"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దళిత సాహిత్యం

From tewiki
Jump to navigation Jump to search

దళితులు - దళిత సాహిత్యం:

భారతీయ సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది. దాన్ని అనుసరించి కులవ్యవస్థ రూపొందింది. ప్రధానంగా కుల వివక్షను ఆధారం చేసుకొనే దళితులను, దళిత సాహిత్యాన్ని సాహితీవేత్తలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో దళితులు, దళిత సాహిత్యం అనే మౌలిక విషయాల పట్ల విస్తృతమైన చర్చ జరిగింది.

దళితులు

నిఘంటువుల్లో "దళితము' అనే శబ్దానికి "ఖండింపబడినది, ఛేదింపబడినది, వికసించినది' అనే అర్థాలు కనిపిస్తున్నాయి. ("Dalit' అంటే Broken or reduced to pieces generally అని ఆంగ్ల నిఘంటువులు వివరిస్తున్నాయి.)

అస్పృశ్యత కారణంగా సమాజం నుండి "విడగొట్టబడిన" వారనే అర్థంలోనే సాహితీవేత్తలు దళితులను వివరిస్తున్నారు. ప్రత్యేకించి ఒక్క కులం లేదా కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేసుకొని దళిత శబ్దాన్ని ఉపయోగించటం సరికాదనే వాదనలు కూడా ఉన్నాయి.

 1. సామాజిక వ్యవస్థలో సరైన స్థానం లభించని, వివక్షకు గురవుతున్న వారందరికీ "దళిత' శబ్దం వర్తిస్తుంది.
 2. శతాబ్దాల తరబడి జరిగిన పోరాటంలో వ్యక్తమైన ఆత్మ గౌరవ నినాదం "దళిత'.
 3. మతాన్ని ఆధారం చేసుకొని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో జరిగే వివక్షను ప్రశ్నించే శబ్దం "దళిత'.
 4. సమాజంలో నిమ్నస్థాయిలో బతుకీడుస్తూ, ఆ కష్టాల నుండి బయటపడటానికి శాస్త్ర విజ్ఞానాన్ని విశ్వసిస్తూ, హేతువాద భావనా బలంతో పోరాడుతూ, అస్తిత్వం కోసం నిత్యం ప్రయత్నించే వారికి ప్రాతినిధ్యం వహించే శబ్దం "దళిత'.
 5. దేవుడు, విధి, స్వర్గ-నరకాలు : జన్మ-పునర్జన్మ: ఆత్మ- అంతరాత్మ: అదృష్టం దురదృష్టం వంటి భావనలన్నీ దళితులను బానిసలుగా మారుస్తున్నాయని భావిస్తూ నాస్తికత్వం, హేతువాద భావాలతో మానవతావాదాన్ని బలపరుస్తూ సామాజిక విముక్తిని ఆశించే విస్తృత పరిధిగల శబ్దం "దళిత'.

ఇలా "దళిత' శబ్దం గురించి రచయితలు భిన్న కోణాల్లో వివరించారు. అయితే, 1971న బొంబాయి నుండి వెలువడిన మరాఠీ "దళిత పాంథర్స్‌ మ్యానిఫెస్టో' దళిత శబ్దాన్ని కింది విధంగా వివరించింది.

దళితులు ఎవరు ?

Members of scheduled castes and tribes, Neo - Buddhists, the working people, the landless and poor peasants, women and all those who are being exploited politically, economically and in the name of religion'

దీని ప్రకారం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, నయా బౌద్ధులు, శ్రామికులు, భూమిలేని పేద రైతులు, స్త్రీలు, మతం పేరుతో రాజకీయంగా ఆర్థికంగా దోపిడీకి గురయిన వారంతా "దళితు'లవుతారని తెలుస్తుంది. కానీ, గిరిజనులకు అస్పృశ్యత సమస్య లేదు. అన్ని రంగాల్లోనూ వెనుకబాటుతనం ఉంది. అగ్రవర్ణ స్త్రీలను "దళితులు'గా భావించనవసరం లేదనీ భావిస్తున్నారు. ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు వంటి మైనారిటీ వారి పై హిందూమత ఆధిపత్యం ఉంది. అణిచివేతకు గురవుతున్నారని, వీరినీ దళితులుగా గుర్తించాలనీ కొంతమంది భావిస్తున్నారు.

సామాజికంగా నిమ్నస్థానంలో ఉన్న అనుభవిస్తున్న ప్రజలు దళిత శబ్దాన్ని ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తున్నారు. చారిత్రక ఆధారాలను బట్టి వీరిని అవర్ణులు, అతిశూద్రులు, అనార్యులు, దాసులు, దాస్యులు, ప్రతిలోములు, అంత్యజులు, అంత్య వాసులు, అంత్యులు, అసురులు, చండాలురు, బాహ్యులు, మ్లేచ్చ్యులు, హీనులు,అపృశ్ స్యులు, అంటరానివాళ్ళు, పంచములు, హరిజనులు వంటి వివిధ పేర్లతో పిలిచారు. అయితే పంచములు, హరిజనులు శబ్దాలతో కొన్ని వందల సంవత్సరాలుగా వీరిని పిలిచేవారు. భారత స్వాతంత్రోద్యమకాలంలో నర్సీమెహతా అనే ఓ రచయిత పెట్టిన "హరిజన' శబ్దాన్ని మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ విస్తృతంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. మతపరంగా దేవుని బిడ్డలనే అర్థంలో ఆ శబ్దాన్ని ప్రచారం చేశారనీ, అది తమ ఆత్మగౌరవ భంగకరమని దళితులు నిరసించారు. అప్పటినుండే "దళిత' శబ్దం ఆత్మ గౌరవానికి సమైక్య శక్తికీ ప్రతీకగా ప్రయోగంలో ఉంది. ఆ శబ్దంతో పిలిపించుకోవడానికి ఇష్టపడుతూ, ఆ పేరుతోనే తమ భావాలను వివిధ సాహిత్య ప్రక్రియలుగా అందిస్తున్నారు. అన్ని భారతీయ భాషల్లోనూ "దళిత సాహిత్యం' పేరుతోనే రచనలు చేస్తున్నారు.

== దళిత సాహిత్యం

దళితుల జీవన విధానాన్ని చైతన్యవంతంగా వర్ణించిన సాహిత్యం దళిత సాహిత్యమవుతుంది. దళితుల అభ్యున్నతి కోసం ఎవరు రాసినా అది దళిత సాహిత్యంగానే పరిగణించవచ్చునని విమర్శకులు భావిస్తున్నారు. దళితులే తమ సమస్యలకు ప్రతిస్పందించి రాస్తే దాన్ని "ఆత్మాభిమానం వాదం' గానూ దళితేతరులు దళితుల పక్షాన్ని వహించి రాస్తే దాన్ని "ఉదారవాదం' గానూ పిలుస్తున్నారు.

దళిత సాహిత్యం మరాఠీ భాషలో ముందుగా స్థిరపడి, తరువాత భారతీయ భాషలన్నింటిలోనూ విస్తరించింది. కొంతమంది మరాఠీ రచయితలు దళిత సాహిత్యాన్ని ఇలా వివరించారు.


"This literature i closely associated with the hopes for freedom of a group of people who as untouchables are victims of social, economic and cultural in equalities" - Arjun Dangle ""The Dalit literature was an all out plebeian attack on the orthodox establishment' - Latha Murugakar

"Any work of literature which seeks to express to express in words, the people of those sections of humanity which are oppressed and which are engaged in struggle for there existence to be called in the broadest seance, dalit literature" - Harish Mangalam (గుజరాతీ రచయిత)

దళిత సాహిత్యాన్ని ఎవరు రాసినా దాని మౌలిక స్వభావం, లక్ష్యాలను వీడనంతవరకు దాన్ని దళిత సాహిత్యంగానే పరిగణించవచ్చుననే ఆలోచన ఇంచుమించుగా సర్వాంగీకారం పొందింది. కింది విషయాలు గమనిస్తే ఈ మౌలికాంశాలు ఉన్నదే దళిత సాహిత్యమని స్పష్టమవుతుంది.

 1. ప్రాచీన, సాంప్రదాయిక స్వభావం కలిగిన సామాజిక నిర్మాణాన్ని (కులవ్యవస్థని) తిరస్కరించటం.
 2. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం ఆశించే మానవతా దృక్పథాన్ని ఆశించటం.
 3. హేతువుకు అందని అతీంద్రియ భావాలను తిరస్కరించటం.
 4. వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చి జీవితానుభవాలను సృజనీకరించటం.
 5. వస్తువుకి రూపం సహకారి కావటం, సాహిత్యం సామాజిక చైతన్యాన్ని ఆకాంక్షించేటట్లు రూపొందటం, కళ సమాజం కోసమే అన్న దృక్పథానికి కట్టుబడటం.
 6. సత్యం, శివం, సుందరం అనే భావనలను తిరస్కరించటం.
 7. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం పోరాడటం.
 8. కర్మ, పునర్జన్మ, పరమాత్మ వంటి భావనలను నిరసించటం.
 9. దళితుల భాషను, ఆచార వ్యవహారాలను గౌరవించి, ఆత్మ గౌరవాన్ని పెంపొందించటం.
 10. హిందూ లేదా మూఢత్వాన్ని ప్రబోధించే మత భావనలను తిరస్కరించి, ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించటం.
 11. అస్పృశ్యత కారణంగా దూరంగా విసిరేయబడిన వారిని ప్రధాన జీవన స్రవంతిలో కలపటం, కులాన్ని నిర్మూలించటం ప్రధాన లక్ష్యాలుగా గ్రహించటం.
 12. దళిత సాహిత్యాన్ని రాయటం వినోదం కోసం కాదనీ, సామాజిక చైతన్యం, సామాజిక పరివర్తనకు బాధ్యతాయుతమైన పనిగా గుర్తించటం - దళితులు రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా సాహిత్యం ప్రేరణనివ్వటం.

దళిత సాహిత్య స్వభావాన్ని తెలుసుకోవటానికి పై అంశాలను క్రోడీకరించినా, "దళిత సాహిత్యం' అని పిలుస్తున్న అన్ని రచనలకూ పైన పేర్కొన్న అన్ని లక్షణాలు సరి పోతున్నాయని చెప్పే వీలు లేదు. కానీ, మౌలికంగా ఈ లక్షణాలు చాలా వరకు దళిత సాహిత్యంలో కనిపిస్తున్నాయి. అలాంటి కొన్ని లక్షణాలు అభ్యుదయ, విప్లవ సాహిత్యంలోనూ కనిపిస్తున్నా, అవి వర్ణానికిచ్చిన ప్రాధాన్యం, కులానికివ్వలేదు. కనుక, కులనిర్మూలన ప్రధాన లక్ష్యంగా దళిత సాహిత్యం కొనసాగుతుంది.

జ్యోతిబా పూలే, పెరియార్‌, అంబేడ్కర్‌ భావజాలంతో పాటు, మార్క్సిజం ప్రభావం కూడా దళిత సాహిత్యంలో కనిపిస్తుంది. "దేశీయ మార్స్కిజం' అనే భావన కూడా తెలుగు దళిత సాహిత్యంలో చర్చలోకొచ్చింది. అందువల్ల దళిత సాహిత్యాన్ని కాలం, స్వభావాలను అనుసరించి గుర్తించవలసి ఉంది. అయినా, దళిత సాహిత్యం ఆవిర్భవించటానికి శతాబ్దాల సామాజిక పీడనను ఎదుర్కొన్న చారిత్రక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం నుండే "దళిత సాహిత్యం' స్పష్టమైన అంబేడ్కర్‌ తాత్త్విక భావజాల భూమికతో ఆవిర్భవించింది

దళిత సాహిత్యం - చారిత్రక నేపథ్యo అపౌరుషేయాలని భావించే వేదాల్లో (ఋగ్వేదం-10వ మండలం పురుష సూక్తం) చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన కనిపిస్తుంది. దాని ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ సాంఘిక అసమానతలకు కారణమయ్యింది. కులం వల్ల కలిగిన

అసమానతలపై బౌద్ధం, జైనం, చార్వాకం మొదలైనవి నిరసనను తెలిపాయి. అవి కుల నిర్మూలనకంటే అహింస, జ్ఞానబోధ, బౌద్ధిక దృక్పథాలపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించాయి. కొన్ని వందల యేండ్లుగా బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాల వారు తమ అధికారాన్ని చెలాయిస్తూ సంస్కృత సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కాలంలోనే ముస్లిములు భారతదేశంపై దండయాత్రలు చేసి, చాలా చోట్ల అధికారం హస్తగతం చేసుకున్నారు. ముస్లిములు మొదట్లో సంస్కృత సాహిత్యానికి ప్రాధాన్యాన్ని తగ్గించారు. ఆ తరువాతి కాలంలో పరోక్ష పద్ధతులలో హిందూ సామాజిక వ్యవస్థలో కనిపించే అణచివేత స్వభావాన్నే ముస్లిం పాలకులు కూడా అనుసరించారు. ముస్లిం పాలనలో హిందూ వ్యవస్థలో తమకు అనుకూలమైన వాటిని స్వీకరించి, మిగిలిన వాటిని అణచివేశారు. ఈ నేపథ్యంలోనే భక్తి సాహిత్యం ప్రారంభమయింది. ఈ సాహిత్యంలో హిందూ మతంలోని మౌలిక లక్షణాలను విస్మరించకుండా, కొన్నింటిని సంస్కరించే ప్రయత్నం మాత్రం జరిగింది. హిందూ - ముస్లిం పాలకుల సంఘర్షణలో బ్రిటీష్‌ వాళ్ళు భారత దేశాన్ని ఆక్రమించుకున్నారు. వారి పాలనలో పాశ్చాత్య విజ్ఞానం భౌతిక దృష్టిని కలిగించింది. కొన్ని వందల యేండ్ల బ్రిటీష్‌ వారి పాలనను వ్యతిరేకిస్తూ జాతీయోద్యమం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో "జాతీయోద్యమ సాహిత్యం' లో భాగంగా కుల నిర్మూలన కూడా ఒక అంశమయ్యింది. జ్యోతిబా పూలే, నారాయణగురు, సాహు మహారాజ్‌, పెరియార్‌ ఇ.వి. రామస్వామి నాయర్‌, డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ మొదలైన వారి ఆలోచనలు దళిత సాహిత్యానికి చారిత్రక, తాత్త్విక భూమికను ఏర్పరిచాయి.

జ్యోతి బాపూలే నిమ్నజాతుల ఉద్ధరణ కోసం "సత్య శోధక సమాజం' (1873) స్థాపించారు. పూలే హిందూమతంలోని లోపాలను వివరిస్తూ అనేక పుస్తకాలను రాశారు. 1910లో కలకత్తా కాంగ్రెస్‌ సమావేశం అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. 1918లో అఖిలభారత దళితజాతుల సమావేశాలు బొంబాయిలో జరిగాయి. 1924లో డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ అస్పృశ్యత నివారణోద్యమాన్ని ప్రారంభించారు.

ఈ ప్రభావం భారత దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో బలంగానే కనిపించి, దళిత ఉద్యమాలు ఊపందుకున్నాయి. తెలుగువారికీ ఈ ఉద్యమాలు మార్గదర్శకమయ్యాయి. 1967 నాటికి జ్యోతిబా పూలే, సాహూ మహారాజ్‌, [కారల్‌ మార్క్స్‌]] సిద్ధాంతాలు నీగ్రో సాహిత్యంలోని తిరుగుబాటు కలగలిసి అంబేడ్కర్‌ భావజాలాన్ని ప్రధానంగా చేసుకొని "దళిత సాహిత్యం' ఆవిర్భవించింది.

1981లో భారతీయ దళిత సమాచార పత్రికా సంపాదకుల సదస్సు జరిగింది. 1984లో భారతీయ దళిత సాహిత్య అకాడమీనీ స్థాపించారు. కాన్షీరామ్‌ 1984 నాటికి అంబేడ్కర్‌ భావజాలంతో బహుజన సమాజ్‌ పార్టీని స్థాపించారు. దీనితో రాజకీయంగా కూడా దళితులలో చైతన్యం వెల్లువెత్తింది. ఈ ప్రభావం కూడా తెలుగు సాహిత్యంపై కనిపించింది.

1968లో కంచకచర్లలో కోటేశుని సజీవ దహనం చేయడం, 1985 జూలై 17న కారంచేడు ప్రాంతంలో దళితులపై మారణకాండ సాగించడం వంటి సంఘటనలు జరిగాయి. 1990 ఆగస్టు 6న చుండూరులో దళితులను ఊచకోత కోశారు. దీనితో అంతవరకు సంస్కరణోద్యమ, అభ్యుదయ, విప్లవ సాహిత్యం రాస్తున్న తెలుగు రచయితలు, కవులు దళిత సాహిత్యం పై దృష్టిని కేంద్రీకరించారు.

తెలుగు సాహిత్యచరిత్ర పరంగా చూసినపుడు 12వ శతాబ్దంలో శివకవులు నిమ్న జాతీయులని పిలువబడుతున్న దళితులను శైవమతం వైపు ఆకర్షించేటట్లు చేసిన రచనలు కొన్ని కనిపిస్తున్నాయి.

13 వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు భక్తి ఉద్యమం పేరుతో హిందూ మతంలో సంస్కరణ దిశగా రచనలు వచ్చాయి. 16వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ""ఆముక్తమాల్యదలో మాలదాసరి కథ రాయడంలోనూ కుల ప్రభావాన్ని గుర్తించారు. 17వ శతాబ్దంలో పోతులూరి వీరబ్రహ్మం, వేమన వంటి కవులు కులం వల్ల కలిగే సాంఘిక నిమ్నోన్నతాలను నిరసిస్తూ రచనలు చేశారు. 18, 19 వ శతాబ్దాలలో జమీందారీల పెత్తనం, వారి అధికారం క్షీణించటంతో పాశ్చాత్య పాలనకు, పాశ్చాత్య విద్యకు ద్వారాలు తెరిచాయి. క్రైస్తవ సాహిత్యం ప్రారంభమయింది. ఉన్నత వర్ణాలు, వర్గాల వారు క్రైస్తవ రచనలను చేసే నేపథ్యంలో కింది వర్ణాల వారి గురించి రాయడం ఒక అనివార్యగా మారింది.

దళిత సాహిత్యం - ఆరంభ వికాసాలు

భారతదేశ వ్యాప్తంగా జరిగిన పాలన, ఆర్థిక పర అంశాల కారణంగా వచ్చిన సామాజిక ఉద్యమాలు వచ్చాయి. దాని ప్రభావంతో వెలువడుతున్న సాహిత్యంలో దళిత సాహిత్యం ఒక ప్రత్యేక విభాగమయ్యింది. 1960 నుండి దళిత సాహిత్యం ప్రాచుర్యాన్ని పొందింది. ఈ పరిణామాలను ప్రముఖ విమర్శకులు ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు కింది విధంగా విశ్లేషించారు.

1970లలో మరాఠీ, కన్నడ భాషలలో నిర్ధిష్ట లక్ష్యాలతో, ప్రత్యేకమైన అభివ్యక్తులతో దళిత సాహిత్యం పురోగమించింది. [1980]]ల ఉత్తరార్దంలో తెలుగు సాహిత్యంలో దళిత చైతన్యం నిర్ధిష్ట రూపాన్ని పొంది, 1990 మొదలయ్యే నాటికి ""దళిత సాహిత్యం సాహిత్యంగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేసింది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని ప్రశ్నిస్తూ తనదైన అస్తిత్వంతో ముందుకొచ్చింది. వేమన, తత్వ కవులు మానవతా దృక్పథంతోనూ, గురజాడ హేతువాద దృక్పథంతోనూ దళితుల సమస్యలను సృజనీకరించారు. సంఘసంస్కరణోద్యమాలు ప్రధానంగా స్త్రీ సమస్యలపైనే కేంద్రీకరించినా, కొంతవరకు కుల సమస్యను కూడా గుర్తించాయి. జాతీయోద్యమం అస్పృశ్యతా సమస్యను ప్రధానంగా గుర్తించి, మతస్పృహలో దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసింది.

అభ్యుదయ సాహిత్యం పీడిత శ్రామిక వర్గ సమస్యలలో భాగంగానే దళిత సమస్యలకు పరిష్కారాన్ని సూచించింది. అది ఎక్కువగా ఆర్థిక సంస్కరణలకే ప్రాధాన్యాన్నిచ్చింది. విప్లవ సాహిత్యం గిరిజన సమస్యలతో పాటు దళిత సమస్యలను వర్గ దృష్టితో ప్రత్యేక ప్రాధాన్యాన్నిచ్చింది. ఆర్థిక కోణానికి అధిక ప్రాధాన్యాన్నిచ్చే విప్లవ స్పృహతో సమాంతరంగా సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా దళిత చైతన్యం విస్తరించింది. వర్గం కంటే దళిత సమస్య "కులం' తోనే ముడిపడి ఉందని గుర్తించి, ఆ అంశాలను ప్రధానంగా తీసుకొచ్చింది.

1909లో ఒక అజ్ఞాత కవి రాసిన ""మాలవాండ్ర పాటను తొలి దళిత గేయంగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇది ఆంధ్రభారతి (బాధ్రపద) మాసపత్రికలో అచ్చయ్యింది. ఆ తరువాత గురజాడ అప్పారావు 1911లో కుల సమస్యను స్పర్శిస్తూ ముత్యాలసరాల్లో రాశారు. 1915లో మంగిపూడి వేంకటశర్మ ""నిరుద్ధ భారతం అనే పద్య కావ్యాన్ని రాశారు. అస్పృశ్యతను నిరసిస్తూ దళితేతరులు రాసిన తొలి పద్యకావ్యంగా దీన్ని విమర్శకులు భావిస్తున్నారు. కొండపల్లి జగన్నాథరావు 1921లో రాసిన ""మేలుకొలుపు గీతం పురాణాల్లో దళితుల గొప్పతనాన్ని కీర్తించే విధంగా ఉంది. 1930లో జాలా రంగస్వామి రాసిన ""అంటరానివాడెవ్వడు పాట, 1933లో కుసుమ ధర్మన్న రాసిన ""హరిజన శతకం దళితుల మనోభావాలను బాగా పట్టుకోగలిగాయి. 1933లోనే కుసుమ ధర్మన్న రాసిన ""మాకొద్దీ నల్ల దొరతనము గేయం ఒక ఊపు ఊపింది.

గుర్రం జాషువా రాసిన ""గబ్బిలం(1941) కావ్యంలో దళితుల వేదనా భరిత జీవితాలను, అప్పుడే మొలకలెత్తుతున్న తిరుగుబాటు స్వభావాన్ని శక్తివంతంగా అభివ్యక్తీకరించారు. ఈయనే రాసిన ""నా కథ దళిత ఆత్మ కథకు ప్రేరణనిచ్చే రచన. బోయి భీమన్న పురాణేతిహాసాల సమగ్ర అవగాహనతో గాంధీ, అంబేడ్కర్‌ తాత్త్విక భావాల సమ్మేళనంతో గొప్ప రచనలు చేశారు. ""గుడిసెలు కాలిపోతున్నై, ""రాగవాశిష్టం ""పాలేరు వంటివి బోయి భీమన్న రచనలలో ప్రముఖమైనవి. ఈ రచనలు దళితులకు గొప్ప ప్రేరణనిచ్చాయి. ఇలా అస్పృశ్యతను నిరసిస్తూ దళిత, దళితేతరులు అనేక రచనలు చేశారు.

ఇంచుమించు ఈ రచనలన్నీ ""జీవితానుభవాలనుంచి పొందిన స్పందన, నిరసన, సంస్కరణ, ఉద్ధరణ, విమర్శ, విజ్ఞాపన, సంఘటన, ప్రతిఘటన దశలుగా పరిణామం చెందాయని విమర్శకులు భావిస్తున్నారు. 1968లో కృష్ణా జిల్లా కంచికచెర్లలో కోటేశు అనే దళితునిపై అగ్రవర్ణాల వారు దొంగతనం కారణాన్ని మోపి అతడిని సజీవ దహనం చేశారు. ఆ తరువాత కారంచేడు ప్రాంతం(17-7-1985)లో దళితులపై జరిగిన మారణకాండతో దళితుల్లో చైతన్యం వెల్లువెత్తింది. అంతకుముందు పదిరికుప్పం ప్రాంతం(5-8-1983)లోనూ కొతమంది దళితులను కిరోషిన్ పోసి కాల్చేశారు. నీరుకొండ ప్రాంతం( 15-7-1987)లోకొంతమంది దళితులను చంపేశారు. చుండూరు ప్రాంతం( 6-8-1991)లోనూ కొంత మంది దళితులను ఊచకోత కోశారు. ఈ నేపథ్యంలో జి. లక్ష్మీ నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్‌ల సంపాదకత్వంలో ""చిక్కనవుతున్న పాట వెలువడింది.ఈ సంకలనంతో దళిత కవిత్వం ఒక సమగ్ర రూపం పొందింది. ఆ తర్వాత ఇంచుమించు ప్రతి సాహిత్య పేజీలోను దళిత సాహిత్యంపై చర్చోపచర్చలు జరిగాయి. జి. లక్ష్మీనరసయ్య ఆంధ్రజ్యోతి (ఆదివారం అనుబంధం) లో రాసిన వ్యాసాలు దళిత సాహిత్యానికి శాస్త్రీయమైన వివరణలను అందించగలిగాయి.

దళిత సాహిత్య ప్రక్రియలు

తెలుగులో దళిత సాహిత్యం ప్రధానంగా "దళిత కవిత్వమే' అన్నంతగా కవిత్వం వెలువడింది. అదే స్థాయిలో కాకపోయినా కథలు కూడా ఎక్కువగానే వచ్చాయి. నవలలు, నాటకాలు కూడా వచ్చినా సంఖ్యాపరంగా కూడా చెప్పుకోదగినన్ని రాలేదు. దీర్ఘకావ్యం, పాటలు కూడా ఎక్కువగానే వెలువడ్డాయి. ఆత్మ కథ అనువాదాలు కూడా కొన్ని వచ్చాయి. 1985 తరువాత వచ్చిన రచనల్లో జీవితానుభవాలతో కూడిన దళిత చైతన్యం ప్రతిఫలిస్తుంది. వివిధ పుస్తకాలకు రాసిన ముందుమాటలు, పత్రికా వ్యాసాలు, పుస్తకాల రూపంలో దళిత సాహిత్య విమర్శ వచ్చింది. విశ్వవిద్యాలయాల్లో దళిత సాహిత్యంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అలా దళిత సాహిత్యం ప్రక్రియా వైవిధ్యాన్ని సాధించింది.

దళిత గేయం

అస్పృశ్యతను నిరసిస్తూ 1909లో అజ్ఞాత కవి "మాలవాండ్ర పాట' లో ""అందారు పుట్టిరీ హిందమ్మ తల్లికి - ఎట్టాగు ఎక్కూవ బ్యాపన్లు మాకంటె అని నిలదీశారు.. "" మంచియన్నది మాలయైతే మాలనే అగుదున్‌ అని గురజాడ అన్నారు. జయధీర్ తిరుమలరావు ప్రధాన సంపాదకత్వంలో వెలువడిన "దళిత గీతాలు' (1993) లో చాలా వరకు అస్పృశ్యత నివారణకు ప్రయత్నించిన గేయాలున్నాయి. జాలా రంగస్వామి (1930) రాసిన "అంటరానివారెవరు?' గేయం బొబ్బిలి యుద్ధం బుర్రకథ వరుసలో వీర రసాత్మకంగా సాగింది. నక్కా చిన వెంకయ్య "హరిజన కీర్తనలు' బాగా ప్రసిద్ధి పొందాయి. అస్పృశ్యతా నివారణకై శక్తివంతమైన పాటలు రాసిన వారిలో కుసుమ ధర్మన్న ప్రతిభావంతుడైన కవి. బోయి భీమన్న డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌పై రాసిన "జయ జయ అంబేడ్కర' (1992), మాష్టార్జీ "అందుకో దండాలు బాబా అంబేడ్కరా' గేయాలు ప్రార్థనా గీతాలయ్యాయి. గద్దర్‌ "పొట్టకూటి కోసం పోలీసోడు', "దళిత పులులమ్మా' గేయాలు, యువక "కర్మభూమిలో పూసిన ఓ పువ్వా', గూడ అంజయ్య రాసిన "ఊరు మనదిరా ఈ వాడ మనదిరా' గేయాలు దళితులను నేటికీ ఉర్రూతలూగిస్తున్నాయి. శివసాగర్‌, వంగపండు ప్రసాదరావు, ఉ. సాంబశివరావు, ఇంకా అనేక మంది రాసిన గేయాలలో చాలా వరకు సంస్కరణ, మార్క్సిస్టు భావాలు అధికంగా ఉన్నా దళిత జీవితమే స్పష్టమవుతుంది.

దళిత పద్య కవిత్వం

అస్పృశ్యతా నివారణను ప్రతిఫలించే గేయాలు మాత్రా ఛందస్సులో పద్యాలలో దళిత, దళితేతరులు రాసినా, 1915లో మంగిపూడి వేంకటశర్మ గారి "నిరుద్ధ భారతం' ఛందోబద్ద దళిత పద్యకావ్యాల్లో మొదటి రచన. ఆ తరువాత పేర్కొనదగిన పద్యాలు, కావ్యాలు శతకాలు చాలా వరకు వచ్చాయి. అయితే అవి జాతీయోద్యమ సాహిత్యంలో భాగంగా గాంధీ ప్రభావంతో వెలువడినవి. కుసుమ ధర్మన్న ( హరిజన శతకం - 1933), కర్ణ వీర నాగేశ్వరరావు (అస్పృశ్యుల విజ్ఞప్తి -1936), బిర్నీడి మోషే (హరిజనాభ్యుదయం, పృథ్వీ భాగవతం - 1966), జోసెఫ్‌ కవి ( కన్నీటి కబురు), గుర్రం జాషువా (గబ్బిలం - 1941), కె.సి. జాన్‌ (బహిష్కారం -1948, ధర్మచక్రం), ఎడ్లపల్లి సామ్యూల్‌ (చిక్కడు -1963), మల్లవరపు జాన్‌ ( విశ్వ ప్రకాశం - 1974, అతుకుల బ్రతుకులు), సవ్వప్పగారి ఈరన్న (కడలి కెరటం - 1987), నంబూరు దూర్వాస మహర్షి (లోకాలోకనం - 1971), నూతక్కి అబ్రహాం (మత్కణం), రావూరి ఏకాంబరం (అంబేడ్కరో సమరసింహ -1994), కొలకలూరి స్వరూపరాణి (ప్రబోధము), ఎస్. టి. జ్ఞానానంద కవి (పాంచజన్యం, ధర్మాగ్రహం), ఆశావాది ప్రకాశరావు (అంతరంగ తరంగాలు - 1990) తదితరులు ఎంతో మంది కవులు కుల నిర్మూలనను ఆకాంక్షిస్తూ తమదైన దృక్పథంతో పద్య కవిత్వాన్ని రాశారు. ఛందోబద్ద పద్య కవిత్వం దళితుల దగ్గరకు చేరే సాహిత్య రూపం కాదని ఎనభయ్యో దశకం వచ్చే నాటికి చాలా మంది వాదించినా కావ్యాలు వెలువడుతూనే ఉన్నాయి. గుర్రం జాషువా పద్యాలు నేటికీ దళితులకు ప్రేరణనిస్తూనే ఉన్నాయి.

దళిత సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతీ వారికి గుర్రం జాషువా రాసిన ఒక పద్యం అయినా నోటికి రాకుండా ఉండదు. ఆ పద్యాల్లో ఉండే వస్తువు, లాలిత్యం, మాధుర్యంతో రసభరితంగా ఉండటమే దానికి ప్రధాన కారణం. గబ్బిలం కావ్యంలో పరమేశ్వరునికి సందేశం పంపిస్తూ దళితుని గురించి ...

ముప్పు ఘటించి వీని కులమున్‌, గలిమిన్‌ గబలించి దేహమున్‌

బిప్పి యొనర్చు నీ భరత వీరుని పాదముకందకుండగా

జెప్పులు కుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలే

దెప్పుడు నప్పువడ్డది సుమీ భారతావని వీని సేవకున్ - అని వర్ణించారు జాషువా.

దళితుల శ్రమను విలువ కట్టడం సాధ్యం కాదంటున్నారు కవి. గాంధీ ప్రభావంతో దళితేతరుడైనా తుమ్మల సీతారామమూర్తి అస్పృశ్యతా నివారణను కోరుతూ...

"హరిజనుల యందు నేను నొక్కరుండననుచు

నెపుడు ప్రతి హైందవుడు నిర్ణయించుకొనునొ

యపుడె యస్పృశ్యతా భూతమాపసరిల్లు

నపుడె శుచితామయ సమాజమవతరించును అనే భావాలతో పద్యాలను రాశారు.

ఇలా అనేక మంది పద్య కవిత్వం ద్వారా కూడా దళిత సమస్యను వర్ణించే ప్రయత్నం చేశారు. కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా, బోయి భీమన్నలను దళిత పద్యకవిత్రయంగా అభివర్ణించవచ్చు.

దళితుల గురించి తొలిసారిగా ‘‘"నిరుద్ధభారతం’‘' కావ్యాన్ని రాసిన మంగిపూడి వేంకటశర్మ అస్పృశ్యతను నిరసిస్తూ...

"మాలలని, పంచములటంచు, మాదిగలని

శ్వపచులని, చెప్పగారాని వారటంచు

మరియు చండాలురని తోడి మానవులను

దురలి వేయుట సాంఘిక ధర్మమగునె అని సంఘాన్ని ప్రశ్నించారు.

మొత్తం మీద దళిత పద్య కవిత్వంలో మూడు ప్రధాన ధోరణులు కనిపిస్తున్నాయి. గాంధీ ప్రభావం, గాంధీ - అంబేడ్కర్‌ ప్రభావం, హేతువాద భావాలు గల పురాణ విమర్శతో కూడిన మానవతా వాద ధోరణులుగా వాటిని చెప్పుకోవచ్చు..

దళిత వచన కవిత్వం

కులం వల్ల కలుగుతున్న సమస్యలను వర్ణిస్తూ వచన కవిత్వం అధిక స్థాయిలోనే వచ్చింది. నేటికీ పత్రికల్లో, పుస్తకాలలో ప్రచురితమవుతూనే ఉంది. గేయం కుల సమస్యను ఆధారం చేసుకొన్నా, ఆర్థికాంశాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. గేయాలు పాడిన/రాసిన వారే వచన కవిత్వాన్ని కూడా రాశారు. కానీ, వారి వచన కవిత్వం ప్రధానంగా కుల సమస్యపైనే దృష్టిని కేంద్రీకరించబడింది. మూలవాసీ సిద్ధాంతాన్ని మాష్టార్జీ ప్రతిపాదించారు. దళితులు నాగజాతికి చెందిన వారనే వాదాన్ని సవేరా ప్రచారం చేశారు. ఇలా వచన కవిత్వం కూడా వర్గ స్పృహతోనే ప్రారంభమయినా, తరువాత కాలంలో కులాన్నే కేంద్రీకరించుకొని వర్గ, మత వివక్షలను సైతం వ్యతిరేకిస్తూ వచ్చింది.

"చిక్కనవుతున్న పాట' (1995) తెలుగు సాహిత్యంలో ఒక కదలికను తెచ్చింది. ఆ తరువాత, దళిత కవిత్వం పూలే, అంబేడ్కర్‌ తాత్విక భావజాలంతో, చైతన్యవంతంగా అనేక కవితా సంకలనాలు, సంపుటాల రూపంలో వెలువడింది. 1995లోనే ఈ కవితా సంకలనాలు ఎక్కువగా రావడం దళిత కవిత్వంలో ఒక చారిత్రక పరిణామం. ఈ సంవత్సరంలోనే కేశవ కుమార్‌, కె. సత్యనారాయణల సంపాదకత్వంలో "‘‘దళిత మేనిఫెస్టో', పట్టేటి రాజశేఖర్‌, నాగప్ప గారి సుందర్రాజు సంపాదకత్వంలో’‘ "గుండె డప్పు', సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో "బహువచనం' కవితా సంకలనాలు వచ్చాయి. ఇదే సంవత్సరంలో వచ్చిన మద్దూరి నగేష్‌ బాబు వెలివాడ', కత్తి పద్మారావు "జైలుగంటలు',జూలూరి గౌరీశంకర్ "పొలికట్టె', సుంకర రమేష్‌ బాబు తల్లి కోడి హెచ్చరిక' సతీష్‌ చందర్‌ ‘‘"పంచమ వేదం'వంటివి పేర్కొనదగినవి.

వీటితో పాటూ కత్తి పద్మారావు ‘‘"నల్లకలువ'‘‘ (1996) ‘‘"భూమి భాష'‘‘, ‘‘"కట్టెల మోపు’‘', ఎండ్లూరి సుధాకర్‌ ‘‘"వర్తమానం'‘‘, ‘‘"కొత్త గబ్బిలం’‘', ‘‘"నల్ల ద్రాక్షపందిరి'‘‘, ‘‘"వర్గీకరణీయం'‘‘, ‘‘"అటాజనికాంచె'‘‘ (2005), పైడి తెరేష్ బాబు ‘‘"అల్ప పీడనం'‘‘ (1996), చిన్ని ‘‘"ఒళ్ళు కడుక్కుందాం రండి'‘‘ జి.వి. రత్నాకర్‌ ‘‘"మట్టి పలక'‘‘, ‘‘"అట్లేటి అల'‘‘, గ్యార యాదయ్య ‘‘"ఎక్కోషి'‘‘, దార్ల వెంకటేశ్వరరావు "దళిత తాత్వికుడు'‘ (2004), ప్రసాద్‌ మూర్తి ‘‘"కలనేత', "మాట్లాడుకోవాలి',’‘ చల్లపల్లి స్వరూపరాణి ‘‘"మంకెన పూవు',’‘ నాగప్పగారి సుందర్రాజు ‘‘"చండాల చాటింపు'‘‘, బన్న ఐలయ్య ‘‘"నిప్పు కణిక'‘‘ మొదలైనవి దళిత వచన కవిత్వంలో వస్తు, శిల్పాలలో వైవిధ్యాన్ని ప్రదర్శించాయి. వి. సిమ్మన్న, కొండపల్లి సుదర్శనరాజు వెలువరించిన’‘ "దళిత కవిత'‘‘ (1991)ను అనేకదళిత కవితలను ఒక చోటకు చేర్చిన మొదటి కవితా సంకలనంగా కొందరు పేర్కొంటున్నారు.

ఎస్‌.సి. వర్గీకరణ నేపథ్యంలో మాల, మాదిగలు పరస్పరం తమ అవకాశాల కోసం ఒకరినొకరు విమర్శించుకుంటూ వెలువడిన కవితా సంకలనం, సంపుటాలు వచ్చాయి. "‘‘మాదిగ చైతన్యం', "వర్గీకరణీయం', "ఒకే గొంతు', "దండోరా'‘‘ మొదలైనవాటిలో ఈ రకమైన కవిత్వం ఉంది..దళిత కవిత్వాన్ని విమర్శిస్తూ "చకోనా" సంపాదకత్వంలో ‘‘"పాట చిక్కబడుతుందా?'‘‘ (1996) అనే కవితా సంకలనం కూడా వెలువడింది.

ఈ వచన కవిత్వాన్నంతటినీ చూసినపుడు వస్తు, శిల్పాలలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. సలంద్ర ‘‘"దళిత మేనిఫెస్టో' ‘‘కవితలో వర్గ స్పృహతో కూడిన కుల ప్రతిఘటన చైతన్యం కనిపిస్తుంది.

""నన్ను

చచ్చిన శవాల ముందు

దహన సంస్కారాలే చూసుకోమన్నావ్‌

సరే,

ఎలాగైతేనేం,

నీ ప్రాణాల్ని కూడా

ఎలా పాతేయాలో

నాకు తెలియడమే బాగయిది. -

అంటూ దళితులకు ప్రతికూలాంశాలైనవి, అనుకూలాంశాలుగా మార్చుకొని చైతన్యంతో పోరాటపటిమను ప్రదర్శించారు.

చాతుర్వర్ణ వ్యవస్థలో దళితులకు అవకాశం లేకుండా చేసిన తీరుని వర్ణిస్తూ బొజ్జాతారకం --

""నాకై కవిత లేదు

నాకు చరిత లేదు

నాలుగు వేదాలలోంచి

నాలుగు పాదాలలోంచి

నన్ను తొలగించారు -- అని వర్ణించారు.

అలాంటి దళితుడు ఆత్మ గౌరవం కోసం పోరాడిన పరిణామాలను కలేకూరి ప్రసాద్‌ "పిడికెడు ఆత్మ గౌరవం' కోసం కవితలో ఇలా అంటారు.

""త్రేతా యుగంలో నేను శంబూకుణ్ణి

ఇరవై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు

నా జన్మ స్థలం కీలవేణ్మణి, కారంచేడు, నీరు కొండ . . .

ఇప్పుడు కరడు గట్టిన భూస్వామ్య క్రౌర్యం

నా గుండెల మీద నాగేటి కర్రులతో

పచ్చబొడిసిన పేరు చుండూరు

ఇక చుండూరు నామవాచకం కాదు, సర్వనామం

. . . . . . . . .

అవమానాలకు, అత్యాచారాలకుక, మానభంగాలకు

చిత్రహింసలకు గురై

పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తినవాణ్ణి

దళితులు హిందుమతం నుండి అన్యమతాల వైపు ఆకర్షింపబడటానికి గల కారణాలను కూడా కవులు వర్ణించారు.

""మీ వేదాలు ఆలకించినందుకు

సీసం పోయించుకుని దిబ్బళ్ళెత్తిన

నా చెవులకు నా మసీదు, నా సిలువ

అమృతం చిలికే

నాలుగు ఆప్తవాక్యాలు చెప్పి

ధార కట్టిన నా కన్నీటిని

పైట చెంగుతో తుడిచాయి --అని చల్లపల్లి స్వరూపరాణి మతాంతరీకరణకు గల కారణాలు కవిత్వీకరించారు

వందలాది సంవత్సరాలు వర్గపోరాటంలో భాగంగా ప్రాణాలర్పించినా, కుల సమస్యను విస్మరించి, వర్గ సమస్యే ప్రధానమన్న మార్క్సిస్టులను కూడా వ్యతిరేకిస్తూ దళిత కవిత్వం వచ్చింది. అలాగే, ఒకప్పుడు దళితులను దగ్గరకు చేర్చుకున్న క్రైస్తవ మతంలో కూడా కులం రాజ్యమేలడాన్ని మద్దెల శాంతయ్య "ఓసీ క్రీస్తు'లో నిరసిస్తూ కవిత్వం రాశారు. ఈ కవితను ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ముఖచిత్రంలో ప్రచురించడం ఒక చారిత్రక సందర్భంగా చెప్పుకోవచ్చు. వర్గీకరణ నేపథ్యంలో ఎండ్లూరి సుధాకర్‌ ‘‘"కొత్త గబ్బిలం', "వర్గీకరణీయం'‘‘ వంటి కవితా సంకలనాలని వెలువరించారు. తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ వచన కవిత్వం 2007లో "దళిత వ్యాకరణం", 2013లో " మాకూ ఒక భాషకావాలి " వెలువడ్డాయి దళిత కవిత్వంలో మినీకవితలు కూడా కనిపిస్తున్నాయి. దళిత నానీలు, హైకూలు కూడా రాశారు. దీర్ఘకావ్యాలు కూడా వచ్చాయి. ఇలా వచ్చిన దళిత కవిత్వం వస్తు, రూపాలలో తెచ్చిన వైవిధ్యం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి కాగలుగుతుంది. దళిత కవిత్వంలో వచ్చిన శిల్ప వైవిధ్యాన్ని పాశ్చాత్య సాహిత్యంతో అన్వయించి జి. లక్ష్మీనరసయ్య అనేక వ్యాసాలు రాశారు. వాటిలో పౌరాణిక నేపథ్యం (Mythopoeic), వ్యక్తిత్వారోపణ (Personification), ఉల్లేఖన (Allusion), నాటకీయ స్వగతం (Dramatic Monologue), సంభాషణా శైలి (Conversational Style), పునరుక్తి (Repetition), అపరిచియిత్వీకరణ (De-Formalization), విరోధాభాసం (Paradox), అసాధారణ పోలిక (Conceit), స్థానభ్రంశం (Displacement), స్థానికత లేదా దేశీయత (Nativity), పురాణ ప్రతీకలు (Mythological symbols) మొదలైన శిల్ప పద్ధతులలో దళిత కవిత్వం శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించింది.

దేవరాజు మహారాజు, ఎండ్లూరి సుధాకర్‌ మొదలైనవాళ్ళు ""దళిత ఆత్మకథా ప్రక్రియను పరిచయం చేశారు. పైడి తెరీష్‌ బాబు ""దళిత గజల్‌ను ప్రారంభించినా కొనసాగలేదు. ఆయనే కవిత్వాన్ని క్యాసెట్‌ (హిందూ మహాసముద్రం) రూపంలో అందించడానికి ప్రయత్నించినా , పాటకున్నంత ఆదరణ దీనికి లభించలేదు. దళిత సాహిత్యలో ఇంకా ప్రదర్శనానుగుణ సాహిత్య ప్రక్రియలు రావలసి ఉంది.

దళిత నవల

అస్పృశ్యతను వివిధ కోణాల్లో చిత్రిస్తూ నవలలు రాసిన వాళ్ళున్నారు. ‘‘హేలావతి’‘ (1913), వెంకటపార్వతీశ్వరకవులు ‘‘"మాతృమందిరం' ‘‘(1919), ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ‘‘"మాలపల్లి'‘‘ (1922), ఆచార్య రంగనాయకులుగారిమ ‘‘"హరిజన నాయకుడు'‘‘ (1933), వట్టికోట ఆళ్వారుస్వామిగారి ‘‘"ప్రజల మనిషి'‘‘ (1955) ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి ‘‘"బలిపీఠం'‘‘ (1962), డా. కేశవరెడ్డి రాసిన ‘‘"బానిసలు'‘‘ (2971), ‘‘"శ్మశానం దున్నేరు'‘‘ (1979),’‘ "ఇన్‌క్రెడిబుల గాడెస్‌'‘‘ (1979),’‘ "అతడు అడవిని జయించాడు'‘‘ పేర్కొనదగినవి.’‘"మాలపల్లి'‘‘ నవల మార్క్సిస్టు భావజాలంతో జాతీయోద్యమ ప్రభావంతో వచ్చినా, దళితుల జీవితాన్ని స్పర్శించిన నవలగా ప్రసిద్ధి పొందింది. దళితులలోని దాసరుల కుటుంబం చుట్టూనే ‘‘"మాలపల్లి'‘‘ నవలలోని సంఘటనలన్నీ చిత్రితమయ్యాయి. తక్కెళ్ళ జగ్గడు ఉరఫ్‌ వెంకటదాసు కులం వల్ల వివక్షకు గురవుతుటాడు. అయినా, ఆర్థిక స్థితిగతులలో మార్పుల రాకపోతే దళితుల అస్తవ్యస్తమవుతుందనేటట్లు పాత్రను తీర్చిదిద్దారు రచయిత.

1980 తర్వాత దళిత సాహిత్యంలో నవలా ప్రక్రియ వేగవంతంగానే వచ్చింది. అక్కినేని కుటుంబరావు ‘‘"సొరాజ్జెం'‘‘ (1981) స్వాతంత్ర్యానంతర గ్రామీణ దళితుల జీవితాలను నవలలో చిత్రించారు. ‘‘"ఖాకీ బతుకులు'‘‘ (1980-82) నవలలో

పోలీసుశాఖలో దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని స్పార్టకస్‌ (జి. మోహనరావు) వివరించారు. చిలుకూరి దేవపుత్ర రాసిన ‘‘"అద్దంలో చందమామ' ‘‘(1988), ‘‘"పంచమం'‘‘ (1998) నవలలో సుమారు 1975 నుండి 99 వరకు రాష్ట్రంలో జరిగిన దళిత ఉద్యమాల చారిత్రక నేపథ్యాన్ని చిత్రించే ప్రయత్నం చేశారు. ‘‘"అకాశంలో సగం'‘‘ (1990) నవలలో ఓల్గా అగ్రవర్ణ భూస్వామ్య వ్యవస్థ కింద నలిగిపోతున్న దళితుల జీవితాలను, ముఖ్యంగా స్త్రీ దృక్పథాన్ని వర్ణించారు. సదానంద శారద 1992లో రాసిన ‘‘"మంచినీళ్ళ బావి’‘' తెలంగాణ ప్రాంతం దళిత జీవితాలను వర్ణించింది. 1996లో బండి నారాయణస్వామి ‘‘"గద్దలాడతాండాయి'‘‘ నవలలో రాయలసీమ దళితుల జీవితాన్ని చిత్రించారు. ‘‘"నీ బాంచెన్‌ కాల్మొక్త' ‘‘(1997) నవలలో కాలువ మల్లయ్యగారు సుమారు యాబై ఏళ్ళలో తెలంగాణలో వచ్చిన సామాజిక పరిణామాలను ప్రాంతీయ మాండలికంలో వివరించే ప్రయత్నం చేశారని విమర్శకులు వ్యాఖ్యానించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘‘"కాడి'‘‘ (1998) నవలలో మాల, మాదిగల మధ్య కలిగే అంతరాలను ఆసరా చేసుకొని అగ్రవర్ణాల వారు దళితులపై చేసే పెత్తనాన్ని వర్ణించారు. ఇంచుమించు ఇదే ఇతివృత్తంతో పి.నాసరయ్య’‘ "మాదిగపల్లె'‘‘ (1998) నవల రాశారు. జి.కళ్యాణరావు గారు ‘‘"అంటరాని వసంతం'‘‘ (2000)లో సుమారు వంద సంవత్సరాల దళితుల పోరాటాల పరిణామాలను ఆకర్షణీయమైన శైలిలో రాశారు. వేములఎల్లయ్య ‘‘"కక్క"‘‘ (2000) ‘‘"సిద్ధి'‘‘ (2006) నవలలో తెలంగాణ ప్రాంత దళితుల సాంస్కృతిక జీవనాన్ని ప్రాంతీయ మాండలికంలో రాశారు. బోయ జంగయ్య జాతర (1997) కూడా తెలంగాణ దళితుల జీవితాన్ని వర్ణించిందే. ఇంకా చాలా నవలల్లో దళిత, దళితేతర రచయితలు ఆయా పాత్రలను వర్ణించిన వారున్నారు.

దళిత కథ

దళిత జీవితాలను చిత్రిస్తూ సంస్కరణ, అభ్యుదయ, విప్లవ సాహిత్యంలో భాగంగానే దళిత కథలు కూడా ప్రారంభమయ్యాయి. వాటిలో ఆర్థిక కోణాలకున్న ప్రాధాన్యత కులనిర్మూలన దిశ కనపడదు. దళితేతరులు రాసిన కథల్లోనూ నిమ్న కులాలనే స్పృహ తప్ప, ఆ కులాల జీవిత సంవేదనలకు దర్పణం పట్టే విధంగా వర్ణించినవి చాలా తక్కువగానే వచ్చాయి.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 1925లో రాసిన ‘‘"పుల్లంరాజు కథ'‘‘లో తొలిసారిగా దళితుల ప్రస్తావన కనిపిస్తుంది.

దళిత జీవితాన్ని, సంవేదనలను, పోరాట చైతన్యాన్ని వర్ణించిన తొలి దళిత కథగా కొలకలూరి ఇనాక్ రాసిన’‘ "ఊరబావి'‘‘ (1968-69) కథను పరిశోధకులు గుర్తిస్తున్నారు. ఈ కథలో వ్యవస్థ కోసం వ్యక్తి చేసిన త్యాగం, దళితుల్లోని వివిధ తరాల్లో వచ్చిన చైతన్యాన్ని వర్ణించారు. ఈ కథలో మాల మాదిగలందరికీ నీటి సమస్యను తీర్చడానికి ఒక దళిత స్త్రీ చూపిన సాహసంలో ధైర్యం ఉంది. అగ్రవర్ణ కుట్రను ఎదుర్కొనే ఆలోచన ఉంది.

డా.భార్గవి రావు సంకలనం చేసిన ‘‘"ఇంకానా ఇకపై సాగవు'‘‘, కె.లక్ష్మీనారాయణ, ఆర్‌.చంద్రశేఖర్‌ రెడ్డి సంపాదకత్వం, సంకలనంలో వచ్చిన ‘‘"దళిత కథలు'‘‘, గోగు శ్యామల, జూపాక సుభద్ర సంపాదకత్వంలో వచ్చిన ‘‘"రేగడి సాల్లు'‘‘ (2006), రచయితలే విడివిడిగా ప్రచురించుకున్న కథా సంపుటాలలో సుమారు వెయ్యికి పైగా దళిత కథలు కనిపిస్తున్నాయి. కొలకలూరి ఇనాక్, బోయ జంగయ్య, కాలువ మల్లయ్య, శాంతి నారాయణ, ఎండ్లూరి సుధాకర్‌, నాగప్పగారి సుందర్రాజు, గోగు శ్యామల, జూపాక సుభద్ర, చల్లపల్లి స్వరూపరాణి, జాజుల గౌరి మొదలైన వాళ్ళు రాసిన దళిత కథల్లో నిజమైన దళిత జీవితం కనిపిస్తుంది. దళితేతరులు రాసిన కథల్లో కరుణకుమార, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, గోపీచంద్‌ వంటి వారు కూడా దళిత జీవితాల్లోని అనేక కోణాలను చిత్రించగలిగారు. చలం కొన్ని కథలు రాసినా దళిత జీవితం పట్ల సరైన అవగాహన లేదనిపిస్తుంది. క్రైస్తవం దళితుల్లో తెచ్చిన సాంఘిక, ఆర్థిక అభ్యున్నతితో పాటు, నీరుగార్చే చైతన్యాన్ని కూడా ధారాగోపి, చిలుకూరి దేవపుత్ర వంటి కథకులు వర్ణించగలిగారు.

దళితుల్లోని అంత:సంఘర్షణను, ముఖ్యంగా మాల - మాదిగల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సామాజిక వ్యత్యాసాలను స్వామి, మద్దూరి నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు, ఎండ్లూరి సుధాకర్‌, ఒమ్మి రమేష్‌ బాబు, గోగు శ్యామల, జూపాక సుభద్ర మొదలైన వాళ్ళు వర్ణిస్తూ కథలు రాశారు.

ననుమాస్వామి, బి.ఎస్.రాములు, కాలువ మల్లయ్య, కాసుల ప్రతాపరెడ్డి మొదలైన వారు కథల్లో మార్క్సిస్టు, తెలంగాణ సమస్యలను దళిత జీవిత కోణాల నుండి వర్ణించారు. ఇక ఆధునికంగా దళితకథను బలంగా చిత్రిస్తున్నవాళ్లలో డా.ఎం.ఎం.వినోదిని, డా.పసునూరి రవీందర్ ఉన్నారు.

మొత్తం మీద దళిత కథ 1934-68 వరకు సంస్కరణోద్యమ దశగా చెప్పుకోవచ్చు. ఈ దశలో సానుభూతి ధోరణి కనిపిస్తుంది. 1968-80 వరకు కులనిర్మూలన దశ. ఈ దశలో మాల, మాదిగలలో ఉండవలసిన సమష్టి పోరాట చైతన్యాన్ని చిత్రిస్తూనే, నీటి సమస్య, వృత్తి చేత పొందే న్యూనత, ఆర్థిక వెనుకబాటుతనం, దళితులు చదువుకోవలసిన అవసరం, క్రైస్తవ, ముస్లిం మతాంతరీకరణ, కులనిర్మూలన చైతన్యంతో కథలు వచ్చాయి. 1980-95 వరకు దళిత పోరాట చైతన్య దశ. ఈ దశలో దళితులలో వచ్చిన చైతన్యం చిత్రించబడింది. కారంచేడు, పదిరి కుప్పం, చుండూరు తదితర ప్రాంతాలలో దళితులపై జరిగిన దాడుల నేపథ్యంలో అంబేడ్కర్‌ భావజాలం, ఆత్మగౌరవ పోరాటం మొదలైనవి ప్రతిఫలించాయి. 1995 నుండి నేటివరకు వరకు దళిత బహుజన సమైక్య దశ. ఈ దశలో ఉత్తర భారతదేశంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంతో బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఏర్పాటు చేయాలనే ఆకాంక్షతో కొన్ని కథలు వస్తున్నాయి. బి.సి. కులాల నుండి వచ్చిన కథకులు ఈ దిశగా మంచి కథలు రాశారు. మాల, మాదిగల మధ్య వర్గీకరణ నేపథ్యంలో జరుగుతున్న సంఘర్షణలకు రాజ్యాధికారమే పరిష్కారం చూపుతుందనే ఆలోచనలు కూడా కొన్ని కథల్లో కనిపిస్తునాయి.

మొత్తం మీద వస్తు విస్తృతితో పాటు శిల్ప పరమైన మార్పులు కూడా దళిత కథ అందించగలిగింది. అయినా, సాంస్కృతిక, ఆర్థిక అంశాలను వర్ణిస్తూనే దళిత తాత్విక భూమికను విస్మరించకుండా అంబేడ్కర్‌ భావజాలతో మరిన్ని కథలు రావలసి ఉంది.

దళిత నాటకం

పందొమ్మిది వందల ముప్ఫై ప్రాంతం నుండి దళితులను ప్రస్తావిస్తూ కొన్ని నాటికలు, నాటకాలు వచ్చాయి. వాటిని దళితులపై సానుభూతిని చూపుతూ వచ్చిన నాటకాలుగానే చెప్పుకోవచ్చు. ధర్మవరం గోపాలాచార్యుల ‘‘"అస్పృశ్యవిజయం'‘‘లో అస్పృశ్యత మహాపాపమని వివరించే నాటకం. మునిమాణిక్యం నరసింహారావు తిరుగుబాటు (1938), దర్భ భాస్కరమ్మ ‘‘"దేవాలయ ప్రవేశం'‘‘ ఓరుగంటి కృష్ణ కౌండిన్య ‘‘"కృష్ణ చరితం'‘‘ (1933),బండారు మృత్యుంజయ ‘‘"సమాజం మారాలి',’‘ ఆచార్య ఎన్.జి.రంగా ‘‘"హరిజననాయకుడు'‘‘ (1933), ఉన్నవ లక్ష్మీనారాయణ ‘‘"హరిజన నాటకం"‘‘ (1933) వంటి నాటకాలలో ఆయా రచయితలకు దళితుల పట్ల ఉన్న సానుభూతి కనిపిస్తుంది.

దళిత జీవితాన్ని పౌరాణిక, చారిత్రక, సాంఘిక ఇతివృత్తాలతో రాసిన నాటకాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. దళితులపై సానుభూతి చూపండంటూనే వారి ప్రతిభను వివరించే ప్రయత్నం చేసిన నాటకాలున్నాయి. పుట్టుక, ‘‘"కలిసిమెలిసి తిరగటం', "ప్రేమ వివాహాలు', "దేవాలయ ప్రవేశం'‘‘, తిరుగుబాటు భావాలతో కొన్ని నాటకాలు వచ్చాయి.

1959లో బోయి భీమన్న రాసిన’‘ "రాగవాశిష్టం'‘‘ నాటకాన్ని తొలి దళిత నాటకంగా భావించే అవకాశం ఉంది. దళితుల పుట్టుక కూడా ఉన్నతమైనదేనని, దళితులు హిందువులలో భాగమని వాదించే నాటకం’‘ "రాగవాశిష్టం'‘‘. ఈ రచయితే రాసిన’‘ "ఆదికవి వాల్మీకి'‘‘ (1970),’‘ "పాలేరు'‘‘ నాటకం దళితులను ఆలోచింపజేసినవి. కొలకలూరి ఇనాక్ రాసిన’‘ "మునివాహనుడు'‘‘ నాటకం దళితులు దేవాలయ ప్రవేశాన్ని, వారి భక్తిని శక్తివంతంగా వర్ణించింది. ఇంకా సాంఘిక నాటకాలు కూడా చాలా వచ్చాయి. దళిత సాహిత్య విమర్శ:

’‘ "చిక్కనవుతున్న పాట'‘‘ (1985)కి జి. లక్ష్మీనరసయ్య దేశీయ మార్క్సిజమే ‘‘"దళిత కవిత్వ ఎజెండా' ‘‘పేరుతో రాసిన ముందు మాటతో తెలుగులో దళిత సాహిత్య విమర్శ శాస్త్రీయ పద్ధతిలో ప్రారంభమయింది. అంతకుముందు గుర్రం జాషువా, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్, కత్తి పద్మారావు, బొజ్జా తారకం మొదలైనవారు ఆయా గ్రంథాలకు రాసిన/రాసుకున్న ముందుమాటల్లోనూ దళిత సాహిత్య విమర్శ కనిపిస్తున్నా, అది అస్పృశ్యతా నివారణను ప్రధానంగా చేసుకొని అనేకాంశాలను విశ్లేషించినదే అవుతుంది. వివిధ విశ్వవిద్యాలయాల్లో గుర్రం జాషువా, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్ రచనలపై కొన్ని పరిశోధనలు జరిగాయి. వాటిలో కొంత విమర్శ ఉన్నా, జి.లక్ష్మీనరసయ్య రాసిన వ్యాసాలలోనే దళిత సాహిత్య విమర్శ స్పష్టంగా కనిపిస్తుది.

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు దళిత కవిత్వంలో ధ్వని సూత్రాలను అన్వయించి, దళితసాహిత్య విమర్శకు దేశీయ భూమికను ఏర్పరిచే ప్రయత్నం చేశారు. కొలకలూరి ఇనాక్ ఆధునిక విమర్శ సూత్రాలలో దళిత సాహిత్య విమర్శకు శాస్త్రీయ విశ్లేషణను అందించారు. దళిత కథపై ననుమాస స్వామి, దళిత ఉద్యమం పై ఎస్వీ సత్యనారాయణ, చారిత్రక, భౌతిక దృక్పథాన్ని కత్తి పద్మారావు, కె.కె. రంగనాథాచార్యులు, దళిత సాహిత్యంలో బిసివాదాన్ని బి.ఎస్.రాములు, పోస్టుమోడరన్ దృక్పథాన్ని బి. తిరుపతిరావు, పోస్టుమోడరన్ దృక్పథ వ్యతిరేకతను సతీష్‌ చందర్‌, జాషువాసాహిత్యంపై ఎండ్లూరి సుధాకర్‌, అనువర్తిత దళిత సాహిత్య విమర్శను శిఖామణి మొదలైనవారు విశేషమైన కృషి చేశారు. ఇంకా సమన్వయ దృక్పథాన్ని అఫ్సర్, చందు సుబ్బారావు, అద్దేపల్లి రామమోహనరావు, ద్వా.నా.శాస్త్రి, ప్రసేన్‌, బొజ్జా తారకం, కలేకూరి ప్రసాద్‌, కోయి కోటేశ్వరరావు, కె. సత్యనారాయణ, కొప్పర్తి, దార్ల వెంకటేశ్వరరావు, మేడేపల్లి రవికుమార్‌, పి.సి.

రాములు, హెచ్చార్కె, మో, కోవెల సంపత్కుమారాచార్య, ఆర్‌.ఎస్‌.సుదర్శనం, కొడపల్లి సుదర్శనం రాజు, కె. లక్ష్మీనారాయణ, గద్దల భాను, కాసుల ప్రతాపరెడ్డి, కొల్లూరి చిరంజీవి, జ్వాలాముఖి, నగ్నముని, తుమ్మల భారతి, కొలకలూరి మధుజ్యోతి తదితతరులు అందించారు. వీరే కాకుండా, గోగు శ్యామల, ఎస్జీడీ చంద్రశేఖర్‌, బూదాటి వెంకటేశ్వర్లు, దేవరపల్లి మస్తాన్‌రావు, వెలమల సిమ్మన్న, కాలువ మల్లయ్య, ఆర్‌.చంద్రశేఖర్‌ రెడ్డి మొదలైనవారంతా దళిత సాహిత్య విమర్శను పరిపుష్టం చేస్తున్నారు.

ప్రధానంగా దళిత సాహిత్య విమర్శ జాషువాపై ఎక్కువగా వచ్చింది. ఆ తరువాత వచన కవిత్వం, భాష, అశ్లీల పదాలు, భారతీయ ఆలంకారిక దృక్పథం మొదలైన అంశాలపై ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ, దళిత సాహిత్య విమర్శ సంప్రదాయ సాహిత్యాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నట్టు ఉందనే అభిప్రాయాలున్నాయి. మరింత మౌలికంగా శాస్త్రీయంగా దళిత సాహిత్య విమర్శ రావలసిన అవసరం ఉంది. ప్రస్తుతం దళిత సాహిత్య విమర్శలో కనిపిస్తున్న ధోరణులను గమనిస్తే ఆ సాహిత్య విమర్శ పయనించవలసిన మార్గం స్పష్టమవుతుంది.

దళిత విమర్శ ధోరణులు

1. ప్రాచీన కావ్యాలలో సామాన్య పాత్రలకు కనీస అవకాశం కల్పించలేదు. సమాజంలో కేవలం కొన్ని వర్ణాలవారి ఆలోచనలతో కూడినదే సాహిత్యంగా ప్రచారం పొందింది.

2. అలంకార శాస్త్రాలు, లక్షణ గ్రంథాలు చాలా వరకు నిమ్న వర్ణాల గురించి రాయటాన్ని అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితులలో కొన్ని పాత్రలను ప్రవేశపెట్టినా వాటిని నీచ పాత్రలుగానే చిత్రించాయి. సమాజంలో కొన్ని వర్ణాలవారే సుగుణ స్వభావం కలిగి ఉంటారనే దృక్పథం వాస్తవానికి దూరంగా ఉంది.

3.కొన్ని వందల యేండ్ల సాహిత్యమంతా అసత్యాలతో నిండి పాలకవర్గాల ఆధిపత్యంలో కొనసాగింది. దళితులను అణచివేసే దిశగా ప్రజల భాషకేమాత్రం సంబంధంలేని సంస్కృత భాషలో, ఆ భాషానువాదాలతో దాని మనుగడ కొనసాగింది.

4. ఆధ్యాత్మిక భావాల పేరుతో భావవాదాన్ని ప్రచారం చేసి సాహిత్యం ద్వారా శాస్త్రీయమైన ఆలోచనకు అవకాశం కలగనివ్వలేదు. విదేశీ పాలకుల ప్రవేశంతో హిందూ మత పరిరక్షణకు వివిధ పేర్లతో సంస్కరణ విధానాలను పాటించినా, దళిత సాహితీ వేత్తలు ఆ నేపథ్యాన్ని గుర్తెరిగి సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం జరగాలి. మౌఖిక సాహిత్యంలో ఉన్న దళితుల మూలాలు బహిర్గతపరిచే ప్రయత్నం జరగాలి.

5. దళితులను అణచివేసిన భావజాలమే బ్రాహ్మణవాదం. బ్రాహ్మణులను లేదా ప్రత్యేకంగా కొన్ని కులాలను నిందించటం దళిత సాహిత్య విమర్శ ధోరణి కాదు.

6. తెలుగులో దళిత సాహిత్యాన్ని తెలంగాణ ప్రాంతపరంగానూ, ఆంధ్ర ప్రాంతపరంగానూ ప్రత్యేక పరిశీలనలు అవసరం. కారంచేడు సంఘటనతోనే తెలుగు దళిత సాహిత్య చరిత్ర అంబేడ్కర్‌ దృక్పథంతో ప్రారంభమయింది అనటంలో ఆంధ్ర ప్రాంత దళిత రచయితల ఆధిపత్యం కనిపిస్తుంది. ఆంధ్ర ప్రాంత రచయితల రచనలలో క్రైస్తవ మతం, తెలంగాణ ప్రాంత రచయితల రచనలలో హిందూ, ముస్లిం మత విప్లవ సాహిత్య భావాలలో స్పష్టమైన విభజన రేఖను విస్మరిస్తున్నారు.

7. ఎవరి కులం గురించి వాళ్ళు మాత్రమే కుల సంఘాలకు పరిమితమైన దృష్టితో పరిమిత ప్రయోజనంతో సాహిత్యం కుదించుకుపోతుంది. అందువల్ల, దళిత సాహిత్య చరిత్ర పునర్మూల్యాంకనం చేసేటప్పుడు ఏ కులంలో పుట్టాలనేదానితో పాటు ఆ రచయితలు దళీతుల గురించి రాశారో లేదో పరిగణలోకి తీసుకోవాలి.

8. దళిత సాహిత్య చరిత్రను అంటరానితనం, కులవ్యవస్థ మొదలైనప్పటినుండి పరిశీలించాలి. దీనిలో భాగంగానే చిందు భాగవతం, జాంబపురాణాలను చూడాలి.

9. దళిత సాహిత్యంతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్న క్రైస్తవ సాహిత్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు మత దృక్పథం పట్ల ప్రత్యేక సూత్రాలతో విశ్లేషించాలి.

10. కుల నిర్మూలనతోనే దళితుల విముక్తి సాధ్యమవుతుందా? వర్గ దృక్పథం కూడా అవసరమా? అయితే అది ఎంతవరకు అవసరమనేది స్పష్టం చేయవలసిన అవసరముంది. దేశీయ మార్స్కిజం పేరుతో జరిగిన చర్చ కొంతవరకు ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళింది.

11. దళిత సాహిత్యం ఏర్పర్చుకొనే పరిధి వల్ల దళితులంటే ఎవరనేది స్పష్టమవుతుంది. షెడ్యూల్డు తెగలు, వెనకబడిన తరగతులు, ముస్లిములు దళితులవుతారా? ఈ విషయంలో ఇంకా స్పష్టత అవసరం. దళితులు, దళిత బహుజనులు వంటి పారిభాషిక పదాలను దళిత సాహిత్యం రాజకీయపరంగా కాకుండా సాంఘిక పీడన, కుల ప్రభావాన్ని అనుసరించి అన్ని వేళలా ఒకే అవగాహనతో ప్రయోగించవలసి ఉంది.

12. సాహిత్యంలో నాయకత్వ పాత్రలను సృజించేటప్పుడు అధికారం, భూమి సమస్య సాంఘిక హోదాల విషయంలో దళిత రచయితలకు స్పష్టత అవసరం.

13 దళితులలో ప్రధానంగా మాల, మాదిగల మధ్యే రిజర్వేషన్ల కోసం జరుగుతున్న అంత:సంఘర్షణ వల్ల వస్తున్న సాహిత్యం దళిత సాహిత్య వికాసమా? వైఫల్యమా?

14. స్త్రీవాద సాహిత్యలో దళిత స్త్రీ సమస్యలను సమర్థవంతంగా చిత్రణ జరగక పోవడానికి ఆ జీవితం తెలియక పోవడమా? విస్మరించడమా?

15. దళిత సాహిత్యాభివ్యక్తిని శక్తివంతంగా వ్యక్తీకరించడానికి ప్రత్యేక భాషను ప్రయోగించడం, అశ్లీల పదాలను గ్రహించటం, భారతీయ ఆలంకారిక శాస్త్రాంశాలను నిరసించటం, పాశ్చాత్య సాహిత్య సంప్రదాయాలను పాటించటలో గల పరిధులను స్పష్టంగా గుర్తించాలి.

16. దళిత సాహిత్యల ప్రక్రియాపరంగా గేయం (పాట), పద్యం, కథ, నవల, నాటకం, వ్యాసం వంటి వాటిలో దళితులకు దగ్గరైనవేమిటో, అవసరమైనవేమిటో, ఇంకా రావలిసినవేమిటో గమనిస్తుండాలి.

ముగింపు

మొత్తం మీద దళిత వచన కవిత్వమే దళిత సాహిత్యంగా కూడా భావింపబడింది. కానీ, అనతి కాలంలోనే వివిధ ప్రక్రియలను పరిశీలించిన తరువాత సాహితీవేత్తల అభిప్రాయంలో మార్పు కలిగింది. భారతీయ సాహిత్యలో వివిధ భాషల్లో కూడా దళిత సాహిత్యం విస్తృతంగానే వచ్చి, ఆ ప్రభావం తెలుగు దళిత కవిత్వంపై చూపింది.

ఇంత వస్తు వైవిధ్యాలను ప్రదర్శించినా, దళితులకు అందుబాటులో ఉండే సాహిత్య ప్రక్రియ పాటగానే (గేయం) కొంతమంది విమర్శకులు భావిస్తున్నారు. వచన కవిత్వం మధ్య తరగతి విద్యావంతులకు మాత్రమే బాగా అందుబాటులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ అనే విమర్శ కుడా ఉంది.