"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం

From tewiki
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినరోజు (జూన్ 2, 2014) న పూలతో అలంకరించబడిన తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం

తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం జరిగిన తొలిదశ ఉద్యమం (1969) లో అమరులైన తెలంగాణవీరుల స్మారకంగా నిర్మించబడిన స్థూపం. ఇది హైదరాబాద్ లోని అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ లో ఉంది.[1] ప్రతి సంవత్సరం జూన్ 2 ను తెలంగాణ అమరవీరుల స్మారకదినంగా జరుపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.[2]

స్మారకస్థూపం ఏర్పాటు నిర్ణయం

1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పోలీసుల కాల్పులకు 369 మంది అమరవీరులయ్యారు. వారందరి స్మారకంగా ఒక స్మారకసూపాన్ని నిర్మించాలని అప్పటి ఉద్యమ నాయకులు భావించారు. అలా 1969, మే 31న తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపాన్ని నెలకొల్పాలని నిర్ణయం జరిగింది.

స్మారకస్థూపానికి శంకుస్థాపన

1970, ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగావున్న గన్ పార్కులో తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఆ విషయం తెలుసుకున్న ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమం జరగకుండా గన్ పార్కు దగ్గర చాలామంది పోలీనులు ఉదయం నుండే పెద్ద ఎత్తున కాపల పెట్టింది. వారి అంచనాలకు అందకుండా నాయకులంతా ఒక్కసారిగా వచ్చి, అప్పటి నగర మున్సిపల్ మేయర్ లక్ష్మినారాయణ చేతులమీదుగా అమరవీరుల స్మారకస్థూపానికి శంకుస్థాపన చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నారెడ్డిని, మల్లికార్జున్ ను, మేయర్ లక్ష్మినారాయణను, టి. గోవింద్ సింగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా మరునాడు నగరంలో బంద్ జరిగింది.

సికింద్రాబాదు క్లాక్ టవర్ పార్కులో స్మారకస్థూపానికి శంకుస్థాపన

25వ తేదీనాడు సికింద్రాబాద్ క్లాక్‌ టవర్ పార్కులో నగర మున్సిపల్ ఉపమేయర్ శ్రీమతి మ్యాడం రామచంద్రయ్య ఆధ్వర్యంలో మరో అమరవీరుల స్మారక స్థూపానికి కూడా శంకుస్థాపన జరిగింది. అక్కడ కూడా అరెస్టులు, అల్లర్లు జరిగాయి.

తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం స్థాపన

గన్ పార్కులో స్థాపించిన శిలాఫలకాన్ని 28న పోలీసులు తొలగించారు. దాంతో ఆ శిలాఫలకాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని పెద్దఎత్తున సత్యాగ్రహ కార్యక్రమం జరిగింది. అందులో 12 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్ల కృషి వలస తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం స్థాపించబడింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదలచేయకుండా ఎన్నో ఆటంకాలను సృష్టించినా 1975లో స్థూప నిర్మాణం పూర్తయింది. కానీ, స్మారక స్థూపం అవిష్కరణ మాత్రం జరగలేదు. స్మారకస్థూపం రూపొందించిన శిల్పాచార్యుడికి సుమారు 75వేల రూపాయల నష్టం వచ్చింది.

స్థూప నిర్మాణం

జె.ఎన్.టి.యులో ఆచార్యడుగా పనిచేసిన అంతర్జాతీయ కళాకారుడు, శిల్పి ఎక్కా యాదగిరిరావు తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపాన్ని నిర్మించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యాదగిరిరావు హైదరాబాద్ చదువుకొని స్థిరపడ్డారు. స్థూపం అడుగుభాగం నల్లరాయితో తయారు చేయబడింది. నాలుగు వైపులవున్న ఆ శిలాఫలకాలపై ప్రతివైపు తొమ్మిది చొప్పన చిన్నచిన్న రంధ్రాలు కనబడుతాయి. ఆ తొమ్మిది రంధ్రాలు అమరవీరుల శరీరంలోకి దూసుకుపోయిన బుల్లెట్ గుర్తులు మరియు అప్పటి తొమ్మిది తెలంగాణ జిల్లాలకు సంకేతం.

ఎరుపు రంగు త్యాగానికి, సాహసానికి చిహ్నం కనుక స్థూపం మొత్తం ఎర్రరంగు రాయితో నిర్మించబడింది. స్థూపానికి ఒక మకరతోరణం ఏర్పాటుచేయబడింది. ఆ మకరతోరణం నిర్మాణ పద్ధతిని మన దేశంలో మొదటి స్థూపమైన సాంచీ స్థూపం నుండి స్వీకరించారు. ఆ మకరతోరణాన్ని శిలాఫలకాన్ని అతికించకుండా, తొలిచడం జరిగింది. అమరవీరులకు అర్పించే నివాళికులకు సంకేతంగా ఆ శిలాఫలకానికి నలుమూలలా పుషాలను చెక్కారు.

స్థూపం మధ్యభాగంలో ఒక స్తంభం ఉంటుంది. ఏవైపునుండి చూసినా దానిపై తొమ్మిది గీతలు కనబడుతాయి. తొమ్మిది జిల్లాల తెలంగాణకు సంకేతంగా ఆ తొమ్మిది గీతలను మలిచారు. స్థూపం పైభాగంలో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. ఆ చక్రం ధర్మం, శాంతి, సహనాలకే సంకేతం కాదు ఆ అమరవీరులు ధర్మ సంస్థాపనకోసం తమ ప్రాణాలు బలిపెట్టారన్న సంకేతాన్ని సూచిస్తుంది.

ఆ స్థూపం శీర్షభాగంలో తెలుపు వర్గంలోనున్న తొమ్మిది రేకులు గలిగిన మల్లెపువ్వు ఉంటుంది. ఆ మల్లెపువ్వు తెలుపు స్వచ్ఛతకు సంకేతం. ఉద్యమంలో ప్రాణాలు వదిలిన అమరవీరుల త్యాగానికి, నిజాయితీకి, సాహసానికి ఆ తెలుపు ఒక సంకేతం, సందేశం.

మూలాలు

  • ప్రత్యేక తెలంగాణా ఉద్యమాల చరిత్ర, శోభాగాంధి, నవంబర్, 2002.