దాశరథి కృష్ణమాచార్య

From tewiki
Jump to navigation Jump to search
దాశరథి కృష్ణమాచార్య
Dasaradhi-Krishnamacharyulu.jpg
దాశరథి కృష్ణమాచార్య
జననంజూలై 22, 1925
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు
మరణంనవంబర్ 5, 1987
ఇతర పేర్లుదాశరథి
ప్రసిద్ధికవి, రచయిత
తండ్రిదాశరథి వెంకటా చార్య

తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) . దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.

జీవిత విశేషాలు

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి[1] హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.

రచనా ప్రస్థానం

ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు.

నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.

రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు.

దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్

అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు.

ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.

మరణం

1987 నవంబరు 5 న దాశరథి మరణించాడు.

రచనలు, అవార్డులు, బిరుదులు

దస్త్రం:Telugubookcover dasaradhikrishna.jpg
దాశరథి "యాత్రాస్మృతి"

కవితా సంపుటాలు

అవార్డులు

 • 1967 లో ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి
 • 1974 లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి
 • ఆంధ్ర విశ్వవిద్యాలయం " కళాప్రపూర్ణ "
 • వెక్కటేశ్వర విశ్వవిద్యాలయం "డి. లిట్ "

బిరుదులు

 • కవిసింహం
 • అభ్యుదయ కవితా చక్రవర్తి
 • ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుంచి 1983 వరకు
 • ఆంధ్రా కవితా సారధి


మచ్చుకు కొన్ని దాశరథి రచనలు

తెలుగుజాతి ఆత్మకథ లాగా ఉంటుంది కింది పద్యం..

ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతా నేనే! అన్నీ నేనే!
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే!

ఆ చల్లని సముద్ర గర్భం

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||
మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
భూస్వాముల దౌర్జన్యాలకు
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో ||ఆ చల్లని||
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని||

నిరంకుశ నిజాము పాలన గురించి..

ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ

ఎముకల్ మసిచేసి పొలాలు దున్ని
భోషాణములన్ నవాబునకు
స్వర్ణము నింపిన రైతుదే
తెలంగాణము రైతుదే

1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా..

ఆంధ్ర రాష్ట్రము వచ్చె
మహాంధ్ర రాష్ట్రమేరుపడువేళ
పొలిమేర చేరపిలిచె
నా తల్లి ఆనందం పంచుకుంది

సినీ గీతాలు

దాశరథి సినిమా రచనలు

1961లో ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీరంగ ప్రవేశం చేసాడు. ఇంచుమించుగా కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి సేవచేశారు.[2]

 • ఇద్దరు మిత్రులు (1961): ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
 • వాగ్దానం (1961): నా కంటిపాపలో నిలిచిపోరా...నీవెంట లోకాల గెలవనీరా
 • అమరశిల్పి జక్కన (1964): అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరేయి నీదోయి స్వామి
 • డాక్టర్ చక్రవర్తి (1964): ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర
 • దాగుడు మూతలు (1964): గోరంక గూటికే చేరావు చిలకా ; గోరొంక కెందుకో కొండంత అలక
 • మూగ మనసులు (1964): గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది
 • నాదీ ఆడజన్మే (1964): కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా
 • ప్రేమించి చూడు (1965):
 • ఆత్మగౌరవం (1966): ఒక పూలబాణం తగిలింది మదిలో తొలిప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే
 • నవరాత్రి (1966): నిషాలేని నాడు హుషారేమి లేదు ఖుషీ లేని నాడు మజాలేనే లేదు
 • శ్రీకృష్ణ తులాభారం (1966): ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల
 • వసంత సేన (1967): కిలకిల నగవుల నవమోహిని ప్రియకామినీ సాటిలేని సొగసుల గజగామినీ
 • పూల రంగడు (1967): నీవు రావు నిదురరాదు, నిలిచిపోయె యీ రేయి
 • నిండు మనసులు (1967): నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో
 • కంచుకోట (1967): ఈ పుట్టినరోజు, నీ నోములు పండినరోజు, దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు
 • పట్టుకుంటే పదివేలు (1967): తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలించ రావా దేవా
 • రంగులరాట్నం (1967): కనరాని దేవుడే కనిపించినాడే ; నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
 • బంగారు గాజులు (1968): విన్నవించుకోనా చిన్నకోరికా ఇన్నాళ్ళు నామదిలో వున్న కోరిక
 • రాము (1968): రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
 • బందిపోటు దొంగలు (1968): విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
 • ఆత్మీయులు (1969): మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నొ చెలరేగె కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడె
 • బుద్ధిమంతుడు (1969): నను పాలింపగ నడచీ వచ్చితివా, మొర లాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
 • భలే రంగడు (1969): నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా గెలుపు నాదేలే
 • మాతృ దేవత (1969): మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా
 • మూగ నోము (1969): ఈవేళ నాలో ఎందుకో ఆశలు ; నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే
 • ఇద్దరు అమ్మాయిలు (1970): పువ్వులో గువ్వలో వాగులో తీవెలో అంతట నీవేనమ్మా అన్నిట నీవేనమ్మా
 • చిట్టి చెల్లెలు (1970): మంగళగౌరి మముగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మా
 • అమాయకురాలు (1971): పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా
 • మనసు మాంగల్యం (1971): ఆవేశం రావాలి ఆవేదన కావాలి ; ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
 • శ్రీమంతుడు (1971)

Prasantam

  Ne swasaloni vaccani jwala
  Nannu calikagamantondi
  Ne kanulaloni chiru dipalu
  Na chikati payanam lo
  Nidu punnami valea
   Raca marganni bramipachastunnayi

బయటి లింకులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూలాలు

 1. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 102
 2. దాశరథి సినిమా పాటలు, సంకలన కర్త: కె. ప్రభాకర్, లావణ్య ఆర్ట్ క్రియేషన్స్, హైదరాబాద్, 2010.