"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కలేకూరి ప్రసాద్

From tewiki
Jump to navigation Jump to search
కలేకూరి ప్రసాద్
250px
జననం(1964-10-25)అక్టోబరు 25, 1964
కంచికచెర్ల, కృష్ణా జిల్లా,
మరణంమే 17, 2013(2013-05-17) (వయస్సు 48)
ఒంగోలు
వృత్తికవి, సినీ గీత రచయిత, దళితోద్యమ కవి
మతంక్రిస్టియన్
తండ్రిశ్రీనివాసరావు
తల్లిలలితా సరోజిని

కలేకూరి ప్రసాద్ (1964 అక్టోబర్ 25 [1] - 2013 మే 17) కవి, సినీ గీత రచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత ఉద్యమకారుడు. జననాట్యమండలి, విప్లవ రచయితల సంఘంలో పనిచేశాడు.[2]


జీవిత విశేషాలు

ప్రసాద్ 1964 అక్టోబర్ 25వ తేదీన కృష్ణా జిల్లా, కంచికచెర్లలో జన్మించాడు. ఆయన తల్లి తండ్రులు లలితా సరోజిని, శ్రీనివాసరావులు ఇద్దరూ ఉపాధ్యాయులే. తమ గ్రామంలో కంచికచర్ల కోటేశు అనే యువకుడ్ని పెత్తందార్లు సజీవదహనం చేయడంతో చలించిపోయి, కలేకూరి ప్రసాద్‌ పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో చేరాడు. పార్టీ రాజకీయ పాఠశాలల్లో బోధకుడిగా పనిచేశాడు. కారంచేడులో దళితుల మారణకాండతో దళిత ఉద్యమాల్లో పనిచేశాడు. పీపుల్స్‌వార్‌ నుంచి బయటకు వచ్చిన కె.జి.సత్యమూర్తి వంటి నాయకులతో కలిసి జిల్లాలో జరిగిన పలు ప్రజా, దళిత ఉద్యమాల్లో పనిచేశాడు. డర్బన్‌లో జాతి వివక్షపై జరిగిన చారిత్రక అంతర్జాతీయ సదస్సులో కలేకూరి పాల్గొన్నాడు. అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో సైతం తన ఉపన్యాసాన్ని ఆసక్తిగా విన్నారని కలేకూరి పలు సందర్భాల్లో చెప్పేవాడు.

కలేకూరి ప్రసాద్‌ యువక అనే కలం పేరుతో కవితలు రాసాడు. మండుతున్న చుండూరు, దళిత కవిత్వం లాంటి కవితా సంకలనాల్లో ఆయన కవితలు చోటు చేసుకున్నాయి. ప్రసాద్‌ రాసిన పాటలను పలు చిత్రాలకు ఉపయోగించుకున్నాడు. కర్మభూమిలో పూచిన ఓ పువ్వా, భూమికి పచ్చాని రంగేసినట్టూ, చిన్ని చిన్ని ఆశలే చిందులేయగా తదితర గీతాలు బహు ప్రాచుర్యం పొందాయి. శ్రీరాములయ్య సినిమాలో వాడిన భూమికి పచ్చాని రంగేసినట్లు అమ్మలాలో.. పాట కారంచేడును ఉద్దేశించి రాసినది. టంగుటూరులో నవవధువు ఇందిర హత్యకు గురైన సమయంలో ఆయన రాసిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా.. విరిసీ విరియని ఓ చిరునవ్వా.. పాట రాసి మహిళా ఉద్యమానికి వూపిరిలూదాడు.

ఉద్యమ అవసరాల కోసం పలు పత్రికలకు సంపాదకత్వం వహించాడు.[ఆధారం చూపాలి] ఇంగ్లీష్ భాషపై మంచి పట్టున్న ఆయన విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు. స్వామి ధర్మతీర్థ రచించిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చాడు. ఆ అనువాదం దాదాపు పది ముద్రణలు పొందింది. తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి తర్వాత ఆ స్థాయిలో అనువాదాలు చేసిన ఘనత కలేకూరికే దక్కుతుంది.[ఆధారం చూపాలి] కొంతకాలం సబ్ ఎడిటర్‌గానూ పనిచేశాడు.[ఎక్కడ?]

చిలకలూరిపేట బస్సు ఘటనలో ఉరిశిక్ష పడిన చలపతి, విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమంలో విప్లవ దళిత కవి శివసాగర్‌తో కలిసి పాల్గొన్నాడు.

కలేకూరి రచనలు

కలేకూరి ప్రసాద్ స్వీయ రచనలు :

1. దళిత సాహిత్యం ( దళిత స్త్రీ సాహిత్య పరిషత్, 1993)

2. దళిత కిరణాలు (లోకాయుత, 1996)

3. దళిత ఉద్యమం దళిత సాహిత్యోద్యమం (1999)

4. ఆంధ్రప్రదేశ్ దళితులు (ప్రజాశక్తి, 2003)

5. పిడికెడు ఆత్మగౌరవం కోసం (బహుజన కెరటాలు ప్రచురణ, 2012)

6. అంటరాని ప్రేమ (మాల మహాసభ ప్రచురణ, 2012)

అనువాదాలు :

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ:

 1. మహాశ్వేతా దేవి కథలు 'ఛోళీ కె పీఛే ', 'పాలతల్లి ' (1997)
 2. మహాశ్వేతా దేవి కథ 'రుదాలి', అంజుం కత్యాల్ 'రుదాలి-జీవన పరిణామ చిత్రణ' (1998)
 3. అరుంధతీ రాయ్ 'ఊహలు సైతం అంతమయ్యే వేళ' (1998)
 4. స్వామీ ధర్మతీర్ధ 'హిందూ సామ్రాజ్యవాద చరిత్ర' (1998)
 5. వందన సోనాళ్కర్ "జెండర్ రాజకీయాలు- చర్చనీయాంశాలు' (కె. సజయతో కలిసి, 1999)
 6. డాక్టర్ అమితావ ముఖర్జీ, వందనా శివ, ఉత్సా పట్నాయక్, దేవీందర్ శర్మ 'తిండి గింజలకు తిలోదకాలు ' (1999)
 7. కె.ఎస్. చలం 'ఆర్ధిక సంస్కరణలు - సంక్షేమాలకు అందని ప్రజలు. (1999)
 8. కృష్ణ కుమార్ 'చదువు చర్చ ' (సహవాసి, ప్రభాకర్ మందారలతో కలిసి, 1999)
 9. కిషోర్ శాంతాబాయి కాళే ఆత్మకథ 'ఎదురీత' (2001)
 10. ప్రీమొ లెవి 'ఖైదీ నెంబర్ 174517' (2003)
 11. బషీర్ కథలు 'అవని తల్లికి అసలైన వారసులు', 'అనల్ హఖ్' (2009)

ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురణ:

 1. జాన్ హోల్ట్ 'పిల్లలు ఎలా నేర్చుకుంటారు' (వి.శ్రీహరి, సుంకర రామచంద్రరావులతో కలిసి 2002)
 2. ఏ.జి.నూరానీ 'ఇస్లాం-జిహాద్' (2003)
 3. చేగువేరా రచనలు 'విప్లవం రాజకీయాలు' (సఫ్దర్ అహ్మద్, గుడిపూడి విజయరావులతో కలిసి, 2004)

ఇతర ప్రచురణలు:

 1. పి. సాయినాథ్ 'ప్రచార సాధనాలు - పీడిత ప్రజలు' (అనువాదం)
 2. 'భోపాల్ డాక్యుమెంట్-డిక్లరేషన్' (అనువాదం, 2002)
 3. సాక్షి, హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలు (అనువాదం)
 4. ఎవరికీ తలవంచని నేటి తరం హీరో (బహుజన కెరటాలు, కలేకూరి ప్రసాద్ స్మృతి సంచిక, 2013 )

కలేకూరి ప్రసాద్ గురించి ఎవరేమన్నారు

కలేకూరి ప్రసాద్ గురించి పైడి తేరేష్ బాబు ఇలా రాసాడు:

నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ వేలఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను. తనెవరో, తన మూలాలేమిటో గుర్తించిన ఒక మూలవాసి చేసిన సాధికార ప్రకటన ఇది. పిడికెడు ఆత్మ గౌరవం కోసం, తనదైన జీవితం కోసం మరణం గొంతు మీద కాలేసి నిలదీసిన వైనమిది. కవిగా, కార్యకర్తగా నాయకుడిగా, గాయకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, పాత్రికేయుడుగా, మధుపాత్రికేయుడుగా, ప్రేమికుడిగా, కాముకుడిగా, సాయుధుడుగా, నిరాయుధుడుగా ఒక కొత్త రూపాన్ని ఆవిష్కరించుకుంటూ పోయిన బహురూపి. సిద్ధాంతపరంగా విప్లవవాదిగా మొదలై దళితవాదిగా కొనసాగాడు. మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని రెండు కళ్ళు చేసుకుని దృష్టికోణాన్ని విస్తరించుకున్నాడు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్ట్ డైరెక్టర్ (మహబూబ్‌నగర్)గా, సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ సంచాలకుడుగా,స్వచ్ఛంద సంస్థలకు సలహాదారుడుగా ఎన్నో పాత్రలు నిర్వహించాడు. ఎక్కడా కుదురుగా నిలవకపోవడం అతని ప్రత్యేకత.అతను స్వేచ్ఛావాది అరాచక వాది. ఒక మూసలో ఇమిడేరకం కాదు. బంధాలకు, అనుబంధాలకు, సంకెళ్ళకు, ప్రేమలకు, పెళ్ళిళ్లకు, స్నేహాలకు, దేహాలకు చిక్కినట్టే చిక్కి లిప్తపాటులో తప్పించుకుపోగల అపర పాపియాన్.

మరణం

కలేకూరి ప్రసాద్ 2013, మే 17ఒంగోలు లోని అంబేద్కర్‌ భవన్‌లో మరణించాడు.[1][3]

ఇతర లింకులు

మూలాలు

 1. 1.0 1.1 కినిగె.కాం. "ద పాషన్ ఆఫ్ కలేకూరి ప్రసాద్ (దళిత్‌కెమెరా వీడియోల సమీక్ష)". /patrika.kinige.com. Archived from the original on 2 ఆగస్టు 2016. Retrieved 17 May 2017. Check date values in: |archive-date= (help)
 2. రచయిత, గాయకుడు కలేకూరి ప్రసాద్ ఆకస్మిక మృతి
 3. సాక్షి. "రచయిత, గాయకుడు కలేకూరి ప్రసాద్ ఆకస్మిక మృతి". Retrieved 17 May 2017.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).