"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తమ్మలి

From tewiki
Jump to navigation Jump to search

తమ్మలి : అనగా ఆంధ్రప్రదేశ్ లో బి.సి.డి. గ్రూపునకు చెందిన ఒక కులం. తమ్మలి వారు శివాలయాల్లో అర్చకులు. ఆదిశైవులు అంటే శివ బ్రాహ్మణులు.

చరిత్ర - సామాజిక జీవనం

వారు దేవాలయాలలో స్వార్థ, పరార్థ పూజలను శివా గమముల ప్రకారం కొనసాగించేవారు. కర్షణాది ప్రతిష్ఠాంతము, ప్రతిష్ఠాది ఉత్సవాం తము, ఉత్సవాది ప్రాయశ్చిత్తాంతము... వంటి పూజాకలాపాలను నిర్వహించేవారు. శివార్చకులని, వివద్విజులని, స్థాపకులని, శివాచార్యులని, దీక్షితులని, తమ్మళులని కూడా అంటారు. పూర్వం తమిళప్రాంతం నుంచి వలస వచ్చిన `తమ్మళి' కులస్థులు తెలుగు నేలపై స్థిరపడ్డారు. కనుకనే వీరిని తమ్మళులు, తంబళులు అని పిలిచేవారు. కాలక్రమేణా వీరు తమ్మళిలు అయ్యారు. వీరి పూర్వీకులు బాసికాలు తయారు చేసేవారు. శైవ పూజ తగ్గటం వల్లవీరు తయారుచేసే బాసికాలకు ఆదరణ తగ్గింది. కొందరు శివాలయం ఎదుట పూలు అమ్ముకుని బతుకుతున్నారు. శివుని ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదనేది వీరి భావన. ఇప్పటి తరంలోని తమ్మళివారిని చూపించి వీరు తమిళ ప్రాంతపు వారంటే ఎవ్వరూ నమ్మరు కూడా. వీరి కట్టూ బొట్టూ, ఆచార వ్యవహారాలు, మాట్లాడే తీరు... అన్నీ తెలుగుదనమే. వీరి ఇంటి పేర్లు అందరివీ ఒకటే. తమ్మళి ఇంటి పేరు తప్ప మరో ఇంటి పేరు వీరిలో ఎవ్వరికీ ఉండదు. కనుక వావివరసలు మారకుండా ఉండేందుకు వీరు గోత్రాలను చూసి వివాహాలు జరిపిస్తుంటారు.

వృత్తి - సాంప్రదాయాలు

హిందు వివాహవ్యవస్థలో వధూవరులకు నుదుట బాసికం కట్టటం తరతరాల ఆచారంగా వస్తోంది. పూర్వపు రోజుల్లో తమ్మళివారు తయారు చేసిన బాసికానికి ఒక ప్రత్యేకత ఉండేది. వీరు అరచేయి అంత వెడల్పున బాసికాన్ని తయారు చేసేవారు. అది కూడా వెదురును సన్నటి ఈనెలుగా చివ్వి రమణీయంగా తయారు చేసేవారు. కనుకనే పెళ్ళిళ సీజన్‌ వచ్చిందంటే ఎక్కడెక్కడివారో ఈ బాసికాలు తయారు చేసేవారిని వెతుక్కుంటూ వచ్చేవారు. వీరు తయారు చేసిన పెద్ద బాసికాన్ని వస్త్రంతో నుదుటిపై బంధించేవారు.ఎక్కువ మంది బంగారానికే ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభించాక వీరి కులవృత్తి మరుగున పడింది. దాంతో ఈ కులంలో ఎక్కువమంది శివాలయాల్లో అర్చకులుగానే ఉంటున్నారు. ఇతర దేవాలయాలతో పోల్చుకుంటే శైవాలయాల్లో దక్షిణలు కూడా తక్కువగా వస్తుంటాయి.

రిజర్వేషన్లు - ఉద్యమాలు

వైష్ణవ ఆలయాల్లోని అర్చకులు కూడా తమ్మలి వారికిచ్చిన రిజర్వేషన్‌ తమకూ వర్తింప చేయాలని కోర్టుకు వెళ్ళారు. పైగా తెలంగాణ ప్రాంతం మినహా మిగతా ప్రాంతా లలో తమ్మలి కులస్థులు లేరని అన్నారు. ఇందుకు ప్రభుత్వం స్పందించి 1997లో జీఓ నెం 20 విడుదల చేసింది. దీని ప్రకారం నల్గొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలోని తమ్మలి వారికే రిజర్వేషన్‌ వర్తిస్తుం దనీ, రాష్ర్టంలోని మిగతా జిల్లాలలో నివసిస్తున్న తమ్మలి వారికి బిసి రిజర్వేషన్‌ వర్తించదని స్పష్టం చేసింది. తమ్మలివారు కోర్టును ఆశ్రయించటంతో స్టేటస్‌కో ఇవ్వటం జరిగింది. కనుక రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న తమ్మళిలు ప్రస్తుతం రిజర్వేషన్‌ పొందగలుగుతున్నారు. కులవృత్తి దెబ్బతిన్నా, మరోవైపు కోర్టులో రిజర్వేషన్‌పై వ్యాజం నడుస్తున్నా, ఆదాయం వచ్చినా రాకపోయినా శైవాలయాల్లో సేవలు చేస్తూ కాలం గడుపుతున్నారు. పుట్టుస్వామి కమిషన్‌ ఎటువంటి సర్వే జరపక గుడ్డిగా తమ్మళి కులంవారు ఐదు జిల్లాలలోనే ఉన్నారని ప్రభుత్వానికి నివేదిక సమర్పించటం సమంజసం కాదంటున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారందరికి‚ ఒకే ఇంటిపేరు ఉన్నప్పటికీ కులదృవీకరణ పత్రాలు మంజూరు చేసే అంశంలో అధికారులు వివక్ష చూపుతున్నారని వీరి మరోబాధ.

ఇవీ చూడండి

మూలాలు