"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దమన్ దియు

From tewiki
Jump to navigation Jump to search
Daman and Diu in India (disputed hatched).svg

దమన్-దియు ( Daman and Diu) అనేది భారత దేశంలో ఒక కేంద్రపాలిత ప్రాంతము. అరేబియా సముద్రం తీరమున ఉన్న ఈ చిన్న ప్రాంతములు - దమన్, దియు, గోవా, దాద్రా, నాగర్-హవేలీ.

చరిత్ర

1531లో దమన్‌ను పోర్చుగీసువారు ఆక్రమించారు. 1539లో గుజరాతు సుల్తాను ద్వారా దమన్ అధికారికంగా పోర్చుగీసువారికి అప్పగింపబడింది. 450 సంవత్సరములకు ఇది పోర్చుగీసు అధీనములో ఉంది. 1961 డిసెంబరు 19న గోవా, దమన్, దియులను భారత ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకొన్నది. కాని పోర్చుగల్ ప్రభుత్వం 1974 వరకు వీటిపై భారత దేశపు అధిపత్యాన్ని అంగీకరించలేదు.

1987 వరకు గోవా, దమన్, దియులు (వేరు వేరు చోట్ల ఉన్నా గాని) ఒకే కేంద్రపాలిత ప్రాంతముగా పరిపాలింపబడినవి. 1987 లో గోవా ప్రత్యేక రాష్ట్రముగా ఏర్పడింది. ఇక దమన్ - దియు అనే రెండు జిల్లాలు ఒక కేంద్రపాలిత ప్రాంతముగా కొనసాగుతున్నాయి.

ఇక్కడ అధికారిక భాష గుజరాతీ. పోర్చుగీసు భాషను పాఠశాలలో బోధించకపోవడం వల్ల దాని వాడకం క్రమంగా క్షీణిస్తున్నది. దమన్ లో 10 % ప్రజలు పోర్చుగీసు భాష మాట్లాడుతారు. అది క్రమంగా 'ముసలివారిభాష' అనిపించుకొంటున్నది.

దమన్

'దమన్' జిల్లా వైశాల్యము 72 చ.కి.మీ. జనాభా 1,13,949 (2001 జనాభా లెక్కలు ప్రకారం). ఇది దమన్-గంగా నది ముఖద్వారాన ఉంది. దీనికి పశ్చిమాన అరేబియా సముద్రము, మిగిలిన మూడు ప్రక్కల గుజరాత్ లోని వల్సాడ్ జిల్లా ఉంది. దమన్ కు అతి దగ్గరి రైల్వే స్టేషను 7 కి.మీ. దూరంలో ఉన్న 'వాపి' (గుజరాత్). దమన్ కు ఉత్తరాన సూరత్ నగరము, దక్షిణాన సుమారు 160 కి.మీ. దూరంలో ముంబాయి నగరము ఉన్నాయి.

దమన్‌లో చేపలు పట్టడం, మత్స్య పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గాలు. అనేక పరిశ్రమలు కూడా ఉన్నాయి.

అందమైన సముద్రతీరము, పోర్చుగీసు విధానంలో నిర్మించిన కట్టడాలు, చక్కనైన చర్చిలు, ప్రకృతి సౌందర్యము - ఇవి దమన్ విశేషాలు. గంగా దమన్ నదికి ఇరువైపులా నాని-దమన్, మోతి-దమన్ అనే పట్టణాలున్నాయి.

దియు

గుజరాతు దక్షిణ ప్రాంత తీరంలో కథియవార్ దగ్గర ఉన్న ఒక ద్వీపం పేరు దియు. ఈ ద్వీపం వైశాల్యం 40 చ.కి.మీ. జనాభా 44,110 (2001 జనాభా లెక్కల ప్రకారం). ఈ ద్వీపం తూర్పు తీరాన దియు పట్టణం ఉంది. ఇక్కడ పాతకాలపు పోర్చుగీసు కోట ఒక ప్రధాన ఆకర్షణ. చేపలు పట్టడం ప్రధానమైన ఉపాధి. భారతీయ వైమానిక దళం స్థావరమున్నది. ద్వీపంలో మరోప్రక్క 'ఘోగ్లా' అనే పల్లె ఉంది.

1535లో అప్పటి గుజరాతు సుల్తాను (మొగలు చక్రవర్తి హుమాయున్ కు వ్యతిరేకంగా) పోర్చుగీసువారితో ఒప్పందం కుదుర్చుకొని, కోట కట్టడానికీ, సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికీ అనుమతినిచ్చాడు. తరువాత పోర్చుగీసువారిని తొలగించడం సుల్తాను వల్ల కాలేదు. 1537 లోను, 1546లోను యుద్ధాలు జరిగినా ప్రయోజనం లేకపోయింది. 1545లో 'డామ్ జో డి కాస్ట్రో' అనే పోర్చుగీసు సేనాని ఈ కోటను మరింత బలపరచాడు.

1961 డిసెంబరు 19న భారత సైన్యం దియు ద్వీపాన్ని ఆక్రమించింది.

పర్యాటుకులకు మంచి ఆకర్షణీయమైన స్థలంగా దియు పేరొందింది. నగొవా బీచి చాలా చక్కనైనది. పోర్చుగీసు శైలిలో నిర్మింపబడిన కోట, చర్చి, మ్యూజియము కూడా చూడదగినవి.

బయటి లంకెలు

డామన్ జిల్లా గురించి