ఉన్నవ లక్ష్మీబాయమ్మ

From tewiki
Jump to navigation Jump to search
ఉన్నవ లక్ష్మీబాయమ్మ
150px
జననంఉన్నవ లక్ష్మీబాయమ్మ
1882
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాదు
మరణం1956
వృత్తిగుంటూరు శారదా నికేతనము స్థాపకురాలు
ప్రసిద్ధిదేశసేవిక, సంఘసంస్కరిణి
భార్య / భర్తఉన్నవ లక్ష్మీనారాయణ
తండ్రినడింపల్లి సీతారామయ్య
తల్లిరామలక్ష్మమ్మ

ఉన్నవ లక్ష్మీబాయమ్మ దేశసేవిక, సంఘసంస్కరిణి. ఈమె ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, విద్యాదాత అయిన ఉన్నవ లక్ష్మీనారాయణ సతీమణి. గుంటూరు శారదా నికేతనము స్థాపకురాలుగా ప్రసిద్ధి చెందినది.

లక్ష్మీబాయమ్మ నడింపల్లి సీతారామయ్య రామలక్ష్మమ్మ దంపతులకు 1882లో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాదు గ్రామంలో మధ్యతరగతి నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.[1] కుటుంబంలో అందరికంటే చిన్నదైన కారణంగా అభ్యుదయభావాలతో పాటు సాంప్రదాయక విద్యను అందుకున్నది. తన 10వ ఏట గుంటూరుజిల్లా వేములూరిపాడుకు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణతో 1892లో వివాహం జరిగింది.

1902లో ఉన్నవ దంపతులు గుంటూరుజిల్లాలో ఒక వితంతు శరణాలయం స్థాపించారు. ఎంతో సాహసంతో వితంతు పునర్వివివాహాలు జరిపించారు. ఇంతలో రాజమండ్రి నుండి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ దంపతుల్ని పిలిచారు. వీరేశలింగం అక్కడ స్థాపించిన ఆశ్రమం, శరణాలయ కార్యకలాపాలను ఈ దంపతులకు చూపించారు. అక్కడి వారంతా కలసి ఆశ్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారో వీరు పరిశీలించి ఒక్క సంవత్సరం పాటు అక్కడ గడించిన అనుభవంతో 1908లో ఉన్నవ దంపతులు గుంటూరు తిరిగి వచ్చారు. 1914నుండి స్వాతంత్య్రం సంపాదించుకోవాలనే ఆకాంక్ష భారతీయుల్లో బలంగా నాటుకుపోయింది. ఉన్నవ దంపతులతోపాటు అయ్యదేవర కాళేశ్వరరావు, రాయప్రోలు సుబ్బారావు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వంటి స్వాతంత్ర్య సమరయోధులు తరచూ పొట్లపూడిలో సమావేశమౌతుండేవారు. స్వరాజ్య సంపాదన గురించి ఆంధ్రరాష్ర్ట నిర్మాణానికై ఆలోచనలు జరిపేవారు.

శారదా నికేతన్

1918లో ఉన్నవ లక్ష్మీబాయమ్మ, దేశభక్త కొండా వెంకటప్పయ్య ఇంట్లో వయోజనులైన స్త్రీలకు తీరిక సమయాలలో విద్యాబోధన, చేతిపనులు నేర్పేందుకు ఒక పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాల కాలక్రమంలో శారదా నికేతన్‌గా రూపొందినది. లక్ష్మీబాయమ్మ తన ఉత్తేజపూరిత ప్రసంగాలతో స్త్రీలు, విద్యార్థులను ఆకట్టుకునేవారు. జాతీయ విధానంలో స్త్రీవిద్య వ్యాప్తి చేయాలని 1922లో ఉన్నవ దంపతులు భావించారు. తెలుగు, సంస్కృత భాషలకు ప్రాధాన్యతనిస్తూ విద్వాన్‌, భాషాప్రవీణ పరీక్షలకు శారదానికేతన్‌లో తరగతులు నడిపారు. విదేశీవస్త్ర, వస్తు బహిష్కరణకు లక్ష్మీబాయమ్మ పిలుపునిచ్చారు. సంస్థకు చెందిన బాలికలతో పాటు వీరుకూడా నూలు వడికి ఖాదీని ధరించేవారు.

1930లో జరిగిన ఉప్పుసత్యాగ్రహం భారతీయులందరినీ ఏకత్రాటిపై నిలిచేలా చేసింది. ఆమె వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనగా 1941 ఫిబ్రవరి 2న మూడవసారి అరెస్టుచేసి మూడునెలల శిక్ష నిమిత్తం రాయవేలూరు జైలుకు పంపారు. దేశసేవిక, సంఘసంస్కరిణి అయిన ఉన్నవ లకీబాయమ్మ తన 74వ ఏట 1956లో మరణించినది.[2]

మూలాలు

  1. http://www.streeshakti.com/bookL.aspx?author=3
  2. "మహిళలకు అండాదండ ఉన్నవ లక్ష్మీబాయమ్మ - సూర్య పత్రిక నవంబరు 4, 2012". Archived from the original on 2012-11-06. Retrieved 2013-03-12.