"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కోరస్ (బెంగాలీ సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
కోరస్
దస్త్రం:Chorus 1974 film.jpg
దర్శకత్వంమృణాల్ సేన్
నిర్మాతమృణాల్ సేన్ ప్రొడక్షన్స్
రచనమృణాల్ సేన్
కథమృణాల్ సేన్,
మోహిత్ ఛటర్జీ
నటులుఉత్పల్ దత్
శేఖర్ ఛటర్జీ
గీతా సేన్
దిలీప్ రాయ్
సంగీతంఆనంద శంకర్
ఛాయాగ్రహణంకె.కె.మహాజన్
విడుదల
1974 (1974)
దేశంభారతదేశం
భాషబెంగాలి/హిందీ

కోరస్ (బెంగాలీ: কোরাস) మృణాల్‌సేన్ దర్శకత్వంలో 1974లో నిర్మించబడిన బెంగాలీ చిత్రం. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ ఛాయాగ్రహణం (నలుపు-తెలుపు), ఉత్తమ సంగీతం అవార్డులు లభించాయి.

నటీనటులు

  • ఉత్పల్‌దత్
  • శేఖర్ చటర్జీ
  • గీతా సేన్
  • దిలీప్ రాయ్
  • అజిత్ బెనర్జీ

సాంకేతికవర్గం

  • కథ : మృణాల్ సేన్, మోహిత్ చటర్జీ
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మృణాల్ సేన్
  • ఛాయాగ్రహణం : కె.కె.మహాజన్
  • సంగీతం : ఆనంద శంకర్

చిత్రకథ

అనగనగా ఒక రాజును గురించి ఓ కవి పాటపాడుతూ వుండడంతో ఈ కథ మొదలవుతూ ఉంది.

రాజు కొలువుదీర్చి తన దగ్గరున్న మేధావులందరినీ సమావేశపరిచి ఒక ప్రశ్న వేశాడు. "ఓ మేధావుల్లారా మన దేశంలో కోరికలే లేని మనుషులుగల ప్రాంతం ఏదైనా వుందా? ఈ విషయం మీరే చెప్పాలి. ఎంచేతంటే మేము చాలా కాలంగా నిద్రపోతున్నాము" అన్నాడు. రాజుగారి ప్రాపకంలో సుఖాలకు అలవాటుపడ్డ మేధావులు చాల సులభంగానే జవాబు చెప్పారు. "ప్రభూ! ప్రజల్లో తరచుగా కోరికలన్నవి కలుగుతూ వుంటాయి. ఒకవేళ లేకపోయినా మనం అలా కోరికలు కోరడానికి తగిన క్లిష్టమైన వాతావరణాన్ని కల్పించాలి. వాళ్ళ అవసరాలకు ఎప్పుడూ లోటన్నది ఉంటూనే వుండాలి. లేకపోతే వాళ్ళకు మీరన్నా దేవుడన్నా భక్తి ఎలావుంటుంది చెప్పండి? మనం కల్పించిన మతంమీద, కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఎలా ఏర్పడుతుంది చెప్పండి?" అన్నారు. రాజుకు ఈ సమాధానం సబబుగానే తోచింది. "అవును. ప్రజల్లో అవసరాలన్నవి ఎప్పటికీ వుండి తీరాలి" అనుకున్నాడు. తనకు దేవుడులాంటి చక్రవర్తి ముందు తన కోరికలను కూడా జ్ఞాపకం తెచ్చుకున్నాడు.

రాజుల్లాంటి దేవుళ్ళు, దేవుళ్ళుగా చలామణి అయిన రాజులు ఎప్పటినుంచో భూమి మీద అవతరిస్తూనే ఉన్నారు. కానీ ఆకారాలే మారిపోతూ ఉన్నాయి. కోరికలు - అవసరాలు కల్పించే ఈనాటి చిల్లరదేవుళ్ళు కోట్లూ, సూట్లతో అవతరించారు. పెద్దపెద్ద కోటల్లాంటి వాళ్ళ కార్యాలయాల్లో - సుఖ భోగాలకేమీ తక్కువలేదు. కోటల బయటి వాతావరణం వాళ్ళకసలు అక్కర్లేదు. ఇవాళ్టి కొత్త రాజు పేరు ఛైర్మన్. ప్రజల గురించి చెప్పడానికి ఆయనకు సలహాదార్లు చుట్టూ మామూలుగానే ఉన్నారు.

ప్రజల అవసరాలు నిరుద్యోగాలు మరీ ఎక్కువై పోయాయి అని సలహాదార్లు మరీ మరీ చెబితే 'కర్మ - అదృష్టం' లాంటి సిద్ధాంతాల ప్రాముఖ్యం నిలపాలని ఒక వంద ఉద్యోగాలు మాత్రం ఏర్పాటు చేశాడు ఛైర్మన్. కానీ ఉద్యోగాల కోసం కాచుకుని ఉన్నవాళ్ళు వెయ్యిమంది వరకూ ఉన్నారు. "అంతమాత్రం చేత తక్కిన తొమ్మిది వందల మందినీ నిరుత్సాహపరచడం ఎందుకు? అందరికీ దరఖాస్తులు అందజేయండి. ఉద్యోగాలు దొరకనివాళ్ళూ 'మా కర్మ' అనుకుని ఏడవనీయండి" అన్నాడు. తరతమ భేదాలు లేకుండా అందరికీ దరఖాస్తులు మాత్రం అందాయి.

రానురాను అవసరాలు, సమస్యలూ ఎక్కువైపోయాయి. చిల్లరదేవుళ్ళచేత ఎక్కువ చేయబడ్డాయి. నిరుద్యోగ సమస్య మరింత ఎక్కువయ్యే సరికి ఛైర్మన్ కోటముందు క్యూ పెరిగి పోసాగింది. ఆ క్యూలో వ్యవసాయ కూలీలు, మిల్లు కార్మికులు ఇలా రకరకాలుగా వివిధ వ్యాపకాలను ఎన్నుకున్న వేలాది జనం చేయడానికి పనుల్లేక మండుటెండలో ఆశల నీడల్లో అక్కడ నిలబడ్డారు. అందరి మొహాల్లోనూ ఆవేదన, ఆరాటం మూర్తీభవిస్తున్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క విషాదమైన కథ.

కథలంటే అందరికీ ఇష్టమే. ఒకే చోట ఇన్నిరకాల మనుషులు ఇన్ని కథలూ అంటే పత్రికల వారికి ఇంకేం తక్కువ? విపరీతమైన ఈ వాతావరణం వాళ్ళను ఆకర్షించింది. న్యూస్ కెమెరాలు మెరుపుల్లా వరసగా మెరిశాయి. క్యూలో నిలబడ్డ ప్రజల కథలు టేప్‌రికార్డర్లలోకి, పత్రికలలోకి ఎక్కాయి. ఎవరి చరిత్ర విన్నా 'పరపీడన పరాయణత్వమే' ప్రతిధ్వనించింది. తన పల్లెటూళ్ళో వడ్డీ వ్యాపారి అన్యాయాలకు బలైపోయి, అన్నింటినీ పోగొట్టుకుని అక్కడకు చేరిన వ్యవ్యసాయకూలీ గాథను ఒక టేప్ వినిపిస్తే - మరో టేప్ ఒక కార్మికుని హృదయవిదారక గాథను వివరించింది. బస్తీలో నివసిస్తున్న ఓ యువతి తనూ తనవాళ్ళూ పడుతున్న అవస్థలన్నీ ఒక్కటీ దాచకుండా చెప్పింది. అన్నీ గాయపడిన హృదయాలేఅ. అందరివీ కన్నీటి కథలే.

పాపం! ఛైర్మన్‌కు ఈసారి కాస్త దయకలిగింది. ఈ యువతరం యొక్క నిరుద్యోగపు ఆకలిని, ఆక్రోశాన్ని తీర్చాలనుకున్నాడు. "సరే... ఈ సారి ఏర్పడిన నూరు ఖాళీలకు ముప్పైవేల దరఖాస్తులు మంజూరు చేశాను. పొండి" అని దర్జాగా టై సరిచేసుకుని కూర్చున్నాడు.

ఐతే... ఇప్పటి యువతరం వెనుకటి వాళ్ళలా వూరుకోలేదు. "మీ పాలకుల మోసాలు మేము కనిపెట్టాము. మీ కుతంత్రాలు ఇక చెల్లవు" అన్నారు. అలా అంటూ వూరుకోలేదు. వాళ్ళలో చైతన్యం ప్రజ్వరిల్లింది. విప్లవ భావాలి కార్చిచ్చులా నలుదిశలా వ్యాపించాయి. "అలజడి మా జీవితం. ఆందోళన మా ఊపిరి - తిరుగుబాటు మా వేదాంతం. న్యాయ సాధనకై మేము పోరాడుతాం" అన్న సమూహగానం (కోరస్) కోటలోని వాళ్ళు విని గతుక్కుమన్నారు. 'శాంతి... అహింస..' అంటూ కొన్ని మంత్రాలు వవల్లించడానికి ప్రయత్నించసాగారు.

కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉప్పెనలా ముంచుకు వస్తున్న ఆ ప్రజాసమూహం విజృంభిస్తూనె ఉంది. వాళ్ళ చైతన్య గీతం హోరులో ఈ మంత్రాల తంత్రులు తెగిపోక తప్పలేదు[1].

పురస్కారాలు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1974 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ సినిమా మృణాల్ సేన్ విజేత
1974 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ సంగీత దర్శకుడు ఆనంద శంకర్ విజేత
1974 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం (నలుపు-తెలుపు) కె.కె.మహాజన్ విజేత

మూలాలు

  1. సంపాదకుడు (1 August 1975). "ఉత్తమ చిత్రం కోరస్". విజయచిత్ర. 10 (2): 6–8. |access-date= requires |url= (help)

బయటిలింకులు