"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గుండేరావు హరార్కే

From tewiki
Jump to navigation Jump to search
గుండేరావు హరార్కే
200px
గుండేరావు హరార్కే
జననంమార్చి 13, 1887
హైదరాబాద్‌, తెలంగాణ
మరణండిసెంబర్ 3, 1979
ఇతర పేర్లుగుండేరావు, హరార్కే
ప్రసిద్ధిన్యాయశాస్త్ర కోవిదుడు, బహుభాషావేత్త, చిత్రకారుడు మరియు మల్లవిద్యా విశారదుడు
తండ్రిరామారావు
తల్లిసీతాబాయి

గుండేరావు హరార్కే (మార్చి 13, 1887 - డిసెంబర్ 3, 1979) న్యాయశాస్త్ర కోవిదుడు, బహుభాషావేత్త, చిత్రకారుడు మరియు మల్లవిద్యా విశారదుడు.[1]

జననం

ఈయన రామారావు, సీతాబాయి దంపతులకు 1887, మార్చి 13న హైదరాబాద్‌ లోని చందూలాల్‌ బేలాలో జన్మించాడు.

విద్యాభ్యాసం - ఉద్యోగం

గుండేరావు హరార్కే మరాఠీ, తెలుగు, కన్నడ భాషలు మాట్లాడేవాడు. 1899లో ఆంగ్ల పాఠశాలలో చేరి, 1906లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాశాడు. అదే సమయంలో హరార్కే తండ్రి రామారావు ఉన్నత న్యాయస్థానం నుండి ఉద్యోగ విరమణ చేశారు. దాంతో చదువును మధ్యలోనే ఆపేసి, నగర న్యాయస్థానంలో ఉద్యోగిగా చేరాడు. 1908లో ప్రమోషన్ పొంది స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు మారాడు.

నిజాం రాజ్యం ఆ కాలంలో త్రిభాషా రాష్ట్రం అవ్వడంతో 1914 లో గుండేరావును ఉన్నత న్యాయస్థానానికి మార్చారు. న్యాయ శాస్త్రం, రెవెన్యూ, అకౌంటెన్సీ ఈ మూడు శాఖలలో ప్రభుత్వం నిర్వహించే ఉన్నత పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణులవడంతోపాటు, పంజాబీ విశ్వవిద్యాలయం ఫార్సీ, అరబీ భాషలలో నిర్వహించే మౌల్వీఆలం, మౌల్వీ ఫజల్‌ వంటి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యాడు.

గద్వాలలో న్యాయమూర్తిగా చేరిన గుండేరావు క్రమంగా సెషన్స్‌ జడ్జ్‌గా, కలక్టర్‌గా పదవులు చేపట్టి 1919 నుండి 1948 వరకు 30 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. సాయంకాలం వరకు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, మిగిలిన సమయంలో న్యాయ, వైశేషిక, వ్యాకరణ, విూమాంసాది సర్వ శాస్త్రాలను అధ్యయనం చేస్తూ, న్యాయ, సాహిత్యాది శాస్త్రాలలో శిరోమణి పరీక్షలో, విూ మాంసా శాస్త్రంలో పి.ఓ.ఎల్‌ పరీక్షలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణులైనాడు.[1]

రచనా ప్రస్థానం

 • విజ్ఞానేశ్వరుని మితాక్షరా హిందూ ధర్మశాస్త్రాన్ని ఉర్దూ భాషలోకి అనువదించడంతోపాటు, అందులో కొన్ని కొత్త అరబిక్‌ పారిభాషిక పదాలను కూడా సృష్టించాడు.
 • గోల్డ్‌ స్మిత్‌ రాసిన ట్రావెలర్‌ (ప్రవాసి), డిసర్టెడ్‌ విలేజ్‌, వర్డ్స్ వర్త్ రాసిన ఏన్‌ ఓడ్‌ టు ఇమ్మోర్టాలిటి, ధామస్‌ గ్రే రాసిన ఎలిజి (చైత్య విలాపము) వంటి ఆంగ్ల కావ్యాలకు సంస్కృతపద్యాను వాదము చేశాడు.
 • షేక్స్పియర్ హామ్‌లెట్‌ను, మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ డ్రీమ్‌ను సంస్కృతంలోకి అనువదించాడు.
 • ఖురానే షరీఫ్‌ యొక్క 5 భాగాలు సంస్కృత పద్యానువాదము ఇస్లామిక్‌ కల్చర్‌ లో ముద్రింపబడింది.
 • ఫార్సీలోని మస్నివీ షరీఫ్‌ ను కొంత భాగము సంస్కృతానువాదం చేశాడు. యాస్కుని నిరుక్తము తెలుగు అనువాదము కొంత గోలకొండ పత్రికలో ముద్రింపబడింది.
 • చూపు మందగించాక కూడా, వ్రాయస గాని సహాయంతో పింగళి సూరన్న గారి ప్రభావతీ ప్రద్యుమ్న ప్రబంధాన్ని సంస్కృతంలోకి అనువదించాడు. వీరి సంస్కృత ప్రత్యయ కోశమును ఉస్మానియా విశ్వవిద్యాలయము సంస్కృత శాఖ ముద్రించింది.
 • మరాఠీ సాహిత్య చరిత్రను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రచురించింది.[1]
 • అయ్యలరాజు త్రిపురాంతకకవి - శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకముకు పీఠిక రాశాడు.[2]

పురస్కారాలు

 • హర్కారే న్యాయశాస్త్ర కోవిదత్వానికి మెచ్చి న్యాయశాస్త్ర కేంద్రమైన నవద్వీపంలో పండితపరిషత్తు వాచస్పతి అను బిరుదును ప్రదానం చేసింది.
 • అయోధ్య, బెల్గాం నగర పండిత సభలు విద్యా భూషణ బిరుదును ప్రదానం చేశాయి.
 • గోల్డ్ స్మిత్ ట్రావెల్ సంస్కృతానువాదంకు మైసూరు ప్రభుత్వం స్వర్ణ పతాకాన్ని ప్రదానం చేసింది.[3]

మరణం

హరార్కే 1979, డిసెంబర్ 3న మరణించాడు.[1]

మూలాలు

 1. 1.0 1.1 1.2 1.3 తెలంగాణ ప్రభుత్వ మ్యాగజైన్. "వాచస్పతి గుండేరావు హర్కారే". magazine.telangana.gov.in. Retrieved 10 June 2017.
 2. ఆంధ్రభారతి. "అయ్యలరాజు త్రిపురాంతకకవి - శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకము పీఠిక". www.andhrabharati.com. Retrieved 10 June 2017.
 3. సరసభారతి ఉయ్యూరు. "గీర్వాణ కవుల కవితా గీర్వాణం -74 113-ధర్మ శాస్త్ర నిధి ,న్యాయాధీశ కవి –గుండేరావు హర్కారే". sarasabharati-vuyyuru.com. Retrieved 10 June 2017.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).