"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి

From tewiki
Jump to navigation Jump to search

కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అంటూ సాగే పద్యం తిక్కన రచించిన ఆంధ్ర మహా భారతము లోనిది. భారతంలోని ఈ పద్యం మరో నాలుగు పద్యాలతో పాటు భీష్మస్తుతిగా పేరొందింది. కురుక్షేత్రంలో ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞ ను, అర్జునుడిపైన ఉన్న వాత్సల్యంతో, పక్కనపెట్టి తనను చంపేందుకు దూకిన కృష్ణుణ్ణి భీష్ముడు వర్ణిస్తూ స్తుతిస్తున్న సందర్భంలోని పద్యం ఇది.

పద్యం

సీ. కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి
            గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ
    నుఱికిన నోర్వక యుదరంబులోనున్న
            జగముల వ్రేఁగున జగతి గదలఁ
    జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
            బైనున్న పచ్చని పటము జాఱ
    నమ్మితి నాలావు నగుఁబాటు సేయక
            మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ

తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
    నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
    విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ
    దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

తాత్పర్యం

రథం మీద నుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నది. ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో జగత్తు అదిరిపోయిందట. చక్రాన్ని చేపట్టి వేగంతో పరుగెత్తే ఆయన భుజాల మీద ఉన్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. అనూహ్యమైన ఈ చర్యకు అర్జునుడికి రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును పట్టుకుని నిలిపే ప్రయత్నం చేసి రోషంతో-నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘించే సింహంలా ఉరకలు వేస్తూ – ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా’ అంటూ – ముందుకొస్తున్న ఆ దేవుడు – నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు – నాకు దిక్కు అగు గాక!

సందర్భం

కుప్పించి ఎగసిన... ఆదిగా కలిగిన ఈ పద్యం పోతన వ్రాసిన శ్రీమదాంధ్ర మహా భారతం లోనిది. కురుక్షేత్రంలో 11 రోజుల పాటు యుద్ధం చేసి, గాయాలతో అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచిచూస్తున్న భీష్ముడి వద్దకు కురుక్షేత్రం ముగిశాకా కృష్ణుడు, పాండవులు వస్తూండగా వారితో బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు తమ శిష్యసమేతంగా వచ్చారు. ఆ సందర్భంలో భీష్ముడికి భారతయుద్ధంలో మూడవరోజు తన విజృంభణకు అర్జునుడు ఆగలేకపోగా, కృష్ణుడు ఎలా తనమీదకు చక్రధారియై వచ్చాడో గుర్తుకువచ్చింది. ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ కృష్ణుడిని స్తుతించాడు. అటువంటి సందర్భంలోని పద్యం ఇది.[1]

విశేషాలు

ఛందస్సు

పద్యాన్ని సీసం అనే ఛందస్సులో రాశారు. సీస పద్యంలో అంతర్భాగంగా తర్వాత వచ్చి తీరాల్సిన ఉపజాతి పద్యంగా తేటగీతి పద్యాన్ని రాశారు.

శిల్పం

ప్రాచుర్యం

కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి.. ఆదిగా వచ్చే పద్యం తెలుగునాట విస్తృత ప్రచారం పొందింది. పలువురు పౌరాణికులు, భాగవతులు ఈ పద్యాన్ని ప్రత్యేకించి విశ్లేషించేవారు. ఇతర సందర్భాలకు కూడా పద్యంలోని పాదాలను వినియోగించుకుని మార్చుకుని వాడుకున్న ఘటనలు ఉన్నాయి. పిచ్చుకుంటులనే జానపద కళాకారులు పలనాటి యుద్ధం గురించి చెప్తూ, బాలచంద్రుని కదనాన్ని వర్ణించేందుకు పాడే పాటలో మొదటి వాక్యం కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి ఆదిగా కల పాదమే.[2]
1962లో విడుదలైన బి.ఎ.ఎస్. సంస్థ వారి భీష్మ (1962) సినిమాలోనూ ఈ పద్యాన్ని యధాతథంగా వాడుకున్నారు. పద్యాన్ని ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేశాడు.[3]

మూలాలు

  1. చీమలమర్రి, బృందావనరావు (మే 2011). "భీష్మ స్తుతి". ఈమాట. నాకు నచ్చిన పద్యం. Retrieved 16 March 2016. Check date values in: |date= (help)
  2. మిక్కిలినేని, రాధాకృష్ణమూర్తి (1992). తెలుగువారి జానపద కళారూపాలు. హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం. p. 669. Retrieved 16 March 2016.
  3. ఉలిమిరి, సూర్య్. "కుప్పించి యెగసిన (పద్యం) - భీష్మ చిత్రం నుండిస". ఘంటసాల.[permanent dead link]