"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బేతాళ కథలు

From tewiki
(Redirected from భేతాళకథలు)
Jump to navigation Jump to search

బేతాళ పంచవింశతి బేతాళుడు చెప్పే 25 కథల సమాహారం. భేతాళుడిని శ్మశానాలలో తిరుగాడే మానవాతీత శక్తులుగల ఒక భూతంగా భావిస్తారు. శాంతిశీలుడనే బిక్షువు కోరిక మేరకు త్రివిక్రమసేనుడనే రాజు అర్ధరాత్రి శ్మశానంలో శవాన్ని మోసుకొని వస్తున్నప్పుడు, ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు రాజుకు చెప్పిన కథలివి. ప్రాకృత భాషా కవి గుణాడ్యునిచే (క్రీ. పూ. 1 వ శతాబ్దం) పైశాచి భాషలో రాయబడిన బృహత్కథలోని కొన్ని కథలే తరువాతి కాలంలో బేతాళ పంచవింశతి కథలుగా ప్రసిద్ధి పొందాయి. భారతీయుల కథాకౌశలానికి అద్దంపట్టిన ఈ ప్రాచీన కథలు విశ్వవిఖ్యాతమై ప్రపంచంలోని పలు భాషలలో అనువదించబడ్డాయి.

కథా మూలాలు

బేతాళ పంచవింశతి కథల మూలాలు అత్యంత ప్రాచీనమైనవి. క్రీ. పూ. 1 వ శతాబ్దానికి చెందిన ఈ కథలు తొలిసారిగా శాతవాహనుల యుగానికి చెందిన గుణాడ్యుని బృహత్కథలో ఒక భాగంగా చోటుచేసుకొన్నాయి. మొట్టమొదట పైశాచి భాష (ప్రాకృత భాషా భేదం) లో రాయబడిన ఈ కథలు తరువాతి కాలంలో సంస్కృత భాషలోనికి అనువదించబడ్డాయి. అయితే పైశాచి భాషలోని బృహత్కథ మూలగ్రంధం అలభ్యం కావడంతో సంస్కృత భాషలో అనువదించబడిన కథలే మిగిలాయి.

పైశాచి భాషలో వున్న బృహత్కథను సంస్కృతంలోకి పద్యరూపంలో బుద్ధస్వామి, క్షేమేంద్రుడు, సోమదేవసూరిలు అనువదించారు. అయితే బుద్ధస్వామి (క్రీ.శ. 5 వ శతాబ్దం) ‘బృహత్కతా శ్లోక సంగ్రహం’లో ఈ బేతాళ కథలు లేవు. క్షేమేంద్రుడు (క్రీ.శ. 11 వ శతాబ్దం) ‘బృహత్కథామంజరి’, సోమదేవసూరి (క్రీ.శ. 11 వ శతాబ్దం) ‘కథాసరిత్సాగరం’ లలోనే ఈ బేతాళ కథలు చోటుచేసుకొన్నాయి. కాలక్రమేణా బేతాళ పంచవింశతి పేరుమీదుగా కథాగ్రంధ రూపంలో వెలువడినప్పటికీ బేతాళ పంచవింశతి సంస్కృత మూల గ్రంథం మాత్రం లభించలేదు. అప్పటివరకూ పద్య రూపంలోనే వున్న బేతాళ పంచవింశతి కథలను తొలిసారిగా శివదాసు (క్రీ.శ. 11-14 వ శతాబ్దం) చంపూ మార్గంలో (పద్య గద్య మయం) సంస్కృతంలో రాసాడు. తరువాత జంభలదత్తు (క్రీ.శ. 11-14 వ శతాబ్దం) ఈ కథలను గద్యరూపంలో రాసాడు.

కథా నేపధ్యం

బేతాళుడు కలలో కనపడి చెప్పిన ప్రకారం తన కాబోయే భార్య ‘శశాంకవతి’ కోసం వెతుకుతూ, మృగాంకదత్తుడనే రాకుమారుడు తన ప్రాణమిత్రులతో కలసి ఉజ్జయినీకి బయలుదేరతాడు. అయితే ఈ మిత్రులు అనుకోకుండా ఆపదలో చిక్కుకొని విడిపోయి చెల్లాచెదురవుతారు. కొంతకాలానికి ఒకరి తరువాత ఒకరుగా తిరిగివచ్చి తమ తమ విచిత్ర అనుభవాలను రాకుమారుడు మృగాంకదత్తునితో పంచుకొంటారు. అలా వేరుపడిన విక్రమకేసరి అనే స్నేహితుడు ఒక బ్రాహ్మణుని ద్వారా బేతాళ మంత్రాన్ని, బేతాళుని ప్రసన్నం చేసుకొని ఐశ్వర్యాన్ని పొందిన 'త్రివిక్రమసేనుడనే రాజు' వృత్తాంతాన్ని తెలుసుకొంటాడు. తిరిగివచ్చి తన రాకుమారుని కలుసుకొన్న విక్రమకేసరి ఆ కథను మృగాంకదత్తునికి చెపుతాడు.

త్రివిక్రమసేనుని కథ

బేతాళుడుని శ్మశానాలలో తిరుగాడే మానవాతీత శక్తులుగల ఒక పిశాచ గణాధిపతి (Vampire) గా భావిస్తారు. శాంతిశీలుడు అనే తాంత్రిక బిక్షువు భేతాళుని సిద్ధింపచేసుకొని తద్వారా భూలోకానికి ఆపై విద్యాధరులకు కూడా మహా చక్రవర్తి కావాలని ప్రగాఢంగా వాంచిస్తాడు. ముందుగా భేతాళుని వశం చేసుకోవడానికి కావలిసిన మహాసాహసిగా ప్రతిష్ఠాన రాజ్యానికి రాజైన త్రివిక్రమసేనుని గుర్తిస్తాడు. తన కార్యం సఫలం చేసుకొనే వ్యూహంలో భాగంగా ఆ బిక్షువు ప్రతీ దినం రాజాస్థానానికి వచ్చి రాజుకు ఒక ఫలం కానుకగా అర్పించి వెళ్లిపోతుంటాడు. రాజు స్వీకరించిన అనంతరం ఆ ఫలం కోశాగారంలో పదిలపరచబడుతుంది. ఈ విధంగా పది సంవత్సరాలు గడిచేసరికి ఒకరోజు ఫలం నుంచి అనూహ్యంగా అమూల్యమైన రత్నం బయటపడుతుంది. దాంతో రాజు అప్పటివరకూ తాను స్వీకరించిన ఫలాల గురించి విచారిస్తే వాటిని నిలువ చేసిన కోశాగారంలో వాటి స్థానంలో రత్నాల రాశి పోగుపడినట్లు గుర్తిస్తాడు. మరుసటిరోజు యధాప్రకారం బిక్షువు కానుకగా ఫలాన్ని ఇవ్వబోగా రాజు అతనిని అటువంటి అమూల్య ఫలం తనకు అర్పించడానికి గల కారణం వివరిస్తేనే కాని ఫలాన్ని స్వీకరించనని చెపుతాడు. అంతట ఆ బిక్షువు ఒక మంత్రం సిద్ధి కోసం తనకొక వీరుని సాయమవసరమని, త్రివిక్రమసేనుని వంటి మహావీరుని నుండి తానా సాయం ఆశిస్తున్నానని తెలియచేస్తాడు. అతని విశ్వాసానికి ప్రసన్నుడైన రాజు అందుకు సాయపడతానని వాగ్దానం చేస్తాడు. దానిలో భాగంగా బిక్షువు రాబోయే అమావాస్యకు ముందు రాత్రి రాజును శ్మశానానికి వచ్చి తనను కలవమంటాడు.

ఆ విధంగా అర్ధరాత్రి శ్మశానానికి వచ్చిన రాజును, ఆ బిక్షువు శ్మశానంలో చెట్టుకు వేలాడుతున్న ఒక పురుష శవాన్ని తనకు అప్పగించమని కోరుతాడు. ఈ ప్రయత్నంలో శవాన్ని తెచ్చేంతవరకూ మౌనం పాటించమని రాజుకు సూచిస్తాడు. ఆ ప్రకారం త్రివిక్రమసేనుడు అర్ధరాత్రి శ్మశానంలో చెట్టుకు వ్రేలాడుతున్న శవాన్ని దించి భుజం మీద మోసుకొని మౌనంగా వస్తుండగా, ఆ శవాన్ని ఆవహించిన బేతాళుడు కాలయాపన చేసే నిమిత్తం రాజుకు ఒక కథను చెప్పి, ఆ కథ చివరలో ఒక చిక్కు ప్రశ్నను వేసి దానికి సరైన జవాబు తెలిసీ చెప్పకపోతే తల పగిలి చస్తావని హెచ్చరిస్తాడు. రాజు సరైన సమాధానం చెప్పడంతో మౌనభంగం జరిగినందున బేతాళుడు శవం లోనించి అదృశ్యమైపోతాడు. దాంతో రాజు బేతాళుని పట్టితేవడం కోసం మళ్ళీ మరుసటి అర్ధరాత్రి ప్రయత్నిస్తాడు.

ఈ విధంగా ప్రతీసారి రాజు బేతాళుని పట్టుకోవడానికి ప్రయత్నించడం, బేతాళుడు చిక్కుముడులతో వున్న కథలను వరుసగా 24 రాత్రుళ్ళు చెప్పడం, ప్రతి కథ చివరలో ప్రశ్నను వేయడం, ఆ రాజు వాటికి సరైన సమాధానం ఇవ్వడం, బేతాళుడు అదృశ్యం కావడం, రాజు మళ్ళీ పట్టు విడవకుండా బేతాళుని కోసం ప్రయత్నించడం జరుగుతుంది. చివరకు 24 వ కథలోని చిక్కుప్రశ్నకు రాజు సమాధానం చెప్పలేకపోవడం జరుగుతుంది. చిట్టచివరి 25 వ కథలో త్రివిక్రమసేనుడు బేతాళుని వలన ఆ కపట తాంత్రిక సిద్దుని కుటిల పన్నాగాన్ని తెలుసుకొనడం, దానిని యుక్తితో ఛేదించి బేతాళుని సిద్ధింపచేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

కథలు

బేతాళ పంచవింశతిలో బేతాళుడు త్రివిక్రమసేనుడనే రాజుకు ప్రతీ అర్ధరాత్రి ఒక కథ చొప్పున వరుసగా ఈ క్రింది 24 కథలు చెపుతాడు.

1 వ భేతాళ కథ: మర్మ సందేశాలు: తెలివైన పద్మావతి పంపిన గూఢ సైగలను, మర్మ సందేశాలను మంత్రి పుత్రుడు తన బుద్ధికుశలతతో పరిష్కరించి యుక్తితో ఆమెను తన రాకుమారుడిని కలిపిన కథ.

2 వ భేతాళ కథ: ముగ్గురు బ్రాహ్మణ యువకులు: పునర్జీవితురాలైన మందారవతిని పెళ్ళాడగోరిన ముగ్గురు ప్రేమికుల యొక్క అర్హతలకు సంబంధించిన కథ.

3 వ భేతాళ కథ: రాజు - రెండు జ్ఞాన పక్షుల కథ: స్త్రీ, పురుషులలో పాపాత్ములెవరనే విషయంపై చిలుకా-గోరింక పక్షుల మధ్య సంవాద రూపంలో నడిచిన కథ.

4 వ భేతాళ కథ: వీరవరుని సాహస కృత్యాలు: రాజు ప్రాణాలు రక్షించడం కోసం వీరవరుడనే బృత్యుని కుటుంబం మొత్తం ఒకరి తరువాత ఒకరుగా ప్రాణ త్యాగాలు చేయడం గురించిన కథ.

5 వ భేతాళ కథ: సోమప్రభ – ముగ్గురు ప్రేమికులు: తమ ఉమ్మడి ప్రయత్నం కారణంగా రక్షించబడిన సోమప్రభ అనే యువతిని వివాహమాడటానికి, తమ కున్న వ్యక్తిగత అర్హతలపై ముగ్గురు ప్రేమికుల (జ్ఞాని, విజ్ఞాని, శూరుడు) మధ్య చెలరేగిన వివాదం గురించిన కథ.

6 వ భేతాళ కథ: తరుణి - తారుమారైన తలలు: విధివశాత్తూ తల, మొండేలు తారుమారుగా అతికించబడి, పునర్జీవులైన భర్త, సోదరులలో తిరిగి ఎవరిని భర్తగా, ఎవరిని సోదరునిగా స్వీకరించాలో తెలియక అయోమయంలో పడిన ఒక యువతికి ఎదురైన ధర్మసంకటం గురించిన కథ.

7 వ భేతాళ కథ: రాజాశ్రితుడు – సముద్రగర్భ నగరం: స్వామిభక్తి పరాయణుడైన సత్యశీలుడు రాజానుగ్రహంతో తను కోరుకున్న దివ్య నగర రాకుమారిని పెళ్ళి చేసుకోవడం గురించిన కథ.

8 వ భేతాళ కథ: ముగ్గురు సున్నిత నేర్పరులు: భోజన, స్త్రీ, తూలిక విషయాలకు సంబంధించి ఒకరిని మించిన ఒకరైన ముగ్గురు సున్నిత నేర్పురుల కథ.

9 వ భేతాళ కథ: అనంగరతి – నలుగురు ప్రేమికులు: రాకుమారి అనంగరతిని వివాహమాడకోరిన శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణులైన నలుగురు విశిష్ట యువకుల కథ.

10 వ భేతాళ కథ: మదనసేన అనాలోచిత వాగ్థానం: తన పెళ్ళికి పూర్వం ఒకానొక సంకటస్థితిలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే ప్రయత్నంలో సత్యసంధురాలైన మదనసేన అనే వివాహిత భర్త అనుమతితో ఇల్లు దాటడం, తమ చేతికి చిక్కిన ఆమెను కాముకుడు, దొంగ విడిచిపెట్టడం, నిష్కళంకమైన ఆమెను భర్త తిరిగి ఆదరించడం గురించిన కథ.

11 వ భేతాళ కథ: అతి సుకుమారులైన ముగ్గురు భార్యలు: కలువ తాకిడికే శరీరం కందిపోయిన, శశి కిరణం సోకినంతనే శరీరం కాలిన, దంపుడు మోతను విన్నంతనే చేతికి బొబ్బలెక్కిన ముగ్గురు అతి సుకుమారులైన రాణుల కథ.

12 వ భేతాళ కథ: యశఃకేతు మహారాజు – అతని భార్య: సుఖలాలసుడైన యశఃకేతు మహారాజుకు ఒక దివ్యస్త్రీ దక్కడంతో, అప్పటివరకూ రాజ్యభారం మోస్తూ వస్తున్న మంత్రి హఠత్తుగా దుర్మరణం పాలైన కథ.

13 వ భేతాళ కథ: హరిస్వామి- అతని దురదృష్టం: దురదృష్టం వెన్నాడుతున్న హరిస్వామి, ఒకానొక అన్నదానంలో పాయసం స్వీకరించి, ఆపై డేగ-పాముల కారణంగా ఆ పాయసం విషతుల్యం కావడంతో అది తెలియక భుజించి దుర్మరణం పాలైన కథ.

14 వ భేతాళ కథ: వణిజుని కుమార్తె – దొంగ: వధ్యశిల ఎక్కబోతున్న ఒక దొంగను వరించి, అతనితో సహగమనానికి సిద్ధపడిన వర్తక శ్రేష్టుని కుమార్తె కథ.

15 వ భేతాళ కథ: మంత్ర గుళిక: తన గురువు ఇచ్చిన ఒక మంత్ర గుళిక సాయంతో ‘మూలదేవుడు’ రాకుమారి శశిప్రభను రహస్యంగా వివాహం చేసుకోవడం, తిరిగి అదే కపటంతో మంత్రి భార్యను సైతం లేవదీసుకొని ఉడాయించడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకొన్న గురువు ఆ శశిప్రభను తన మిత్రుడైన శశికిచ్చి తిరిగి వివాహం జరిపిస్తాడు. ఈ విధంగా మంత్ర గుళికల వలన ఇరువురితో వివాహమైన ఒక రాకుమారి కథ.

16 వ భేతాళ కథ: జీమూతవాహనుని త్యాగం: బోధిసత్వుని అంశతో పుట్టి పరోపకారియైన జీమూతవాహనుడు, శంఖచూడుడనే నాగుని కోసం తన దేహాన్ని గరుత్మంతునికి ఆహారంగా అర్పించుకొన్న కథ.

17 వ భేతాళ కథ: సుందరి ఉన్మాదిని: తన సేనాపతి భార్య యొక్క అపురూప సౌందర్యాన్ని వీక్షించిన రాజు ఆమెపై మోహం పెంచుకొని మనోవేదన పడతాడు. విషయం అవగతమైన సేనాపతి రాజుకు అర్పించుకోవడంకోసం తన అర్ధాంగిని సైతం వదులుకోవడానికి సిద్ధపడతాడు. అయినప్పటికి రాజు అటు ధర్మం తప్పలేక, ఇటు మోహాన్ని వదులుకోలేక కృశించి మరణిస్తాడు.

18 వ భేతాళ కథ: విప్రకుమారుడు – మంత్రవిద్య: ఒక గురువు తన శిష్యుడైన విప్రకుమారునికి అభీష్టవరదాయినీ మంత్రవిద్యను నేర్పే సాధనాక్రమంలో అనూహ్యంగా గురుశిష్యులిరువురూ ఆ మంత్రవిద్యను పోగొట్టుకోవడం గురించిన కథ.

19 వ భేతాళ కథ: దొంగ కుమారుడు: క్షేత్రజుడు, అత్రిముడు అయిన చంద్రప్రభుడనే రాజుకు తన తండ్రికి చేసిన పిండప్రధానంలో ఎదురైన ధర్మసంకటం గురించిన కథ.

20 వ భేతాళ కథ: బాలుని బలిదానం: ఒకవైపు కాసులకోసం తల్లిదండ్రులు, మరోవైపు తన స్వప్రాణ రక్షణ కోసం రాజు – ఇలా అందరూ కలసి ఒక దైవోపహతుడైన ఏడేళ్ళ బాలుని నరబలి ఇవ్వడానికి సిద్దపడిన కథ.

21 వ భేతాళ కథ: ముగ్గురు ప్రేమ మూఢులు: తన సన్నిధిలో మోహాతిరేకంతో ప్రాణం విడిచిన అనంగమంజరిని చూసి తట్టుకోలేని ప్రియుడు మరణించడం, ఆపై వీరురివురినీ చూసి శోకంతో భర్త కూడా మరణించిన కథ.

22 వ భేతాళ కథ: నలుగురు సోదరులు – సింహం: తాము సముపార్జించిన విద్యల ద్వారా తమకు దొరికిన ఒక సింహపు ఆస్థిపంజరానికి వరుసగా మాంసం, చర్మం, అవయవాలు, ప్రాణ ప్రతిష్ఠ చేసి, చివరకు ఆ సింహానికే బలై పోయిన నలుగురు సోదరుల కథ.

23 వ భేతాళ కథ: ఏడ్చి, నృత్యం చేసిన యోగి: చనిపోయిన బాలుని దేహంలో పరకాయప్రవేశం చేయడానికి ముందు విచిత్రంగా ప్రవర్తించిన ఒక ముసలి యోగి కథ.

24 వ భేతాళ కథ: తికమక సంబంధాలు: అనాథలైన కూతురు, తల్లులకు విధివశాత్తు ఓ తండ్రి, కొడుకు భర్తలు కావడం. ఈ రెండు జంటల సంతతి మధ్య నెలకొన్న సంక్లిష్ట వావి వరుసల గురించిన కథ.

25 వ భేతాళ కథ: ముగింపు: చిట్ట చివరి 25 వ కథ చిక్కు ప్రశ్నతో కూడి వుండదు. ఈ ముగింపు కథలో కుటిల పన్నాగాన్ని యుక్తితో ఛేదించడం, ఫలితంగా రాజుకు బేతాళుని అనుగ్రహం సిద్దించడం జరుగుతుంది.

ముగింపు కథ: భేతాళుడు త్రివిక్రమసేనునికి కపట బిక్షువు రాజునే బలి ఇచ్చే కుటిల పన్నాగంతో వున్నాడని తెలియచేసి దానికి తరుణోపాయం చెప్పి అదృశ్యమవుతాడు. బిక్షువు క్షుద్రుడే అని గ్రహించిన రాజు శవాన్ని తీసుకొని భిక్షువు శాంతిశీలుని వద్దకు వస్తాడు. అతని రాక కోసమే ఎదురుచూస్తున్న బిక్షువు భేతాళుని శవంలో ఆవాహన చేసి, ఆ శవానికి పూజలు పూర్తి చేసి రాజును సాష్టాంగ ప్రణామం చేయమని కోరతాడు. బదులుగా రాజు ప్రణామం చేసే విధం తనకు తెలీదని, అది చేసి చూపమని కోరతాడు. ఎలా చేయాలో చూపడానికి ఆ బిక్షువు నేలమీద సాక్షాంగ పడగానే రాజు కత్తి దూసి ఆ కపట తాంత్రికుని శిరస్సును ఛేదిస్తాడు. ఈ విధంగా త్రివిక్రమసేనుడు రాబోయే ముప్పును తప్పించుకోవడమే కాక ఆ తాంత్రికుని బలితోనే భేతాళుని అర్చిస్తాడు. ప్రసన్నుడైన భేతాళుడు త్రివిక్రమసేనుడు భవిష్యత్తులో భూమండలానికే గాక విద్యాదర లోకాలకు చక్రవర్తి కాగలడని దీవించడమే కాకుండా, త్రివిక్రమసేనుని అభీష్టం మేరకు ఈ మొత్తం 25 కథలు 'భేతాళ పంచవింశతి' పేరుతొ విశ్వ విఖ్యాతమవుతాయని, ఈ భేతాళ పంచవింశతి ప్రసంగ, శ్రవణాలు జరిగేచోట యక్ష, భేతాళ, పిశాచ, రాక్షసులు ప్రవేశించలేరు అని వరమిచ్చి అదృశ్యమవుతాడు. తరువాత శివుడు ప్రత్యక్షమై అపరాజితమనే దివ్య ఖడ్గాన్ని రాజుకు ప్రసాదించి త్వరలో విద్యాధరులకు అధిరాజువు కాగలవని ఆశీర్వదిస్తాడు.

కథాశైలి – చిత్రణ

చిత్ర విచిత్రమైన ఘటనలతో, సాహసాద్భుతాలతో పాఠకులలో కుతూహలాన్ని రేకెత్తించే ఈ కథలలో శృంగార, అధ్బుత రసాలు పోషించబడ్డాయి. బేతాళ పంచవింశతి కథలు కథా కథన సంవిధానంలో ప్రత్యేకతను కలిగివున్నాయి. కథలో కథను చేర్చడం, కథను పాత్రల ముఖంగా చెప్పించడమే కాక ప్రతీ కథను ఒక చిక్కుప్రశ్నతో ముడిపెట్టడం, ఆ చిక్కుముడిని విడదీయడానికి ఎంతో వివేచన, తర్కశక్తి అవసరం కావడం మొదలైనవి ఈ కథల విశిష్టత అని చెప్పవచ్చు.

ఈ కథలపై బౌద్ధ, శైవ, జైన మతాల ప్రభావం అందులోను తాంత్రిక ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. 16 వ భేతాళ కథ (జీమూతవాహనుని త్యాగం) బౌద్ధ జాతక కథను స్పురింపచేస్తుంది. పేర్లు నిర్ణయించబడని ఈ ప్రపంచ ప్రసిద్ధ కథలలో నీతి, త్యాగ, తర్క, ధర్మ, కామ సంబందమైన అంశాలు చక్కగా చిత్రించబడ్డాయి. వీటిలో కొన్ని కథలు నీతి బోదకమైనవి. ఉదాహరణకు 'నలుగురు సోదరులు – సింహం' కథ. అలాగే 'జీమూతవాహనుని త్యాగం', 'వీరవరుని సాహస కృత్యాలు' వంటి కథలలో త్యాగ సంబందమైన అంశాలు చిత్రించబడ్డాయి. 'అతి సుకుమారులైన ముగ్గురు భార్యలు', 'సోమప్రభ – ముగ్గురు ప్రేమికులు' వంటి కథలు తార్కిక అంశాలతో ముడిపడినవి. అదేవిధంగా ధర్మ సంబందమైన అంశాల చిత్రణలు కూడా ఈ బేతాళ కథలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు 'హరిస్వామి- అతని దురదృష్టం', 'ముగ్గురు బ్రాహ్మణ యువకులు', 'దొంగ కుమారుడు'. కామ సంబందమైన అంశాలు 'ముగ్గురు ప్రేమ మూఢులు' వంటి కథలలో ఎక్కువగా వర్ణించబడ్డాయి.

కథల ప్రాచుర్యం

ప్రాచీన భారతీయ కథా కౌశలానికి నిదర్శనంగా నిలిచిన ఈ కథలు కాలక్రమంలో ఖండంతరాలను దాటి విస్తరించాయి. వివిధ భాషల్లో ఆయా స్థానిక సంస్కృతుల రూపంలోనికి సంతరించుకొన్నాయి. భారతీయ భాషలతో పాటుగా టిబెట్, చైనీస్, మంగోలియన్ మొదలగు ప్రాక్ భాషలలోనే కాక, ఇంగ్లీష్, జర్మన్, ఇటాలియన్ వంటి పాశ్చాత్య భాషలలోనికి అనువదించబడ్డాయి. ఉదాహరణకు 'నలుగురు సోదరులు-సింహం' వంటి నీతి కథలు 'పంచతంత్రం' లోనేకాక, స్థానిక మార్పు చేర్పులతో ప్రపంచ నీతి బోధక సాహిత్యంలో ఆవశ్యకమైన కథగా చోటు చేసుకొన్నాయి.

భేతాళ పంచవింశతి – పాఠాంతరాలు, సంకలనాలు, అనువాదాలు

భేతాళ పంచవింశతి – అనుకరణలు

భేతాళ పంచవింశతి కథలను అనుకరిస్తూ అనేక కథలు చెప్పబడ్డాయి. అటువంటివాటిలో చందమామ పత్రికలో బేతాళ కథలు శీర్షికన ప్రచురించబడిన కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. చందమామ పిల్లల మాస పత్రికలో గుణాడ్యుని బేతాళ కథలను అనుకరిస్తూ దానిలోని మూల కథలను విభిన్నసామాజిక, కాల పరిస్థితులకనుగుణంగా నేర్పుగా మార్చి బేతాళ కథలుగా 600 పైగా తెలుగు కథలను ధారావాహికంగా ప్రచురించారు. కథాకథన పద్ధతి గుణాడ్యుని బేతాళ కథలలో వలనే వున్నప్పటికీ ఈ కథలు తెలుగులో కొత్తగా అనుసృజించబడ్డాయని చెప్పవచ్చు.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లంకెలు