గుర్రాల వెంకట శేషు

From tewiki
Jump to navigation Jump to search

గుర్రాల వెంకట శేషు భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా తన సేవలనందించారు.

జీవిత విశేషాలు

ఆయన స్వగ్రామం టంగుటూరు మండలం జమ్ములపాలెం. ఆయన 1945లో జన్మించారు. ఆయన తండ్రి గుర్రాల వెంకటస్వామి. తన ప్రాథమిక విద్యను ఒంగోలులోనే పూర్తి చేశారు. డిగ్రీ, పీజీ కావలి జవహర్‌ భారతి కళాశాలలో చేశారు. ఆంధ్రా యూనివర్శిటీలో మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎంకామ్‌) విద్యనభ్యసించారు. ఎంకాం పూర్తయిన తరువాత 1979లో ఒంగోలు వచ్చిన శేషు ఏబిఎం కళాశాల ఎదురుగా శాంతినికేతన్‌ ట్యుటోరియల్‌ సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు విద్యను అందించారు. ఈయన వద్ద విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్‌లుగా, ఐపిఎస్‌లుగా, బ్యాంకు, పోలీసు అధికారులుగా, వివిధ శాఖలలో ఉన్నత పదవులను సాధించారు. ఒంగోలు మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావుకి జివి.శేషు రాజకీయ గురువు.[1]

రాజకీయ జీవితం

ఆయన 1977లో ఒంగోలు బ్లాక్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1989 శాసన సభ ఎన్నికలలో తొలిసారిగా సంతనూతలపాడు శాసనసభ్యునిగా గెలిచిన[2] శేషు అప్పటి ముుఖ్యమంత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో పాడి పరిశ్రమ, జౌళి శాఖ, లిడ్‌ క్యాప్‌ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. 1996-99 మధ్య కాలంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా శ్రీకాకుళం, విజయనగరం ఇన్‌ఛార్జిగా పనిచేశారు. 1994 ఎన్నికలలో సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జివి శేషు సిపిఎం అభ్యర్థి తవనం చెంచయ్య చేతిలో ఓడిపోయారు.[3] 1999లో జరిగిన ఎన్నికలలో సంతనూతలపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి, పాలపర్తి డేవిడ్‌రాజు చేతిలో ఓటమి చవిచూశారు. 2005-08 మధ్య కాలంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా జివి శేషు మూడేళ్ళ పాటు పార్టీని నడిపించారు. తరువాత కాలేయంలో గడ్డలు ఏర్పడి జివి.శేషు అనారోగ్యం పాలవటంతో స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వైద్య చికిత్సలకు సహకరించారు. తరువాత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా జివి శేషుకు అవకాశం కల్పించారు. 2007-09 మధ్య కాలంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శేషు పనిచేశారు. 2009 సాధారణ ఎన్నికలలో కొండపి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రజలకు సేవలందించారు. [4]

వ్యక్తిగత జీవితం

ఆయన జూలై 23 2016 న మరణించారు.[5] ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన రాజకీయ వారసునిగా కుమారుడు డాక్టర్‌ రాజ్‌విమల్‌ ఉన్నారు. [6]

మూలాలు

ఇతర లింకులు