"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చల్లా రాధాకృష్ణ శర్మ

From tewiki
Jump to navigation Jump to search

ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ (1929 - 1999) రచయిత, కవి, విమర్శకుడు, బహుభాషావేత్త, బాల సాహిత్య రచయిత, అనువాదకులు.

జీవిత విశేషాలు

వీరు కృష్ణా జిల్లాలోని సోమవరప్పాడు గ్రామంలో 6 – 1 – 1929 న జన్మించారు.శర్మ తండ్రి సాంస్కృతాంధ్రాలలో, హిందీలో అపారమైన పాండిత్యం గలవారు, అష్టావధాని, బహు గ్రంథ కర్త అయిన చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి . తల్లి అన్న పూర్ణకునుద్దియైన యశోదమ్మ.

విద్యాభ్యాసం

ఈయన నాల్గవ తరగతి వరకు బందరులో చదివారు. మద్రాసుకు ఇరవై మైళ్ళ దూరంలో చెంగల్పట్టు జిల్లాలోని పోన్నేరి గ్రామంలో ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివి ఆ తర్వాత నెల్లూరు వి.ఆర్. కళాశాలలో ఎం.పి.సి గ్రూపుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యాడు. తెలుగు సాహిత్యాన్ని ప్రధానాంశంగా తీసుకుని బి.ఎ చదివి 1950 లో డిగ్రీ పొందారు. నెల్లూరులో విద్యార్థిగా ఉండిన శర్మ ప్రాచ్య భాషా పరిషత్ కు కార్యదర్శిగా పనిచేశారు. నెల్లూరులో దర్భా వెంకట కృష్ణమూర్తి, ధరణికోట వెంకట సుబ్భయ్య, పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి, నేలటూరి రామ దానయ్య, గుంటూరులో జమ్మలమడక మాధవరామశాస్త్రి వంటి హేమా హేమీలు గురువులుగా లభించటం అదృష్టంగా పొంగిపోయేవాడు. చల్లా శర్మ మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు పూర్తి చేశాడు. నిడదవోలు వెంకటరావు పర్యవేక్షణలో “ Tamil element in telugu literature ’’ అనే అంశంపై పరిశోధన చేసి ఎం.లిట్ పొందారు. మద్రాసు విశ్వ విద్యాలయం నుంచే పర్యవేక్షకులు లేకుండా స్వయంగా “ The Ramayana in telugu and tamil- a comparative study ‘’ అనే అంశంపై పరిశోధన చేసి ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం పరీరక్షకులుగా పి.హెచ్.డి పొందారు. శర్మ మొదట్లో సత్యవేడు గ్రామంలో ఉన్నత పాఠశాలలో సైన్సు టీచర్ గా, తరువాత మద్రాసు సర్. త్యాగరాయ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు . 1957 నుంచి మద్రాసు లో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యాలయం కార్యదర్శిగా ఇరవై నాలుగు సంవత్సరాలు పని చేశారు . 1981 నుంచి మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యాక్షులుగా పని చేసి పదవీ విరమణ చేశారు .

ఉన్నత విద్యాభ్యాసం అనంతరం మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో చాలాకాలం ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరు తమిళం నుండి చాలా పుస్తకాల్ని అనువాదం చేశారు. పిల్లల కోసం అనగా, అనగా, బెకబెకలు, అన్నదమ్ములు, దయావీరులు, అంతా ఒక్కటే, శ్రీసాయి కథామృతం అనే కథా సంకలనాలను వెలువరించారు. వాన కురిసింది, చందమామ అనే గేయాల పుస్తకాలు రాశారు. ప్రసిద్ధ వ్యక్తులను ' చరిత్ర కెక్కిన చరితార్థులు ' అనే పేరుతో మూడు భాగాలుగా పిల్లలకు పరిచయం చేశారు. దీనిలో భారతదేశానికి చెందిన ఎందరో ప్రసిద్ధిచెందిన మహాపురుషుల పరిచయాలు ఉన్నాయి. జయదేవుడు జీవితచరిత్ర రాశారు.

తమిళ భాషలో ప్రసిద్ధిచెందిన కొన్ని పిల్లల పుస్తకాలను కూడా తెలుగు బాలలకు పరిచయం చేశారు. చిట్టికి చిరుగంట, కడుపులో గారడీ, అడవి ఏనుగు కథ, టైం ఎంతయింది, దారిచూపిన తాత గాంధీ, భారతి చెప్పిన పిల్లల కథలు, బాల రామాయణం, భారతి జీవిత కథ, రంగు రంగుల పూలు చెప్పుకోదగ్గవి. ఆంగ్లంలో పిల్లల కోసం రాసిన కథల పుస్తకం టేల్స్ ఫ్రమ్‌ తెలుగు (1975) మరాఠీ, మళయాళం, తమిళం, హిందీ భాషలలోకి అనువాదం అయింది.

వీరు ఎన్నో సమావేశాలలో సాహిత్యం గురించి ప్రసంగాలు చేశారు. పత్రికలలో వ్యాసాలు ప్రకటించారు. సాహిత్య అకాడమీలో ఉండటం వల్ల శర్మకి అనేక భాషాల కవులతో , రచయితలతో పరిచయాలు ఏర్పడాయి. శర్మ లోకజ్ఞత , పరిశీలనాదృష్టి విస్తరించాయి.

గుడివాడ వాస్తవ్వులైన చింతలపాటి కామయ్య శాస్తీ కుమార్తే సుశీలతో శర్మ వివాహం జరిగింది. ముగ్గురమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలతో ఆదర్శ జీవితాన్ని గడిపారు . శర్మ హై స్కూల్ విద్యార్ధిగా ఉండగా ఒక సభలో ఒక ప్రసిద్ధి తమిళ పండితుడు తమిళ భాష చాలా గొప్పదని ప్రసంగిస్తూoటే శర్మ లేచి “మా తెలుగే గొప్పది ” అన్నారట .

శర్మ డిల్లిలో కేంద్రసాహిత్య అకాడమీలో పనిచేస్తున్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మాత్తుగా అకాడమి కార్యాలయానికి వచినప్పుడు శర్మ నెహ్రుతో కరచాలనం చేసి మాట్లాడటం ఒక మధురానుభూతిగా మిగిలిందని పరవశించి పోయారు శర్మ .

1957లో పశ్చిమ జర్మనీలో మ్యూనిచ్ నగరంలో ఒక వారం గడపటం, డిల్లీలో జరిగిన అంతర్జాతీయ రామాయణ సదస్సులో పాల్గొనటం, తమిళనాడు గవర్నర్ ప్రభుదాస్ పత్వారీతో “భాషాభూషణ ” బిరుదు పొందటం శర్మ జీవితంలో మధుర సన్నివేశాలు .

శర్మ వక్త అంటే శ్రోతలను ఉర్రూతలూగించి, నవ్వించి చప్పట్లు కొట్టించే వక్త కాదు. విషయం ప్రధానంగా మెదడుకి మేతనందించే ఉపన్యాసం ఆయనది. సాహితిపరులకి, ఆలోచనాశీలురకి మాత్రమే ఆయన ఉపన్యాసం నచ్చుతుంది.

‘‘ గర్వం-ప్రల్లదనం ’’ అయన నిఘంటువులో దొరకవు. స్నేహాన్ని సకలార్ధ సాధనంగా భావించేవారు. నిరాడంబర జీవనులు. భాషల ద్వారా జాతీయ సమైక్యతని సాధించిన బహుముఖ ప్రతిభావంతులు. చిన్నవాళ్ళ అభిప్రాయాల్ని కూడా స్వీకరించి ‘‘ బాలదపి సుభాషితం ’’ అనే సూక్తిని గౌరవించే ఈ మంచి మనిషి హఠాత్తుగా 20-10-1998 న ఈ లోకాన్ని విడిచి పెట్టినా ద్రావిడ సాహిత్యం ఉన్నంత వరుకు ఆయన అమరజీవులే. శర్మ రచనలు :- శ్రీ రాధాకృష్ణ శర్మ దాదాపు తొంబై ఏడు పై చిలుకు రచనలు చేశారు. ఆర్ధిక స్తోమత అంతగా లేకున్నా వదాన్యుల, పుస్తక ప్రచురణ సంఘాల విద్యా సంస్థల సహకారం వల్ల ఇన్ని రచనలు వెలువడ్డాయి. ప్రచురణ కావలసినవి సుమారు పది వరుకు ఉంటాయి. మొత్తం మీద శత గ్రంథకర్త అనవచ్చు.

రచనలు

నవలలు

 1. మణి మేఖాల
 2. `రాణి మీనాక్షి
 3. దళవాయి రామప్ప
 4. విమలాదిత్య విజయం
 5. శ్రీ విజయము మొదలైనవి

వచన కవితా సంపుటాలు

 1. ఆర్తి గీతాలు
 2. శ్రమలో స్వర్గం
 3. శాంతి సూక్తం (1995)
 4. పఠీస్తూ
 5. జయించిన జనత (1972) మొదలైనవి.

గేయ సంపుటి

 1. వాన కురిసింది

పద్య కవితా సంపుటాలు

 1. సాయి నాధ (శతకం)

విమర్శ, చరిత్ర గ్రంథాలు

 1. తెలుగు – దక్షీణ్యత సాహిత్యాలు
 2. తెలుగు – తమిళ కవితలు - జాతీయ వాదం[1]
 3. సాహిత్య సమారాధన
 4. వ్యాస మంజూష
 5. ప్రజా కవి వేమన
 6. తెనుగు విందు
 7. తమిళ విందు
 8. సి.పి.బ్రౌన్ సాహితీ సేవ
 9. తమిళ సాహిత్య చరిత్ర (1976)
 10. ఆధునిక తమిళ సాహిత్య నిర్మాతలు[2] మొదలైనవి.

బాల సాహిత్య రచనలు

 1. జాతీయ కవి గరిమెళ్ళ
 2. బెకబెకలు
 3. మా తాతయ్య కొక ఎనుగుండేది
 4. దారి చూపిన తాత గాంధీ
 5. బాలల పద్యాలు
 6. పిల్లల పాటలు
 7. అన్నదమ్ములు
 8. అంతా ఒక్కటే
 9. పొడుపు కధలు

అన్య భాషా రచనలు

 1. టేల్స్ ఫ్రొం తెలుగు
 2. రాంబ్లింగ్స్ ఇన్ తెలుగు లిటరేచర్
 3. లాండ్ మార్క్స్ ఇన్ తెలుగు లిటరేచర్
 4. వెర్సెస్ ఆఫ్ వేమన
 5. నవ భారత పునర్నిర్మాణము
 6. తెలుంగు ఇలక్కియ
 7. ఆముక్తమాల్యద (తమిళ సేత)
 8. భారతి దాసన్ కవితలు
 9. బాలల రామాయణం

మొదలైనవి.

ఇతర రచనలు

 1. మదరాసు తెలుగు
 2. సుబ్రహ్మణ్య భారతి
 3. తర తరాల తమిళ కవిత
 4. మధుర నాయక రాజులు
 5. ఇంటాబయట రామకథ
 6. అనంతశయనం
 7. ఆర్కాటు సోదరులు[3]
 8. మ్యూనిచ్ యాత్ర
 9. రాజభక్తి ( నాటికలు )
 10. తమిళ వేదము
 11. ఆలోచనాలహరి
 12. ఇతిహాసలహరి
 13. నమ్మాళ్వారు (అనువాదం)
 14. తమిళ సాహిత్య కథలు

నిఘంటువులు

 1. త్రిభాషా నిఘంటువు

పరిష్కరణ ప్రచురణలు

 1. “ వెర్సెస్ ఆఫ్ వేమన ” సుమతీ శతకం

మూలాలు

 • రాధాకృష్ణశర్మ, డాక్టర్ చల్లా, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 497-8.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).

 1. చల్లా, రాధాకృష్ణశర్మ. తెలుగు,తమిళ కవితలు జాతీయవాదం. హైదరాబాదు: యువభారతి.
 2. రాధాకృష్ణశర్మ, చల్లా. ఆధునిక తమిళ సాహిత్య నిర్మాతలు.
 3. రాధాకృష్ణశర్మ, చల్లా. ఆర్కాటు సోదరులు.