పసునూరు శ్రీధర్ బాబు

From tewiki
Jump to navigation Jump to search
పసునూరు శ్రీధర్ బాబు
200px
జననంపసునూరు శ్రీధర్ బాబు
1969 , జూలై 21
మోత్కూరు, యాదాద్రి భువనగిరి జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిపాత్రికేయుడు
ఉద్యోగంబిబిసి వరల్డ్ సర్వీస్
మతంహిందువు
తండ్రిపసునూరు శ్రీరాములు
తల్లినర్మదాదేవి
వెబ్‌సైటు
www.anekavachanam.wordpress.com

పసునూరు శ్రీధర్ బాబు ఆధునిక తెలుగు కవి[1], పాత్రికేయుడు. ఆయన తొలి కవితా సంకలనం అనేక వచనం 2001లో విడుదలైంది. సాహితీ ప్రియుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ కవితా సంపుటికి అవార్డులు లభించాయి. 1987 నుంచి వివిధ పత్రికల్లో కవిత్వాన్ని ప్రచురించిన శ్రీధర్ బాబు వృత్తిరీత్యా పాత్రికేయుడు.

బాల్యం-విద్యాభ్యాసం

పసునూరు శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరులో 1969, జూలై 21 న జన్మించాడు. తండ్రి పసునూరు శ్రీరాములు, తల్లి నర్మదాదేవి. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు, అధ్యాపకులు, ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించారు. తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీధర్ బాబు నల్లగొండ జిల్లాలోని ఉత్తటూరు, మోత్కూరు గ్రామాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్ లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదివాడు. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నాడు. ఆ తరువాత వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (M.C.J) పూర్తి చేశాడు.

వ్యక్తిగత జీవితం

హైదరాబాద్కు చెందిన స్వర్ణలతను 2001 మే 27న పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు అక్షర్ దిగ్విజయ్, అమ్మాయి పేరు హొయన. అక్షర్ 2006 సెప్టెంబరు 21న, హొయన 2010 జనవరి 20న జన్మించాడు.

పసునూరు శ్రీధర్ బాబు.. హెచ్‌ ఎమ్‌ టివి కార్యాలయంలో వికీపీడియాకు సహకరిద్దాం కార్యక్రమం తరువాత

వృత్తి జీవితం

న్యాయశాస్త్ర పట్టభద్రుడైన తరువాత 1992లో కొన్ని రోజుల పాటు హై కోర్టులో ప్రాక్టీసు చేసినా, అందులో తాను ఇమడలేనని భావించి తన ప్రవృత్తినే వృత్తిగా మార్చుకునేందుకు 1993 లో హైదరాబాద్ లోని ఆంధ్రభూమి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాడు. రెండేళ్ళు ఆంధ్రభూమిలో పనిచేసిన తరువాత ఇండియా టుడే తెలుగు పత్రికలో సబ్ ఎడిటర్ గా ఎంపికయ్యాడు. 1995 ప్రారంభం నుంచి 2008 నవంబరు వరకు పద్నాలుగేళ్ళు ఇండియా టుడేకు ఎన్నో విశిష్ట కథనాలు అందించి, కవిగానే కాకుండా పాత్రికేయునిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

2008 నవంబరు చివరి వారంలో ఆ ఏడాది కొత్తగా ప్రారంభమైన 24 గంటల వార్తా చానల్ హెచ్.ఎం.టి.వి లో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరాడు. ఆ తరువాత 2011 ఆగస్టు నెలలో V6 న్యూస్ ఛానెల్ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేసి, చానల్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. 2012 సెప్టెంబరులో V6 న్యూస్ నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ హెచ్.ఎం.టి.విలో చేరాడు.[2]

హెచ్.ఎం.టి.విలో ప్రోగ్రెస్ డిబేట్ వంటి స్ఫూర్తిదాయక చర్చలను నిర్వహించాడు. 2013 డిసెంబరులో హెచ్.ఎం.టి.వి నుంచి వైదొలగాడు. ఆ తరువాత దాదాపు ఏడాది పాటు ETV తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ చానల్ల్లో ప్రైమ్ టైమ్ షో "ప్రతిధ్వని" కార్యక్రమాన్ని, ఇతర లైవ్ షోస్ ను ప్రజెంట్ చేశాడు. అదే సమయంలో హైదరాబాద్ లోని పుడమి పబ్లికేషన్స్ నుంచి విద్యార్థులు, యువతరానికి రాజకీయ, సామాజిక, శాస్త్రీయ అంశాల మీద సులువుగా అవగాహన కల్పించే లక్ష్యంతో "Young Zone" అనే మాసపత్రికను ప్రారంభించాడు.

యంగ్ జోన్ మాస పత్రికకు మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేసిన తరువాత, 2015 మే నెలలో మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలోకి అడుగుపెట్టాడు.ప్రజల చానల్ గా గుర్తింపు తెచ్చుకున్న 10టీవీకి అసోసియేట్ ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించాడు.[3]

అనంతరం 10టీవీ నుండి 2017, జూన్ లో వైదొలిగి న్యూఢిల్లీలోని బిబిసి న్యూస్ ఛానల్ లో సీనియర్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా చేరాడు. ప్రతిరోజు రాత్రి 10.30కు ఈటీవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛానలో ప్రసారమవుతున్న బిబిసి తెలుగు న్యూస్ బులిటెన్ కు సారథ్యం వహిస్తున్నాడు.

అనేకవచనం

పసునూరు శ్రీధర్ బాబు రచించిన కవితల సంకలనం "అనేకవచనం" 2001లో విడుదలైంది. ఆధునిక వచన కవిత్వంలో కొత్త గాలిలా వీచిన ఈ కవితా సంకలనానికి ప్రముఖ కవి ఇస్మాయిల్ పూర్వవచనం పేరుతో ముందుమాట రాశారు. మరో ప్రముఖ కవి సిద్ధార్థ చివరిమాట రాశాడు. ఈ సంకలనానికి ఆ ఏడాది వచ్చిన ఉత్తమ కవితాసంకలనంగా అజంతా అవార్డు, రమణ-సుమనశ్రీ ఫౌండేషన్, సిరిసిల్ల సాహితీ మిత్రుల పురస్కారాలు లభించాయి. అనేక వచనం కవితా సంపుటి తరువాత రాసిన కవితలన్నీ పుస్తక రూపంలో ఇంకా రాలేదు. ఆయన అజంతా అవార్డు, రంగినేని స్మారక ట్రస్టు పురస్కారరం, సుమనశ్రీ ఉత్తమ కవితా సంపుటి అవార్డులు వచ్చాయి.

మూలాలు

  1. సారంగ బుక్స్. "పసునూరు శ్రీధర్ బాబు". www.saarangabooks.com. Retrieved 30 November 2017.
  2. ఏపి మీడియా కబుర్లు. "V 6 కు పసునూరి శ్రీధర్ బాబు గుడ్ బై..." apmediakaburlu.blogspot.in/. Archived from the original on 21 మార్చి 2015. Retrieved 30 November 2017.
  3. ఏపి మీడియా కబుర్లు. "10 టీవీ లో చేరబోతున్న పసునూరి శ్రీధర్ బాబు!". apmediakaburlu.blogspot.in. Archived from the original on 3 మే 2015. Retrieved 30 November 2017.

యితర లింకులు