పాండురంగయ్య

From tewiki
Jump to navigation Jump to search
పాండురంగయ్య
జననం1938
మరణం1993
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు

పాండురంగయ్య (1938 - 1993) ప్రముఖ రంగస్థల నటుడు. గానకళా విశారద, సంగీత సరస్వతి, రాయలసీమ నటరత్న బిరుదాంకితుడు.[1]

జననం - విద్యాభ్యాసం

పాండురంగయ్య 1938 లో మాధవస్వామి, అలివేలు మంగమాంబ దంపతులకు కర్నూలు జిల్లా పెదపాడులో జన్మించాడు. చిన్నవయసులోనే తండ్రి చనిపోవడంతో పాండురంగయ్య తన మేనమామైన వెంకటకవి దగ్గర పెరిగాడు. వెంకటకవి అష్టావధాని, పండితుడు. ఈయన దగ్గరే తెలుగు, సంస్కృతం భాషలు నేర్చుకున్న పాండురంగయ్య తొమ్మిదోతరగతి వరకు చదువుకున్నాడు.

నాటకరంగ ప్రస్థానం

చిన్నతనంలోనే సంగీతం, నటనలో శిక్షణ పొందిన పాండురంగయ్య నాటకరంగంపై ఇష్టంతో 1953లో మిత్రులతో కలసి మొట్టమొదటిసారిగా బోయి భీమన్న రాసిన కూలిరాజు నాటకంలో పరంజ్యోతి అనే స్త్రీపాత్రను ధరించి నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. 1970లో లలిత కళాపరిషత్తు (అనంతపురం) నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో నూటపదిమంది నటులు శ్రీకృష్ణ పాత్రను ప్రదర్శించగా, ఆ పోటీలో పాల్గొన్న పాండురంగయ్యకు ఉత్తమ నటుడు అవారు లభించింది. కర్నూలు జిల్లా రంగస్థల పితామహుడు కల్లూరు శేషయ్య శిష్యుడైన పాండురంగయ్య హెచ్. చంద్రం, ఆర్. మీరాహుసేన్, జి. రంగనాథం, మాస్టారు హనుమంతులను కళాకారులుగా తీర్చిదిద్దాడు.

నటించిన నాటకాలు

  1. కూలిరాజు (పరంజ్యోతి)
  2. కురుక్షేత్రం
  3. గయోపాఖ్యానం
  4. శ్రీ కృష్ణ తులాభారం (శ్రీకృష్ణుడు)
  5. రామాంజనేయ యుద్ధం (రాముడు)
  6. సత్య హరిశ్చంద్ర (హరిశ్చంద్రుడు)
  7. చింతామణి (బిల్వమంగళుడు, భవానీ శంకరుడు)

మరణం

నాలుగు దశాబ్ధాలపాటు నాటకరంగానికి సేవలందించిన పాండురంగయ్య 1993 లో మరణించాడు.

మూలాలు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.401.