"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కోదాటి నారాయణరావు

From tewiki
Jump to navigation Jump to search

కోదాటి నారాయణరావు (డిసెంబరు 15, 1914 - నవంబరు 11, 2002) గ్రంథాలయోద్యమం నేత, విశాలాంధ్ర ప్రచారకులు.

వీరు నల్గొండ జిల్లా రేపాల గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రంగారావు గారు రేపాల కరణంగా చేసేవారు. రేపాలలోని శ్రీ లక్ష్మీనరసింహ మనోహర బాలభారతీ పుస్తక భాండాగారం బాల్యం నుండే అతన్ని ఆకర్షించింది. దాని కార్యకర్తగా గ్రంథాలయ మంచి చెడ్డలు చూసేవారు. ప్రాథమిక తర్వాత సూర్యాపేటలో మెట్రిక్ పూర్తిచేశారు. ఆర్థిక కారణాల వలన సాయం కళాశాలలో చేరి పట్టా పొందారు. ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. వీరు కొంతకాలం గోలకొండ పత్రికలో పనిచేసి, జర్నలిజంపై ఆసక్తి కలిగి మందుకుల నరసింగరావు సంపాదకత్వంలోని "రయ్యత్" పత్రికలో ఏజెంట్ గా పనిచేశారు. తర్వాత ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజన్సీ తీసుకోవడంతో ప్రజా జీవనంతో సంబంధంలో ఏర్పడింది. వీరు అస్పృశ్యతా నివారణోద్యమం, గ్రంథాలయోద్యమం, జాతీయోద్యమం లలో ప్రముఖ పాత్ర పోషించారు. ఖమ్మంలోని విజ్ఞాన నికేతన గ్రంథాలయం ఆయన కృషి వలన స్థాపించబడింది. గ్రంథాలయోద్యమం ద్వారా విశాలాంధ్రకు నాందిపలికాడు. విజ్ఞాన నికేతనానికి జరిగే వార్షికోత్సవాల ద్వాతా నిజాం, బ్రిటిష్ వారిలో ప్రముఖులను కోదాటి సమావేశపరిచేవారు.

1944లో ఇల్లెందులో 25వ ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుండి అనేకమంది ప్రముఖులు విచ్చేశారు. విశాలాంధ్ర స్వరూపాన్ని ఆ సభ ప్రతిబింబించింది. గ్రంథాలయోద్యమం యావదాంధ్ర దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉద్యమంగా మారింది.

ఖమ్మంలో అస్పృశ్యతా నివారణ కోసం నిర్విరామంగా కృషిచేశారు. కోదాటి నాయకత్వంలో ఎందరో యువకులకు తిరుగుబాటు బీజాలు వేసి కనువిప్పు కలిగించారు. ఎం.ఎస్. రాజలింగం, కొమరగిరి నారాయణరావు, యల్లాప్రగడ కృష్ణమూర్తి, సుగ్గుల అక్షయలింగం గుప్తా, గెల్లా కేశవరావు మరెందరో హరిజజ హాస్టలులో విద్యార్థులకు చదువుచెప్పి జ్ఞానజ్యోతి వెలిగించారు. వర్తక సంఘం ఏర్పాటుచేసి వారిమధ్య తగాదాలను పరిష్కరించేవారు.

హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ లో 10వ ఆంధ్ర మహాసభ జరుగుతున్న సమయంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించారు. పోలీసు చర్య అనంతరం ఆలంపురంలో జరిగిన ఉత్సవాలలో పరిషత్తు పేరును ఆంధ్ర సారస్వత పరిషత్తుగా మార్చారు.

తెలంగాణా ఉద్యమంలో కోదాటి, కాళోజీ, కొమరగిరి నారాయణరావు గారలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరిని నారాయణ త్రయం లేదా కకారత్రయం అనేవారు. కోదాటి నారాయణరావు పలువురు కవులు కళాకారులు రచయితలను ప్రోత్సహించేవారు. అనేక అవార్డులు సాధించిన నాటకకర్త కె.ఎల్.నరసింహారావు తాను తొలినాళ్ళలో రాసిన నాటకాన్ని చదివించుకున్న తొలిశ్రోత, తనకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తీ కోదాటియే అని వ్రాసుకున్నారు.[1]

ఆంధ్ర రాష్ట్ర, అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలం రాష్ట్ర స్థాయి సహకార సంఘానిని అధ్యక్షులుగా పనిచేశారు. ఇవికాక ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా, గాంధీ స్మారక నిధి కార్యదర్శిగా, గాంధీ భవన్ మేనేజింగ్ ట్రస్టీగా, సర్వోత్తమ గ్రంథాలయానికి అధ్యక్షునిగా ఆయన వ్యవహరించారు. కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం అధ్యక్షులుగా, భాగ్యనగర ఖాదీ సమితి కార్యదర్శిగా కూడా పనిచేశారు.

కాకతీయ విశ్వవిద్యాలయం కోదాటికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

మూలాలు

  • నారాయణరావు, కోదాటి (1914-2002), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు 314-15.
  • ప్రచారం గిట్టని ప్రజా సేవకుడు : కోదాటి నారాయణరావు, తెలుగు వెలుగులు, ఆంధ్ర ప్రదేశ్ పత్రిక డిసెంబరు 2009 సంచికలో ప్రచురించిన వ్యాసం, పేజీ: 4.
  1. నరసింహారావు, కె.ఎల్. (9 నవంబరు 1956). అడుగుజాడలు (నమస్కారం వ్యాసం). Retrieved 5 March 2015. Check date values in: |date= (help)


Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).