"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పల్నాటి సీమలో కోలాటం

From tewiki
Jump to navigation Jump to search

పల్నాడు ప్రాంతంలో విలసిల్లిన కోలాట కళ గురించి బిట్టు వెంకటేశ్వరరావు రచించిన సిద్ధాంత గ్రంథమిది. రచయిత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ సాధించే క్రమంలో ఈ పరిశోధన చేసి అనంతరం సిద్ధాంత గ్రంథాన్ని వెలువరించారు

రచన నేపథ్యం

బిట్టు వెంకటేశ్వరరావు రచించిన.ఈ సిద్ధాంత గ్రంథానికి 1981కి గాను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉత్తమ పీహెచ్‌డీ పరిశోధనకు నిర్ణీతమైన తూమాటి దొణప్ప బంగారు పతకాన్ని అందుకున్నారు. పీహెచ్‌డీ పొందాక ఆచార్య వెంకటేశ్వరరావు 1988లో గ్రంథాన్ని ప్రచురించారు.[1]

ముఖ్య విషయం

తెలుగు నాట ప్రాచుర్యం పొందిన కోలాట కళను గురించీ, మరీ ముఖ్యంగా పలనాటి సీమలో ప్రదర్శితమయ్యే కోలాట నృత్య రీతుల గురించి ఈ పరిశోధన గ్రంథంలో పొందుపరిచారు. ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళా రూపాలతో పాటు ఈ కోలాట నృత్యం కూడా తెలుగు జానపదుల జీవితాలతొ పెన వేసుకుకు పోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం.కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దు పోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తి భావంతో దేవుని స్తంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీధుల్లోనూ ప్రదర్శిస్తారు. కోలాటం ఒక రకమైన సాంప్రదాయక సామూహిక ఆట. కోల, ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు అబ్దుల్ రజాక్ అనే చరిత్రకారుడు వర్ణించాడు. విజయనగర శిథిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. గ్రామదేవతలైన ఊరడమ్మ, గడి మైశమ్మ, గంగాదేవి, కట్టమైసమ్మ, పోతలింగమ్మ, పోలేరమ్మ దనుకొండ గంగమ్మ, మొదలగు గ్రామ దేవతల జాతర సందర్భంగా కోలాటం ఆడుతారు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. పల్నాటి సీమలో కోలాటం:బిట్టు వెంకటేశ్వరరావు:1988