"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కల్లూరు అహోబలరావు

From tewiki
Jump to navigation Jump to search
కల్లూరు అహోబలరావు
150px
కల్లూరు అహోబలరావు
జననంకల్లూరు అహోబలరావు
1901, జూన్
అనంతపురం జిల్లాలేపాక్షి మండలం కల్లూరు గ్రామం
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిప్రముఖ కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త
భార్య / భర్తసీతమ్మ
పిల్లలుఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు
తండ్రిగూళూరు కృష్ణప్ప
తల్లిఅశ్వత్థమ్మ

రాయలసీమ రచయితల చరిత్ర వ్రాసిన కల్లూరు అహోబలరావు స్వయంగా కవి. బహుగ్రంథకర్త.

జీవితవిశేషాలు

కల్లూరు అహోబలరావు[1] 1901 జూన్ నెలలో అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో జన్మించాడు. ఇతని పూర్వీకులు మైసూరు రాష్ట్రంలోని 'మొళబాగు'కు చెందినవారు. బడగనాడు నియోగి శాఖకు చెందిన బ్రాహ్మణుడు. కాశ్యపశ గోత్రుడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరు సుబ్బారావు ఇతనికి మేనమామ. ఇతనికి తన పన్నెండవయేటనే వివాహమైనది. భార్య సీతమ్మకు అప్పటికి ఎనిమిదేండ్లు మాత్రమే. ఇతనికి ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు పుట్టారు.

విద్యాభ్యాసం, ఉద్యోగం

ఇతడు తన ప్రాథమిక విద్య హిందూపురం, ధర్మవరం గ్రామాలలో చదివాడు. బెంగళూరులో యస్.యస్.ఎల్.సి చదివాడు. బళ్లారిలో సెకండరీగ్రేడ్ టీచర్ ట్రైనింగ్ పరీక్ష పాసయ్యాడు. తెలుగులో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకాలోని అనేక గ్రామాల పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేశాడు. బళ్లారిలోని సెయింట్ జాన్స్ హైస్కూలులో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా, తెలుగు పండితునిగా పనిచేశాడు.

సాహిత్యరంగం

బళ్లారిలో పనిచేస్తున్నపుడు 1931లో ఘూళీకృష్ణమూర్తి, హెచ్.దేవదానముల సహకారంతో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా 40కు పైగా గ్రంథాలను పాఠకలోకానికి అందించాడు. 1981లో ఈ సంస్థ స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకున్నది. ఇతడు తన రచనలను మొదట శతకాలతో ప్రారంభించాడు. ఎన్నో గ్రంథాలను వ్రాశాడు. 1919 నుండి 1990 వరకు ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు క్రమం తప్పకుండా శుభాకాంక్షలను పద్యరూపంలో ముద్రించి బంధుమిత్రులకు పంపేవాడు. అవి కేవలం శుభాకాంక్ష పద్యాలు మాత్రమే కావు. గత సంవత్సరంలో ప్రజానీకం పడిన కష్టనష్టాలకు, దేశకాల పరిస్థితులకు దర్పణం పట్టిన పద్య ఖండికలు.[2] రాయలసీమలో పుట్టిపెరిగిన 141మంది కవుల జీవితచరిత్రలను,వారి రచనలను పరిచయంచేస్తూ నాలుగు సంపుటాలలో "రాయలసీమ రచయితల చరిత్ర"ను వెలువరించాడు.

రచనలు

 1. కుమార శతకము (1923)
 2. భరతమాతృ శతకము (1923)
 3. భావతరంగములు - ఖండికలు (1931)
 4. పూదోట - ఖండికలు (1951)
 5. భక్తమందారము - ద్విశతి (1958)
 6. ఉగాది స్వర్ణభారతి (1972)
 7. రాయలసీమ రచయితల చరిత్ర - 4 సంపుటాలు (1975-1986)
 8. శ్రీరామకర్ణామృతము (1980)
 9. శ్రీకృష్ణకర్ణామృతము
 10. ఉగాది వజ్రభారతి
 11. గృహలక్ష్మి - కందపద్య త్రిశతి
 12. పుష్పబాణ విలాసము
 13. యామినీపూర్ణతిలక
 14. శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రము

రచనల నుండి ఉధాహరణలు

1.సీ. రాటమా! కాదు - పోరాటంబు లుడిగించు

విష్ణుచక్రంబిద్ది పృథివి యందు
రాటమా! కాదు - ఆరాటంబు బోకార్పు
కల్పవృక్షంబిద్ది ఖండితముగ
రాటమా! కాదుపో - కాటకంబుల ద్రోలి
కడుపు నిండించెడి కన్నతల్లి
రాటమా! కాదుపో - రమణీయ సుస్వర
సంగీతముల బాడు - శారదాంబ!

గీ. కట్టగా మేలిరకముల బట్టలొసగి

పొట్ట నింపంగఁ బట్టెడు బువ్వనిచ్చి
కడుపు చల్ల కదలనీక కాచి బ్రోచు
రాట్నలక్ష్మిని సేవింపరాదె మనకు?
(పూదోట కావ్యం నుండి)

2.సీ. పాలకుండలఁజేసి పాలజీవము బోసి

పాలించు కుమ్మరి వాడవీవు
పాలకుండలలోని పాలుపాపలకిచ్చి
తనివితో పోషించు తల్లివీవు
పాలకుండలు రెండు పద్మాక్షులకొసంగి
జగము లేలించెడు చతురుడీవు
పాలకుండల నున్న పరిపక్వమైనట్టి
వెన్నమీగడలిచ్చు విభుడవీవు

గీ. పాలకుండలపై నున్న భ్రాంతి ద్రోలి

కుండలోపలి మధువు నాకుండజేసి
పాలకుండవు! రక్షింపు పరమపురుష!
భక్తమందార నీకిదే వందనంబు
(భక్తమందారము నుండి)

3.సీ. దుందుభీ! నీ మ్రోత దూరమౌ లండను

వీథివారలు బాగ వినగవలయు;
దుందుభీ! నీ - దగు తోరమౌ శబ్దంబు
పార్లమెంటులలోనఁ బలుకవలయు;
దుందుభీ! నీ ధ్వని దూరి కర్ణములందు
బ్రిటీషు దుర్బుద్ధులు విఱుగ వలయు;
దుందుభీ! నీ ధ్వాన సందేశమాత్మ, ప్ర
వేశింప వైస్రాయి - వినగ వలయు;

గీ. దుందుభులఁ బోలు రాక్షసుల్ దూరులగుచు

నీతికోవిదు లొక్కింత రీతితోఁ బ్ర
భుత్వ పద్ధతి మాన్పింపఁ బూన వలయు;
దుందుభీ!శుభ్రకీర్తి నీ వందవలయు
(ఉగాది స్వర్ణభారతి నుండి)

పురస్కారాలు

 • హిందూపురంలోని రాయలకళాపరిషత్ పక్షాన శ్రీశారదాపీఠము వారు 'కవిభూషణ' బిరుదుతో సత్కరించింది.
 • 1960లో కూడ్లీ శృంగేరీ జగద్గురు సచ్చిదానంద శంకర భారతీస్వామిచే 'కవితిలక' బిరుదు ప్రదానం.
 • బరోడా మహారాజుచే బంగారు పతక ప్రదానం
 • ఇంకా కవికోకిల, కవిశేఖర బిరుదులు లభించాయి.

శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల

రాయలసీమలోని కవిపండితుల గ్రంథాలను ప్రచురించి వాటిని వెలుగులోకి తెచ్చే ప్రధాన ఆశయంతో ఈ గ్రంథమాల ఘూళీ కృష్ణమూర్తి, హెచ్.దేవదానము, కల్లూరు అహోబలరావులచే 1931లో బళ్లారి పట్టణంలో స్థాపించబడింది. ఆ పట్టణ ప్రముఖులు ఈ గ్రంథమాలకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. అప్పట్లో సంవత్సరానికి మూడు పుస్తకాలను ప్రచురించి ఒక రూపాయి చందాకే ఆ పుస్తకాలను అందించేవారు. 1934లో కల్లూరు అహోబలరావు అనంతపురానికి బదిలీ కావడంతో ఈ గ్రంథమాల కూడా అనంతపురానికి మారింది. 1957లో హిందూపురం కు మారింది. ఈ గ్రంథమాల ప్రకటించిన పుస్తకాలు ఈ విధంగా ఉన్నాయి.

క్రమ సంఖ్య గ్రంథము పేరు భాగము ప్రక్రియ రచయిత
1వ పుష్పము స్వార్థత్యాగము నవల ఘూళీ కృష్ణమూర్తి
2వ పుష్పము భావతరంగములు ఖండికలు కల్లూరు అహోబలరావు
3వ పుష్పము ప్రేమసుందరి 1వభాగము నవల హెచ్.దేవదానము
4వ పుష్పము ప్రేమసుందరి 2వభాగము నవల హెచ్.దేవదానము
5వ పుష్పము వేమభూపాలవిజయము రావాడ వేంకటరామాశాస్త్రులు
6వ పుష్పము విప్రనారాయణ నాటకము రూపనగుడి నారాయణరావు
7వ పుష్పము మాధవాశ్రమము 1వ భాగము నవల గుంటి సుబ్రహ్మణ్యశర్మ
8వ పుష్పము మాధవాశ్రమము 2వ భాగము నవల గుంటి సుబ్రహ్మణ్యశర్మ
9వ పుష్పము కుముదవల్లి నాటకము శీరిపి ఆంజనేయులు
10వ పుష్పము పూదోట పద్యఖండికలు కల్లూరు అహోబలరావు
11వ పుష్పము రాయలసీమ రత్నరాశి కవితా సంకలనము కల్లూరు అహోబలరావు (సంపాదకుడు)
12వ పుష్పము స్వప్నవల్లభుడు పద్యకావ్యము హెచ్.దేవదానము
13వ పుష్పము జ్ఞానవాశిష్ట రత్నములు పద్యములు కిరికెర భీమరావు
14వ పుష్పము భక్తమందారము ద్విశతి కల్లూరు అహోబలరావు
15వ పుష్పము అమృతాభిషేకము పద్యఖండికలు బెళ్లూరి శ్రీనివాసమూర్తి
16వ పుష్పము షాజహాన్ పద్యకావ్యము కల్లూరు వేంకట నారాయణ రావు
17వ పుష్పము తపోవనము పద్యఖండికలు బెళ్లూరి శ్రీనివాసమూర్తి
18వ పుష్పము మయూరప్రహసనము హాస్యము డి.బాబన్న
19వ పుష్పము భక్త పోతరాజీయము నాటకము మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ
20వ పుష్పము వివేకానందము ద్విపదకావ్యము బెళ్లూరి శ్రీనివాసమూర్తి
21వ పుష్పము ఉగాది స్వర్ణభారతి పద్యసంపుటి కల్లూరు అహోబలరావు
22వ పుష్పము రాయలసీమ రచయితల చరిత్ర 1వసంపుటి చరిత్ర కల్లూరు అహోబలరావు
23వ పుష్పము రాయలసీమ రచయితల చరిత్ర 2వసంపుటి చరిత్ర కల్లూరు అహోబలరావు
24వ పుష్పము భగవద్గీతాసందేశము డి.బాబన్న
25వ పుష్పము
26వ పుష్పము
27వ పుష్పము
28వ పుష్పము రాయలసీమ రచయితల చరిత్ర 3వసంపుటి చరిత్ర కల్లూరు అహోబలరావు
29వ పుష్పము
30వ పుష్పము రాయలసీమ రచయితల చరిత్ర 4వసంపుటి చరిత్ర కల్లూరు అహోబలరావు

మూలాలు

 1. రాయలసీమ రచయితల చరిత్ర మూడవ సంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం
 2. [1]తెలుగు వెలుగు మార్చి 2014 సంచిక

ఇతర లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).