"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పామర్తి సుబ్బారావు
పామర్తి సుబ్బారావు | |
---|---|
దస్త్రం:Pamarthi Subbarao.jpg | |
జననం | సెప్టెంబర్ 8, 1922 గుడివాడ |
మరణం | జనవరి 28, 2004 |
జాతీయత | భారతీయుడు |
జాతి | తెలుగు |
వృత్తి | రంగస్థల నటుడు, దర్శకుడు, క్రీడాకారుడు |
తల్లిదండ్రులు | శ్రీరాములు, మాణిక్యాంబ |
పామర్తి సుబ్బారావు (సెప్టెంబర్ 8, 1922 - జనవరి 28, 2004) ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, క్రీడాకారుడు.[1]
జననం
సుబ్బారావు 1922, సెప్టెంబర్ 8న శ్రీరాములు, మాణిక్యాంబ దంపతులకు గుడివాడలో జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
చిన్నప్పటి నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తివున్న సుబ్బారావు, తన సహచరులైన సూరపనేని ప్రభాకరరావు, హెచ్.వి. చలపతిరావు, దాసరి తిలకం, పువ్వుల అనసూయ మొదలైన వారితో కలిసి నాటకాలు వేయడం ప్రారంభించాడు. తన బృందంతో 'తెలుగుతల్లి' నాటకాన్ని విస్తృతంగా ప్రదర్శించాడు. 1939లో తెలుగుతల్లి నాటకాన్ని విజయవాడలో ప్రదర్శించినప్పడు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి ముగ్ధులై పామర్తికి 'హాస్యరత్న' బిరుదు ప్రదానం చేసి ఆశీర్వదించాడు. ‘పల్లెపడుచు'లో గంగులు పాత్ర 'సుల్తానీ'లో పరమానందం, 'ఎవరు దొంగ'లో దొంగ వంటి పాత్రలే పోషించాడు.
బొబ్బిలియుద్ధం, సత్యహరిశ్చంద్రీయం, మహాకవి కాళిదాసు, చంద్రగుప్త, రంగూన్ రౌడీ మొదలైన పద్య నాటకాలను ప్రదర్శించాడు. శ్రీ ప్రభాకర నాట్యమండలి సంస్థ పేర అనేక ప్రదర్శనలు ఙచ్చాడు. పినిశెట్టి శ్రీరామమూర్తి రచించిన 'పల్లెపడుచు' నాటకంలో గంగులు పాత్ర అద్భుతంగా పోషించాడు. 1951లో తెనాలిలో జరిగిన పోటీలలో ఆత్రేయ రచించిన ఎవరు దొంగ నాటికను ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనకు, నటనకు బహుమతులందుకున్నాడు. ప్రముఖ కళాకారులైన కైకాల సత్యనారాయణ, పుష్పకుమారి, రేడియో ఏకాంబరం, జాలాది రాజారావు, జి.వి. ప్రసాదరావు, నిర్మలమ్మ, హేమలత, అమ్ముల పార్వతి మొదలైనవారు పామర్తి శిక్షణలో నటనను నేర్చుకున్నారు. పామర్తి దర్శకత్వం వహించిన ఆరు స్త్రీ పాత్రలున్న 'చావకూడదు' నాటిక ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలో ఉత్తమ నటి, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతులను అందుకుంది.
వేలూరి శివరామ శాస్త్రి రచించిన రేడియో నాటికను ప్రదర్శనకు అనుగుణంగా రాసి, అందులో పరమానందం పాత్రలో నటించాడు. 1961లో నాటక కళాపరిషత్తులో 'సుల్తానీ' నాటికను మనోజ్ఞంగా ప్రదర్శించడం, దానికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకత్వం బహుమతులు గెలుచుకోవడం జరిగింది. సుల్తానీ పామర్తి నట జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది.
సన్మానాలు – పురస్కారాలు
- 1991లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంల 'గౌరవ పురస్కారం'
- 1993లో అక్కినేని కళాపీఠం పురస్కారం
- 1994లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు పురస్కారం
- 1997లో అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం
- 1997లో కళాజగతి రంగస్థల పురస్కారం
- 1999లో శ్రీకళానికేతన్ (హైదరాబాద్) జూలూరి వీరేశలింగం కల్చరల్ అవార్డు
గుర్తింపులు
గుడివాడలో సుబ్బారావు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించండమేకాకుండా, పామర్తి నివసించిన వీధికి 'పామర్తి సుబ్బారావుగారి వీధి' అని నామకరణం చేశారు.
మరణం
సుబ్బారావు 2004, జనవరి 28న మరణించాడు.
మూలాలు
- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.658.
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).