కాకాని వెంకటరత్నం

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Kakani venkataratnam.jpg
కాకాని వెంకటరత్నం
ఆకునూరు గ్రామంలో నెలకొల్పిన కాకాని వెంకటరత్నం స్మారకవిగ్రహం

సమైక్యాంధ్ర సారథి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ కాకాని వెంకటరత్నం తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు[1]. వీరు 1900 సంవత్సరం, ఆగస్టు 3వ తేదీన కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీరు 1924లో రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. 1937-40లలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు 4 పర్యాయాలు ఎన్నికయ్యారు. 1941-42లో యుద్ధ వ్యతిరేక ప్రచారం చేశారు. వీరు క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఫలితంగా 1942-1945 సంవత్సరాల మధ్య వెల్లూరు, తంజావూరు కారాగారాలలో శిక్షను అనుభవించారు. 1952-53లో ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పనిచేశారు. 1959-66ల మధ్య వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా పనిచేశారు. అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డిల వద్ద వ్యవసాయ, పశుపోషక, పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు[2][3] . 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో వీరు కీలకంగా వ్యవహరించి మంత్రిపదవికి రాజీనామా చేశారు. వీరు 1972, డిసెంబరు 25న గుండెపోటుతో మరణించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు. కృష్ణా జిల్లాలోని నందిగామలోని కాలేజీకి వీరి గౌరవార్థం కె.వి.ఆర్ (కాకాని వెంకటరత్నం) కాలేజీ అనే పేరుతో పిలుస్తున్నారు. ప్రజలు వీరిని "ఉక్కు కాకాని" అని పిలిచేవారు.

మూలాలు

  1. Lucien D. Benichou, From Autocracy to Integration: Political Developments in Hyderabad State, 1938-1948 (Orient Longman, 2000), p282
  2. "Aspirants beware! Voters tilt the scales here". The Hindu. Chennai, India. March 16, 2004.
  3. ""Jai Andhra" now in momentum". AndhraCafe.com. Archived from the original on 2011-07-07. Retrieved 2016-01-05.

ఇతర లింకులు