"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మొండిబండ

From tewiki
Jump to navigation Jump to search

మొండిబండ బి.సి.ఏ.గ్రూపు కులం. సంచారజాతిగా ఊరూవాడ తిరిగే మొండిబండ కులస్థులు ఇప్పుడు స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. చిక్కెంట్రుకలు (మహి ళలు తలదువ్వుకోగా దువ్వెనకు చిక్కిన చిక్కు వెండ్రుకలు) వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వరికోతల సమయంలో రైతుల దగ్గర మిరాసీ వసూలు చేసుకునేవారు. మిగతా రోజుల్లో భిక్షాటన చేసేవారు. అడుక్కోవడం కూడా రకరకాలుగా ఉండేది. కత్తి చేతపట్టి తమని తాము హింసించుకొంటూ భిక్షాటన చేసేవారు కొందరు. భిక్ష వేయకపోతే పులిసిన గంజి వంటికి రాసుకుని గుమ్మం ముందే తిష్టవేసేవారు మరికొందరు. ఆ కంపు భరించలేక గృహస్థులు తప్పనిసరిగా భిక్ష వేయాల్సివచ్చేది. ఈ విధంగా ఎదుటి వ్యక్తిని బట్టి వీరు యాచించే తీరు మార్చుకునేవారు. సవరాలు అమ్ముకుని గడిపేందుకు ఊరి పొలిమేరల్లో ఉండటానికి చిన్న చెట్టు, పరిసరాలలో కొంత ఖాళీ స్థలం కనిపిస్తే చాలు... మూడు రాళ్లు పేర్చి పొయ్యి పెడతారు. చెట్టుకొమ్మకు చీర వేలాడదీసి చంటిబిడ్డను అందులో పడుకోబెడతారు. చెట్టుకింద కాపురాలు వీరివి. ఆ గ్రామంతోపాటు చుట్టుపట్ల ఉన్న గ్రామాలకు తిరిగి చిక్కెంట్రుకలు సేకరించేవారు. ఈ సేకరణలో పిల్లలే వీరి కష్టమర్లు! చిన్న పిల్లలకు బెలూన్లు, స్వీట్లు ఇచ్చి వారి ద్వారా చిక్కెంట్రుకలు సేకరిస్తారు. ఈ చిక్కెంట్రుకల కోసం ఈ మహిళలు రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు నడుస్తారు. రెండు మూడు రోజుల్లో పరిసర గ్రామాలలో చిక్కెంట్రుకల సేకరణ పూర్తిచేసి మరో ఊరికి ప్రయాణం కడతారు. ఇలా రాష్ర్ట మంతటా సంచారం చేస్తూనే ఉంటారు. స్థిర నివాసం లేకపోవటంతో తరతరాలుగా వీరు చదువుకు దూరమయ్యారు. సేకరించిన చిక్కెంట్రుకలను వేడి నీళ్లలో ఉడకబెట్టి శుభ్రం చేస్తారు. ఆ విధంగా శుభ్రపరిచిన వెంట్రుకలను ప్రత్యేకంగా తయారుచేసిన గట్టి కుంచెలతో సాపు చేసి సవరాలు కడతారు. ఈ సవరాలను వివిధ రూపాలలో కడతారు. ఈ కళలో పురుషులకు కూడా ప్రవేశం ఉంది. పదేళ్ల కిందటి వరకూ వీరి సవరాల వ్యాపారం బాగానే సాగింది. టీవీల ప్రభావం గ్రామీణ వాసులపై పడటంతో కొప్పులు పెట్టుకోవటం, జడలు అల్లుకోవటం పల్లెటూరి స్త్రీలకు ఓల్డ్ ఫ్యాషన్‌ అయ్యింది. పొడవాటి జడలను కత్తిరించటం ఫ్యాషన్‌ కావటంతోపాటు, సమయం, డబ్బు కూడా ఆదా అవుతోంది. కాబట్టి మహిళలు వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న క్లిప్‌తోనో, రబ్బర్‌ బ్యాండ్‌ తోనో వెంట్రుకలను బిగించి పోనీ టెయిల్‌ మాదిరి వదిలేస్తు న్నారు. సవరాలు పల్లెపడుచులకు మాత్రమే పరిమితం కావటంతో వీటికి గిరాకీ తగ్గింది. కనుక చిత్తు కాగితాలు ఏరుకునో మరో వృత్తిచేసుకునో వీరు జీవిస్తున్నారు. దేవాలయాలలోని మొక్కుబడి వెంట్రుకలకు పిలిచే టెండర్‌లలో వీరికి అవకాశం తక్కువ. శ్రీశైలం దేవాలయంలోని మొక్కుబడి వెంట్రుకల టెండర్‌లో పాల్గొనాలంటే కోటి 50 లక్షల రూపాయలు డిపాజిట్‌ చేయాలి. దాదాపు అన్ని ప్రముఖ దేవాలయాలలో ఇదేపద్ధతి ఉంది. తరాల కిందట వీరు ప్రారంభించిన ఈ వెంట్రుకల వ్యాపారం నేడు దేశం ఎల్లలు దాటింది. ఇది బడా బాబులు చేతుల్లోకి వెళ్ళి విదేశీ ఎగుమతి వ్యాపారంగా మారింది. ఏలూరులో కోట్లాది రూపాయలతో ఈ వెంట్రుకలను ఎగుమతి చేసే కంపెనీలు వెలిశాయి. ఆయా కంపెనీల్లో ఒక్కొక్క యూనిట్‌ ఖరీదే కోట్లలో ఉంది. ఈ వెంట్రుకలతో విగ్గులు తయారు చేస్తున్నారు. `ఏ గ్రేడ్‌ వెండ్రుకలు టన్ను 90 లక్షల రూపాయలు పలుకుతోంది. రెండు, మూడు గ్రేడ్‌ల నాణ్యత కల వెంట్రుకలకు వరుసగా 60 లక్షలు, 30 లక్షల రేటుంది. వెంట్రుకలపై ఏడాదికి దాదాపు 1200 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. చిక్కెంట్రుకల కోసం మైళ్ళ కొద్దీ నడిచే మహిళలు మాత్రం అప్పటకీ ఇప్పటికీ ఏ మాత్రం ఎదుగుబొదుగూ లేని జీవితాలు గడుపుతున్నారు. మొక్కుబడి వెంట్రుల్లో 30 శాతం తమకివ్వాలని ఈ కులస్తులు కోరుతున్నారు.

మూలాలు