కొల్లేరు సరస్సు

From tewiki
Jump to navigation Jump to search
కొల్లేరు
—  రెవిన్యూ గ్రామం  —
పెద్దింటి అమ్మవారి దేవస్థానం
పెద్దింటి అమ్మవారి దేవస్థానం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ఆకివీడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 76
 - స్త్రీలు 78
 - గృహాల సంఖ్య 40
పిన్ కోడ్ 534235
ఎస్.టి.డి కోడ్
దస్త్రం:Kolleru Lake.jpg
కొల్లేరు సరస్సు
దస్త్రం:Kolletikota.kolleru.1.jpg
కొల్లేరు పెద్దింట్లమ్మవారి ఉత్సవం కొల్లేరు.
దస్త్రం:Kolletikota.kolleru.2.jpg
కొల్లేరులో పడవప్రయాం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - కొల్లేరు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలసవచ్చే పక్షులలో ముఖ్యమైనవి - పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలుకలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది.[1]

పెద్దింట్లమ్మ దేవాలయము

కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము. శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగులపైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒడిషా, అస్సాం, తమిళనాడు ల నుండి సైతం భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన కల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు.

రవాణా సౌకర్యాలు

సమీపాన కల ఆకివీడు నుండి లాంచీ ల ద్వారా, లేదా ఆలపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.

అయిదో కాంటూరు వరకు ఆక్రమణల తొలగింపు

కొల్లేరు 60శాతం ఆక్రమణలకు గురైంది. ప్రభుత్వం ఇక్కడి లంకల గ్రామాల ప్రజలకు ఇచ్చినది, ప్రజలు సరస్సును అక్రమంగా ఆక్రమించుకుని, కట్టలు పోసి, చేపల చెరువులుగా మార్చినది పోగా కేవలం 40 శాతం సరస్సు మాత్రమే మిగిలి ఉంది. చేపల పెంపకం కారణంగా సరస్సులో కాలుష్యం కూడా పెరిగింది.ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ సంస్థల పోరాటాల ఫలితంగా 2005లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టింది. కొల్లేరు సరస్సును అయిదో కాంటూరు వరకు విస్తరించాలంటే రైతుల దగ్గర నుంచి 15,335 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, దీనికి రూ.679.38 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈ నిధులను విడుదల చేస్తేనే విస్తరణ కార్యక్రమం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.వివిధ ప్రాజెక్టుల కోసం అటవీ భూములను తీసుకుని నష్ట పరిహారంగా ఇచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఇందులో ఇప్పటివరకు రూ.120 కోట్ల నిధులనే విడుదల చేశారని, మిగిలిన నిధులనూ పూర్తిగా విడుదల చేస్తేనే కొల్లేరు విస్తరణ పనులు చేపట్టడానికి అవకాశం ఉందన్నారు. కొల్లేరును అయిదో కాంటూర్ వరకు కాకుండా మూడో కాంటూర్ వరకు విస్తరిస్తామని అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం దానిని తిరస్కరించింది. మూడో కాంటూర్ లోపల 475 ఎకరాల రైతుల సొంత భూములను సేకరించడానికి రూ.21.38కోట్లు ఖర్చవుతుంది. అయిదో కాంటూర్ లోపలైతే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 13,899 ఎకరాలకు రూ.628.48 కోట్లు, కృష్ణా జిల్లా పరిధిలో 961 ఎకరాలకు రూ.30 కోట్లు వ్యయం అవుతుంది.కొల్లేరును అయిదో కాంటూరు వ్యన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా సంరక్షించాలని న్యాయస్థానాల ఆదేశాలు, ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటనల నేపథ్యంలో కొల్లేరును అయిదో కాంటూరు వరకు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, తెదేపా సహా దాదాపు అన్ని పక్షాల నాయకులు, పోటీచేసిన అభ్యర్థులు అంతా కొల్లేరును మూడో కాంటూరు వరకే పరిమితం చేసి, వ్యవసాయానికి, జలసాయానికి, కొల్లేటి ప్రజల ఉపాధికి ఢోకా లేకుండా చేస్తామని హామీలు గుప్పించేశారు. కొల్లేరును మూడో కాంటూరు వరకే వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఉంచాలని కేంద్రానికి కోరుతూ అసెంబ్లీలో తీర్మానించారు. న్యాయస్థానాల ఆదేశాలకు వ్యతిరేకంగా నాయకులు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, అసెంబ్లీ తీర్మానం కేంద్రంలో చెల్లుబాటు కాలేదు. ఇందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అయిదో కాంటూరు వరకూ కొల్లేరును రక్షించాల్సిందేనని ఎన్నికల అనంతరం స్పష్టం చేసింది. కొల్లేట అయిదో కాంటూరు వరకు ఉన్న చేపల చెరువులను ధ్వంసం చేసి, వాటిపై ఆధారపడి ఉన్న ప్రజల పునరావాస ప్యాకేజి అమలు చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2005 నుంచి ఇంతవరకు సుమారు రూ.80 కోట్లు వ్యయం చేసింది. అయినా ఆశించిన ఫలితం ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. ధ్వంసం చేసిన చెరువులనే పునరుద్ధరించడం ప్రారంభించారు. వీటిని మళ్లీ ధ్వంసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాది జూన్‌లో జిల్లాకు నీటిపారుదల శాఖ ద్వారా రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేసింది. పార్టీలన్నీ ఎన్నికల్లో మూడో కాంటూరు వరకే కొల్లేరును పరిమితం చేస్తామని హామీలిచ్చి, ఇప్పుడు అయిదో కాంటూరు వరకూ అంటున్నారని గుడివాకలంక తదితర గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులు చెరువులను ధ్వంసం చేయించడానికి కొలతలు వేస్తుంటేనే జిరాయితీ రైతులు అభ్యంతరాలు తెలుపుతూ అడ్డుకుంటున్నారు.అయిదో కాంటూరు లోపల చెరువులను పునర్ధురిస్తున్నారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణాధికారులు ఇంతవరకు 200కి పైగా ప్రజలపై కేసులు నమోదు చేశారు.

కేంద్రం చేతిలోకి కొల్లేరు

Panorama of Kolleru Lake 1.jpg
center

కేంద్ర ప్రభుత్వం కొల్లేరు సహా దేశంలోని 25 ప్రముఖ సరస్సుల నియంత్రణ బాధ్యతలను తన ఆధీనంలోకి తీసుకోబోతోంది. చిత్తడినేలల పరిరక్షణ నిర్వహణ నిబంధనలు-2009 పేరుతో కొత్త చట్టాన్ని అమలులోకి తేబోతోంది.చిత్తడి నేలలను మెట్టభూమిగా మార్చడాన్ని పూర్తిగా నిషేధించారు. ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఉన్న పరిశ్రమలను విస్తరించడం కూడా బంద్‌ చేస్తారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 1989లో విడుదల చేసిన మూడు ఉత్తర్వుల్లో పొందుపరిచిన ప్రమాదకర వ్యర్థాలను తయారుచేయడం కానీ, నిల్వ చేయడం కానీ, లేదంటే పారేయడం కానీ పూర్తిగా నిషేధం. ఒకవేళ సరస్సుల ప్రాంతంలో ఘన వ్యర్థాలను పారబోస్తుంటే ఏడాదిలోపు దాన్ని పూర్తిగా బంద్‌ చేయాల్సి ఉంటుంది. మురికి నీళ్లు, పరిశ్రమలు, నగరాలు, పట్టణాల నుంచి వచ్చే వ్యర్థాలేవైనా వీటిలోకి వదులుతుంటే రెండేళ్లలో పూర్తిగా నిలిపేయాల్సి ఉంటుంది. గత పదేళ్లలో ఆ ప్రాంతంలో గమనించిన అత్యధిక వరద స్థాయికి 50 మీటర్లలోపు పడవ జెట్టీలు తప్ప ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. జాతీయ చిత్తడి నేలల మదింపు కమిటీ అనుమతి లేకుండా సరస్సుల నుంచి నీరు తోడేయడం, నిల్వ చేయడం, ఇతర చోట్లకు మళ్లించడం, సహజ జలప్రవాహాన్ని అడ్డుకోవడం లాంటివి చేయకూడదు. మర పడవలు వాడకూడదు. సరస్సుల్లో పూడిక పేరుకు పోయినప్పుడు తప్ప ఎప్పుడూ తవ్వకాలు చేపట్టరాదు. నీటి సహజ ప్రవాహం, పర్యావరణ సంబంధ ప్రక్రియకు విఘాతం కల్గించే ఎలాంటి కార్యక్రమాలనూ 200 మీటర్ల పరిధిలో చేపట్టరాదు. బల్లకట్టు వంతెనలు, రోడ్ల నిర్మాణానికి తప్పనిసరిగా కేంద్ర కమిటీ అనుమతి పొందాలి. సరస్సుగా గుర్తించిన ప్రాంతంలో చేపలు పట్టడాన్ని నిషేధిస్తారు.

మారిన హద్దులు

భీమడోలు మండలం గుండుగొలను, ఆగడాలలంక మధ్య రోడ్డు పాయింటు వద్ద, ఆకివీడు మండలం సిద్ధాపురం, ధర్మాపురం గ్రామాల సరిహద్దులు, కృష్ణా జిల్లా సరిహద్దులతో కలిసేచోట అడంగల్‌లోని విస్తీర్ణం వంటి అంశాల ఆధారంగా రూపొందించిన మ్యాప్ కు,120 జీవోలో పేర్కొన్న 5వ కాంటూరు దిగువ సర్వే సంఖ్యల ఆధారంగా రూపొందించిన మ్యాప్ కు అభయారణ్య హద్దుల్లో తేడాలున్నాయి. గుండుగొలను, ఆగడాలలంక రోడ్డును అభయారణ్య పరిధి నుంచి మినహాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రోడ్డు గతం నుంచే ఉండటం ఇందుకు కారణం. ప్రస్తుతం నిర్ధారించిన మ్యాప్‌లో గుడివాకలంక ప్రాంతంలో 965, 966, 1003, 1004 సర్వే నెంబర్లతో కూడిన మొండికోడు ప్రాంతం అభయారణ్య పరిధిలోకి రాదు.అభయారణ్య సరిహద్దులు గుర్తిస్తూ స్తంభాలు ఏర్పాటు చేస్తారు.అభయారణ్యం చుట్టూ నక్లెస్ రోడ్డు, ఏలూరు నుండి కొల్లేరు మీదుగా కైకలూరుకు 25 కి.మీ.రైలుమార్గం వెయ్యాలని స్థానిక మత్స్యకార నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

పురాతన గ్రంధాలలో కొల్లేరు ప్రస్తావన

రామాయణం అరణ్యకాండలో వర్ణింపబడిన పెద్ద సరస్సు కొల్లేరే నని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన చిలుకూరి వీరభద్రరావు భావించాడు. ఈ విషయమై "ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము"లో ఇలా వ్రాశాడు - [2]

ఈ దండకారణ్య మధ్యమున యోజనాయుతమైన (100 చతురపు మైళ్ళ వైశాల్యము గల) మహా సరస్సొకటి గలదనియు, అది జల విహంగములతో నత్యంత రమణీయమై యొప్పుచున్నదనియు .... ఆప్రదేశమంత నిర్జంతుకముగా నున్నదనియు నగస్త్యుడు శ్రీరామ చంద్రునితో జెప్పినట్లు రామాయణమున చెప్పబడినది.... ఈ సరస్సెక్కడనున్నదని విచారింపగా నయ్యది యాంధ్ర దేశములోనిదిగా జూపట్టుచున్నది. ఏమన గొప్పదై దండకారణ్య మధ్యగతమై కొంగలకాకరమై యుండు తియ్యని కొలను మన యాంధ్ర దేశముననే గాని మఱియెచ్చటను గానరాదు.
మఱియు దండియను మహాకవి తన దశకుమార చరిత్రములో నీ యాంధ్రదేశము నభివర్ణించుచు నిందొక మహా సరస్సు గలదనియు నది సారస నిలయమనియు నది యాంధ్రనగరికి ననతి దూరముగా నున్నదనియు బేర్కొని యుండుటచేత నట్లభివర్ణింపబడిన కొలను కొల్లేరు గాక మఱియొక్కటి కానేరదు. (ఆంధ్ర నగరి యనగా వేంగి కావచ్చునని చిలుకూరి వీరభద్రరావు అభిప్రాయం). "కొల్లేటికొంగ" యను లోకోక్తియె కొల్లేరు కొంగలకు ప్రసిద్ధమను విషయమును వేనోళ్ళ జాటుచున్నది. దక్షిణ హిందూస్థానమున నెన్నందగిన పెద్ద తియ్య నీటికొలను "కొల్లేరు" మాత్రమేయై దండి చెప్పినట్లుగా జలరాశి.

ఇవి కూడ చూడండి

మూలాలు, వనరులు

  1. The calanoid and cyclopoid fauna (Crustacea Copepoda) of Lake Kolleru, South India[permanent dead link], Hydrobiologia, Volume 119, Number 1 / December, 1984, 27-48
  2. ఆంధ్రుల చరిత్రము - చిలుకూరి వీరభద్రరావు ప్రచురణ: విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి - 1910లో చెన్నపురి ఆనంద ముద్రణాశాల యందు ముద్రింపబడియెను. వెల 1-4-0. రాజపోషకులు: బొబ్బిలి రాజా, పిఠాపురం రాజా, మునగాల రాజా