మధ్వాచార్యులు

From tewiki
Jump to navigation Jump to search
మధ్వాచార్యులు
Shri Madhvacharya.jpg
జననంవాసుదేవ
1238 CE
ఉడిపి, (ప్రస్తుతం కర్ణాటక) -భారత దేశ
నిర్యాణము1317 CE (అదృశ్యమైన రోజు)
ఉడిపి, (ప్రస్తుతం కర్ణాటక) -భారత దేశ
బిరుదులు/గౌరవాలుపూర్ణప్రజ్ఞ, వైష్ణవ మత గురువు, ఆనందతీర్థ, జగద్గురు
గురువుఅచ్యుతప్రజ్ఞ
తత్వంద్వైతం
సాహిత్య రచనలుసర్వమూలగ్రంథాలు

మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంత స్థాపకులుగా సుపరిచితులు. మధ్వాచార్యులు స్థాపించినదే మధ్వమతం. వీరి అనుయాయులను మాధ్వులు అంటారు. వీరికి పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, అని కూడా కలవు. వీరు హిందూమతాన్ని ఉద్ధరించిన ఆచార్యత్రయంలో(శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య)ఒకరు. వాయుదేవునికి గల అవతరత్రయంలో (హనుమంతుడు, భీమసేనుడు, మధ్వాచార్యులు) మూడవ అవతారం మధ్వాచార్యులది. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త మధ్వాచార్యులు. మధ్వాచార్యుల జీవిత కాలానికి సంబంధించి భిన్న అభిప్రాయాలూ కలవు. క్రీ.శ. 1199–1278 మధ్య కాలంలో జీవించారని కొన్ని మూలలో ఉంటె మరి కొన్నిటిలో క్రీ.శ. 1238–1317 మధ్య కాలంలో జీవించారని ఉన్నది.

పుట్టుక / బాల్యము

మద్వాచార్యులు ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో విజయదశమి రోజున జన్మించారు. ఈ ప్రదేశం ప్రస్తుతము కర్ణాటక రాష్ట్రంలో కలదు. మధ్వాచార్యుని జీవిత కథను రచించినది నారాయణ పండితాచార్యులు. మధ్వాచార్యుల తల్లిదండ్రులు మధ్యగేహ భట్ట, వేదవతి. మధ్వాచార్యులకు వారి తల్లితండ్రులు పెట్టిన పేరు వాసుదేవ. బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. తల్లితండ్రులకు ఇష్టం లేక పోయినా వారిని ఒప్పించి వాసుదేవ సన్యాస దీక్ష స్వీకరించారు. మధ్వాచార్యులు సన్యాస దీక్ష స్వీకరించిన సందర్భంలో వారి గురువులు అచ్యుతప్రేక్షులు మధ్వాచార్యులకు పూర్ణప్రజ్ఞ తీర్థులు అని నామకరణం చేసారు. పూర్ణప్రజ్ఞుడికి గల విశేష మేధస్సుకు, ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుతప్రేక్షులు తన అనంతరం ఉత్తరాధికారిగా ప్రకటించి పూర్ణ ప్రజ్ఞుల్ని వేదాంత పీఠం అధిష్టింపచేసిన నాటి నుంచి మధ్వాచార్యులు ఆనందతీర్థులుగా పిలవబడినారు.

దక్షిణభారత యాత్ర

యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు దక్షిణ భారతదేశమంతా పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా అతను ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ అయన వేటికీ చలించలేదు. యాత్ర పూర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే భగవద్గీత పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.

రచనలు

తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు వ్రాసాడు. ఇంకా ఋగ్వేదంలోని మొదటి 40 సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాసాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు. ఇందులో ప్రముఖమైనవి

  1. గీతాభాష్యం
  2. గీతాతాత్పర్యం
  3. బ్రహ్మసూత్రభాష్యం
  4. అణువ్యాఖ్యానం
  5. న్యాయవివరణం
  6. అణుభాష్యం
  7. దేశోపనిషద్భాష్యం
  8. మహాభారతతాత్పర్యనిర్ణయం
  9. యమకభారతం
  10. దశప్రకరణం
  11. తంత్రసారం
  12. ద్వాదశస్తోత్రం
  13. కృష్ణార్ణవామృతం
  14. సదాచారస్మృతి
  15. జయంతినిర్ణయం
  16. ప్రణవకల్పం
  17. న్యాసపద్ధతి
  18. తిథినిర్ణయం
  19. కందుకస్తుతి

ద్వైత వాదం

జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.

భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. ముక్తి నాలుగు విధాలు:

  1. సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం
  2. సామీప్యం - భగవంతుని సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం
  3. సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం
  4. సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా అతను కంటే వేరుగా ఉంటూనే అతను ఆనందంలో పాలుపంచుకోవటం.

ద్వైతమత ప్రభావం

మధ్వాచార్యుడు ఆసేతుశీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు.దేశంలో వైష్ణవమత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు.

నిర్యాణం

మధ్వాచార్యుడు తన 79వ ఏట, క్రీ.శ.1317లో శిష్య సమేతంగా బదరినారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా ఉత్తర బదరిని చేరుకొని వ్యాసభగవానుని కైంకర్యాలాలో నిమగ్నమైపోయారు.

మూలాలు

  1. జ్ఞానజ్యోతి మధ్వాచార్య-శ్రీమతి గోపికా ప్రసాద్ - ఎమెస్కో ప్రచురణ
  2. https://en.wikipedia.org/wiki/Madhvacharya