"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం

From tewiki
Jump to navigation Jump to search

తెలుగుసినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం పుస్తకం ప్రముఖ తెలుగు సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రాసిన సిద్ధాంత గ్రంథం. ఈ గ్రంథంలో తెలుగు సినిమాలలోని కథ, కథనం వాటి శిల్పాలను సప్రమాణికంగా చర్చించారు.

రచన నేపథ్యం

పరుచూరి గోపాలకృష్ణ ప్రముఖ సినీ రచయిత. ఎన్నో సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించి విజయాలను అందుకున్న పరుచూరి బ్రదర్స్ గా పేరుపొందిన వారిలో ఆయన ఒకరు, ఇంకొకరు ఆయన అన్న వెంకటేశ్వరరావు. ఎం.ఎ.(తెలుగు) పూర్తిచేసి ఆంధ్రోపన్యాసకునిగా పనిచేస్తూండగా సినీ అవకాశాలు రావడం, సినీరంగంలో పేరుప్రతిష్టలు, డబ్బు సంపాదించుకోవడంతో ఆంధ్రోపన్యాసకత్వం వదిలివేసి సినిమాల దిశగా వెళ్ళిపోవాల్సివచ్చింది. గోపాలకృష్ణ తల్లికి చిన్నతనం నుంచి తన పిల్లలలో ఎవరైనా డాక్టరు కావాలనే కోరిక ఉండేదిట. ఐతే ఇద్దరు కుమారులూ సినీరంగంలో, మిగిలిన పిల్లలు వేరే వృత్తుల్లో స్థిరపడడంతో ఆ కోరిక తీరలేదు. ఆమె కోరికను కనీసం పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పట్టా తీసుకుని పరోక్షంగానైనా తీరుద్దామనే లక్ష్యంతో గోపాలకృష్ణ పీహెచ్‌డీ ప్రారంభించారు. తనకు చక్కని అవగాహన, అనుభవం ఉన్న సినీ సాహిత్యంపై పి.హెచ్.డి. పూర్తిచేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. ఈ గ్రంథరచనకు గాను ఆయన పీహెచ్‌డీ అందుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం అన్న సిద్ధాంత గ్రంథాన్ని తన తల్లికి అంకితమిచ్చారు గోపాలకృష్ణ.[1]

పరిశోధనాంశాలు

ఈ గ్రంథంలో తెలుగు సినిమాలో కథాసాహిత్యాన్ని, కథనాన్ని, శిల్పాన్ని వేరువేరు అధ్యాయాలుగా విభజించి చర్చించారు. సాధారణంగా సినిమా ప్రారంభమైన అరగంటలో ప్రధాన పాత్రలను, పాత్రల మనస్తత్త్వాలను పరిచయం చేసి, 30-35నిముషాల నడుమ సినిమాలో కథానాయకుడు(ప్రొటోగనిస్ట్) సాధించాల్సిన సమస్యను సృష్టించి, విశ్రాంతికి ముందు కథను మలుపుతిప్పి, సినిమా పూర్తయ్యే ముందు కథానాయకుడు పూర్తిగా దెబ్బతిన్న స్థితికి తీసుకువెళ్ళి చివరకు విజయాన్ని సాధించడం అనే తరతరాలుగా తెలుగు సినీరంగాన్ని ఏలుతున్న సిద్ధాంతాన్ని కొన్ని ఉదాహరణలతో వివరించారు. సినిమాలో సన్నివేశాలను, ఘట్టాలను నిర్వచించి వాటి భేదాలు నిరూపించడం, సినిమా రచన శిల్పంలో భాగంగా సంభాషణను అవసరమైనచోట సంభాషణలు, మౌనం అవసరమయ్యేచోట మౌనం సినీదర్శకులు, రచయితలు ఎలా సృష్టిస్తారో వివరించారు. ఏ సన్నివేశాల్లో ఏ వివరాలు ప్రేక్షకుల అవగాహన మీద నమ్మకం ఉంచి వదిలేస్తూంటారు, మరి ఏ వివరాలను పాత్రలతో పలికిస్తూంటారు వంటి సూక్ష్మమైన విషయాలను తెలుగు సినిమా క్లాసిక్స్‌ను ఉపయోగించి తెలిపారు.

మూలాలు

  1. పరుచూరి గోపాలకృష్ణ. తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం. Retrieved 2020-01-14.