"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు

From tewiki
Jump to navigation Jump to search

పెమ్మసాని నందస్వామిదురై కొండలస్వామి నాయుడు బ్రిటిష్ వారి కాలములో తమిళదేశములోని కురివికులము జమీందారు. 1878లో జన్మించాడు[1]. .

వంశము

పెమ్మసాని వంశము నాయకులు దక్షిణభారతదేశమందు, ముఖ్యముగా విజయనగర సామ్రాజ్య కాలములో గండికోట పాలకులుగా, ప్రశస్తమగు సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని బెల్లంకొండకు చెంద ముసునూర్ల గోత్రీకులు. 1370వ సంవత్సరములో ఓరుగల్లు పతనమైన పిమ్మట వీరు విజయనగరమునకు తరలిపోయి ఆ తరువాత మూడు శతాబ్దములు దక్షిణభారతదేశమును, హిందూమతమును రక్షించుటకు పాటుపడిరి.

పూర్వీకులు

నాయుని పూర్వీకులు విజయనగర రాజ్యములో గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు. తళ్ళికోట యుద్ధము తరువాత పెమ్మసాని వారి ప్రాభవము తగ్గినది. అయిననూ రాజ్యావశేషములను కాపాడుతూ పెనుకొండ అరవీటి రాజులకు యుద్ధములలో తోడ్పడుతూ తెలుగు వారి మానాభిమానాలు కాపాడారు. వీరిలో పెద వీరప్ప నాయుడు మధురనేలుతున్న విశ్వనాథ నాయకుడు వద్ద చేరతాడు. విశ్వనాథుడు పెద వీరప్పను చాలా గౌరవముతో ఆదరించాడు. కురువి కులము జాగీరు వ్రాసి ఇచ్చాడు. అచట అప్పటికే పాతుకుపోయివున్న కురువి తలైవన్ అనునతడు పెదవీరప్పను దరికి రానీయలేదు. జరిగిన ఘర్షణలో తలైవన్ మరణిస్తాడు. విశ్వనాథుడు నెలకొల్పిన 72 మన్నారీయ పలయపట్టులలో కురువి కులము మొదటిది. రెండవది ఇలయరసనందాల్.

పెద్దవీరప్పకేరళదేశ దండయాత్రను విజయవంతముగా చేసి విశ్వనాథుని మన్ననలు పొందుతాడు. మధుర ముస్లిముల పాలనలోకి వచ్చినపుడు కురివికులము జమీందారీగా మార్చబడింది. తరువాత వచ్చిన బ్రిటిష్ వారు కురువికులమును కట్టుగుత్తగై జమీందారీగా గుర్తించారు. బ్రిటిష్ వారి సమయములో తిమ్మనందాయస్వామి నాయుడు జమీందారు.

తిమ్మనందాయస్వామి దైవచింతనాపరుడై 19సంవత్సరముల వయసుగల కొడుకు కొండలరాయస్వామికి జమీందారీ భారము అప్పగించాడు. తిరునెల్వేలి హిందూ కళాశాలలో చదివిన కొండలరాయస్వామి తాలూకా, జిల్లా బోర్డులలో సభ్యునిగా ప్రశంసాయుతమైన పాత్ర నిర్వహించాడు. ప్రజాభ్యుదయమునకు పాటుబడ్డాడు. కురువి కులము పట్టణం యూనియన్ గా ఏర్పడినప్పుడు నాయుడు అధ్యక్షునిగా చేయబడ్డాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత సందర్శన సందర్భముగా ఒక పాఠశాల కేవలము పేదవారికై ప్రారంభించాడు. సంస్కృతము, తెలుగు, తమిళము, ఆంగ్లము భాషలలో మంచి ప్రావీణ్యముగలదు. ఒక ఆదర్శ జమీందారుగా అందరిచే పరిగణింపబడ్డాడు.

మూలాలు

  1. The Aristocracy of Southern India, A. Vadivelu, Vest publication, Madras, 1903; p. 168