పడాల బాలకోటయ్య

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Padala Balakotaiah.jpg
డా. పడాల బాలకోటయ్య ముఖచిత్రం

డా. పడాల బాలకోటయ్య (జూలై 1, 1937 - ఆగష్టు 19, 2015) ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత, రమ్య కళారంజని (నల్లగొండ) వ్యవస్థాపకులు, వైద్యులు.

జననం

ఈయన 1937, జూలై 1నెల్లూరు జిల్లా, కోవూరులో జన్మించారు. బాల్యమంతా కోవూరులోనే గడిచింది.

నాటకరంగ ప్రస్థానం

ఒకరోజు కోవూరులో వేస్తున్న నాటకం చూడడానికి వెళ్లిన బాలకోటయ్యకు కథానాయక చెలికత్తెగా అందులో నటించే అవకాశం వచ్చింది. అలా అమ్మాయి వేషంలో తొలిసారిగా రంగస్థలంపై అడుగు పెట్టిన ఈయన ఆ తరువాత నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు.

హీరోయిన్ గా సుశీల నాటకం వేసి ఆకట్టుకున్నారు. గుడిపాటి వెంకట చలం రాసిన త్యాగం నాటకంలో వనకుమారి అనే వేశ్య పాత్ర బాలకోటయ్యకి మంచి పేరు తెచ్చిపెట్టింది. వైకుంఠ భవనంలో సుజాతగా, వరవిక్రయం (నాటకం)లో కమలగా, కళకోసంలో రాధగా, చస్తేనేం నాటికలో సరస్వతిగా, ఆనాడులో రాణీ సంయుక్తగా, నాలుగు రైళ్లో విద్యాధరిగా, రామాంజనేయ యుద్ధంలో శాంతిమతిగా ఇలా ఎన్నో స్త్రీ పాత్రలను పోషించారు.

కేవలం స్త్రీ పాత్రలే పరిమితం కాకుండా పురుష పాత్రలు కూడా చేశారు. మూగజీవులు, రాగరాగిణి, విజయపురి వికాసం, పునర్జన్మ, పల్లెపడుచు, మురారి వంటి నాటకాలను పలు వేదికలపై ప్రదర్శించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

అనేక పరిషత్తులకు ప్రాథమిక పరిశీలకులుగా వ్యవహరించారు. గుణనిర్ణేతగా గుర్తింపు పొందారు. 78 ఏళ్ల వయసులో కూడా ఇంటి దగ్గర వైద్య సేవలు అందిస్తూ, నాటక పోటీలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి నాటకాలను చూసేవారు.

పురస్కారాలు

  1. కళాతపస్వి
  2. కళాభూషన్
  3. కళాసారథి
  4. ప్రతిభా పురస్కారం
  5. అభిజ్క్ష అవార్డు
  6. విశిష్ట కళా సేవ పురస్కారం
  7. ఉగాది పురస్కారం

మరణం

గుండెపోటు కారణంగా 2015, ఆగష్టు 19నల్గొండలో కన్నుమాశారు.

మూలాలు