"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రేడియోకార్బన్ డేటింగ్

From tewiki
Jump to navigation Jump to search

రేడియోకార్బన్ డేటింగ్ లేదా కార్బన్ డేటింగ్ అనేది ఆర్గానిక్ పదార్థాలు కలిగిన ఏదైనా వస్తువు వయస్సు తెలుసుకునే పద్ధతి.[1] కర్బన మూలకపు రేడియ ఐసోటోపు అయిన రేడియోకర్బనం అనే మూలకం ద్వారా ఇది సాధ్యమౌతుంది.

ఈ పద్ధతిని 1940 వదశకం చివర్లో విల్లార్డ్ లిబ్బీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఈ పద్ధతి పురాతత్వ శాస్త్రవేత్తలకి బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిశోధనకి గాను 1960 లో లిబ్బీకి నోబెల్ బహుమతి లభించింది. రేడియో కార్బన్ డేటింగ్ ఈ సిద్ధాంతం ఆధారంగా పని చేస్తుంది. రేడియో కార్బన్ మూలకం నైట్రోజన్, విశ్వకిరణాలు (కాస్మిక్ రేస్) కలవడం ద్వారా అనునిత్యం ఏర్పడుతూనే ఉంటుంది. ఇలా ఏర్పడ్డ రేడియా కార్బన్ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తో కలిసి రేడియో యాక్టివ్ కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కల్లోకి చేరుతుంది. జంతువులు ఈ మొక్కలను తినడం ద్వారా అది వాటి శరీరంలోకి చేరుతుంది. ఆ చెట్లు గానీ జంతువులు గానీ చనిపోయినప్పుడు వాటిలో ఉన్న రేడియో కార్బన్ నెమ్మదిగా నశించడం ప్రారంభిస్తుంది. దీన్నే రేడియోయాక్టివ్ డికే అని వ్యవహరిస్తారు. ఏదైనా కొయ్య, లేదా చనిపోయిన కళేబరం లేదా ఎముకలో ఈ రేడియో కార్బన్ ను కొలవడం ద్వారా అది ఎంత పాతదో కనుక్కోవచ్చు. వస్తువు ఎంత పాతదైతే అందులో అంత తక్కువ రేడియోకార్బన్ ఉంటుంది. రేడియోకార్బన్ అర్ధజీవిత కాలం (ఏదైనా పదార్థంలో రేడియోధార్మిక పదార్థం సగం నాశనం కావడానికి పట్టే సమయం) సుమారు 5,730 ఏళ్ళు. కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించి సుమారు 50,000 ఏళ్ళ వయసు కలిగిన వస్తువులను కనుక్కోవచ్చు.

మూలాలు

  1. ఎ. రామచంద్రయ్య. "రేడియో కార్బన్‌ డేటింగ్‌ అంటే ?". prajasakti.com. ప్రజాశక్తి. Retrieved 20 October 2016.