ఎస్.వి.జోగారావు

From tewiki
Jump to navigation Jump to search

ఎస్.వి.జోగారావు లేదా శిష్ట్లా వెంకట జోగారావు (అక్టోబరు 2, 1928 - సెప్టెంబరు 1, 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి.

జననం

వీరు అక్టోబరు 2, 1928 సంవత్సరం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శిష్టా సాంబశివరావు, సరస్వతమ్మ.

వీరు 1952లో ఎం.ఎ. తెలుగులో ప్రథమశ్రేణిలో ప్రథమస్థానాన్ని పొందారు. 1954-56 మధ్య భారత ప్రభుత్వ పరిశోధక పండితునిగా నియమితులయ్యారు. ఒక దశాబ్ది కాలం ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరి పరిశోధన ఫలితంగా "ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర" విడుదలైంది. 1965-67 మధ్యకాలంలో సోవియట్ దేశంలో లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని అధిష్టించారు. అప్పుడే 'తెలుగు-రష్యన్-తెలుగు వ్యవహార దర్శిని' ప్రచురించారు.1976-83 మధ్యలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో వివిధ శాఖలకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 1085 'జాతీయ ఆచార్య' గౌరవాన్ని పొందారు. 1975లో యక్షగానం రచనను ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రచురించారు.

1958లో 'పంచకళ్యాణి' శీర్షికతో కవితా సంపుటి వెలువరించారు. 1961లో 'అప్సర' గేయనృత్యనాటికల సంపుటి విడుదలైంది. వీరు 'ఉపనిషత్తు', 'సువర్ణశృంఖల', 'మధురమాధవం' మొదలగు కవిత, కథానిక, నాటికల సంపుటాలను సారస్వతులకు కానుకచేసారు. 1988లో నవలాకర్తగా 'మేరుశిఖరం' రాశారు. 1980లో 'అడిగొప్పుల హోరుగాలి' కావ్యం, 'మణిప్రవాళం' సాహిత్య వ్యాస సంపుటాలను ప్రచురించారు. 'శృంగార సర్వజ్ఞం', 'ఆదిభట్ట సారస్వత నీరాజనం', పది సంపుటాల దాన భారతీ ప్రచురణలు చేశారు. 'ఊహాప్రహేళిక' అనే సాహితీ ప్రక్రియ పూర్తిగా వీరి సొంతం.

'మణిప్రవాళం' రచనకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1989లో లభించింది.

మరణం

వీరు సెప్టెంబరు 1, 1992 సంవత్సరంలో పరమపదించారు.

బయటి లింకులు

మూలాలు

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.