"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
నేదునూరి కృష్ణమూర్తి
నేదునూరి కృష్ణమూర్తి | |
---|---|
![]() నేదునూరి | |
జననం | కొత్తపల్లి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ | అక్టోబరు
10, 1927
మరణం | డిసెంబరు 8, 2014 | (వయస్సు 87)
పూర్వ విద్యార్థులు | మహరాజా సంగీత కళాశాల, విజయనగరం |
వృత్తి | సంగీత విద్వాంసుడు |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | సంగీత కళానిధి |
వెబ్సైటు | http://www.nedunuri.com |
నేదునూరి కృష్ణమూర్తి (1927, అక్టోబరు 10 - 2014, డిసెంబరు 8) కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి బిరుదు పొందినవాడు. తూర్పుగోదావరి జిల్లా, కొత్తపల్లె గ్రామంలో జన్మించాడు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. మొదట్లో వయొలిన్ మీద ఆసక్తితో ఉన్నా తర్వాత గురువుల సలహాపై గాత్ర సంగీతం వైపు మొగ్గు చూపాడు. శ్రీపాద పినాకపాణి వంటి వారి వద్ద శిష్యరికం చేశాడు. అన్నమాచార్య సంకీర్తనలు, రామదాస కీర్తనలను స్వరపరిచాడు. నాదసుధా తరంగిణి అనే ట్రస్టును ఏర్పాటు చేసి స్వరపరిచిన కీర్తనలను వాటి నొటేషన్లతో సహా ప్రచురించాడు. 2002 లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం అందుకున్నాడు. 2013 లో కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. 2014 డిసెంబరు 8 న విశాఖపట్నంలో వృద్ధ్యాప్యం, అనారోగ్య కారణంగా మరణించాడు.
Contents
బాల్యం
కృష్ణమూర్తి అక్టోబరు 10, 1927 న తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నవారు. వీరి తండ్రి పిఠాపురం రాజా వారి సంస్థాన కార్యాలయంలో పనిచేస్తూండేవారు. నేదునూరి 1940 లో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్, గాత్రంలో ప్రాథమిక శిక్షణ పొందారు. కీర్తిశేషులు ద్వారం నరసింగరావు నాయుడు శిష్యుడిగా ఉన్నారు. 1945 నుంచి సంగీత సభలలో పాల్గొంటూ వచ్చారు. 1949లో ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వద్ద చేసి సంగీతంలో గమకాలు, ఇతర మెళకువలలో శిక్షణ పొంది, సంగీత నైపుణ్యానికి మెరుగులు దిద్దారు. ఆల్ ఇండియా రేడియోలో అగ్రగణ్య కళాకారుడిగా వెలుగులోకి వచ్చారు. 1951 నుండి ఐదు దశాబ్దాలకు పైగా మద్రాసు సంగీత అకాడమీలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు.
ఉచితంగా ఏం నేర్చుకో గలిగితే అది నేర్చుకో అని ఆయన తండ్రి కోరాడు. అలా ఉచితంగా బోధించబడుతున్న హిందీ, సంస్కృతం నేర్చుకున్నారు. కానీ ఆయనకు మాత్రం సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. అందుకు తల్లి ప్రభావం ఉంది అని అంటారు. అష్టపదులు, తరంగాలు, రామాయణ కృతులు పాడారు. చిన్నతనంలో నేదునూరి గ్రామంలో పెరిగేరు. విద్వాన్ అప్పారావు వద్ద వర్ణాలు నేర్చుకున్నారు. అష్టపదులు, తరంగాలు కల్లూరి వేణుగోపాల రావు గారి వద్ద నేర్చుకున్నారు. ఓ సారి వేణుగోపాలరావు గారి ఇంటికి విజయనగరం తహసిల్దారు విచ్చేసినప్పుడు నేదునూరి హత్తుకొనే పాట విని ప్రసన్నులైయ్యారు. అప్పల నరసింహం పుణ్యమా అని విజయనగరం మహారాజా కాలేజీలో చేరడం జరిగింది. ఉండేందుకు ఉచిత బస ఏర్పరచారు, భోజన వసతి కల్పించారు. ఇంక నేదునూరివారు వెనుదిరిగి చూడలేదు.
ఈయన అనేక అన్నమయ్య కృతులకు బాణీలు కట్టాడు. "నానాటి బ్రతుకు నాటకము" కీర్తనకు నేదునూరి కట్టిన బాణీని ప్రశంసిస్తూ ఎం. ఎస్. సుబ్బలక్ష్మి "నేదునూరి గారూ, ఆ ఒక్కపాటకు బాణీని కట్టినందుకు మీకు సంగీతకళానిధి ఇవ్వచ్చండి" అని మెచ్చుకున్నది. 1991 లో సంగీత కళానిధి పురస్కారం ఈయనకు ఇచ్చినప్పుడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ ఈయన పేరును ప్రతిపాదించగా, సుబ్బలక్ష్మి ఆ ప్రతిపాదనకు ద్వితీయం చేసింది.[1] 2013 లో కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు.
సంగీత లోకంలో ప్రముఖ స్థానం సంపాయించుకున్నారు. సంగీత అకాడమీలో యాబై యేళ్ళకు పైగా పాడారు. తన సుదీర్ఘ సంగీత యాత్రలో అనేక సంగీత కోవిదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ద్వారం వెంకట స్వామి నాయుడు దగ్గరనుంచి, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, లాల్గుడి జయరామన్, ఎం ఎస్ సుబ్బులక్ష్మి, పేరి శ్రీరామమూర్తి (వయొలిన్), వెంకటరమణ (మృదంగం), నేమాని సోమయాజులు (ఘటం) ఇత్యాదులు నేదునూరి ప్రతిభను కొనియాడేవారు. నేదునూరి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు పొందారు.
విభిన్న పదవులు
నేదునూరి విజయవాడ జీ వీ ఆర్ ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాల, ప్రధాన అధ్యాపకుడిగా, సికింద్రాబాద్, విజయనగరం, తిరుపతి సంగీత కళాశాలలో పనిచేసారు. వేంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో ఆర్ట్స్ విభాగం డీన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్గా, ఆల్ ఇండియా రేడియో, సంగీత విభాగ ఆడిషన్ బోర్డ్ సభ్యుడిగా పనిచేసారు. 1985లో ప్రభుత్వ కొలువు నుంచి రిటైర్ అయ్యి పింఛను తీసుకుంటున్నారు. కొంతకాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యుడిగా ఉన్నారు.
సంగీత సౌరభం
సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు, నేదునూరి ప్రతిభకు ముగ్దులై, "గాత్ర సంగీతం లోనే ఉండకూడదూ ? మంచి గళం ఉంది" అన్నారు. నాయుడు గారి బంధువు, ప్రముఖ వయొలనిస్ట్ ద్వారం నరసింగరావు కూడా ఈ మాటనే సమర్ధించారు. ఐతే నేదునూరికి వయొలిన్ మీద మక్కువ ఉంది. ఆయన ఓ ఉపాయం చేసారు - క్లాసులో నేదునూరి చేత పాడించి ఆయనే వయొలిన్ వాయించారు. గాత్ర సంగీతం మీద ధ్యాస ఉంచేట్టు ప్రోత్సహించారు. ఐదేళ్ళు గడిచే సరికి నేదునూరి ప్రతిభ ద్విగుణం, బహుళం అయ్యింది.[2]
ఒకసారి కాకినాడలోని సరస్వతీ గాన సభలో జనం మాలి గారి వేణు గానం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. రైలు బండి ఆలస్యమయ్యింది. మాలి వచ్చేదాక నేదునూరి చేత పాడించకూడదూ అని జనంలో ఎవరో సూచించారట. సమయానికి మంచిగా స్పందించాడు యువ గాత్ర సంగీతకారుడు. జన రంజక సంగీతాన్ని అందించి అలరించారు నేదునూరి.
స్వభావ రీత్యా నేదునూరి బహు సౌమ్యులు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి ఈయనకు గురువు, ఆప్త మిత్రుడు, సోదరప్రేమ, వాత్సల్యం కలిగిన వాడూను. శ్రీపాద పినాకపాణి వద్ద 1949లో గమకాలు నేర్చుకున్నారు. సంగీత విద్యకు మరింత సాన పట్టారు. హృదయాలని స్పందించే సంగీతాన్ని సాధన చేయడంతో నేదునూరి ప్రతిభ పరిణితి చెందింది. విద్వత్తు రాణించ సాగింది.
ఆయన స్వర పరచిన కీర్తనలు
నేదునూరి కృష్ణమూర్తి స్వర పరచిన కీర్తనలలో - దాశరథి శతకం పద్యాలు, రాగ సుధా రసాలతో భద్రాచల రామదాస కీర్తనలు ప్రసిధ్ధమైనవి. రెండు సీడీలు వెలువరించారు. అన్నమాచార్య సంకీర్తనలు, పదకదంబం మీద పలు సీ డీలు, కేసెట్లు వెలువరించారు. ఆల్ ఇండియా రేడియో భక్తి రంజనిలో కూర్చిన నారాయణ తీర్థ తరంగాలు, రామదాస కీర్తనలు బగా వాసికెక్కాయి.
వీరి శిష్యగణం
నేదునూరి ప్రముఖ శిష్యులలో కళాప్రపూర్ణ చిట్టి అబ్బాయి, శ్రీమతి కోక సత్యవతి, శ్రీమతి కె. సరస్వతి వుధ్యార్తి, జి. బాలకృష్ణ ప్రసాద్, శ్రీమతి శోభారాజు, మల్లాది సోదరులు (శివరామ ప్రసాద్, రవి కుమార్) ఉన్నారు.
మరణం
నేదునూరి 2014 డిసెంబరు 8న, అనారోగ్యంతో బాధపడుతూ 87 సంవత్సరాల వయసులో విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు.[3]
అందుకున్న అవార్డులు, గౌరవ పురస్కారాలు
పలు అవార్డులు, గౌరవ పురస్కరాలు అందుకున్నారు నేదునూరి గారు.
- టీ టీ డీ - ఆస్థాన విద్వాన్గా నియమితులైయ్యారు. అన్నమాచార్య కృతులని కూర్చి సంగీత లోకానికి అందించారు.
- మద్రాసు సంగీత అకాడమి నుండి సంగీత కళానిధి గౌరవం అందుకున్నారు.
- శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం (2002)[4]
- నేషనల్ ఎమినెన్స్ అవార్డు (2006)
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి కళానీరాజనం పురస్కారం (1995) అందుకున్నారు.
మూలాలు
- ↑ Revisiting the saint - The Hindu ఆగష్టు 22, 2008
- ↑ "The Hindu : Music is in his genes". web.archive.org. 2010-04-25. Retrieved 2020-12-09.
- ↑ http://www.teluguone.com/news/content/musician-nedunuri-krishnamurthy-death-39-40935.html
- ↑ "The Hindu : Rewarding eminence". web.archive.org. 2005-05-09. Retrieved 2020-12-09.
- some music samples from musicindiaonline. com
- Senior musicians honour Nedunuri Krishnamurthy, The Hindu, October 30, 2006
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).