం ఆదిశేషుని తండ్రి కశ్యపుడు, తల్లి కద్రువ.
  • ఆది శేషుడు అంశయైన వాసుకి అనే సర్పం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నపుడు తాడులా ఉపయోగపడింది.

మూలాలు

  • పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

బయటి లింకులు