"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం
మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం | |
---|---|
పబ్బతి ఆంజనేయస్వామి పబ్బతి ఆంజనేయస్వామి | |
ప్రదేశము | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నాగర్‌కర్నూల్ జిల్లా |
ప్రదేశం: | మద్దిమడుగు |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | ఆంజనేయుడు |
మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, పదర మండలంలోని మద్దిమడుగు గ్రామంలో ఉన్న ఆలయం. పబ్బతి అంటే గిరిజనుల భాషలో ప్రసన్న, శాంతమూర్తి అని అర్థం. అమ్రాబాద్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో, ఇప్పలపల్లి నుండి 09 కిలోమీటర్ల దూరంలో నల్లమల లోతట్టు, అటవీ ప్రాంతంలో స్వామివారు స్వయంగా వెలసినట్లు ప్రతీతి. చైత్ర శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.[1] ఈ ప్రాంతం హైదరాబాదుకు 186, మహబూబ్‌నగర్‌కు 147, అచ్చంపేటకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది
Contents
స్థల పురాణం - విశిష్టత
పూర్వం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బట్టలుతుక్కుంటూ వుండేవారట. వారు బట్టలు పిండి పక్కనేవున్న బండమీద వేసేవారుట. అలా వేసినప్పుడల్లా వేసినవారికి కాళ్ళు నెప్పులూ వగైరాలతో బాధపడేవారట. ఏమటాఅని ఒకసారి ఆ రాతిని పరిశీలనగా చూస్తే స్వామి ఆకారం కనబడిందట. వెంటనే తమ తప్పు తెలుసుకుని, ఆ విగ్రహాన్ని నిలబెట్టి, దీపారాధన చేసి వారికి తోచిన పూజలు చేసి, అక్కడ దొరికిన సామాగ్రితో నాలుగు గోడలు, పైన కప్పు వేశారట. సరిగా లేకపోవటంవల్ల ఆ గోడలు, కప్పూ కూలినా, స్వామి విగ్రహానికి ఏమీ కాలేదుట. ఇంకొక కథనం ప్రకారం, స్వామి స్వయంభూ. చెట్టు తొఱ్ఱలోంచి ఉద్భవించారు. నైఋతి దిక్కుగా, కొంచెం వంగినట్లు వుండే స్వామి విగ్రహాన్ని నిటారుగా నిలబెట్టాలని ఎంత ప్రయత్నంచేసినా కుదరలేదు. ఇప్పటికీ విగ్రహం కొంచెం ఒరిగినట్లే వుంటుంది. ఈ స్వామి గురించి అందరికీ తెలిసింది శ్రీ మానిసింగ్ బావూజీ వల్ల. ఈ ఆలయంలో ఆ బావూజీ ఫోటో కూడా వుంది. ఆ బావూజీనే ఆలయం వెలుపల ధుని ఏర్పాటు చేశాడు. ఆ ధుని అలాగే 365 రోజులూ వెలుగుతూనే వుంటుందట. అది స్వామి మహత్యం అని చెబుతారు. ఇక్కడ వుండే లంబాడీవారికీ, చెంచులకీ ఈ స్వామి మీద అపరిమితమైన భక్తి. [2]
పూజలు
చైత్ర శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా హనుమద్గాయత్రి యజ్ఞం చేస్తారు. శని, మంగళవారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బెల్లం, గోధుమ రొట్టెలతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులు స్వామివారికి నైవేధ్యంగా సమర్పిస్తుంటారు.[3]
దీక్ష
1992లో గురుస్వామి జయరాం ఆధ్వర్యంతో 15మంది భక్తులతో మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి దీక్ష ప్రారంభమైంది.[1] చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా ప్రజలకు ఇక్కడకు వచ్చి కార్తీక మాసంలో ఈ దీక్ష స్వీకరిస్తారు. మాలలు ధరించి ఈ దీక్షను చేపట్టిన స్వాములు 41రోజులు నియమనిబంధనలతో ప్రతి రోజు తెల్లవారుజామున, సాయంత్రం చన్నీటి స్నానం చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చేపట్టి, దీక్షా కాలం మద్దిమడుగులో జరిగే మహాయజ్ఞంలో పాల్గొంటారు.[4]
మూలాలు
- ↑ 1.0 1.1 వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, నాగర్ కనర్నూల్, 21 అక్టోబర్ 2017, 6వ పేజి. "నల్లమల్ల కిరీటం మద్దిమడుగు ఆంజనేయుడు". web.archive.org. Retrieved 12 November 2017.
- ↑ తెలుగువన్.కాం, Bhakti Content, Punya Kshetralu. "శ్రీ పబ్బతి వీరాంజనేయస్వామి, మద్దిమడుగు". www.teluguone.com. పి.యస్.యమ్. లక్ష్మి. Retrieved 12 November 2017.
- ↑ ప్రకృతి రమణీయ దృశ్యం... నల్లమల - సూర్య October 30, 2012
- ↑ సర్వరోగ నివారిణి హనుమాన్ దీక్ష - - ఆంధ్రప్రభ 8 Nov 2010