బ్యాచిలర్ ఆఫ్ రూరల్ హెల్త్ కేర్

From tewiki
Jump to navigation Jump to search

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను అధిగమించడానికి భారత కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న మూడేళ్ల వైద్య డిగ్రీ కోర్సే బ్యాచిలర్ ఆఫ్ రూరల్ హెల్త్ కేర్. ఈ మూడేళ్ల వైద్య డిగ్రీ కోర్సును 2015కి అమల్లోకి తెచ్చేందుకు భారత కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, అసోం రాష్ట్రాల్లో మూడేళ్ల వైద్య డిగ్రీ కోర్సు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగంగా వైద్యుల కొరతను అధిగమించడానికి మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ కోర్సు ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి అధికారులను ఆదేశించారు.

వైద్య విద్య బోధనలో ఆధునిక విధానాలకు ప్రాధాన్యమిచ్చే పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సహకారంతో ఈ కోర్సుకు సంబంధించిన పాఠ్యాంశాలను నాలుగు సంవత్సరాల కిందటే రూపొందించారు. ఈ కోర్సు చేసిన వారిని వైద్యచికిత్సలు చేయడానికి అనుమతిస్తే అత్యంత విలువైన విద్యగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ కి విలువ తగ్గుతుందని భారత వైద్య మండలి వ్యతిరేకించడంతో ఈ కోర్సు అప్పట్లో అమలుకు నోచుకోలేదు.

అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య పరిజ్ఞానం అంతగా లేనివారి చికిత్సల కారణంగా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకం పెరుగుతుండటంతో ప్రజావసరాల మేరకు వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని అందుకు పరిష్కారంగా మూడేళ్ల వైద్య డిగ్రీ కోర్సైన బ్యాచిలర్ ఆఫ్ రూరల్ హెల్త్ కేర్ ని తెరపైకి తెచ్చి భారత వైద్య మండలి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు.

ముసాయిదా మార్గదర్శకాలు

  • ఇంటర్మీడియట్ పూర్తి చేసి గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ హామీ ఇచ్చిన వారికి ప్రవేశ పరీక్ష ద్వారా ఈ మూడేళ్ల వైద్య కోర్చులో ప్రవేశాలు కల్పిస్తారు.
  • వైద్య కళాశాలల్లో ఉద్యోగ విరమణ చేసిన నిపుణులను ఈ కోర్సుకు అధ్యాపకులుగా నియమిస్తారు.
  • ఈ కోర్సులో ప్రధానంగా మలేరియా, డెంగీ, విషజ్వరాలు, అతిసారం, క్షయ, రక్తహీనత సమస్యల చికిత్సలపై శిక్షణ ఇస్తారు.
  • పాఠ్యాంశాలు: ఈ కోర్సులో కమ్యూనిటీ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, బేసిక్ సర్జరీ, బేసిక్ ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఆప్తాల్మజీ, ఈఎన్‌టీ, దంతవైద్యం, రేడియో డయాగ్నొస్టిక్స్ అంశాలను బోధిస్తారు.

ఇవి కూడా చూడండి

బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ

మూలాలు

  • ఈనాడు దినపత్రిక - 27-10-2014 - (వైద్యంలో మూడేళ్ల డిగ్రీ కోర్సు)