"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నీలిమందు

From tewiki
Jump to navigation Jump to search
నీలిమందు
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [482-89-3]
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య DU2988400
SMILES O=c3c(=c2[nH]c1ccccc1c2=O)[nH]c4ccccc34
ధర్మములు
C16H10N2O2
మోలార్ ద్రవ్యరాశి 262.27 గ్రా/మోల్
స్వరూపం ముదురు నీలంరంగు స్ఫటికాకర పొడి
సాంద్రత 1.199 గ్రా/సెం.మీ3
ద్రవీభవన స్థానం 390–392 °సె
20 °సె వద్ద కరగదు
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R36/37/38
S-పదబంధాలు S26-S36
సంబంధిత సమ్మేళనాలు
Except where noted otherwise, data are given for
materials in their standard state
(at 25 °C, 100 kPa)

Infobox disclaimer and references

నీలిమందు (indigo) ఒక రంజనం (dye) లేదా అద్దకపు రంగు. తెలుగులో 'నీలిమందు' అన్నప్పుడు అద్దకాలలో ఉపయోగించే రంగు పదార్థం అన్న అర్ధమే స్పురిస్తుంది కాని, ఇంగ్లీషులో 'ఇండిగో' అన్నప్పుడు రెండు అర్ధాలు వస్తాయి. తెలుగులో 'నారింజ' అంటే నారింజ పండు అనేది ఒక అర్థం, నారింజ రంగు అనేది మరొక అర్థం వచ్చినట్లే, ఇంగ్లీషులో 'ఇండిగో' అన్నప్పుడు 'నీలంగా ఉన్న ఆ రంజనపు గుండ' అనే అర్థం ఒకటి, రెండవ అర్థం ఆ రంగు పేరు. నీలిమందుని మొదట్లో ఒక జాతి మొక్కలనుండి తయారు చేసేవారు. సంధాన రసాయనం బాగా పుంజుకున్న తరువాత దీనిని కృత్రిమంగా తయారు చెయ్యటం మొదలు పెట్టేరు.

చరిత్ర

నీలిమందుకీ భారతదేశానికీ చాలా గట్టి లంకె ఉంది. సింధు నాగరికత రోజులనుండి వృక్షసంపద నుండి రంగులు తీసి వాడటం భారతీయులకి తెలుసు. హరప్పా దగ్గర దొరకిన ఒక వెండి పాత్ర చుట్టూ చుట్టబెట్టిన అద్దకపు బట్టే దీనికి నిదర్శనం. అజంతా గుహలలో ఉన్న చిత్రాలలో మొక్కలనుండి తీసిన రంగులు కనిపిస్తున్నాయి. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో రంగుల ప్రస్తావన ఉంది. రంజనాలు మొక్కల నుండి తయారు చెయ్యటమే కాకుండా వాటిని బట్టలకి అద్దటంలో ఉన్న సాంకేతిక సూక్ష్మాలని కూడా కనిపెట్టేరు భారతీయులు. ఎనిమిదవ శతాబ్దం నాటికే మధ్య ఆసియాలోనూ, ఈజిప్ట్ లోనూ భారతదేశంలో చేసిన అద్దకం బట్టలు మంచి ప్రాచుర్యంలో ఉండేవి. పదమూడవ శతాబ్దంలో ఇండియా వచ్చిన మార్కోపోలో ఇండియాలో నీలిమందు వాడకం గురించి ప్రస్తావించేడు. అప్పటికి గ్రీకు దేశంలోనూ, రోములోనూ ఈ నీలిరంగు రంజనం వాడకంలో లేకపోలేదు. కాని ఈ రంగుకి 'ఇండిగో' అన్న పేరు రావటానికి మార్కోపోలో ఇండియాలో ఈ రంగుని చూడటమే అని అభిజ్ఞవర్గాల నమ్మకం. గ్రీకు భాషలో "ఇండికాన్" అన్నా లేటిన్ భాషలో "ఇండికమ్" అన్నా "ఇండియా నుండి వచ్చినది" అనే అర్థం.

పద్దెనిమిది, పందొమ్మిది శతాబ్దాలలో అద్దకం పరిశ్రమ భారత దేశంలో బాగా పుంజుకుంది. వెలిసిపోని పక్కా రంగులని వాడి తయారు చేసిన భారతీయ వస్త్రాలకి ఐరోపాలో మంచి గిరాకీ ఉండేది. అందుకనే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కొత్తలో నీలి మొక్కలని బీహారు లోను, బెంగాల్ లోను తోటలుగా పెంచి, శ్రామిక వర్గాలు చెమటోడ్చి తయారు చేసిన ఆ నీలిరంగుని ఎగుమతి చేసి లాభసాటి వ్యాపారం చేసేరు. కాని ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలని ఎండనక, వాననక పొలాల్లో పనిచేసిన కర్షకులతో పంచుకోటానికి సుముఖత చూపేవారు కాదు. ఆఖరికి జిల్లా కలెక్టర్లు కూడా చూసీచూడనట్లు ఊరుకునేవారు. సిపాయిల తిరుగుబాటు 1857 అయిన కొత్తలోనే, దరిదాపు 1850 ప్రాంతాలలో, పొలాల్లో పనిచేసే పనివాళ్ళు బ్రిటిష్ జమీందారుల మీద తిరగబడ్డారు. ఈ తిరుగుబాటుని చిత్రిస్తూ 1859-62 కాలంలో "నీల్ దర్పణ్" (నీలి అద్దం) అన్న పేరుతో ఒక నాటకం బిహార్లో మంచి ప్రజాదరణ పొందింది. జేమ్స్ లాంగ్ అనే కేథలిక్‌ ఫాదర్ ఈ నాటకాన్ని ఇంగ్లీషులోకి అనువదించి రైతులకి జరుగుతూన్న అన్యాయాన్ని బయటపెట్టేడు. అందుకని బ్రిటిష్ జడ్జి ఫాదర్ లాంగ్ ని జైల్లో పెట్టేడు. దానితో గూడుపుఠాణీగా జరుగుతూన్న అన్యాయం కాస్తా బట్టబయలయింది.

ఇదే సందర్భంలో జాన్ బీమ్స్ (John Beames) అనే వ్యక్తి బిహార్ లోని చంపారన్ జిల్లాకి కలెక్టర్‌గా నియమించబడ్డాడు. జరుగుతూన్న అన్యాయాన్ని సహించలేక ఆయన రైతుల పక్షం తీసుకుని తీర్పు చెబితే వెంటనే ఆయనని ఒడిషా బదిలీ చేసేసేరు. విక్రమార్కుడిలా ఈ బీమ్స్ ఒడిషాలో కూడా ఇదే రకం అన్యాయం జరుగుతూ ఉంటే అక్కడ రైతులకి అనుకూలంగా "రూల్స్" మార్చేసేడు. ది మెన్ హూ రూల్డ్ ఇండియా (The Men Who Ruled India) అనే పుస్తకంలో ఫిలిఫ్ వుడ్రఫ్ (Philip Woodruff) ఈ కథని చెప్పి జాన్ బీమ్స్ ని శ్లాఘించేడు. ఒడిషాలో పద్ధతులు మారేయి కాని బీహార్ లో ఏ మార్పూ రాలేదు. అక్కడ రైతులు మరొక 60 ఏళ్ళు కడగండ్లు పడ్డ తర్వాత మహాత్మా గాంధి చంపారన్ రైతుల తరఫున జైలుకి వెళ్ళటం, ఆ తరువాయి కథ ప్రపంచం అంతా వెండి తెర మీద చూడనే చూశారు. గాంధీ మహాత్ముడు సలిపిన స్వాతంత్ర్య సమరంలో ఉప్పుకి ఉన్న ప్రాముఖ్యత లాంటిదే నీలిమందుకి కూడా ఉంది.

నీలిమందు తయారీ

అసలు నీలిమందు కొన్ని రకాల మొక్కల నుండి వస్తుంది. ఈ మొక్కలన్నిటిలోకీ శ్రేష్థమైనది భారత దేశంలో పెరిగే నీలిమందు మొక్క. నీలి రంగు ఆకులతోటీ, చిన్న చిన్న పసుపు పచ్చని పువ్వులతోటీ, రెండేళ్ళకొక సారి పెరిగే ఈ మొక్క ఆవ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం 'ఇండిగోఫెరా టింక్టోరియా' (Indigofera tinctoria). ఈ మొక్కలని కోసి, కట్టలుగా కట్టి, ఇటికలతో కట్టిన కుండీలలో వేసి, నీళ్ళతో తడిపి ఒక రోజుపాటు నానబెడతారు. ఎండుగడ్డి రంగులో ఉన్న తేటని మరొక కుండీలోకి వెళ్ళేలా వారుస్తారు. ఈ తేటని రెండు మూడు రోజులపాటు చిలకాలి. ఇది శ్రమతో కూడిన పని. ఇద్దరు, ముగ్గురు మనుష్యులు ఈ కుండీలలోకి దిగి, తెడ్లతో ఈ తేటని బాదుతారు. అప్పుడు ఎండుగడ్డి రంగులోంచి ఆకుపచ్చ రంగులోకి మారి, క్రమంగా నీలిరంగులోకి వస్తుంది. అప్పుడు నీలిమందు చిన్న చిన్న రేకుల మాదిరి విడిపోయి అడుక్కి దిగిపోతుంది. పైన ఉన్న నీటిని తోడేసి, నీలి ముద్దలో ఉన్న మలినాలని వెలికి తియ్యటానికి ఆ ముద్దని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి, వడబోసి, ఎండబెడితే నీలం రంగు గుండ మాదిరి వస్తుంది.

ఈ కథ ఇలా నడుస్తూ ఉండగా ఐరోపాలో పారిశ్రామిక విప్లవంతో పాటు రసాయన విప్లవం మొదలైంది. అవి సంధాన రసాయనం (synthetic chemistry) కి స్వర్ణయుగం. ఇంగ్లండ్ లో 1856లో విలియమ్ పెర్కిన్ అనే పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు, గుడ్డిగుర్రపు తాపులా, కృత్రిమంగా అద్దకపు రంజనాలు చెయ్యటం ఎలాగో కనిబెట్టేడు. క్రమేపీ మొక్కల ప్రమేయం లేకుండా అన్ని రకాల రంగులు ప్రయోగశాలలో చెయ్యటానికి పద్ధతులు కనిపెట్టేరు. ఇడే ఊపులో నీలిమందు చెయ్యటం కూడా తెలిసిపోయింది. వెంటనే భారతదేశంలో ఉత్పత్తి అయే నీలిమందు ధర పడిపోయింది. మూలుగుతూన్న నక్క మీద తాటిపండు పడ్డ చందంలో ఇండియాలో నీలిమందు పండించే బ్రిటిష్ వాళ్ళ నోట మట్టి పడింది. వ్యాపారం దెబ్బ తినటంతో వాళ్ళు నీలి మొక్కలని పండించే రైతులని, నీలిమందు కర్మాగారాల్లో పని చేసే కార్మికులని నానా కష్టాలు పెట్టేరు.

Indigo, historical dye collection of the Technical University of Dresden, Germany

ఇంతకీ పెర్కిన్ కనిబెట్టిన పద్ధతిని టూకీగా ఇది. ఈ పద్ధతితో ఏ కళాశాలలో ఉన్న రసాయన ప్రయోగశాలలోనైనా నిమిషాల మీద నీలిమందు తయారు చెయ్యొచ్చు. ఆరంగుళాలు పొడుగున్న గాజు ప్రయోగ నాళికలో అర (0.5) గ్రాము ఆర్ధో నైట్రోబెంజాల్డిహైడ్ (ortho-Nitrobenzaldihyde) ని 5 మిల్లిలీటర్ల ఎసిటోన్ లో కరిగించాలి. అప్పుడు 5 మిల్లిలీటర్ల నీళ్ళు కలపాలి. అప్పుడు 2.5 మిల్లిలీటర్ల మోలార్ సోడియం హైడ్రాక్సైడ్ (molar sodium hydroxide) ఒకొక్క చుక్క చొప్పున నెమ్మదిగా కలపాలి. ఈ క్షారం (alkali) కలపటం మొదలవగానే నాళికలో ద్రవం నీలంగా మారుతుంది. నాళిక వేడెక్కటం మొదలవుతుంది. లోపల ఉన్న ద్రవం సలసల మరిగినా మరుగుతుంది. ఈ తాపచూషక (exothermic) ప్రక్రియని 5 నిమిషాలపాటు అలా జరగనిచ్చి అడుక్కి దిగిన నీలం మడ్డి (precipitate) ని వేరు చెయ్యాలి. అదే నీలి మందు! కూలివాళ్ళు, రోజుల తరబడి ఎండలో ఆ కుళ్ళబెట్టిన మొక్కలని కాళ్ళతో తొక్కి, నానా తంటాలు పడి తయారు చెయ్యటం కంటే నిమిషాల మీద ఈ కార్యక్రమం జరిగిపోతూ ఉంటే ఇండియాలో ఈ పరిశ్రమ ఒక్క రోజులో కుదేలయిపోయింది.

వనరులు

  • D. Balasubramanian, Indigo Nation: Champaran to Chandigarh, The Hindu (https://web.archive.org/web/20080117044105/http://www.hinduonnet.com/seta/2002/04/25/stories/2002042500180300.htm)
  • Lotika Varadarajan, "Indian Leven in Een Kleur" (CIP -GKB; The Hague, Holland, 1985, pp. 65–72)
  • Kausalya Santhanam, The Hindu Sunday Magazine, Folio, June 20, 1999
  • Indigofera tinctoria, Guide des Teintures Naturelles Dominique Cardon et Gaëtan du Chatenet, Delachaux et Niestlé 1990 ISBN 2-603-00732-7
  • Philip Woodruff, The Men Who Ruled India, Vol. I: The Founders, Vol II: The Guardians, New York: St. Martin's Press. 1954. Pp. 385