జాతీయపతాక వందనం

From tewiki
Jump to navigation Jump to search
జాతీయపతాక వందనం
కృతికర్త: వడ్డూరి అచ్యుతరామ కవి
దేశం:  భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: జాతీయపతాక వందనం
విభాగం (కళా ప్రక్రియ): దండకం
ప్రచురణ:
విడుదల:

జాతీయపతాక వందనం ప్రముఖ కవి వడ్డూరి అచ్యుతరామ కవి రచించిన దేశభక్తికి సంబంధించిన దండకం.

దండకం

శ్రీమన్మహీమండలంబందు వెల్గొందు శ్రీ హిందూదేశంబు దాస్యంబునన్ మ్రగ్గుచో
సర్వ జాతీయ వీర ప్రజా సంతతిన్ కూర్మి సంధింపగా నైకమత్యంబు సత్యంబు
శాంతంబు త్యాగంబహింసన్ బ్రబోధింపగా భూరి స్వాతంత్ర్యమున్ పేర్మి సాధింపగా
నీవే యాధార భూతంబ వైనావుగా సత్పతాకంబా!నీ శాంతి సత్యాదులాదర్శమై
యొప్ప నీ ఛాయనేగా చరిత్రన్ మహా కీర్తి స్వర్ణాక్షరాళిన్ వెలుంగొందు ధీరాగ్రగన్యుల్
మహాదేశభక్తుల్ త్యాగమూర్తుల్ మహాశాంతియోధుల్ ఘనుల్ పూజ్య నౌరోజీ;
వేడ్దర్; బరన్; హ్యూము; గోఖ్లే; తిలక్; చిత్తరంజన్; బెనర్జీ; తయాబ్జీ ముఖుల్;
పూజ్య బాపూజీ; నేతాజీ ; లాలాజి ; మాలవ్య ; వాచా ; పటేల్ ; మోతీలాల్;
షౌకతాలి; భగత్సింగ్; బీసెంట్ ; గోపాలకృష్ణయ్య ; శ్రీరాములున్ ;పూజ్య నెహ్రుజీ ;
రాజాజీ ; రాజేంద్ర పట్టాభి ; దేభర్ ; వినోబా ; యజాద్ ; పంతు ; రాధాకృష్ణన్ ;
స్వామి ; కల్లూరి ;అల్లూరి ; గోపాల ; సంజీవ ; రంగా ; ప్రకాశం ; కళా ముఖ్యులున్
వీరులింకెందరో ధీరులజ్ఞాత యోధుల్ కుల స్త్రీలు కస్తూరిబా ;లక్ష్మి ; మణ్బెన్ పటేల్ ;
దుర్గాబాముఖ్యులౌ వీర హిందూ పురంద్రీ మణుల్ విశ్వదాతల్ ; కవుల్ ; గాయకుల్ ;
డాక్టరుల్ ;లాయరుల్ ; పాత్రికేయుల్ ;మహా దేశభక్తుల్ ; మహర్షుల్ ;
సదా ధర్మ యుద్ధంబునన్ ;శాంతి మార్గంబునన్ ; మాతృబంధంబులన్ ద్రెంచ
ధీ ప్రాణ విత్తంబు లర్పించుచున్ ; మించి యాంగ్లేయులన్ గెల్వ యత్నంబు లన్ జేయ
సత్యాగ్రహంబాది సర్వాయుధాలిన్ మహా వ్యూహముల్ గూర్చి దీవించి గెల్పించి యున్నావు ;
స్వాతంత్ర్యమున్ దెచ్చి సత్కీర్తి చేకూర్చి యున్నావుగా నేడు నీజాతికిన్ కూటికిన్ గుడ్డకున్
కొంపకున్ లోటులేకుండ సర్వార్ద సంవృద్ది సేయంగ యత్నంబులన్ జేయుచున్నావు ; మా తల్లి !
యాశక్తి యాయుక్తి నీ సత్క్రుపా దత్తముల్గావే ?సద్ధర్మ సంకేతమౌ కేతనంబా ! మదంబా !
మహాశక్తి సంధాయినీ !శాశ్వతైశ్వర్యసంధాయినీ ! శాంతి సౌభాగ్య సంపప్త్రదాత్రి !
మహానంద దాత్రీ ! లసద్విశ్వ సామ్రాజ్య స్వాతంత్ర్య సౌభాగ్యదాత్రీ !మహాకీర్తి దాత్రీ !
భవత్కీర్తి యీ దేశ దేశంబులన్ సర్వ ఖండములందెల్ల వెల్గొందే ; సర్వ ప్రపంచ ప్రజానీక
మీనాడు నీయందు రాజిల్లు నీ ధర్మ చక్రంబుచే శాంతి సౌఖ్యంబు లాసింప నీవే సదా దిక్కటంచున్
మనీష్యాలి కీర్తింప రాజిల్లు చున్నావు ;మువ్వన్నె జెండా !యహింసాత్మకంబై త్రివర్ణాత్మకంబై
త్రివర్గ ప్రదంబైన నీ శ్యామవర్ణంబుచే వ్యాపకత్వంబు నారాజసంబైన యైశ్వర్యమున్ ;
పోషకత్వంబు సూచింప నీ శ్వేత వర్ణంబుచే సాత్వికంబైన సత్యంబు సత్కీర్తి సృష్టి స్వభావంబు రూపింప ;
నీ తామ్ర వర్ణంబుచే సృష్టి నైక్యంబు ; నా త్యాగభావంబు ; శీలంబు ; సేవాపరత్వంబు బోధింప ;
నీయందు రాజిల్లు సద్ధర్మ చక్రంబుచే ధర్మ సంస్తాపకత్వంబు గావింపగా నీశ్వర బ్రహ్మ విష్ణు స్వభావంబులన్
బోల్చి ముమ్మూర్తులన్ వెల్గుచున్నావు ; తత్వ త్రాయీభావ మింపొందు నీరూపు ధ్యానింప; దర్శింప ;
నీ కీర్తి వర్ణింప ; నీ యర్ధ మాలింప బ్రాచీన హిందూ మహా సంస్కృతుల్ వైభవంబుల్ స్పురింపన్
మహోత్సాహ మేపారగా ; నైహికాముష్మికంబైన యానంద మింపొందగాడెందముప్పొంగదే! సర్వ శాస్త్రంబులన్
గల్గు ధర్మంబులన్ సర్వ ధర్మంబులన్ గల్గు మర్మంబులన్ పేర్మి నీ యందు రూపింపవే ! రాజకీయంబు ;
నధ్యాత్మ తత్వంబు నేకంబు గావించి నీయందు మూర్తీభవింపన్ విరాజిల్లెదో తల్లి ! సద్భక్త మందార వల్లీ !
సదా నమ్ర రాజేంద్ర మౌళీ విరాజత్కిరీటాగ్ర సద్రత్నరింఛోలి నీరాజితాంఘ్రిద్వయే !అద్వయే లోకసంభావితే ! నిర్మలే !
కోమలే ! శ్యామల శ్వేత కాషాయ సౌభాగ్య రూపాభి సంయుక్త సౌందర్య శోభే ! శుభే !
శంకర బ్రహ్మ విష్ణు స్వరూపే !త్రయీమూర్తిభావే! సదా భవ్య భూపాల సౌధాగ్రవిబ్రాజితే !యోగిభి: పూజితే !
విశ్వవిశ్వంభరా వ్యాప్త శశ్వద్యశో వాసితే ! భారతీ యైక హృత్పద్మసంవాసితే ! భాసితే !
అచ్యుతారాధితే ! సర్వ భాద్రాత్మికే ! సర్వశక్యా త్మికే ! పాహి సత్య స్వరూపే ! పతాకే ! నమస్తే !
త్రయీమూర్తిరూపే !పతాకే నమస్తే !అహింసా స్వరూపే ! పతాకే ! నమస్తే ! సదా విశ్వ శాంతి ప్రియే !
సత్పతాకే !నమస్తే ! నమః ! త్యాగారూపే ! పతాకే ! నమస్తే ! పవిత్ర త్రివర్ణాంచితే !సత్పతాకే ! నమస్తే !
నమస్తే !నమస్తే ! నమస్తే ! నమః !

ఇది శ్రీ మధుభయ కవి మిత్ర శేషమాంబా సోమేశ్వర పుత్ర శ్రీ సకలవిద్వజ్జనవిధేయ అచ్యుతరామ నామధేయ ప్రణీతంబైన భారత జతీయపతాకవందనం

మూలాలు

ఇతర లింకులు