తాళపత్రాలు- పుట్టుపూర్వోత్తరాలు

From tewiki
Jump to navigation Jump to search

నేటి ఆధునికయుగంలో మనం యంత్రయుగంలో పరుగుతీస్తూ అనుకొన్న పుస్తకాన్ని అనువైన ఆకారంలో ముద్రణ చేసుకోగలుగుతున్నాం. అపూర్వ రచనలను క్షణాల్లో ప్రత్యంతరాలుగా(జిరాక్స్‌, కంప్యూటర్ ద్వారా)మార్చుకొంటున్నాం. ఇన్నిసౌకర్యాలు ఇంత అందమైన అచ్చు,కనువిందు కలిగించే హంగులతో పుస్తక గ్రథనం(బైండు)వాని వ్యాప్తిని అనేక విధాల పుస్తకాలను మనం చూస్తూఉన్నాం.వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయని మనం వెతుక్కొంటే.. ‘సుఖ ముద్రాసమన్విత గ్రంథరాశి’లో తేలియాడే మనం కొన్నివందల,వేలసంవత్సరాల వెనుక నాటి గ్రంథాలను, ఆనాటి వారి భాధలను పరిశీలిస్తే నాటి సాహిత్య సౌధ నిర్మాణ కార్మికుల కఠోర దీక్షాదక్షతలు కొంతవరకు తెలుస్తాయి. మన పూర్వీకులు శిలలపైన, ఇటుకలపైన,చర్మంపైన,బట్టలపైన,మైనంపైన,గుజ్జు మొదలైనవాటితో సిద్ధం చేసిన ఫలకాలమీద(పెపైరస్)రాగి,ఇత్తడి,సువర్ణ,రజతంరేకులు,కట్టెపలకలు,భూర్జపత్రాలు ఇలా అనేక విధాలైన వాటిపైన వ్రాసిపెట్టి మనకు అందించినారు.[1][2]

తాళపత్రం - పుట్టు పూర్వోత్తరాలు -ముఖ్యాంశాలు

 1. తాటాకుల పరిచయం
 2. తాటివనాలను పెంచడం
 3. తాటిచెట్ల సాగుకు నీటివసతి అవసరం లేదు!
 4. నాణ్యమైన ఆకులకొరకు గ్రంథకర్తలు చాలా శ్రమపడేవారు!
 5. తాళ పత్ర గ్రంథాలు ఏవిధంగా తయారు చేస్తారు?
 6. తాటాకులకు పసరు పట్టించడం!
 7. వివిధ ఆకృతులలో అందంగా సిద్ధమైన తాటాకులు
 8. 8. తాళపత్ర గ్రంథాలను ఏవిధంగా పరిరక్షిస్తారు?బొద్దు పాఠ్యం


1. తాటాకుల పరిచయం-

         ఆంధ్రదేశంలో తాటిచెట్లు విరివిగా పెరుగుతాయి. ఆంధ్రుల సంస్కృతికి మూలస్తంభం ‘తాటిచెట్టు‘. అనేక విధాల ఉపయోగకారి అయిన ఈ వృక్షాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ‘ఆంధ్రుల కల్పవృక్షం’ అని అన్నారు.దక్షిణ హిందూదేశంలోగాక,సింహళ,ఇండోచైనా,మలేయార్కి(మలేషియా),పెలగో,బర్మా మొదలైనదేశాలలో తాటాకే ముఖ్యమైన లేఖనసాధనంగా ఉండేది. 

పూర్వం వీటిని ‘స్తంభాలు‘గా ఇళ్ళ కట్టడాలలో ఉపయోగించేవారు. వైష్ణవులు శ్రీచూర్ణం, శైవులు విభూధికి ఉపయోగించే లోహపాత్రలు ‘అంటు‘ ఉంటుందని ‘తాటిచిప్పలు‘ ఉపయోగించేవారు.

          దక్షిణ భారతదేశంలో ‘తాటిచెట్లు‘ పెంపకం ఎక్కువ. ఉత్తర భారతదేశంలోని ‘లిపి‘కి, దక్షిణ భారతదేశంలోని ‘లిపి‘కి చాలా తేడా ఉంది. హిందీ, సంస్కృతం,మరాఠి భాషల లిపిలో పైన ఒక ‘గీత‘ను గీస్తారు. దక్షిణాది భాషల్లో అటువంటి గీతలు గీస్తే అవి చిరిగిపోతాయి. దక్షిణాది భాషలుమీద ‘తలకట్టు‘తో అందంగా ఉంటాయి. నేడు ‘పుస్తక ప్రచురణ‘కు కాగితాలు ఎంత ముఖ్యమో, ఆనాడు కావ్యాలు వ్రాయడానికి ‘తాటాకులు‘ అంత ముఖ్యం.       
           క్రీ.పూ.4,5 శతాబ్దాల నాటికే వ్రాతప్రతులను తయారు చెయ్యటం ప్రసిద్దం. ఈవిధమైన ప్రాచీన లిఖిత ప్రతులే బ్రతికిఉన్న జాతి సంస్కృతుల ప్రాధమిక ఆధారాలను తెల్పుతాయి. మన ప్రాచీన సంస్కృతీవాహికలై తరతరాలనుండి ఒకజాతికి పరంపరగా సంక్రమించే అపూర్వమైన సాహిత్య నిధినిక్షేపాలే తాళపత్ర గ్రంథాలు. 
       సుమారు రెండువందల సంవత్సరాల క్రిందటి వరకుకూడా మనపూర్వీకులు తాటియాకులపైన గంటంతో వ్రాసేవారు. దీనిపై కేవలం కావ్యాలే కాకుండా శతక, వైద్య, జ్యోతిషాది కృతులు, నిత్యవ్యయ సూచికలు, కోమట్ల ఖాతాలు(బహి) మొదలగున్నవి వ్రాయబడేవి. ఒక్కమాటలో చెప్పాలంటే నేడు మనం కాగితాన్ని ఏవిధంగా ఉపయోగిస్తున్నామో నాడు తాళపత్రాన్ని అలా ఉపయోగించేవారు. ఎక్కడో చైనాదేశంలో తయారైన కాగితం మనకు శ్రీనాధుని కాలంలోనే తొంగిచూసింది అని చెప్పవచ్చు.‘కాకిత మందలి వర్ణ పద్ధతులు’ శ్రీనాథుడు పేర్కొన్నాడు. 

2. తాటివనాలను పెంచడం

            నేడు పేపరు సిద్దం చేయడానికి ‘యూకలిప్టస్’ మొదలైన చెట్లను పెంచినవిధంగానే పూర్వం తాటివనాలను పెంచి దీనిని ఒక పుణ్యకార్యంగా భావించేవారు. దాదాపు 700 సం. నాటిదైన పిఠాపుర శాసనములో “నాలుగు లక్షలున్న అరవైవేలు తాళ్ళు నాటించెను ఇటువంటి ప్రతిష్ఠలున్ను చేయించిన పుణ్యపురుషుడు గాక వాసిరెడ్డి పోతి నేండు జేయును. దేవేంద్రుడువును – మంగళ మహాశ్రీ” అని ఉన్నది. ఇలాగే మరొక శాసనములో “తల్లి ధరణి మొదలగాన ఈతాటి యెవ్వరు నాటిరి, వారు భూమి ప్రజలకు, బుద్ధిన్ని, మతి విశేషమున్ను, ధర్మమున్ను, చిరుకుదురుగాను”, అని తెల్పి “ఈ తాటాకులనే పంచాంగములు, పురాణములు, శాస్త్రములు, ధర్మకర్తలు వ్రాసి చదువుంగాను అందున్నుండుగాని బుద్ధిమాటలం జెప్పరాదు. గాన సకల ధర్మాలన్ను తాటి వృక్షమే మూలము” అని కలదు. పాత నల్గొండజిల్లా మోతుకూరు మండలంలోని ‘సదర్‌షాపూర్’ గ్రామంలో కాకతి రుద్రమదేవి గజసాహిణియైన రామయమంత్రి వేయించిన శాసనము(క్రీ. శ. 1260-70) నందు ధర్మ కార్యార్థం 700 చెట్లు నాటించినట్లు గలదు. చెళ్ళపిళ్ళ వారి ముత్తాతయైన సరసకవి, తన సుక్షేత్రంలో “ముందు బయలుదేరే వారికోసమని పుస్తకాలకు పనికి వచ్చే రకం తాటిచెట్లు అయిదారు వందలదాక నాటించారు” అని ‘కథలుగాథల్లో’ ‘మా ముత్తాత’ అనే శీర్షికలో తెల్పినారు. 
     ఈవిధమైన అక్షర ఆధారాలు తాటిచెట్లపై మన పూర్వులకు గల గౌరవాన్ని తెలుపుతున్నది.

3. తాటిచెట్ల సాగుకు నీటివసతి అవసరం లేదు!

           బరువైన ఆకులు గల విభాగ వృక్షాలు తాటి, కొబ్బరి మాత్రమే! ఇవి వృక్షజాతులలో పెద్దివి. తాటిచెట్ల సాగుకు నీటివసతి అవసరం లేదు. మెట్టప్రాంతంలో కూడా ఏపుగా పెరుగుతాయి. సమశీతోష్ణ ప్రదేశాలలో ఇవి అభివృద్ధి చెందుతాయి. వృక్షశాస్త్ర ప్రకారం తాటిచెట్టు ‘పామె’ జాతి ఏకదళ బీజ కుటుంబానికి చెందినది. అందుకే ఆకు మొదట మట్ట దృఢముగా నార కలిగియుండి బరువును సహించును. వృక్షశాస్త్రవేత్తలు దీనిని ‘పాలికార్పిక్’ జాతిగా నిర్థారించారు.

4. నాణ్యమైన ఆకులకొరకు గ్రంథకర్తలు చాలా శ్రమపడేవారు!

        గ్రంథ రచనకు తాటాకులను సిద్ధం చెయ్యటం ఎంతోశ్రమతో కూడుకొన్న పని. అనేది ఒకయజ్ఞం! తాటాకు పత్రాలతో మనవాళ్ళు గ్రంథాన్ని (పుస్తకాన్ని) సిద్ధం చేసుకొన్నారు. అయితే ప్రతి తాటియాకు లేఖనోచితం కాదు. గ్రంథాలకు వాడే వెడల్పయిన ఆకులు కొరకు ప్రత్యేకంగా ఈ చెట్లను పెంచేవారు. 

లేఖనానికి అనువైన ఆకు ఇట్లావుండవలెనట! తాళపత్రం దృఢం సౌమ్యం ఋజు సాగ్రం ద్విధాకృతం మృదులం యత్ ప్రశస్తం తత్ మతం లేఖాతి లేఖనే

ఇకలేఖనానికి యోగ్యం కాని తాటాకు 

కర్కశం కల్మషం వక్రం పీనాగ్రం స్పుటితం యుగం తాళపత్రం నతత్ శ్రేష్టం మతం లేఖాతి లేఖనే.....

       అని మనవారి నిర్ణయం.
           తాటాకుల వెడల్పు, పొడవులను బట్టి వాటిని ‘నేపాళాకులు’ అని పేరు. ఇవి సింహళదేశం నుండి మనదేశానికి దిగుమతి అయ్యేవి. ఆగమ ప్రభాకరుడైన 'ముని ప్రణ్యవిజయాజి' ‘కరతాళం’, ‘శ్రీతాళం’ అనే రెండు రకాల తాటాకులను తెల్పినాడు. ఇవి ముఖ్యంగా గుజరాతు¸ శ్రీలంక, బర్మా, తమిళనాడులలో లభిస్తాయి. వీటికోసం దూరభారాలను లెక్కచెయ్యక, సుదారప్రాంతాలకు ప్రయాణమై వాటిని తెచ్చుకొని గ్రంథాలను సిద్ధం చేసుకొనేవారు . 

5. తాళ పత్ర గ్రంథాలు ఏవిధంగా తయారు చేస్తారు?

          వేసవికాలంలో ‘తాటిచెట్లు’ ఉన్న ప్రాంతాలలో పది నుండి ఇరవైబండ్లలో తాటాకులు తెచ్చుకొనేవారు. తాటి ఆకులు ఈనెలు తీసి, చుట్టగా చుట్టలు సిద్ధం చేసుకొని పెట్టేవారు . పెద్దపాత్రలో గోమూత్రం, గోమయము పల్చగా చేసి దానిలో కొంతపసుపు, వస, జాజికాయపొడి వేసి ఈనీటిని మసలబెట్టి దానిలో ఈ తాటాకు చుట్టలను ఉడకబెట్టేవారు. కొంత సమయం తరువాత ఆకులను తీసి, వాటిని పాకలో వేసి నీడలో ఆరబెట్టి, అవి ‘మృదువు‘గా ఉండటానికి నీళ్లు జల్లుతూ తడుపుతూ ఉంటారు* . వాటిని ఎండలో వేసి ఎండబెట్టరు. ఎందుకంటే వాటిని ఎండలో వేసి ఎండబెడితే ఎండకు పళపళమని ఎండి విరిగిపోతాయి. బాగా ఆరిన తరువాత ఆ తాటాకుల మధ్య ఉన్న ‘ఈనె‘ను తీసి, ఒక జోడికి రెండు ఆకులను చేసేవారు. తరువాత వాటి పరిణామాలను బట్టి కత్తిరించి వర్గీకరించి, పగిలిపోయిన కుండ పెంకులతో వాటిని ‘నునుపు‘ చేసేవారు . ఇలా చేసిన ఆకులను రెండు వైపుల రంధ్రాలు చేసేవారు. ఒక్కొక్కదానిలో సుమారు ముప్పై నుండి నలభై వరకు ఆకులకు మధ్యలో పురికోసను పోనిచ్చి కుట్టేవారు* . (రెండు చివరల కొంతభాగాన్ని వదలి రచనలు చేసేవారు.) ఆకులను కట్టగా చేసిన తర్వాత వీటిని ముఖ్యమైన గ్రంథభద్రత నిమిత్తం క్రింద, పైన తాటాకు కొలతలకు అనుగుణంగా పలకలను సిద్ధం చేసి వీటికి తాటాకు రంధ్రంలో సమానంగా రంధ్రాలను ఏర్పరచి ఆకులను వీటి మధ్యలో నలగకుండా పెట్టి ఆ చిల్లుల నుండి సూత్రాన్ని(తాడును) గ్రుచ్చి తీసి చుట్టూ చుట్టేవారు. రక్షణకు కొందరు దృఢమైన చెక్కలను పెట్టి వాటిపై అందమైన చిత్రకళను రూపించుకున్నారు. మరికొందరు వెదురుబొంగును చీల్చి కట్టేవారు. ఇంకొందరు తాటిమట్టనే చదనుగా చేసి నూనె, పసుపు కలిపి దాన్నే రక్షగా (బైండు) చేశారు. ‘గ్రథన’ శబ్దం వలన ఏర్పడినది గ్రంథం.

6. తాటాకులకు పసరు పట్టించడం!

      జిల్లేడు ఆకులు, బొగ్గు, ఆయుర్వేద రసాలు ఒక సీసాలో పోస్తారు. పత్తి తీసుకోని అందులో అద్ది ఆ వ్రాసిన తాటాకులపై పూస్తారు. ఆ పసరు తాటాకులలో లిఖించిన లిపి ఆకృతిలోకి ఇంకి పోతుంది. అప్పుడు అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి! వందేండ్ల పైనే అవి అలానే ఉంటాయి* . 
 • ఏదైనా పొరపాట్లు ఉంటే వెనుక పుటలో పట్టిక ఇచ్చేవారు.
 • “ఈ గ్రంథాన్ని భద్రంగా కాపాడుకోండి! దీనిని నాశనం చేస్తే మీకు కాశీలో గోహత్య చేసిన పాపం తగులుకొంటుంది“ అని రాసి కాపాడుకొనేవారు.
 • తాళపత్రాలుకు ఉపయోగ పడని మిగతా ఆకులను చలిమంటలకు ఉపయోగించి, ఈనెలతో పొరకలను(చీపురులు) తయారు చేసేవారు.

7. వివిధ ఆకృతులలో అందంగా సిద్ధమైన తాటాకులు

         ఈవిధంగా తయారు చేసిన తాటాకుల పరిణామాలు కూడా వివిధ రీతులుగా ఉన్నవి. తక్కువలో తక్కువయైన వెడల్పు ముప్పావు అంగుళం కాగా, మిక్కిలి వెడల్పు నాలుగు అంగుళాలు. ఇక పొడవులో మిక్కిలి తక్కువ నాలుగు అంగుళాలైతే, మిక్కిలి పొడవులో 20 అంగుళాలు. ప్రతి ఆకుపైన కనీసం 8 పంక్తులు (వరుసలు)ఉంటాయి. ఆకు వెడల్పును బట్టి ఒక్కొక్క ఆకుపైన 4 లేదా 5 పద్యాలను వ్రాసేవారు. 

8. తాళపత్ర గ్రంథాలను ఏవిధంగా పరిరక్షిస్తారు? 8.1. తాళపత్రాలను అల్మారలలో బంధించరాదు!

    ఆయుర్వేదాలకు సంబంధించిన రసాయనాలను, వేపాకును పొడిచేసి ఆ మిశ్రమాన్ని కలిపి తాళపత్రాలపై పూస్తే తెల్ల పురుగులు (చెదలు) పట్టవు! తాటాకు పఠిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ‘’తాళపత్రాలను అల్మారలలో బంధించరాదు! చల్లని ప్రదేశాలలో ఉంచాలి!’’ గాలి తగులుతూ ఉండాలి! ఈ నిబంధనలు పాటించకపోతే ఆ తాళపత్రాలు పెట్టిన ప్రదేశంలోని పక్కన గోడలు కూడా పాడై పోతాయి! 

1. మొదటిరోజు'

'సర్జికల్‌ స్పిరిట్‌'కు కొద్దిగా నీటిని చేర్చి తాళపత్ర గ్రంథాలకు పూసి ఒకరోజంతా నీడలో ఆరబెడుతారు!

2. రెండవరోజు తాళపత్ర గ్రంథాలకు 'ఆయిలింగ్‌' చేస్తారు.

      లెమన్‌గ్రాస్, సిట్రమ్‌ ఆయిల్ పూస్తారు. ఇలా 'నూనె' పూతగా పూయడం మూలంగా పెలుసుబారిన ఆకులు సున్నితత్త్వాన్ని పొంది చదవడానికి అనుగుణంగా ఉంటాయి. అంతేగాక 'పసరువాసన'కు పురుగు తాళపత్రాల దరిచేరదు. 

3. ఎన్నో దశాబ్దాల క్రిందటి అక్షరాలను చదవడానికి అంత స్పష్టంగా కన్పించవు!

        పూర్వకాలంలో ఆకు పసర్లు వ్రాసేవారు. నేటి ఆధునికకాలంలో కార్బన్‌ బ్లాక్‌ పౌడర్ (బొగ్గుపొడి) క్లామిన్‌గమ్ము(తుమ్మజిగురు) లేదా ఐటెక్స్‌ కాటుకను ఆ అక్షరాలపై పూసి బట్టతో తుడిచివేస్తారు. దానితో ఘంటంతో చెక్కిన అక్షరాల లోపలికి 'నల్లరంగు' పోయి అక్షరాలను చదవడం సులభతరం అవుతుంది. 

4. ఇలా శుద్ది చేసిన తాళపత్ర గ్రంథాలను ఎర్రటివస్త్రంలో చుట్టి తాళపత్ర భద్రతగదిలో భద్రపరుస్తారు. 5. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇలా తాళపత్ర గ్రంథాలను తీసి శుద్ది చెయ్యాలి!

     ఒకవేళ వాటి మన్నిక బాగుందని అనిపిస్తే కనీసం రెండుసంవత్సరాలకు ఒకసారి తీసి వాటిని నీడలో ఒకరోజంతా ఆరబెట్టి వాటిని మరల చుట్టి భద్రపరచాలి.
 1. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం- "శాసనాలు-నాణేలు- తాళపత్రాలు- లిపులు పై శిక్షణా శిబిరాన్ని 2019- ఫిబ్రవరి- 11 నుండి 17 వరకు - ప్రాచ్యలిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం- ప్రాంగణం- తార్‌నాక- నిర్వహించింది. ఇందులో ఎందరో గ్రంథ పరిష్కరణ నిపుణులు, శాసన పరిష్కర్తలు పాల్గొని తాళపత్రాలకు సంబంధించిన అమూల్యమైన విషయాలను తెలియజేశారు. ఆ శిక్షణా కార్య క్రమంలో నేను పాలు పంచుకొని ముఖ్యవిషయాలను విని రాసుకొన్నాను. - డా. సగిలి సుధారాణి, పరిశోధకురాలు
 2. మన లిపిపుట్టుపూర్వోత్తరాలు. విజయవాడ: విశాలాంధ్ర పబ్లికేషన్స్. 1990- ద్వితీయ ముద్రణ. Check date values in: |year= (help)