కావలి వెంకట బొర్రయ్య

From tewiki
Jump to navigation Jump to search

కావలి వెంకట బొర్రయ్య (1776-1803) కావలి వెంకట బొర్రయ్య గారు ఏలూరు కాపురస్తులు.1776 లో జన్మించారు. తూర్పు ఇండియా కంపెనీ క్రింద ఇంజనీరుగాను, సర్వేయర్ జనరల్ గాను పనిచేసిన కర్నల్ మెకంజీ ( Colonel COLIN MACKENZIE ) గారి క్రింద గుమాస్తాగా చేశారు. వారు 10 ఏండ్ల ప్రాయం వరకు ఏలూరులో వీధిబడిలోనే విద్యనభ్యసించి తరువాత ఉద్యోగం కోసం సంస్కృతం పార్సీ భాషలు నేర్చుకున్నారు. మచిలీబందరులో మార్గన్ దొరగారు స్థాపించిన 'మార్గన్ స్కూలు' లో 14 ఏండ్ల ప్రాయంలో 1790 ప్రాంతములో ఇంగ్లీషు నేర్చుకున్నారు. బందరులో ఇంగ్లీషు సిపాయిల దళాధిపతి కర్నల్ పియర్సు దొరగారితో (Col. Pearce) పరిచయంచేసుకుని వీరు ఇంగ్లీషు ఇంకా అభివృధ్ధి చేసుకుని వారి సహాయంతోనే సైన్యములో మిలిటరీ పె మాస్టరు ( Military Pay Master) అను గుమాస్తా ఉద్యోగములో ప్రవేశించారు. ఆ ఉద్యోగ రీత్యా బొర్రయ్యగారు అప్పటి మచిలీపట్టణం జిల్లాలో అనేక ప్రాంతములలో నున్న సైనిక సిబిరాలు ఒంగోలు, మునగాల, కొండపల్లి మొదలైన చోట్ల గల సైనిక స్తావరములలోని సిపాయిల దళాలకు జీతములు పంచివచ్చుటకు తరుచూ వెళ్లేవారు. వీరి అన్నగారు నారాయణప్ప గారు మద్రాసులో స్కాట్లాండు దేశస్తుడైన ఇంజనీరు కర్నల్ మెకంజీ ( Colonel COLIN MACKENZIE ) గారి క్రింద దుబాషీ అను పెద్ద ఉద్యోగి. మెకంజీ దొర గారు హైదరాబాదులో పనిచేస్తున్నప్పుడు వారి సిఫారసుపై బొర్రయ్యగారు 1794లో బందరులో హెడ్ గుమాస్తాగా ప్రవేశించారు. అప్పటికి వారి వయస్సు 18 సంవత్సరములు.

వెంకట బొర్రయ్య గారి వంశ చరిత్ర

విసన్నపేట జమీందారు దరిగొండ రమణప్ప గారు ఏలూరులో కావలి వెంకట సుబ్బయ్యగారి కుమార్తెను వివాహమాడారు. ఆమె సోదరుడే మన వెంకట బొర్రయ్య గారు. ఆవిధంగా కావలి వారు విసన్నపేట జమీందారీ సంబంధముగలిగినది. వెంకట బొర్రయ్యగారి వంశ వృక్షము కృష్ణాజిల్లా మాన్యువల్ లో 338 వ పుటలో నున్నది.[1], [2]

వెంకట బొర్రయ్యగారి జీవిత విశేషములు

మెకంజీ దొరగారు శ్రీశైల క్షేత్రమును సర్వే చేసినప్పుడు దొరగారు శ్రీశైల స్వామి దర్శనము చేయవలెనని కుతూహలము గలిగినది. కానీ క్రైస్తవులు, మ్లేఛ్ఛులను గర్భగుడిలోకి వచ్చుట అప్పటిలో నిషేధించబడియుండుటవలన దొరగారికి దైవదర్శనము కలిపించుటకు మన బొర్రయ్యగారు ఒక ఉపాయముచేశారు. పెద్ద అద్దములు రెండిటిని (వకటి గర్భగుడిలోని శివలింగము వెనుక, దానికి ప్రతిబింబముచేయటకు ఇంకొకటి బయట అమర్చి) దొరగారికి శ్రీశైల శివలింగ దర్శనము చేయించారు. ఈ విషయము Campbell దొరగారు రచించిన ఒక పుస్తకము ఫుట్ నోటులోనున్నట్లుగా దాసు విష్ణు రావు గారి 1938 లో రచించిన తమ స్వీయచరిత్రలో వ్రాశారు. దాసు విష్ణురావు B.A., B.L (1876-1939). వీరు దేవీ భాగవతము రచించిన మహాకవి దాసు శ్రీరాములు గారి కుమారుడు. కావలి సోదరలు (వెంకట బొర్రయ్యగారు వారి సోదరుడు దుబాషి నారాయణప్ప గారు) మెకంజీ దొరగారితో అనేక ప్రాంతములకు తిరిగారని స్వామినేని ముద్దునరసింహ గారు రచించిన హితసూచిని 2 వ సంకలనం (1986) పుస్తకమునకు ప్రవేశికలో (పీఠిక) లో ఆరుద్రగారు వ్రాశారు.[3]

వెంకట బొర్రయ్యగారి రచనలు

  • 1799వ సంవత్సరములో బ్రిటీషువారు శ్రీరంగపట్టణమును గెలుచుకున్నప్పుడు ఆ సమయములో అక్కడ ఉన్న బొర్రయ్యగారు ఆ ముట్టడిని, ఆ సాధనను వర్ణిస్తూ తెలుగులో ఒక కావ్యమును వ్రాశారు.
  • 1800లో సర్ ఆర్థర్ వెల్లస్లీ దుండి అనే పరాక్రముని పట్టుకున్నప్పుడు ఆ యుద్ధాన్ని వర్ణిస్తూ తెలుగులో ఒక కావ్యాన్ని వ్రాశారు.
  • ఇవి కాక "సత్పురుష వర్ణనము" అనే పేరుతో 100 శ్లోకములు రచించారు.
  • ఇంకా శ్రీరంగ చరిత్రము, శ్రీరంగపట్టణ రాజావళి, యాదవరాజవంశావళి అనే గ్రంథములు కూడా రచించారు.[4]

మూలాధారములు

  1. Krishna District Manual pp 338
  2. "18-19 శతాబ్దాలనాటి ఆంధ్ర ప్రముఖులు" దిగవల్లి వేంకట శివరావు అముద్రిత రచనలు
  3. "హితసూచని" స్వామినీన ముద్దు నరసిహ్మ (1986) ఆంధ్రకేసరి యువజన సమితి, రాజమండ్రి p VIII
  4. మన చరిత్ర, భాషకు తోడ్పడిన కావలి వేంకట బొఱ్ఱయ్య - కోన వెంకటరాయ శర్మ - ఆంధ్రపత్రిక ఆదివారం, ఏప్రిల్ 8,1956 సారస్వతానుబంధం , పేజీ:7[permanent dead link]