జన్మ

From tewiki
(Redirected from జన్మము)
Jump to navigation Jump to search

ఒక శరీరంలోనికి అదృశ్యరూపంలో ఉన్న ఆత్మ ప్రవేశించడంతో శరీరం ప్రాణం పోసుకోవడాన్ని జననం అంటారు. ప్రాణం పోసుకున్న శరీరాన్ని ప్రాణి అంటారు. ప్రాణం పోసుకున్న శరీరం మళ్ళీ ప్రాణాన్ని వదలేంత వరకు జరిగిన కాలాన్ని ఆ శరీరానికి సంబంధించిన జన్మ అంటారు.

జన్మము అనఁగా ఆత్మకు శరీరము తోడి సంబంధము. ఈశ్వరుఁడు జీవునికి కర్మానురూపముగా శరీరములను ఫలములను ఇచ్చుచు ఉన్నాఁడు. అనఁగా జీవుఁడు పూర్వజన్మలయందు చేసిన పుణ్యకర్మములను అనుసరించి వివేకముగల మనుష్యాదిజన్మములను పాపకర్మములను అనుసరించి వివేకముచాలని పశ్వాదిశరీరములను పొందుటయేకాక ఆయాజన్మములయందును సుఖదుఃఖ రూపఫలములను ఆవల స్వర్గనరకాది లోకములను పొందుచు ఉన్నాఁడు. బీజాంకురన్యాయముగా ప్రవాహరూపము అగు కర్మపరంపరను నివర్తింప చేయవలయు. ఆత్మ అనాది, ఆయాత్మకు శరీరధారణహేతువులు అయిన కర్మములును అనాదులు; కర్మములవలన దేహము కలుగుచు ఉన్నది; దేహముచేత కర్మములు చేయఁబడుచు ఉన్నవి; ఈరెంటిలో ఏదిముందో ఎఱఁగబడదు. చెట్టువలన విత్తు కలుగుచు ఉన్నది; విత్తువలన చెట్టు కలుగుచు ఉంది. ఈరెంటిలో ఏదిముందో తెలియఁబడదు. ఆలాగుననే ఆత్మకర్మములును నిత్యములయి ఉన్నాయి. కర్మములు సుఖదుఃఖహేతువులు అగు కార్యములు. సుఖహేతువు అగు కార్యము పుణ్యకర్మము అనియు, దుఃఖహేతువు అగు కార్యము పాపకర్మము అనియు చెప్పఁబడును. దుఃఖము మనకు ఎట్లు విడువ తగినదో అట్లే నశ్వర మయిన సుఖమును విడువ తగినది. మనము కోరకయే ఎట్లు దుఃఖములు కలుగుచు ఉన్నవో అట్లు సుఖములును మనము కోరకయే పూర్వపూర్వ కర్మములచేత కలుగుచు ఉన్నాయి. పుణ్యము చేసినవాఁడును ఆ పుణ్యమునకు అనురూపమైన ఫలమును అనుభవించుటకుఁగాను జన్మము ఒక్కటి ఎత్తవలయు. కనుక శబ్దమయవేదమార్గము అయిన కర్మఫలబోధన ప్రకారము వ్యర్థములు అగు స్వర్గాది నానాలోకసుఖములను ఇచ్ఛించువాఁడు కలలు కనుతెఱఁగున పరిభ్రమించుచు ఉండును; నిరవద్య సుఖలాభమును చెందనేరఁడు. కాఁబట్టి విద్వాంసుఁడు అగువాఁడు నామమాత్రసారములు అగు భోగములలో ఎంతట దేహనిర్వాహము సిద్ధించునో అంతియ కైకొనుచు అప్రమత్తుఁడు అయి సంసారము సుఖము అని ఎంచక ఒండుమార్గమున సిద్ధి కలదేని పరిశ్రమచేయ ప్రయత్నించుచు ఉండును.

సీ||
పాంచభూతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలోఁ బూర్వకర్మ
వశమున నొకవేళ వర్తించు దీపించు తఱియైన నొకవేళఁ దలఁగిపోవు
చెడునేని దేహంబు చెడుఁగాని పురుషుండు చెడఁ డాతనికి నింత చేటులేదు
పురుషునికిని దేహపుంజంబునకు వేఱుగాని యేకత్వంబు గానరాదు

దారువుల వెలుంగు దహనుని కైవడిఁ
గాయములఁ జరించు గాలి భంగి
నాళలీనమైన సభము చాడ్పున వేఱు
దెలియవలయు దేహి దేహములకు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు