తెలంగాణ పల్లె ప్రగతి పథకం

From tewiki
Jump to navigation Jump to search
తెలంగాణ పల్లె ప్రగతి పథకం
దస్త్రం:Palle Pragathi Scheme Logo.png
తెలంగాణ పల్లె ప్రగతి పథకం లోగో
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనఆగష్టు 23, 2015
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ పల్లె ప్రగతి పథకం షెడ్యూల్ కులాలు, తెగల జనాభా ఎక్కువగా ఉన్న మండలాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో అమలైన తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగాం (టీఆర్‌ఐజీపీ) కి ‘తెలంగాణ పల్లె ప్రగతి పథకం’గా నామకరణం చేసి, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పథకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతారు.[1]

ప్రారంభం

2015, ఆగష్టు 23న మెదక్ జిల్లా కౌడిపల్లి లో రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, టి. హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ప్రారంభించారు.[2]

దస్త్రం:Launching of Telangana Palle Pragathi Scheme.jpg
తెలంగాణ పల్లె ప్రగతి పథకం ప్రారంభోత్సవం

పథకం వివరాలు

రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని రానున్న ఐదేళ్లలో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పల్లెప్రగతి పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని 150 వెనుకబడిన మండలాల అభివృద్ది కొరకు ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 653 కోట్ల రూపాయల మొత్తంతో ఐదు సంవత్సరాల కాలపరిధిలో “తెలంగాణ పల్లె ప్రగతి పథకం” కార్యక్రమాన్ని అమలు చేయుటకు నిర్ణయించడం జరిగింది.[3] గ్రామాల్లో ‘పల్లె సమగ్ర సేవాకేంద్రాలు’ ఏర్పాటుచేసి అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు.

డీఆర్‌డీఏ నిర్వహించిన బేస్‌ లైన్ సర్వే ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మండలాను గుర్తించి ఆయా మండలాల్లో, ఈ పథకంలో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకుగాను డీఆర్‌డీఏ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, ఐసీడీఎస్, వైద్యశాఖల సమన్వయంతో ఆయా మండలాల్లో ప్రజలను, మహిళలను, రైతులను చైతన్య పర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. దళారుల బారిన పడి తమ పంటకు గిట్టుబాటు ధరను కోల్పోతున్న రైతులను ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తారు. రైతులను బృందాలుగా ఏర్పర్చి, వారి పంట ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తారు. ఏ.ఎన్‌.ఎం.ల ద్వారా ఆరోగ్య సేవలు, ఐసీడీఎస్ ద్వారా మాతా, శిశు సంరక్షణ కార్యక్రమాలు చేపడుతారు. ఈ కార్యక్రమాలను ఐటీకి అనుసంధానం చేసి పర్యవేక్షిస్తారు.[1]

మూలాలు

  1. 1.0 1.1 సాక్షి. "'తెలంగాణ పల్లె ప్రగతి'". Retrieved 5 February 2017.
  2. సాక్షి, తెలంగాణ కథ. "పేదరిక నిర్మూలనకే 'తెలంగాణ పల్లె ప్రగతి'". Retrieved 5 February 2017.
  3. టి.ఆర్.ఎస్. పార్టీ ఆన్ లైన్. "త్వరలో తెలంగాణ పల్లె ప్రగతి ప్రారంభం". trspartyonline.org. Retrieved 5 February 2017.[permanent dead link]