కుమ్ర లక్ష్మీబాయి

From tewiki
Jump to navigation Jump to search
కుమ్ర లక్ష్మీబాయి
దస్త్రం:Kumra Lakshmibai.jpg
జననం
దహిగూడ గ్రామం, పిప్పల్‌ధారి గ్రామ పంచాయతీ, ఆదిలాబాద్ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
జాతీయతభారతీయురాలు
వృత్తిసామాజిక సేవకురాలు

కుమ్ర లక్ష్మీబాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక సేవకురాలు. తాతలు, తండ్రుల కాలం నాటి భూముల హక్కుల కోసం సుమారు 15ఏళ్ల పాటు పోరాడి విజయం సాధించింది. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

జననం - తొలిజీవితం

లక్ష్మీబాయి ఆదిలాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా పిప్పల్‌ధారి గ్రామ పంచాయతీ పరిధిలోని దహిగూడ గ్రామంలో జంగు, రాంబాయి అనే దంపతులకు రెండో సంతానంగా జన్మించింది.[2]

లక్ష్మీబాయికి చిన్నతనంలోనే భీంరావ్ తో వివాహం జరిగింది. భర్త భీంరావ్ సుమారు 13ఏళ్ల క్రితం మరణించగా, కుటుంబ భారమంతా ఆమె పైనే పడింది. ఒక మగ పిల్లానితో పాటు, ముగ్గురు ఆడపిల్లలను పెంచడం కోసం ఎంతో కష్టపడింది.

భూపోరాటం

ముప్ఫైఏళ్ల క్రితం కొంతమంది గిరిజనులు ముళ్లపొదలూ, బండరాళ్లను తొలగించి భూములను చదును చేసుకుని సాగుయోగ్యంగా మార్చుకొని వ్యవసాయం (పోడు వ్యవసాయం) చేశారు. అలా సాగులోకి తెచ్చిన ఆ భూమిని తమ వారసులకు అందించారు. కాలక్రమంలో దాన్ని కొందరు గిరిజనేతరులు ఆక్రమించుకొని, ఆ భూమి యజమానుల్నే కూలీలుగా మార్చారు. ఆ గిరిజనేతరులపై పోరాటానికి సిద్ధపడి, తనవాళ్లకి చెప్పింది. కానీ ఎవరూ ధైర్యం చూపలేదు. దాంతో ఆమె ఒంటరిగానే పోరాటానికి సిద్ధపడి, దాదాపు పదిహేనేళ్లు పాటు అలుపెరగని పోరాటం చేసింది.[3]

సుమారు 15ఏళ్ల క్రితం తమ తాతలు, తండ్రుల కష్టార్జితమైన భూములను తమకు ఇప్పించాలని కోరుతూ కుమ్ర లక్ష్మీబాయి కోర్టులో కేసు వేశారు. ఆ భూములు రెవెన్యూ రికార్డుల్లో వారి తాతలు, తండ్రుల పేర్లపైనే ఉండడంతో కోర్టు లక్ష్మీబాయికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇటీవలే రెవెన్యూ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆ భూములను ఆమెకు అప్పగించారు. ఇలా గ్రామంలో పలువురి భూములు వారికే దక్కడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.[4]

గుడుంబా నిర్మూలన

గ్రామంలో పురుషులు గుడుంబాకు బానిసలవుతున్నారని తెలిసి ఆ గుడుంబా నిరోధానికి అనేక రకాలుగా కృషి చేసింది. మహిళలు, పిల్లలను చైతన్యవంతులను చేసి గుడుంబా స్థావరాలపై దాడులు చేసింది.[1]

గ్రామ సమస్యలు

గ్రామంలో పింఛన్, రేషన్ ల అక్రమాలపై అధికారులను నిలదీసి, సక్రమ పంపిణి అయ్యేలా చేసింది. ఎండాకాలంలో గ్రామంలో ఉన్న నీటి ఎద్దడి నివారణ కోసం ఆర్‌.డబ్ల్యు.ఎస్ అధికారులను కలిసి, సమస్య పరిష్కరించింది.[4]

బహుమతులు - పురస్కారాలు

మూలాలు

  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 6 April 2017.
  2. నవతెలంగాణ. "గిరిపుత్రుల గుండె చప్పుడు లక్ష్మీబాయి". Retrieved 6 April 2017.
  3. ఈనాడు, మహిళా జయహో. "'ఆదివాసీ ఝాన్సీ' లక్ష్మిబాయి". Retrieved 6 April 2017.[permanent dead link]
  4. 4.0 4.1 నమస్తే తెలంగాణ, ADILABAD NEWS. "పోరాట స్ఫూర్తి చైతన్య దీప్తి". Retrieved 6 April 2017.[permanent dead link]