"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మరాఠా సామ్రాజ్యం

From tewiki
Jump to navigation Jump to search
मराठा साम्राज्य
Maratha Samrajya
మరాఠా సమాఖ్య
సమాఖ్య
Fictional flag of the Mughal Empire.svg
1674 – 1820 British Raj Red Ensign.svg

Flag of మరాఠా సామ్రాజ్యం

Flag

Location of మరాఠా సామ్రాజ్యం
The Maratha Empire in 1760 in yellow.
రాజధాని Raigad, then later Pune
భాష(లు) Marathi
మతము Hinduism
Government Monarchy
Chattrapathi
 - 1674-1680 Shivaji
 - 1681-1689 Sambhaji
 - 1689–1700 Rajaram
 - 1700–1707 Tarabai
 - 1707–1749 Shahu
 - 1749–1777 Rajaram II
చరిత్ర
 - Established జూన్ 06
 - Ended సెప్తెంబర్r 21
Area
18,00,000 km² (6,94,984 sq mi)
Population
 - 1700 est. 15,00,00,000 
Currency Hon, Rupee, Paisa, Mohor

మరాఠా సామ్రాజ్యం (Marathi|मराठा साम्राज्य మరాఠా సామ్రాజ్య ; మహ్‌రాట్ట అని కూడా ప్రతిలిఖించవచ్చు) లేదా మరాఠా సమాఖ్య అనేది నేటి భారతదేశం యొక్క నైరుతి దిక్కున ఒకప్పుడు విలసిల్లిన ఒక మహా సామ్రాజ్యం. 1674 నుంచి 1818 వరకు ఉనికిలో ఉన్న ఈ సామ్రాజ్య శోభ ఉచ్ఛస్థితిలో కొనసాగిన సమయంలో 2.8 మిలియన్ km² పైగా భూభాగాన్ని తన వశం చేసుకోవడం ద్వారా దక్షిణాసియాలో అత్యంత ఎక్కువ భాగాన్ని ఆక్రమించిన సామ్రాజ్యంగా వర్థిల్లింది. శివాజీ భోంస్లే ద్వారా ఈ సామ్రాజ్య స్థాపన మరియు సుసంఘటితం జరిగింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణానంతరం మరాఠా సామ్రాజ్య ప్రధాన మంత్రులైన పేష్వాల పాలన కింద ఈ సామ్రాజ్యం మరింత గొప్పగా అభివృద్ధి చెందింది. 1761లో మరాఠా సైన్యం మూడవ పానిపట్టు యుద్ధంలో ఓడిపోవడం ఈ సామ్రాజ్య విస్తరణకు అడ్డుకట్టగా పరిణమించింది. అటుపై ఈ సామ్రాజ్యం మరాఠా రాష్ట్రాల సమాఖ్య రూపంలోకి విడిపోవడమే కాకుండా ఆంగ్లో-మరాఠా యుద్ధాల కారణంగా చివరకు 1818లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగమైపోయింది.

ఈ సామ్రాజ్య భూభాగంలో పెద్ద భాగం తీర ప్రాంతంగా ఉండడమే కాకుండా, కన్హోజీ అంగ్రే లాంటి వారి నిర్థేశకత్వంలో శక్తివంతమైన కమాండర్ల ద్వారా ఈ ప్రాంతం రక్షింపబడేది. విదేశీ నౌకాదళ నౌకలను ప్రత్యేకించి పోర్చుగీస్ మరియు బ్రిటిష్ వారి నౌకలను సముద్రం దాటి రానీయకుండా చూడడంలో వారు అత్యంత విజయం సాధించారు.[1] తీర ప్రాంతాల రక్షణ మరియు భూ-ఆధారిత దుర్గాలను నిర్మించడమన్నది మరాఠాల రక్షణ వ్యూహం మరియు ప్రాంతీయ సైనిక చరిత్రకు చాలా కీలకమైన అంశాలుగా పరిణమించాయి.


బిజాపూర్‌కు చెందిన అదిల్‌షా మరియు మొఘల్ రాజు ఔరంగజేబులతో జీవితకాలం పాటు గొరిల్లా యుద్ధం సాగించిన తర్వాత రాయ్‌గఢ్ రాజధానిగా 1674లో శివాజీ ది గ్రేట్ ఒక స్వతంత్ర మరాఠా (హిందూ) సామ్రాజ్యాన్ని స్ధాపించాడు. 1680లో శివాజీ మరణించే నాటికి అది ఒక పెద్ద సామ్రాజ్యంగా ఉన్నప్పటికీ, రక్షణ విషయంలో దుర్లభంగా మారిన ఆ సామ్రాజ్యం దాడికి అనువైనదిగా మారింది. 1681 నుంచి 1707 వరకు జరిగిన విజయవంతం కాని 27 సంవత్సరాల యుద్ధం కారణంగా మొఘలులు ఈ సామ్రాజ్యాన్ని ఆక్రమించ లెక పొయరు. శివాజీ మనుమడైన షాహు 1749 వరకు చక్రవర్తిగా పాలన సాగించాడు. షాహూ తన పరిపాలన కాలంలో, కొన్ని నిర్థిష్టమైన షరతులతో ప్రభుత్వాధిపతిగా మొదటిసారిగా పేష్వాను నియమించడం జరిగింది. షామరణం తర్వాత, శివాజీ వారసులు వారి ప్రధాన కేంద్రమైన సతారా నుంచి నామమాత్రపు పాలన సాగించినప్పటికీ, 1749 నుండి 1761 వరకు ఈ సామ్రాజ్య విషయంలో పేష్వాలే వాస్తవ నాయకులుగా మారారు. పేష్వాలకు మరియు వారి సర్దార్‌ల (సైనిక కమాండర్లు) కు మధ్య అంతర్గత సంబంధాలు క్షీణించనంత వరకు భారత ఉపఖండంలోని ఒక పెద్ద భూభాగాన్ని కలిగిన మరాఠా సామ్రాజ్యం, 18వ శతాబ్దం వరకు బ్రిటిష్ దళాలను సముద్రం దాటి రానీయకుండా నిరోధించగలిగింది, అయితే అటుతర్వాత వీరి మధ్య ఏర్పడిన గొడవల కారణంగా కమాండర్ల సంఖ్య క్రమంగా తగ్గిపోవడమన్నది సామ్రాజ్య పతనానికి దారితీసింది.

[] Error: {{Lang}}: no text (help)షాహు మరియు పేష్వా బాజీ రావ్‌ Iల సారథ్యంలో 18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యం కీర్తి ఉన్నత స్థితికి చేరింది. అయితే, 1761లో మూడవ పానిపట్టు యుద్ధంలో ఓడిపోవడంతో వాయువ్య దిశగా సామ్రాజ్య విస్తరణకు అడ్డుకట్ట పడడంతో పాటు పేష్వాల అధికారాన్ని తగ్గించి వేసింది. 1761లో పానిపట్టు యుద్ధంలో కోలుకోలేని దెబ్బ తగిలిన తర్వాత, పేష్వాలు రాజ్యంపై పట్టు కోల్పోవడం నెమ్మదిగా ప్రారంభమైంది. ఇదే అదనుగా షిండే, హోల్కర్, గైక్వాడ్, పంట్‌ప్రతినిథి, నాగ్‌పూర్‌కు చెందిన భోంస్లే, భోర్‌కు చెందిన పండిట్, పట్‌వర్ధన్, మరియు నెవల్కర్ లాంటి అనేకమంది మరాఠా సామ్రాజ్య సైనికాధిపతులు తమ అధికార పరిధికి తామే రాజులుగా మారాలనే తమ కోరికను నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, పానిపట్టు యుద్ధం ముగిసిన పదేళ్ల తర్వాత, మాథవ్‌రావ్ పేష్వా ఆధిపత్యం కింద ఉత్తర భారతదేశంలో మరాఠా అధికారం తిరిగి స్థాపించబడింది. మాథవ్‌రావ్ మరణం తర్వాత, 'పెంటర్చీ'లో కొలువైన రాజకీయ శక్తికి సంబంధించిన ఐదు మరాఠా రాజవంశాల కారణంగా మరాఠా సామ్రాజ్యం విడిపోవడానికి అనువుగా ఉన్న సమాఖ్యగా రూపుదాల్చింది. పూణే పేష్వాలు; మాల్వా మరియు గాల్వియర్‌లకు చెందిన సింథియాలు (వాస్తవంగా వీరిని "షిండేలు" అంటారు) ; ఇండోర్‌కు చెందిన హోల్కర్‌లు; నాగ్‌పూర్‌కు చెందిన భోంస్లేలు; మరియు బరోడాకు చెందిన గైక్వాడ్‌లు ఇందులో భాగంగా మారారు. మరోవైపు సింథియా మరియు హోల్కర్‌ల మధ్య చోటు చేసుకున్న పోరు 19వ శతాబ్దం ప్రారంభంలో సమాఖ్య సంబంధాను దెబ్బతీయడమే కాకుండా మూడుసార్లు జరిగిన ఆంగ్లో-మరాఠా యుద్ధాల్లో భాగంగా బ్రిటిష్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలతో వీరు తలపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో భాగంగా 1818లో చివరి పేష్వా అయిన బాజీ రావు IIను బ్రిటిష్ వారు ఓడించారు. 1947లో స్వతంత్ర భారతదేశం అవతరించే వరకు కొన్ని మరాఠా రాజ్యాలు స్వతంత్ర ప్రిన్సియలీ స్టేట్స్ రూపంలో కొనసాగినప్పటికీ, పేష్వాల అంతంతోటే ఒకప్పటి మరాఠా సామ్రాజ్యంలోని సింహభాగం బ్రిటిష్ ఇండియాలో భాగమైపోయింది.

ఛత్రపతి శివాజీ

శివాజీ పట్టాభిషేకము

మరాఠాలు దీర్ఘకాలం పాటు దక్కను పీఠభూమికి పశ్చిమ భాగంలోని పూణే చుట్టూ ఉన్న దేశ్ ప్రాంతంలో నివసించారు, ఈ ప్రాంతంలోని దక్కను పీఠభూమి పశ్చిమ కనుమల యొక్క తూర్పు వాలును తాకుతూ ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఉండే మొఘల్ పాలకులు తమ ప్రాంతంపై జరిపిన దండయాత్రలను మరాఠాలు సమర్థంగా నిరోధించారు. శివాజీ మహరాజ్ నాయకత్వంలో ఏకమైన మరాఠాలు ఆగ్నేయ ప్రాంతంలో బీజాపూర్‌ ముస్లిం సుల్తాన్ల నుంచి తమను తాము స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు, శివాజీ మహరాజ్ నాయకత్వం కారణంగానే వారు ఈ విషయంలో సాహసించగలిగారు, దీంతోపాటు మరింత శక్తివంతంగా మారిన వారు తరచుగా మొఘల్ భూభాగంపై దాడి చేయడమే కాకుండా, సూరత్‌లోని మొఘల్ కోటను 1664లోను మరియు 1670లోనూ దోచుకున్నారు. 1674లో తనను తాను రాజుగా ప్రకటించుకున్న శివాజీ, సొంతంగా బిరుదు(ఛత్రపతి)ను కూడా తీసుకున్నారు. 1680లో శివాజీ మహారాజా మృతి చెందేనాటికి మరాఠాలు తమ సామ్రాజ్యాన్ని మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వరకు సైతం విస్తరించారు. అయితే అటు తర్వాత వారు ఈ భూభాగాన్ని మొఘలులు మరియు బ్రిటిష్ వారికి కోల్పోయారు. భారతీయ చరిత్రకారుడు త్రయంబక్ శంకర్ షీజ్‌వాకర్ ప్రకారం, దక్షిణ భారతదేశంలో ముస్లిం దండయాత్రలను సమర్థంగా ఎదుర్కొన్న విజయనగర సామ్రాజ్యంను శివాజీ స్ఫూర్తిగా తీసుకున్నారు. ఒకప్పటి మైసూర్ రాజు కంఠీరవ నరసరాజ వడయార్ బీజాపూర్ సుల్తాన్‌కు వ్యతిరేకంగా సాధించిన విజయం సైతం శివాజీ విషయంలో స్ఫూర్తిని నింపింది.[2]. చారిత్రక గాథల ప్రకారం, దేవ్ (దైవం), దేశ్ (దేశం) మరియు ధర్మ (మతం) అనే దార్శనికత కలిగిన భారతదేశ మొట్టమొదటి రాజు శివాజీ మాత్రమే.

ఛత్రపతి శంభాజీ

ఛత్రపతి శివాజీకి శంభాజీ మరియు రాజారాం అని ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన శంభాజీ రాజభృత్యుల మధ్యలో చాలా ప్రముఖుడిగా చలామణీ అయ్యాడు. ఆయన ఒక గొప్ప యోధుడు, గొప్ప రాజకీయవేత్త మరియు చక్కటి కవిగా కూడా ప్రశంసలు అందుకున్నారు. 1681లో, శంభాజీ స్వయంగా రాజ్యానికి రాజుగా ప్రకటించుకోవడంతో పాటు సామ్రాజ్యాన్ని విస్తరించాలనే తండ్రి విధానాలను తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా శంభాజీ ఆ తర్వాత పోర్చుగీస్ మరియు మైసూర్ యొక్క చిక్క దేవ రాయలను ఓడించాడు. రాజపుత్రులు-మరాఠాల మధ్య, అలాగే దక్కను సుల్తానుల మధ్య ఉండే ఎలాంటి సంబంధాలనైనా నాశనం చేయడం కోసం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1682లో స్వయంగా దక్షిణాది పైన దండయాత్రకు సిద్ధమయ్యాడు. మరోవైపు పూర్తిస్థాయి అత్యున్నత న్యాయస్థానాలు, పరిపాలన, మరియు 400,000 మందితో కూడిన సైన్యం లాంటి అంశాలు శంభాజీ సొంతంగా నిలిచాయి. వీటి అండ కారణంగానే బీజాపూర్, మరియు గోల్కొండ సుల్తానులను ఎదిరించేందుకు ఆయన వ్యూహం పన్నారు. మొత్తం ఎనిమిది సంవత్సరాల పాటు మరాఠాలకు నాయకత్వం వహించిన శంభాజీ, ఆసమయంలో కనీసం ఒక్క యుద్ధంలో కూడా ఓడడం గానీ లేదా ఒక్క కోటనైనా సరే ఔరంగజేబుకు కోల్పోవడం గానీ జరగలేదు. ఔరంగజేబు దాదాపు తన ఉద్యమాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పటికీ, 1689 ప్రారంభంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. మొఘలు సైన్యంపై తుది యుద్ధాన్ని ప్రకటించే విషయమై ఒక వ్యూహాత్మక సమావేశం నిర్వహించడం కోసం శంభాజీ తన సైనిక దళాదిపతులను సంగమేశ్వర్ వద్దకు రమ్మని కబురు పంపాడు. ఈ విషయం తెలియడంతో అత్యంత శ్రద్ధతో రూపొందించిన ఒక ప్రణాళిక ప్రకారం, సంగమేశ్వర్‌లో శంభాజీ కొద్దిమందితో సమావేశమై ఉన్న సమయంలో గానోజీ షిర్క్ మరియు ఔహంగజేబు సైనిక దళాధిపతి ముకారబ్ ఖాన్‌లు వారిపై దాడి చేశారు. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటనతో దాడికి గురైన శంభాజీ చివరకు 1689 ఫిబ్రవరి 1న మొఘల్ దళాల చేతికి చిక్కాడు. ఆయన, ఆయన సలహాదారు కవి కలాష్‌లు బంధింపబడి బహదూర్‌గఢ్‌కు తరలించబడ్డారు.[3] ఈ నేపథ్యంలో మరణించడం కోసమై 1689 మార్చి 11న ఒకరినొకరు గాయపర్చుకోవడంతో శంభాజీ మరియు కవి కలాష్‌లు మృతి చెందారు.

రాజారాం మరియు తారాబాయ్

ఛత్రపతి శంభాజీ మృతితో ఆయన సోదరుడు రాజారాం సింహాసనాన్ని అధిష్టించాడు. అదేసమయంలో మొఘలులు రాయ్‌గఢ్ ముట్టడికి తెగించారు. దీంతో భద్రత కోసం మొదట విశాల్‌గఢ్ చేరిన రాజారాం అటుపై జింజి చేరుకున్నాడు. మొఘల్ భూభాగంపై మరాఠాలు దాడి చేయడం ప్రారంభమైన సమయం నుంచి మరాఠా సైనిక దళాధిపతులైన సంతజీ ఘోర్‌పేడ్, ధనాజీ జాదవ్‌ల ద్వారా అనేక కోటలు ఆక్రమించుకోబడ్డాయి. ఈ నేపథ్యంలో 1697లో సంధికి రమ్మంటూ రాజారాం వర్తమానం పంపినప్పటికీ, మొఘల్ చక్రవర్తి మాత్రం అందుకు అంగీకరించలేదు. మరోవైపు 1700లో సింహగఢ్ వద్ద రాజారాం మరణించాడు. దీంతో విధవరాలైన ఆయన భార్య తారాబాయ్ తన కుమారుడు రామరాజ (శివాజీ II) ) పేరు మీదుగా మరాఠా సామ్రాజ్య పాలన ప్రారంభించింది. మొఘలులకు వ్యతిరేకంగా వీరోచితమైన రీతిలో తారాబాయ్ మరాఠాలకు నాయకత్వం వహించింది; 1705లో మరాఠా సైన్యం నర్మద నదిని దాటి మొఘలుల వశంలో ఉన్న మాల్వాలో ప్రవేశించింది.

మాల్వా యుద్ధం మరాఠా సామ్రాజ్యానికి నిర్ణయాత్మక యుద్ధంగా పరిణమించింది. ఈ యుద్ధంతో మొఘలులు భారత ఉపఖండంపై పెద్ద స్థాయి పట్టును శాశ్వతంగా కోల్పోవడంతో పాటు ఆ తర్వాత వచ్చిన మొఘల్ చక్రవర్తులు నామమాత్రపు రాజులుగా మిగిలిపోయారు. బాగా దీర్ఘమైన మరియు భయంకరమైన యుద్ధం తర్వాత మరాఠాలు విజయాలు సాధించారు. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికులు మరియు దళాధిపతులు మరాఠా సామ్రాజ్యం యొక్క నిజమైన విస్తరణను సాధించారు. ఈ విధంగా వారు సాధించిన విజయం ఆ తర్వాతి కాలంలో పేష్వాల నాయకత్వంలో మరాఠా రాజ్యం సాధించిన మరిన్ని విజయాలకు పునాదిగా పరిణమించింది.

షాహు

1707లో ఔరంగజేబు మరణానంతరం, ఆ తర్వాత వచ్చిన మొఘల్ చక్రవర్తి అజమ్ షా, శంభాజీ కుమారుడు (మరియు శివాజీ మనవడు) షాహూజీని ఖైదు నుంచి విడుదల చేశాడు, ఇకనుంచి మొఘల్ చక్రవర్తికి నమ్మిన బంటుగా ఉండాలనే షరత్తు మీద షాహూజీని విడిచిపెట్టడం జరిగింది, మరోవైపు షాహూజీ నుంచి తమకు అవసరమైన మంచి ప్రవర్తనను సాధించే దిశగా అయన తల్లిని మాత్రం ఖైదులోనే కొనసాగించారు. దీనితర్వాత ఆయన తక్షణం తనను తాను మరాఠా సింహాసనానికి వారసుడిగా ప్రకటించుకోవడంతో పాటు తారాబాయ్ మరియు ఆమె కుమారులకు సవాలు విసిరాడు. దీంతో అప్పటివరకు మొఘల్-మరాఠాల మధ్య మాత్రమే పరిమితమైన పోరు తక్షణం త్రిముఖ పోరుగా పరిణమించింది. మరాఠా రాజ్యాధికారంపై జరిగిన ఒక విజయవంతమైన వివాదం కారణంగా, సతారా మరియు కొల్హాపూర్ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చాయి. 1710 నాటికి రెండు ప్రత్యేక రాజ్య భాగాలు స్థాపితమయ్యాయనే యథార్థం చివరకు 1731లో జరిగిన వర్ణ ఒప్పందంతో నిశ్చయంగా మారింది.

1713లో ఫరుఖ్‌సియర్ తనను తాను మొఘల్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఆయన అధికారంలోకి రావడమనేది ఎక్కువ భాగం ఆయన ఇద్దరు సొదరులపై ఆధారపడింది, సైయిద్‌లుగా సుపరిచితమైన వారిద్దరిలో ఒకరు అలహాబాద్ గవర్నర్‌గానూ మరొకరు పాట్నా గవర్నర్‌గా ఉండేవారు. అయితే, తొందర్లోనే చక్రవర్తి విషయంలో సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నైయిద్‌లు మరియు పేష్వా బాలాజీ విశ్వనాథ్‌ల మధ్య ఒకవైపు సంధి చర్చలు సాగుతుండగా, ప్రజల ప్రతినిధిగా రంగంలో దిగిన షాహూ చక్రవర్తికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకునే దిశగా మరాఠాలను ఉసిగొల్పాడు.

పర్సోజీ భోంస్లే, మరియు మొఘలుల సారథ్యంలో ఒక మరాఠా సైన్యం ఢిల్లీ వరకు చేరడంతో పాటు చక్రవర్తిని గద్దె దించేందుకు ప్రయత్నించింది. మొఘలులు అందించిన ఈ సహకారానికి ప్రతిగా బాలాజీ విశ్వనాథ్ వాణిజ్యపరంగా విలువ కలిగిన ఒక ఒప్పందానికి సిద్ధమయ్యాడు. దక్కనులో మొఘలుల పాలనను అంగీకరించిన షాహూజీ, తన బలగాలను సామ్రాజ్య సైన్యంగా మార్చడంతో పాటు, ఏటా కప్పం కట్టేందుకు అంగీకరించాడు. అయితే, తిరిగివచ్చే సమయంలో ఆయనకు ఒక ఫర్మానా లేదా సామ్రజ్య సంబంధిత నిర్థేశం అందింది. దానిప్రకారం, మరాఠా జన్మభూమిలో స్వరాజ్, లేదా స్వాతంత్ర్యంలతో పాటు గుజరాత్, మాల్వాలతో పాటు అప్పటి మొఘలుల దక్కను సామ్రాజ్యంలోని ఆరు ప్రావియన్సులలో చౌత్ మరియు సర్దేశ్‌ముఖ్ (మొత్తం ఆదాయంలో 35 శాతం) లకు సంబంధించిన హక్కు సైతం అందించబడింది. ఈ సంధిలో భాగంగా షాహూజీ తల్లి యెసూబాయ్‌ని సైతం మొఘల్ ఖైదు నుంచి విడిచిపెట్టారు. కేరళకు చెందిన అంతగా ముఖ్యం కాని రాజుల విషయంలోనూ ఇదేరకమైన సంధిని ప్రయోగించారు. ఢిల్లీ, ఆగ్రా, ఉత్తర ప్రదేశ్ మరియు జమ్మూ, కాశ్మీర్‌ లాంటి రాష్ట్రాల్లో మొఘలులు ప్రాముఖ్యం సాధించడంతో ఛత్రపతి షాహూ అనధికారికంగా ఈ ప్రాంతాన్ని పాలించలేదు.

యశ్వంత్‌రావ్ హోల్కర్

పూణా యుద్ధం తర్వాత, పేష్వా పలాయనం చిత్తగించడంతో మరాఠా రాష్ట్ర ప్రభుత్వం యశ్వంత్‌రావ్ హోల్కర్ చేతిలోకి చేరింది.[4] ఆయన అమృతరావును పేష్వాగా నియమించడంతో పాటు 1803 మార్చి 13న ఇండోర్‌కు చేరుకున్నారు. 1802 జూలై 26న కుదిరిన ఒక ప్రత్యేక ఒప్పందం మేరకు అదివరకే బ్రిటిష్ రక్షణను అంగీకరించిన బరోడా అధిపతి గైక్వాడ్ మినహా మిగిలిన అందరూ కొత్త పాలనకు మద్దతిచ్చారు. 1805లో బ్రిటిష్ వారితో ఒప్పందం ద్వారా తన డిమాండ్లను నెరవేర్చుకున్న ఆయన, షిండే, పేష్వా మరియు బ్రిటిష్ వారితో విజయవంతంగా వివాదాలను పరిష్కరించుకున్నాడు. ఆయన సాగించిన యుద్ధాలు భారతదేశ యుద్ధాల చరిత్రలో అత్యంత గుర్తింపును సాధించడంతో పాటు మొఘల్ చక్రవర్తి ద్వారా ఆయనకు లభించిన బిరుదు కారణంగా భారతదేశ పాలకుల మధ్య ఆయనకు ఒక ముఖ్యమైన స్థానం లభించింది.[5]

మరాఠా సమాఖ్యను ఏకీకృతం చేసేందుకు ఆయన ప్రయత్నించారు. నాగపూర్‌కు చెందిన వియంకోజీ భోంస్లేకు 1806 ఫిబ్రవరి 15న ఆయన ఒక లేఖ రాశారు. “విదేశీయుల కారణంగా మరాఠా రాజ్యానికి గ్రహణం పడుతోంది. విదేశీయుల దురాక్రమణను అడ్డుకునే దిశగా గత రెండున్నర సంవత్సరాలుగా నేను అన్నింటినీ త్యాగం చేయడం, నిమిషం కూడా విశ్రాంతి లేకుండా రాత్రీ పగలు వారితో యుద్ధం చేయడం దేవుడికి తెలుసు. ఈ విషయమై దౌలత్‌రావు సింధియా వద్దకు వెళ్లిన నేను, విదేశీ ఆధిపత్యాన్ని నివారించే దిశగా మనమందరం కలిసి పనిచేయడం ఎంత అవసరమనే విషయాన్ని వివరించాను. అయితే దౌలత్‌రావు నన్ను నమ్మడంలో విఫలమయ్యాడు. మరాఠా రాష్ట్రాలను నిర్మించే క్రమంలో మన పూర్వీకుల మధ్య ఉపయుక్తంగా నిలిచింది పరస్పర సహకారం మరియు మనఃపూర్వక సమ్మతి మాత్రమే. అయితే ప్రస్తుతం మనం మాత్రం స్వీయ-అవకాశవాదులుగా ప్రవర్తిస్తున్నాం. నా మద్దతు కోరి రానున్నట్టు నువ్వు నాకు లేఖ రాశావు, అయితే నీవు నీ ప్రమాణాన్ని సరైన విధంగా పాటించలేదు. ముందుగా రచించిన పథకం ప్రకారం నీవు బెంగాల్‌లోకి చొచ్చుకుపోయినట్టైతే, మేము సైతం బ్రిటిష్ ప్రభుత్వాన్ని శక్తిహీనం చేస్తాం. గతంలోని అంశాల గురించి ఇప్పుడు మాట్లాడడం వల్ల ఎంతమాత్రం ఉపయోగం లేదు. అన్ని దిశల్లో పట్టించుకోవడం మానేసిన సమయంలో నన్ను నేను గుర్తించాను, కాబట్టే బ్రిటిష్ ఏజెంట్లు ఇచ్చిన ప్రతిపాదనను నేను అంగీకరించడంతో పాటు యుద్ధాన్నీ ముగించాను” అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

యుద్ధంలో ఎంతో నైపుణ్యం కలిగిన ఆయన పరిపాలనలోనూ అంతే తెలివైన వ్యక్తి. ఆయన హయాంలో పటిష్ఠమైన సైనిక ఆధారంపై వివిధ శాఖలకు చెందిన సైన్యం నిర్వహించబడింది. ఒక సైనిక వ్యూహకర్తగా ఆయనకున్న నైపుణ్యం కారణంగా భారతదేశం గడ్డపై ఎప్పుడూ కాలు మోపని జనరల్స్ మధ్యన కూడా ఆయన స్థానం సాధించారు. ఆయన సాధించిన వీరోచిత లక్ష్యాలు ఆయనకు సంబంధించిన సైనిక మేథోసంపత్తి, రాజకీయ చురుకుదనం మరియు విరామమెరుగని పరిశ్రమల విషయంలో ఒక గొప్ప మెరుపును సృష్టించాయి. భారతదేశ చరిత్రలో నిస్సందేహంగా ఆయనొక గొప్ప మరియు అత్యంత సుందర స్వరూపం కలిగిన వ్యక్తి.[6] వ్యక్తిగత పరాక్రమం మరియు సాహస స్ఫూర్తిల కారణంగానే యశ్వంత్ రావ్ హోల్కర్ ప్రాథమికంగా ఏమీలేని స్థాయి నుంచి అధికారంలోకి రాగలిగారు. ఆయనలోని గొప్ప వ్యక్తిత్వం కొన్ని సందర్భాల్లో కష్టం కలిగించినప్పటికీ, ఏ రాజ్యం గానీ లేదా శక్తిగానీ ఆయన భూభాగంలో దురాక్రమణ జరిపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు; ఈ రకమైన ప్రభావం కారణంగానే హోల్కర్ మరణించిన తర్వాత కూడా కొనేళ్లపాటు ఆయన రాజ్యం పూర్తి రక్షణతో మనగలిగింది.

పేష్వాలు

రామచంద్ర పంత్ అమాత్య బవ్‌దేకర్

రామచంద్ర పంత్ అమాత్య బవ్‌దేకర్ ఒక న్యాయస్థాన పాలకుడు, శివాజీ మార్గదర్శకం మరియు మద్దతు ద్వారా స్థానిక కులకర్ణి స్థాయి నుంచి అష్టప్రధాన స్థాయికి చేరారు. శివాజీ కాలం నుంచి మరాఠా రాజ్యంలో ఆయన ఒక ముఖ్యమైన పేష్వాగా వర్థిల్లారు, అంతేకాకుండా షాహూజీ తర్వాత సామ్రాజ్యాన్ని నియంత్రించిన పేష్వాలకు ఆయనే మూలపురుషుడు.

ఛత్రపతి రాజారాం 1689లో మరాఠా సామ్రాజ్యాన్ని వదిలి జింజికి వెళ్లిపోవాలనుకున్న సమయంలో ముందుగా ఆయన పంత్‌కు "హుకుమత్ పన్హా" (రాజు హోదా) కట్టబెట్టారు. మొఘలలు రాక, వటన్‌డర్ల (మరాఠా రాజ్యం పరిపాలన కింద ఉండే సామంత రాజులు) ద్రోహ చింతన మరియు ఆహార కొరత లాంటి సాంఘిక సవాళ్ల వంటి అనేక సవాళ్ల నడుమ రామచంద్ర పంత్ పూర్తి రాజ్యాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంత్‌ప్రతినిథి, సచివ్‌ల సాయంతో మరాఠా సామ్రాజ్యంలోని ఆర్థిక పరిస్థితిని క్రమ స్థితికి తెచ్చారు.

1813లో జేమ్స్ ఫోర్బ్ చిత్రించిన మరాఠా సైనికుని అచ్చు చిత్రం

మరాఠా సైనికాధిపతులు - సంతజీ ఘోర్పడే మరియు ధనజీ జాదవ్‌ల నుంచి ఆయన సైనిక సాయాన్ని అందుకున్నారు. చాలా సందర్భాల్లో మొఘలులతో జరిగిన యుద్ధాల్లో ఆయన స్వయంగా పాల్గొనడంతో పాటు ఛత్రపతి రాజారాం లేని లోటు తీర్చేదిశగా రాజు నీడగానూ వ్యవహరించారు.

1698లో రాజారాం తన భార్య తారాబాయ్‌కి "హుకుమత్ పన్హా" హోదాను కట్టబెట్టిన సమయంలో ఆయన ఈ పదవినుంచి సంతోషంగా తప్పుకున్నారు. అదేసమయంలో తారాబాయ్ సైతం పంత్‌కు మరాఠా రాజ్యాన్ని పరిపాలించే సీనియర్ పాలకుల్లో ఒక ముఖ్యమైన స్థానాన్ని కట్టబెట్టింది. ఆయన రాసిన "అద్నయపత్ర" मराठी: आज्ञापञలో యుద్ధంలోని వివిధ రకాల సాంకేతికతలు, కోటల నిర్వహణ మరియు పరిపాలన మొదలగు అంశాల గురించి వివరించాడు.

అయితే, షాహూజీ (స్థానిక సామంతులు అనేకమంది ఆయనకు మద్దతుగా నిలిచారు) కి వ్యతిరేకంగా ఆయన తారాబాయ్‌ పట్ల రాజభక్తి ప్రదర్శించడంతో 1707లో షాహూజీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ప్రాముఖ్యాన్ని తగ్గించివేయడం జరిగింది.

బాజీ రావ్ I

1719లో బాలాజీ విశ్వనాథ్ మరణం తర్వాత, ఆయన కుమారుడు బాజీ రావ్ Iని అత్యంత ఉదాత్త స్వభావుడిగా పేరున్న షాహూజీ పేష్వాగా నియమించాడు. ప్రతిభను గుర్తించే విషయంలో షాహూజీ బలమైన సామర్థ్యం కలిగి ఉండేవాడు, దీంతోపాటు ఒకరి సామాజిక స్థాయిని లెక్కలోకి తీసుకోకుండా సామర్థ్యం కలిగినవారిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడం ద్వారా ఆయన ఒక సామాజిక విప్లవానికి కారకుడిగా నిలిచాడు. మరాఠా సామ్రాజ్యంలో కనిపించిన ఈ రకమైన గొప్ప సాంఘిక చైతన్య సంకేతం కారణంగానే ఆ రాజ్యం బాగా వేగంగా విస్తరించేందుకు కారణమైంది.

శ్రీమంత్ బాజీ రావ్ విశ్వనాథ్ భట్ (1699 ఆగస్టు 18- 1740 ఏప్రిల్ 25) సైతం బాజీ రావ్ Iగా సుపరిచితుడు, బాగా గుర్తింపు సాధించిన జనరల్‌గా పరిచయమున్న ఆయన 1719 నుంచి బాజీ రావ్ మరణం వరకు ఉన్న మధ్య కాలంలో నాల్గవ మరాఠా ఛత్రపతి (చక్రవర్తి) షాహూకు పేష్వా (ప్రధాన మంత్రి) గా సేవలందించారు. తోరల (జేష్ఠుని కోసం మరాఠీ) బాజీ రావ్‌గానూ ఆయన సుపరిచితుడు. తండ్రిలాగే, తానొక బ్రాహ్మణుడిననే విషయాన్ని పక్కనపెట్టి మరీ ఆయన తన సేనలకు నాయకత్వం వహించారు. తన జీవితకాలంలో ఆయన ఒక్క యుద్ధంలో కూడా ఓటవి చవిచూడలేదు. మరాఠా సామ్రాజ్య విస్తరణకు కృషి చేసిన వీరునిగా ఆయన ప్రఖ్యాతి సాధించారు, ఆయన మరణానంతరం ఇరవే ఏళ్ల తర్వాత ఆ రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. ఆవిధంగా బాజీ రావ్ తొమ్మిదిమంది పేష్వాల్లో అతిముఖ్యమైన వాడిగా ఖ్యాతి గడించాడు.

బాలాజీ బాజీ రావ్

బాజీ రావ్ కుమారుడైన బాలాజీ బాజీరావ్ (నానాసాహెబ్) ని షాహూజీ పేష్వాగా నియమించాడు. 1741 నుంచి 1745 వరకు మధ్య కాలంలో దక్కను భూభాగంలో తులనాత్మక ప్రశాంతత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 1749లో షాహూజీ మరణించాడు.

నానాసాహెబ్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు గ్రామస్థులను కాపాడాడు, అలాగే రాజ్యానికి సంబంధించిన భూభాగంలో మార్కెట్ అభివృద్ధిని తీసుకొచ్చాడు. మరోవైపు 1756లో అహ్మద్ షా అబ్దలీ ఢిల్లీని కొల్లగొట్టిన తర్వాత, అఫ్ఘన్‌ ఉపసంహరణ నేపథ్యంలో నానాసాహెబ్ సోదరుడు రఘునాథ్ రావ్ విరామం ఎరగని విస్తరణను చవిచూశాడు. ఢిల్లీలో లాగే లాహోర్‌ విషయంలో మరాఠాలు ఆసమయంలో అతిపెద్ద రాజ్య పాలకులుగా అవతరించారు. 1760లో దక్కనులో నిజాంను ఓడించడం ద్వారా 250 మిలియన్ ఎకరాల (1 మిలియన్ km²) కు పైగా భూభాగాన్ని లేదా భారత ఉప-ఖండంలో మూడోవంతు భాగాన్ని ఆక్రమించుకున్న మరాఠా సామాజ్ర విస్తరణ ఉచ్ఛస్థితికి చేరింది.

పతనం

రొహిల్లాస్, షుజ-ఉద్-దౌలా, నజీబ్-ఉద్-దౌలా లాంటి భారతదేశానికి చెందిన ముస్లిం రాజుల ద్వారా మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠా సైన్యం నిష్కర్షమైన రీతిలో ఓటమిపాలైంది. పానిపట్టు యుద్ధంలో ఎదురైన ఓటమితో మరాఠా రాజ్యం వాయువ్య దిశగా విస్తరించే విషయంలో అడ్డంకి చోటు చేసుకోవడంతో పాటు సామ్రాజ్యం ముక్కలుగా విడిపోవడం ప్రారంభమైంది. ఈ యుద్ధం తర్వాత, మరాఠా సమాఖ్య ఎప్పుడు కూడా సమైక్యంగా యుద్ధానికి దిగలేదు.

మరోవైపు పన్నులు ఎక్కువ విధించడం ద్వారా జాట్‌లు మరియు రాజపుత్రులుతో మరాఠాలు కోరి శత్రుత్వం తెచ్చుకున్నారు, మొఘలులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన మరాఠాలు వారి అంతర్గత సంబంధాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. భరత్‌పూర్‌కి చెందిన రాజా సూరజ్ మాల్ మరాఠాలను వదిలివేశాడు, అలాగే మహా యుద్ధం ప్రారంభానికి ముందు ఆగ్రా వద్ద రాజపుత్రులు సైతం మరాఠా సంకీర్ణం నుంచి వైదొలగడంతో పాటు తమ సైన్యాలను ఉపసంహరించుకున్నారు, మరాఠా సైనికాధ్యక్షుడు సదాశివ్‌రావ్ భాహూ ఆగ్రా వద్ద సైనికుల కుటుంబాల (మహిళలు మరియు పిల్లలు) ను మరియు యాత్రికులను విడిచి పెట్టాలన్న సలహాను లక్ష్యపెట్టకపోవడంతో పాటు సైనికులకు తోడుగా వారిని యుద్ధ క్షేత్రానికి తీసుకురానీయలేదు, ఈ కారణంగానే వారి సహకారం కరువైంది. వారి సరఫరా గొలుసులు (గతంలో రాజా సూరజ్ మాల్ మరియు రాజపుత్రల ద్వారా లభించిన హామీ) అందుబాటులో లేకుండా పోయింది. దీంతోపాటు వారు స్థానిక ప్రజల మద్దతునూ కోల్పోయారు). దీంతో మరాఠాలకు అత్యంత కీలకమైన పూణేతో సహా దేశ్ సైతం ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలన కిందకు వెళ్లిపోయింది, కేవలం కొల్హాపూర్ మరియు సతారాలు మాత్రమే స్థానిక మరాఠా రాజుల చేతిలో మిగిలాయి. మరాఠా-పాలనలో భాగమైన గాల్వియర్, ఇండోర్, మరియు నాగ్‌పూర్ లాంటి ప్రాంతాలన్నింటినీ వారు పోగొట్టుకోవడంతో పాటు అవన్నీ బ్రిటిష్ సంకీర్ణంలో భాగమయ్యాయి.

మరాఠా సమాఖ్య

1792లో మరాఠా సమాఖ్యలోని రాష్ట్రాలను చూపుతున్న పటం
మహధాజీ సింధియా

1761 తర్వాత, యువకుడైన మాధవ్‌రావ్ పేష్వా తన సున్నిత ఆరోగ్య పరిస్థితిని సైతం లెక్కచేయకుండా మరాఠా సామ్రాజ్యాన్ని పునర్నిర్మించడం కోసం తన గరిష్ఠ సామర్థ్యంతో కృషి చేశాడు, ఫలితంగా పానిపట్టు యుద్ధం ముగిసిన 10 ఏళ్ల తర్వాత ఉత్తర భారతదేశంలో మరోసారి మరాఠా ఆధిపత్యం చోటు చేసుకుంది. పెద్ద మొత్తంలో ఉన్న సామ్రాజ్యాన్ని ప్రభావవంతంగా నిర్వహించడంలో భాగంగా పాక్షిక-స్వయంప్రతిపత్తిని బలమైన శూరల చేతికి అప్పగించడం జరిగింది. ఆవిధంగా, స్వయంప్రతిపత్తి కలిగిన మరాఠా రాష్ట్రాలు కింది పేర్కొన్న పేరుతో సామ్రాజ్యంలో భాగమైన ప్రత్యేక ప్రాంతాలుగా ఉనికిలోకి వచ్చాయి:

 • పూణా పేష్వాలు
 • బరోడా గైక్వాడ్‌లు
 • ఇండోర్ మరియు మాల్వా హోల్కర్‌లు
 • గాల్వియర్ మరియు ఉజ్జయిని సింథియాలు (లేదా షిండేలు)
 • నాగ్‌పూర్ భోంస్లేలు (శివాజీ లేదా తారాబాయ్‌ కుంటుంబంతో వీరికి ఎలాంటి సంబంధం లేదు)
 • మహారాష్ట్రలో సైతం అనేకమంది యోధులకు పాక్షిక-స్వయంప్రతిపత్తి అధికారాల కింద చిన్న జిల్లాల బాధ్యతలను అప్పగించారు, దీంతో సంగ్లీ, అవుంధ్, బోర్, బౌడా, జాట్, ఫల్టాన్, మీరజ్ మొదలగు జిల్లాలన్నీ ప్రిన్సియల్లీ రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. ఉద్గిర్‌కు చెందిన పవార్‌లు సైతం మరాఠా సమాఖ్యలో భాగంగానే ఉండేవారు.

1775లో బాంబే ప్రధాన స్థావరంగా కలిగిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పూణేలో రఘునాథ్‌రావ్ (రఘోబడాడా అని కూడా పిలుస్తారు) కు సంబంధించిన వారసత్వ పోరాటంలో జోక్యం చేసుకోవడంతో చోటు చేసుకున్న ఘర్షణ మొట్టమొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధానికి దారితీసింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ఇరు పక్షాలు నిర్ణయించడంతో 1782లో ఆ యుద్ధం ముగిసింది. 1802లో బరోడా సింహాసనాన్ని అధిష్టించడం కోసం ఏర్పడిన పోరులో సింహాసన వారసుడికి సాయం చేయడం కోసం బ్రిటిష్ ఆ వ్యవహారంలో జోక్యం చేసుకుంది, అలాగే కొత్తగా అధికారం చేపట్టిన మహారాజుతో ఒక ఒప్పందాన్నీ కుదుర్చుకుంది, దీనిప్రకారం కొత్త రాజు మరాఠా సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకోవడాన్ని బ్రిటిష్ గుర్తిస్తుంది, బ్రిటిష్ సార్వభౌమాధిపత్యాన్ని ఆ రాజు గుర్తించాలి. మరోవైపు రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం (1803–1805) లో భాగంగా పేష్వా బాజీ రావ్ II సైతం ఇదే రకమైన ఒప్పందంపై సంతకం చేశాడు.

ఇక సార్వభౌమాధిపత్యాన్ని నిలబెట్టుకునే దిశగా చివరి ప్రయత్నంగా జరిగిన మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం (1817–1818) మరాఠా స్వాతంత్ర్యం కోల్పోయేందుకు దారితీసింది: దీంతో దాదాపు భారతదేశం మొత్తం బ్రిటన నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా పేష్వాను బితూర్ (U.Pలోని కాన్పూర్‌కు సమీపం) కు పంపివేయడంతో పాటు అతనికి బ్రిటిష్ నుంచి ఫించను వచ్చే ఏర్పాటు చేయబడింది. ఈ నేపథ్యంలో మరాఠా రాజ్యంలో కీలకమైన పూణేతో సహా దేశ్ సైతం ప్రత్యక్ష బ్రిటిష్ పాలన కిందకు చేరింది, అయితే కొల్హాపూర్ మరియు సతారాలు ఇందులోంచి మినహాయింపు పొందాయి, ఆ సమయంలో అవి స్థానిక మరాఠా పాలకుల చేతిలో ఉండేవి. మరాఠా పాలనలోని రాష్ట్రాలైన గాల్వియర్, ఇండోర్, మరియు నాగ్‌పూర్ లాంటి భూభాగాలన్నీ మరాఠాల చే జారడంతో పాటు, ప్రిన్సియలీ స్టేట్స్ రూపంలో అవన్నీ బ్రిటిష్ రాజ్‌తో సంబంధం కలిగిన సంకీర్ణ రాజ్యాల కిందికి చేరాయి, అదేసమయంలో బ్రిటిష్ సార్వభౌమాధిపత్యం కింద ఆయా రాజ్యాల్లో అంతర్గత సార్వభౌమాధిపత్యం చోటు చేసుకుంది. అలాగే మరాఠా యోధుల చేతిలో మిగిలిన ఇతర చిన్నపాటి ప్రిన్సియలీ స్టేట్స్ సైతం బ్రిటిష్ రాజ్ అధికారం కిందకు చేరాయి.

వారసత్వం

భారత నౌకాదళంకు పునాది వేయడం మరియు ఒక బ్లూ-వాటర్ నౌకాదళం ప్రవేశపెట్టడం ద్వారా మరాఠా సామ్రాజ్యం ప్రఖ్యాతి సాధించింది.దేశంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన పూణే, బరోడా, ఇండోర్ లాంటి నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా కూడా మరాఠా సామ్రాజ్యం ఖ్యాతి గడించింది.

పరిపాలన

మరాఠా ఆస్థానం

మరాఠాల పరిపాలనలో వివిధ ప్రధానులు ఉండేవారు.

 • పీష్వా : ముఖ్య ప్రధాన్, చక్రవర్తికి ప్రధానమంత్రి, ఆయన లేని సమయంలో పర్యవేక్షణ, పరిపాలన కూడా చేసేవారు.

పాలకులు

రాజ దర్బారులు

 • ఛత్రపతి శివాజీ మహరాజ్ (1630–1680)
 • ఛత్రపతి శంభాజీ (1657–1689)
 • ఛత్రపతి రాజారాం (1670–1700)
 • మహారాణి తారాబాయ్
 • ఛత్రపతి షాహూ (అలియాస్ శివాజీ II, ఛత్రపతి శంభాజీ కుమారుడు)
 • ఛత్రపతి రామరాజ (పేరుకుమాత్రమే, ఛత్రపతి రాజారాం మరియు రాణి తారాబాయ్‌ల మనుమడు)
కొల్హాపూర్
 • రాణి తారాబాయ్ (ఛత్రపతి రాజారాం భార్య), కుమారుడు శివాజీ II పేరుతో పాలన నిర్వహించింది.
 • ఛత్రపతి శంభాజీ (ఛత్రపతి [రాజారాం] రెండో భార్య కుమారుడు)
 • ఛత్రపతి షాహూ IV

పేష్వాలు

 • సోనోపంత్ దబిర్ కాలం 1640-1652
 • శ్యాంపంత్ కులకర్ణి-రంజేకర్ కాలం 1652-1657
 • మోరోపంత్ త్రింబక్ పింగ్లే కాలం 1657-1683
 • మోరేశ్వర్ పింగలే 1683-1689
 • రామచంద్రపంత్ అమాత్య 1689-1708
 • బహిరోజీ పింగలే 1708-1711
 • పరుశురాం త్రిబక్ కులకర్ణి 1711-1713
 • బాలాజీ విశ్వనాథ్ (1713-2ఏప్రిల్.1720) (జననం.1660, మరణం. 2apr.1720)
 • పేష్వా బాజీరావ్ I (17 ఏప్రిల్.1720-28 ఏప్రిల్.1740) (జననం.18 ఆగస్టు.1700, మరణం. 28 ఏప్రిల్.1740)
 • బాలాజీ బాజీరావ్ (4 జూలై.1740-23 జూన్.1761) (జననం.8 డిసెంబరు.1721, మరణం. 23 జూన్.1761)
 • మాధవరావ్ పేష్వా (1761-18 నవంబరు.1772) (జననం.16 ఫిబ్రవరి.1745, మరణం. 18 nob.1772)
 • నారాయణరావ్ బాజీరావ్ (13 డిసెంబరు.1772-30 ఆగస్టు.1773) (జననం.10 ఆగస్టు.1755, మరణం. 30 ఆగస్టు.1773)
 • రఘునాథ్‌రావ్ (5 డిసెంబరు.1773-1774) (జననం.18 ఆగస్టు.1734, మరణం. 11 డిసెంబరు.1783)
 • సవాయ్ మాథవ రావ్ II నారాయణ్ (1774-27 అక్టోబరు.1795) (జననం.18 ఏప్రిల్.1774, మరణం. 27 అక్టోబరు.1795)
 • చిమ్నజీ మాథవరావ్ (1796 మే 26 - 1796 డిసెంబరు 6) (బాజీరావ్ II సోదరుడు, మాథవ్‌రావ్ II భార్య ద్వారా దత్తత తీసుకోబడ్డాడు.)
 • బాజీ రావ్ II (6 డిసెంబరు.1796-3 జూన్.1818) (మరణం. 28 జనవరి.1851)
 • అమృతరావ్ (బాజీరావ్ II సోదరుడు), యశ్వంత్‌రావ్ హోల్కర్ పాలన కాలంలో స్వల్పకాలం (మే 1802 - మే 1803) పేష్వాగా పనిచేశాడు.

బ్రిటిష్ వారు ఈయన స్థానంలో మళ్లీ బాజీరావ్‌ను నియమించారు.

 • నానా సాహిబ్ (1 జూలై.1857-1858) (జననం.19 మే.1825, మరణం. 24 సెప్టెంబరు.1859

ప్రజాప్రతినిధులు

 • హోల్కర్
 • షిండే (సింథియా)
 • గైక్వాడ్

వీటిని కూడా చూడండి

గమనికలు

 1. Setumadhavarao S. Pagadi. (1993). SHIVAJI. NATIONAL BOOK TRUST. p. 21. ISBN 8123706472. Unknown parameter |firstname= ignored (help); Unknown parameter |lastname= ignored (help)
 2. సూర్యనాథ్ U. కామత్ (2001). ఏ కాన్సిస్ హిస్టరీ అఫ్ కర్ణాటక ఫ్రం ప్రి-హిస్టారిక్ టైమ్స్ టు ది ప్రెజెంట్, జూపిటర్ బుక్స్, MCC, బెంగుళూరు (పునఃప్రచురణ 2002), పుట243.
 3. Patil, Vishwas. Sambhaji.
 4. C A కిన్‌కైద్ మరియు D B పరాస్‌నిస్, ఏ హిస్టరీ అఫ్ ది మరాఠా పీపుల్. సం III పుట 194
 5. సదర్‌లాండ్స్ స్కాచెస్ పుట 64, సోమర్‌సెట్ ప్లేనే Op. Cit. పుట 87
 6. హేమచంద్ర రాయ్, ఫ్లవర్స్ అఫ్ హిందోస్తాన్, 1932, పుట.261, 262.

సూచనలు

 • జేమ్స్ గ్రాంట్ డఫ్ - ఏ హిస్టరీ అఫ్ ది మహారాట్స్, 3 కూర్పులు. లండన్, లాంగ్‌మ్యాన్స్, రీస్, ఆర్మే, బ్రౌన్, మరియు గ్రీన్ (1826) ISBN 81-7020-956-0
 • బోంబే యూనివర్సిటీ - మరాఠ హిస్టరీ - సెమినార్ వాల్యూం
 • రనడే, మహాదేవ్ గోవింద్, రైస్ అఫ్ ది మరాఠా పవర్ (1900) ; పునఃప్రచురణ (1999) ISBN 81-7117-181-8
 • సమంత్, S. D. - వేద్ మహామనవచ
 • కసర్, D.B. - రుగ్వేద టు రాయ్‌గఢ్ మేకింగ్ అఫ్ శివాజీ ది గ్రేట్, ముంబాయ్: మనుదేవి ప్రకాషన్ (2005)
 • ఆప్టే, B.K. (ఎడిటర్) - ఛత్రపతి శివాజీ: కోరోనేషన్ టర్సెన్టనరి కంమెమరేషన్ వాల్యూం, బాంబే: యునివర్సిటీ అఫ్ బాంబే (1974–75)
 • దేశాయ్, రంజిత్ - శివాజీ ది గ్రేట్, జనతా రాజ (1968), పూణే: బల్వంత్ ప్రింటర్స్ - ప్రజాదరణ పొందిన మరాఠీ పుస్తకం యొక్క ఆంగ్ల అనువాదం.
 • పగ్డీ, సేతు మాధవ్ రావ్ - హిందవీ స్వరాజ్ ఆని మొఘుల్ (1984), గిర్గావ్ బుక్ డిపో, మరాఠీ పుస్తకం
 • దేశ్‌పాండే, S.R. - మరత్యంచి మనస్వినీ, లలితా పబ్లికేషన్స్, మరాఠీ పుస్తకం
 • సూర్యనాథ్ U. కామత్ (2001). ఏ కాన్సిస్ హిస్టరీ అఫ్ కర్ణాటక ఫ్రం ప్రి-హిస్టారిక్ టైమ్స్ టు ది ప్రెజెంట్, జూపిటర్ బుక్స్, MCC, బెంగుళూరు (పునఃప్రచురణ 2002), OCLC: 7796041.
 • ఛార్లెస్ ఆగస్టస్ కిన్‌కైద్ - హిస్టరీ అఫ్ ది మరాఠా పీపుల్ సం సంl2 సం3