"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కంకంటి పాపరాజు

From tewiki
Jump to navigation Jump to search
కంకంటి పాపరాజు
జననంనెల్లూరు జిల్లా
వృత్తిసైన్యాధిపతి

కంకంటి పాపరాజు 18 వ శతాబ్దికి చెందిన కవి. ఇతను నెల్లూరు మండలం వాడు. ఆరువేల నియోగ బ్రాహ్మణులలో శ్రీవత్స గోత్రానికి చెందినవాడు.ఆపస్తంబ సూత్రుడు. తండ్రి అప్పయామాత్యుడు. తల్లి నరసాంబ[1]. మదన గోపాల స్వామి భక్తుడు. చతుర్విధ కవితా నిపుణుడు. గణిత శాస్త్ర రత్నాకరుడు. చేమకూర వెంకటకవి తర్వాత మంచికవిగా పేర్కొనవలసినవాడు పాపరాజు మాత్రమే. పాపరాజు విష్ణుమాయా విలాసం అనే యక్షగానం రచించాడు. ఉత్తర రామాయణం అనే ఉత్తమ గ్రంథాన్ని చంపూకావ్యంగా రచించి కవిగా ప్రసిద్దికెక్కాడు. అంతే కాకుండా ఇతడు తన రెండు గ్రంథాలను తన ఇష్ట దైవమైన నందగోపాలస్వామికి అంకితం ఇచ్చాడు. ఇతడు ప్రళయకావేరి పట్టణములో అమీనుగా లౌక్యాధికారమును కలిగి ఉండెడివాడు. ఇతని తమ్ముడు కంకంటి నారసింహరాజు కూడా కవిత్వం చెప్పినాడు.

జీవిత విశేషాలు

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం కంకంటి పాపరాజు కాలం క్రీ.శ. 1575 నుంచి 1632 వరకు. కంకంటి పాపరాజు నెల్లూరి సీమ వ్యక్తి అని నిర్ధారణగా తెలుస్తూంది. కానీ ఆయన పట్టణం మాత్రం సాధికారికంగా నిర్ధారింపబడలేదు. కొన్ని ఆధారాలను అనుసరించి ప్రళయకావేరి పట్టణంలో అమీనుగా పనిచేసేవాడని భావిస్తున్నారు. కంకంటి పాపరాజు కాలం ఏమిటో నిర్ధారించేందుకు అవతారికలోనూ, ఆశ్వాసాంత పద్యాల్లోనూ ప్రస్తావనలు ఏమీ లేవు. ఈ పరిస్థితిలో డా.ఎస్.వి.జోగారావు కృషి ఫలితంగా మారుటూరి పాండురంగారావు నిర్ధారించాడు.[2]

రచనలు

కంకంటి పాపరాజు విష్ణుమాయా విలాసం(యక్షగానం), ఉత్తర రామాయణం(ప్రబంధం) రచించాడు. విష్ణుమాయా విలాసం రచనలో పుష్పగిరి తిమ్మన సహాయం చేశాడని అవతారికలో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పాపరాజుకు ప్రఖ్యాతిని కట్టబెట్టిన రచన "ఉత్తర రామాయణం". ఉత్తరకాండ రామాయణంలో అంతర్భాగం, భవభూతి దీన్ని ఉత్తర రామచరితమ్ నాటకంగా మలిచాడు. ఐతే దీన్ని తెలుగులో తిక్కన "నిర్వచనోత్తర రామాయణం"గా అనువదించాడు. రంగనాథ రామాయణంలోనూ ఉత్తరకాండ ఉన్నా, పాపరాజు రచన ఓ విశిష్టతను సంతరించుకుంది. కంకంటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని ప్రబంధశైలిలో గద్య, పద్యాత్మకంగా(చంపూశైలి) రచించాడు.

శైలీ-శిల్పము

పాపరాజు ఉత్తర రామకథలోని పురాణ లక్షణాన్ని వదలగొట్టి ప్రబంధ పరిమళాలను అద్దాడు. ప్రబంధ శైలిలో పద్యనిర్మాణం, అష్టాదశ వర్ణనలు చేయడం మాత్రమే కాక సీతారాముల వేషభాషలు, సరస సంభాషణలు తదితర అంశాలన్నిటా ప్రబంధలక్షణాలు ఆపాదించాడు. ఆ ప్రయత్నంలో ఈ కావ్యాన్ని విలాసకావ్యంగా మలిచారు కంటింటి.[3]

పాత్ర చిత్రణ

పాత్రచిత్రణకు కూడా పురాణస్థాయిని పరిగణనలోకి తీసుకోకుండా రాజవంశంలోని సాధారణ నాయికా నాయకులుగా మలిచాడు. ప్రబంధ లక్షణాలను ఆపాదించే క్రమంలో కంటింటి సీతారాముల పౌరాణిక స్థాయి ఉదాత్తతను కూడా పరిగణించలేదంటే ఆయన ప్రబంధ రచనపై ఎంతటి దృష్టి సారించారో అర్థం చేసుకోవచ్చు.

ప్రభావం

ప్రబంధ రచనలోని గాఢ బంధమూ, భావప్రౌఢి పలచబడి, ఆశుధోరణి బలపడి, ప్రసన్నతకు, సరళతకూ, సౌకుమార్యతకూ కంటింటి పాపరాజు కావ్యంలో ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే శైలి అనంతర కాలంలో తిరుపతి వెంకట కవులు ఆదిగా పింగళి-కాటూరి కవులు, జాషువా, కరుణశ్రీలు అనుసరించారు. వీరందరూ కంటింటి పాపరాజు రచనాశైలితో ప్రభావితులయ్యారని ప్రముఖ విమర్శకులు బేతవోలు రామబ్రహ్మం భావించాడు.

మూలాలు

  1. ఆంధ్ర కవుల చరిత్రము - కందుకూరి వీరేశలింగం - మూడవ భాగము పుటలు 102-104
  2. డా.మారుటూరి పాండురంగారావు రచించిన ఉత్తర రామాయణ విమర్శ(సిద్ధాంత గ్రంథం)
  3. బేతవోలు రామబ్రహ్మం రాసిన పద్యకవితా పరిచయం గ్రంథంలో కంటింటి పాపరాజు వ్యాసం


Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).