"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తిరుమల నిత్యాన్నదాన పథకము

From tewiki
Jump to navigation Jump to search

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి ముప్పై సంవత్సరాలు నిండాయి. నిత్యము లక్షమందికి పైగా భక్తులు స్వీకరిస్తున్న ఈ అన్న దాన పథకానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన పథకము అని పేరు. ఇంతటి భారీ స్థాయిలో నిత్యాన్నదానం జరిగే అధ్యాత్మిక కేంద్రం ప్రపంచములోనే మరెక్కడా లేదు ...... ఒక్క తిరుమలలో తప్ప. అన్నం పరబ్రహ్మం అన్నది వేదోక్తి.

ప్రారంభ దశ

ముప్పై ఏండ్ల క్రితం.... అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఆదేశాల మేరకు 1985 ఏప్రిల్ 6వ తారీఖున తిరుపతి తిరుమల దేవస్థానము వారు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. తిరుమల లోని కళ్యాణ కట్టకు ఎదురుగా వున్న భవనములో ఈ నిత్యాన్నదాన కార్యక్రమము మొదలైనది. అప్పట్లో రోజుకు రెండు వేల మంది ఈ అన్నదాన పథకము అందుబాటులో వుండేది. అలా ప్రారంభమైన ఈ కార్యక్రమము రోజు రోజుకు అభివృద్ధి నొందుతూ.... నేటికి రోజుకు లక్షమందికి పైగా ఈ నిత్యాన్నదాన ప్రసాదాన్ని స్వీకరించే స్థాయికి ఎదిగింది. వారాంతాలలో, పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగు తుంది. మొదట్లో దైవ దర్శనానికి భక్తులకు ప్రధాన ఆలయము లోపలే చీటీలు ఇచ్చేవారు. భక్తులు ఆ చీటీలను పట్టుకుని అన్నప్రసాదానికి వెళ్ళే వారు. తర్వాత తర్వాత ఆ పద్ధతికి స్వస్తి చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న ప్రసాధము అందేవిధంగా మార్పులు చేశారు.[1]

రోజువారి.... వంట సరుకులు

ప్రతిరోజు లక్షమందికి పైగా అన్నప్రసాదాన్ని వడ్డించ డానికి నిత్యము వంట శాలలో 12000 కిలోల బియ్యము వుడకాల్సిందే. 1500 కిలోల కందిపప్పు, 800 కిలోల వంట నూనె, 5.5 టన్నుల కూరగాయలు ఏపూటకు ఆపూట సిద్ధంగా అవుండాలి. వారాంతాలలో, పర్వదినాలలో ఈ సరుకుల ఆవసరము మరింత పెరుగు తుంది.

ఈ అన్నదాన పథకము ఒక్క తిరుమలకే పరిమితం కాదు.......

ఈ భోజన సేవ ఒక్క తిరుమలలోని అన్న ప్రసాద క్షేత్రానికే పరిమితము కాలేదు. ఆ తర్వాతి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశాల మేరకు దీని పరిది మరింత విస్తరించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో దైవ దర్శనార్థం వేచి వుండే భక్తులకు, వారి పిల్లలకు, సర్వ దర్శనము కొరకు వేచి వుండే భక్తులకు, కాఫీ, టీ, పాలు, వేడి వేడి ఉప్మా, పొంగలి, పెరుగన్నం, సాంబారన్నం అందించే ఏర్పాట్లు చేసింది ఈ అన్నదాన ట్రస్టు. తిరుపతిలో స్థానికంగా వున్న గోవిందరాజస్వామి ఆలయము, కోదండరామ స్వామి ఆలయము, కపిల తీర్థం (కపిలేశ్వర స్వామి ఆలయము), శ్రీనివాస మంగాపురం లోని కల్యాణ వెంకటేశ్వరాలయము, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయము, తిరుచానూరు (శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయము) అలమేలు మంగాపురంలోను నిత్యాన్నదాన పథకాన్ని వర్తింప జేసింది.

వంట శాల

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్సు నాలుగంతస్తుల భవనము. క్రింది భాగములో కేంద్రీకృతమైన బాయిలర్ ఉంది. దీని నుండి వచ్చే ఆవిరితోనే వంటలన్నీ వండుతారు. కేవలము తాళింపులకు మాత్రమే గ్యాసును వాడుతారు. మూడు వందల లీటర్ల సామర్ద్యం వున్న బారి వంట పాత్రలలో కేవలము పది హేను నిముషాలలో 70 కిలోల బియ్యాన్ని ఆవిరితో వండేస్తారు. ఇలాంటి బారి పాత్రలు ఈ వంటశాలలో 22 వరకు ఉన్నాయి. చట్నీలు, పిండి మొదలైన వాటిని రుబ్బడానికి పెద్ద యంత్రాలు ఈ వంట శాలలో ఉన్నాయి. ఈ వంట శాలలో చాల వరకు యాంత్రిక సహాయంతో పనులు జరుగు తున్నా.... 100 మంది పైగా పాక నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారు.

పరిశుభ్రత

లక్షలాది మంది నిత్యం భోజనము చేస్తున్నా.... ఈ పరిసర ప్రాంతాలలో అపరిశుభ్రత కనబడదు. ఒక్కసారి భోజనము పూర్తి కాగానే ఆ భోజన అహాలునంతా యంత్రాలతో శుభ్రం చేస్తారు. యంత్రాలతో పాటు పారిశుద్యాన్ని కాపాడటములో సుమారు 500 మంది నియమిత ఉద్యోగులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు.

భోజన శాల

నాలుగంతస్తులున్న ఈ భవనంలో క్రిందిది వంట శాల. ఒక్కొక్క అంతస్తులో ఒకే సారి వెయ్యి మంది భోజనము చేసే ఏర్పాట్లున్నాయి. పై అంతస్తులో బఫే పద్ధతిలో గోదుమ రొట్టెలు అన్నం, పప్పు వడ్డిస్తారు. ఒక పంక్తి వారు బోంచేయగానే యంత్రాలతో భోజన శాలనంతా శుభ్రపరుస్తారు. దాదాపు 500 మంది ఆ పనుల్లో నిమగ్నమై వుంటారు. భక్తులకు అన్న ప్రసాద వడ్డనలో స్వశ్చంద సేవకులు పాల్గొని తమవంతుసేవ చేస్తున్నారు.

వంట/ వస్తువుల నాణ్యతా ప్రమాణము

వంటకు కావలసిన బియ్యము, పప్పులు మొదలైన వాటిని వచ్చినవెంటనే నాణ్యతా ప్రమాలను నిర్థారిస్తారు. బియ్యము పప్పులు వంటి వాటిలో పిన్నులు, వంటి లోహపదార్థాలను ముందుగాతొలిగిస్తారు. కూర గాయల విషయములోను అంతే జాగ్రత్తలు తీసుకొని కుళ్ళిన వాటిని, పనికిరాని వాటిని తొలిగించి ఆతర్వాతనే వాటిని వండటానికి పంపుతారు. వంటకాలు సుద్ధమైన తర్వాత కూడా తి.తి.దే. వైద్య విభాగం అధికారులు పరీక్షలు జరుపుతారు. వంటలన్నీ సురక్షితమని నిర్థారించుకున్న తర్వాత మాత్రమే భక్తులకు వడ్డిస్తారు.

భక్తుల విరాళాలు

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాధ భవన నిర్మాణానికి అనంత కోటి రాజు అనే భక్తుడు దాదాపు 30 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. మరొక భక్తుడు వంటశాల నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. అన్న ప్రసాదానానికి అవసరమైన కూరగాయలను, చెన్నై, విజయవాడ, బెంగళూరు, వేలూరు వంటి ప్రాంతేఅలలో వున్న తొమ్మిది వాణిజ్య సంస్థలు సరపారా చేస్తున్నాయి. అదే విధంగా పంటల కాలంలో కందిపప్పు, బియ్యము మొదలైన వాటిని సమర్పించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈ అన్న ప్రసాధానానికి భక్తులిచ్చిన విరాళాలు 500 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ల రూపంలో వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. వాటి మీద వడ్డి ప్రతియేటా 45 కోట్ల రూపాయల వరకు వడ్డీ వస్తుంది. ఖర్చు 70 కోట్ల రూపాయల వరకు ఆవుతుంది.

దాతలకు ప్రత్యేకము

లక్షకు పైగా విరాళ మిచ్చే దాతలకు, లేదా సంస్థలకు ప్రత్యేకంగా ఒక పాసుపుస్తకమిస్తారు. అది వ్యక్తులకైతే జీవిత కాలము, స్తంస్థలకైతే 20 సంవత్సరాల వరకు అమలులో వుంటుంది. అందులో దాతాతో పాటు మరో నలుగురి పేర్లను అందులో నామోదు చేసుకునే సౌలభ్యమున్నది. తి.తి.దే వారి తరుపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు విరాళాలను స్వీకరిస్తారు. దాతలకు సెక్షన్ 80 (జీ) క్రింద ఆదాయపు పన్ను మినాహాయింపు వుంటుంది. లక్షరూపాయలనుండి ఐదు లక్షల వరకు విరాళాలు ఇచ్చిన వారికి ఐదుగురి బృందానికి సంవత్సరంలో ఒకసారి ఉచిత వసతి, శీఘ్ర దర్శనము, 6 చిన్న లడ్డూలు శాలువ, రవిక గుడ్డ ఇస్తారు. 5 నుండి 10 లక్షల రూపాయలు విరాళమిచ్చిన దాతలకు సంవత్సరానికి మూడు సార్లుశ్రీవారి శీఘ్ర దర్శనము, ఉచిత వసతి, ఒకసారి మాత్రము 10 లడ్లు, శాలువ, రవికగుడ్డ, ఐదు మహా ప్రసాదం పొట్లాలు, ఇస్తారు. వాటితో పాటు మొదటి ఏడాది బంగారు పూత పూసిన అమ్మవారు, స్వామి వార్ల వెండి జ్ఞాపికలను బహూకరిస్తారు. అన్న ప్రసాద కేంద్రంలో దాతల పేర్లు ప్రదర్శిస్తారు. 10 లక్షలకు పైగా విరాళమిచ్చిన దాతలకు సంవత్సరంలో మూడు రోజులు విఐపీ సూట్ లో వసతి, అయిదు గురికి మూడు సార్లు వీఐపీ బ్రేక్ దర్శనము కల్పిస్తారు. సంవత్సరానికి ఒక సారి మాత్రమే 20 లడ్లు, శాలువ, వరిక గుడ్డ, పది మహా ప్రసాద పాకెట్లు, ఐదు గ్రాముల బంగారు డాలరు, బంగారు పూత పూసిన అమ్మవారు, స్వామివారి వెండి జ్ఞాపికను అందిస్తారు.

స్వామివారి కొలువు బియ్యము

తిరుమలలో స్వామివారి ఆలయంలో ప్రతిరోజు జరిగే స్వామివారి కొలువు ఒక కనువిందైన కార్యక్రమము. ప్రతిరోజు తోమాల సేవ తర్వాత బంగారు వాకిలి లోపల వున్న స్నపవన మండపము స్వర్ణ సింహాసనము మీద కొలువు శ్రీనివాసుడు కొలువు చేస్తాడు. ఆచార్యులు స్వామివారికి అదాయ వ్యయాల పట్టికలు అప్పజెప్పుతారు. ఆతర్వాత నిత్యాన్నదాన పథకము దాతల వివరాలు స్వామివారికి వినిపిస్తారు. అర్చకులు స్వామివారి చేతులమీదుగా పదహారు కిలోల బియ్యాన్ని దానంగా శ్వీకరిస్తారు. అలా స్వీకరించిన బియ్యము నేరుగా నిత్యాన్నదాన వంటశాలకు వెళుతుంది. అందువలనే ఈ నిత్యాన్నదాన ప్రసాదానికి అంత పవిత్రత కలిగింది.

మూలాల జాబితా

  1. పాణిగ్రహి, శ్యాంసుందర్. "ఏడుకొండలవాడి అన్న ప్రసాదం". eenadu.net. ఈనాడు. Retrieved 16 April 2015.