"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర
Gnana Saraswati Temple శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము | |
---|---|
దస్త్రం:Basara-temple-1.jpg | |
భౌగోళికాంశాలు: | 18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°ECoordinates: 18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°E |
పేరు | |
స్థానిక పేరు: | Shri Gnana Saraswati Temple శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము |
స్థానము | |
దేశము: | భారతదేశం |
రాష్ట్రము: | తెలంగాణ |
ప్రదేశము: | బాసర |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | సరస్వతి |
నిర్మాణ శైలి: | దక్షిణ భారతదేశం |
ఆదిలాబాదు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతిచెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది ఆదిలాబాదు జిల్లా ముధోల్ మండలం బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.
Contents
పురాణగాధ
బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది.[1] కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా, గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతున్నది. ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.
ఆలయ విశేషాలు
బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.
రవాణా సౌకర్యాలు
హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్, భైంసా) బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది.
సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.
ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.
మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేషతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం.
పూజా విశేషాలు
ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యైఆర్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానికలు సమర్పించే ఆచారము ఉంది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. దర్శన వేళలు :- ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.3 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7.3 గంటల వరకు అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.3 గంటల నుండి 12.3 గంటల వరకు అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు చేస్తారు. 12.3 గంటలకు నివేదన చేసి ఆలయము 2 గంటవరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6.3 గంటల వరకు అర్చన సర్వదర్శనం చేస్తారు. 6.3 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.3 గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయము మూసి వేస్తారు.
నవరాత్రులు
ఆశ్విని శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీదేవీ భాగవతము, దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహార్నవమి రోజున చండీ హోమము చేయబడుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికథలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.
కొన్ని ప్రార్ధనలు
- విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
- ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
- పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
- బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతరమ్
- నమోస్తు వేదవ్యాస నిర్మిత ప్రతిష్టితాయై
- నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయై
- నమోస్తు అష్ట తీర్థజల మహిమాన్వితాయై
- నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై
- యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
- నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమోనమః
శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం
- శరచ్చంద్ర వక్త్రాం లసత్పద్మ హస్తాం - సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం!
- ఘనాకార వేణీ౦ నిరాకార వృత్తిం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
- ధరా భార పోషాం సురానీక వంద్యాం మృణాళీ లసద్బాహు కేయూర యుక్తాం!
- త్రిలోకైక సాక్షీ ముదార స్తనాధ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
- దురాసార సంసార తీర్ధాంఘ్రి పోతాం క్వణత్ స్వర్ణ మాణిక్య హారాభి రామాం!
- శరచ్చంద్రికా ధౌత వాసోలసంతీం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
- విరించీ విష్ణ్వింద్ర యోగీంద్ర పూజ్యాం ప్రసన్నాం విపన్నార్తినాశాం శరణ్యాం!
- త్రిలోకాధి నాథాధి నాథాం త్రిశూన్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
- అనంతా మగమ్యా మనాద్యా మభావ్యా మభేద్యా మదాహ్యా మలేప్యా మరూపాం!
- అశోష్యా మసంగా మదేహా మవాచ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
- మనో వాగతీతా మనామ్నీ మఖండా మభిన్నాత్మికా మద్వయాం స్వ ప్రకాశాం!
- చిదానంద కందాం పరంజ్యోతి రూపాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!
- సదానంద రూపాం శుభాయోగ రూపా~మశేషాత్మికాం నిర్గుణాం నిర్వికారాం!
- మహా వాక్య వేద్యాం విచార ప్రసంగాం భజే శారదా౦ వాసరా పీఠ వాసాం!!
- ఇమం స్తవం పఠేద్వస్తు త్రికాలం భక్తి సంయుతః!
- శారదా సౌమ్య మాప్నోతి గృహేస్థిత్వాజ్ఞ సంభవం!!
ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత వాల్మీకి కృత శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం సంపూర్ణం
ఇవికూడా చూడండి
వనరులు
- భక్తులచే నిర్వహింపబడుతున్న వెబ్ సైటు http://basaratemple.org
- బాసర గురించి సమగ్రసమాచారము కొరకు వెబ్ సైటు http://basaratemple.com
- శ్రీ సరస్వతీ వైభవము - సంకలన కర్త: సరస్వతీ ఉపాసకులు కొడగండ్ల వేంకటేశ్వర శర్మ.
మూలాలు
- ↑ నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 42