కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి

From tewiki
Jump to navigation Jump to search
శ్రీ
కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి
200 px
తెలుగు సంగీత దర్శకుడు శ్రీ ఛాయాచిత్రపటం.
జననం
కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి

సెప్టెంబర్ 13, 1966 (1966-09-13) 1966 సెప్టెంబరు 13 (వయస్సు 54),
మరణంఏప్రిల్ 18, 2015 2015 ఏప్రిల్ 18(2015-04-18) (వయస్సు 48)
జాతీయతభారతీయుడు
విద్యఇంజనీరింగ్ (మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి)
వృత్తిసంగీత దర్శకుడు , గాయకుడు
జీవిత భాగస్వాములుఅరుణ
పిల్లలురాజేష్ చక్రవర్తి (కుమారుడు)
తల్లిదండ్రులుకె. చక్రవర్తి (తండ్రి)

శ్రీ (సెప్టెంబర్ 13, 1966 - ఏప్రిల్ 18, 2015) సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇతడు సంగీత దర్శకుడైన కె. చక్రవర్తి రెండవ కుమారుడు.[1]

జీవిత విశేషాలు

జననం

శ్రీగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో 1966, సెప్టెంబర్ 13 న శ్రీ జన్మించాడు[2].

వ్యక్తిగత జీవితము

తమ పక్కింటి అమ్మాయి అరుణను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కులాలు వేరు కావడంతో వీరి పెళ్ళిని కుటుంబసభ్యులు అంగీకరించలేదు. తర్వాత కొంతకాలానికి శ్రీ చెల్లెలికి ఆరోగ్యం బాగా లేనపుడు భార్య అరుణ చేసిన సేవలు, కుటుంబసభ్యులతో కలసిమెలసి పోవడం చూసి వీరి వివాహాన్ని ఆమోదించారు.

సినీరంగ ప్రవేశం

ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడైన శ్రీ సంగీతంపై మక్కువతో సినిమా రంగంవైపు అడుగులు వేశారు. రెండు దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి ధారావాహిక సంగీత కార్యక్రమానికి సింగర్ సునీతతో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. తొలిసారిగా బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. పోలీస్ బ్రదర్స్ ఆయన తొలిచిత్రం. హీరోగా అవకాశాలు చాలామంది ఇస్తానన్నా అవి కాదనుకుని సంగీత దర్శకుడుగానే ఉండిపోయాడు. సింధూరం సినిమా వర్క్ జరుగుతున్న సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి రుక్మిణి సినిమాలో హీరోగా చేయమని అడిగారు. ‘‘మ్యూజిక్ అయితే చేస్తాను, యాక్టింగ్ నా వల్ల కాదు’’ అని శ్రీ చెప్పాడు. దాంతో వినీత్ నీ హీరోగా తీసుకొని ఆ సినిమా తీశారు.

మరణం

గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 18, 2015హైదరాబాదు కొండాపూర్‌ లోని స్వగృహంలో కన్నుమూశాడు[3].

సంగీత దర్శకుడుగా

1993లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన గాయం సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే గీతం ఒక ఆణిముత్యం. తర్వాత వర్మ దర్శకత్వంలో మనీ, మనీ మనీ, అనగనగా ఒకరోజు సినిమాలకు శ్రీ సంగీతాన్ని అందించాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సింధూరం చిత్రం ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయం. లిటిల్ సోల్జర్స్, ఆవిడా మా ఆవిడే, అమ్మోరు, నా హృదయంలో నిదురించే చెలి, కాశీ, సాహసం, ఆడు మగాడ్రా బుజ్జీ, చంటిగాడు, నీకే మనసిచ్చాను చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.

చిరంజీవి నటించిన అంజి చిత్రంలోని ఒక పాటను స్వరపరిచాడు. అప్పూ అనే బాలల చిత్రం ఆయన చివరి చిత్రం. హాయ్‌రబ్బా పేరుతో స్మితతో కలిసి ప్రైవేటు ఆల్బం రూపొందించారు శ్రీ. ఇటీవల 'సాహసం', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'చందమామలో అమృతం' చిత్రాలకు పనిచేశాడు. 'అప్పు' అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది.

నేపధ్యగాయకుడుగా

సంగీత దర్శకుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, అనువాద కళాకారుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశాడు శ్రీ. 'చక్రం' సినిమాలో 'జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది' అనే గీతాన్ని, 'అనగనగా ఒక రోజు', 'గాయం', 'అమ్మోరు', 'సింధూరం' తదితర చిత్రాల్లోనూ పాటలు ఆలపించారు. సంగీత దర్శకుడిగా శ్రీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ చిత్రంలోనూ ఒక్క పాటైనా ప్రాచుర్యం పొందేది. శ్రోతలు పదేపదే పాడుకునేలా ఆ పాటలు ఉంటాయి. 'అనగనగా ఒక రోజు' చిత్రలో 'మా ఫ్రెండు చెల్లెల్ని కొందరు ఏడిపించారు..' అనే పాట శ్రీ శైలిని చాటి చెబుతుంది. మామూలు మాటల్ని సైతం పాటగా ఎలా చేయొచ్చో ఆ పాటతో చూపించాడు శ్రీ.

అనువాద కళాకారుడిగా

అనువాద కళాకారుడిగా కూడా పలు చిత్రాలకు పనిచేశాడు శ్రీ. లిటిల్ సోల్జర్స్ సినిమాలో రమేష్ అరవింద్ కు, ఆనందం సినిమాలో జై ఆకాశ్ కు, '143'లో సాయిరాం శంకర్కి డబ్బింగ్‌ చెప్పాడు.

ప్రజాదరణ పొందిన గీతాలు

శ్రీ సంగీతాన్ని అందించిన సినిమాల్లో మనీ చిత్రంలోని భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్..., వారెవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసూ... గీతాలు బాగా ఆదరణ పొందాయి. సింధూరం చిత్రంలో అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, హాయ్‌రే హాయ్ జాం పండురోయ్‌ తోపాటు.. ఐయామ్ వెరీ గుడ్‌గాళ్ (లిటిల్ సోల్జర్స్), ఓం నమామి అందమా, ఇంటికెళ్దాం పదవయ్యో ( ఆవిడా మా ఆవిడే), చికుబుక్ పోరి (అంజి), నా హృదయంలో నిదురించే చెలి (నా హృదయంలో నిదురించే చెలి) గీతాలు ప్రజాదరణ పొందాయి. గాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చక్రం చిత్రంలో ఆయన పాడిన జగమంత కుటుంబం నాది,ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించాడు.[1] ఖడ్గం సినిమాలో సత్యంపలికే హరిచంద్రులం అనే పాటలు ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టాయి.

శ్రీ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

మూలాలు

  1. 1.0 1.1 1.2 ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
  2. పులగం చిన్నారాయణ (2015-04-19). "ఇండస్ట్రీ నన్ను అర్థం చేసుకోలేదు (శ్రీ తో ఇంటర్వ్యూ)". సాక్షి దినపత్రిక. Archived from the original on 7 March 2016. Retrieved 19 April 2015.
  3. న్యూస్ టుడే (2015-04-19). "సంగీత దర్శకుడు శ్రీ కన్నుమూత". ఈనాడు. Archived from the original on 21 April 2015. Retrieved 19 April 2015.

బయటి లంకెలు