రాయల సుభాష్ చంద్రబోస్

From tewiki
Jump to navigation Jump to search

రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవన్న సీపీఐ (ఎంఎల్-న్యూ డెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి. నైతిక విలువలే ప్రామాణికంగా, మార్క్సిజం, మావో ఆలోచనా విధానమే జాతి విముక్తికి మార్గమని భావించి రాజీలేని పోరాటం నడిపిన యోధుడు.[1]

జీవిత విశేషాలు

ఆయన ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం.లో 1947 లో రాయల గోపాలకృష్ణయ్య, రాంబాయమ్మ దంపతులకు జన్మించారు. బోస్ విద్యార్థి దశనుంచే వామపక్ష రాజకీయాలకు ఆకర్షితుడయ్యారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదివారు. 1967లో నక్సల్బరీ, శ్రీకాకుళం రైతాంగ పోరాటాలతో చదువుకు స్వస్తిపలికారు. సమాజంలో నెలకొన్న పెట్టుబడిదారి, పెత్తందారి వ్యవస్థలను రూపుమాపాలనే నినాదంతో డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాయకుండానే ఉద్యమబాట పట్టారు. అంతకు ముందే కమ్యూనిస్టు యోధుడు బత్తుల వెంకటేశ్వరరావుతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ స్థాపించి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.[2]

అజ్ఞాతంలోకి

మొదట్నుంచీ సిద్దాంతం, నియమావళికే కట్టుబడిన రాయల సీపీఎంలో నెలకొన్న భిన్నరాజకీయాలతో 1967లోనే విభేదించారు. ఆనాటి సీపీఎం అగ్రనేతల్లో ఒకరైన బసవ వెంకటేశ్వరరావుతో కలిసి బయటికి వచ్చారు. అప్పుడే విప్లవోద్యమాన్ని నడిపిస్తున్న చారు మజుందార్ పంథాకు ఆకర్షితుడై అదే ఏడాది సీపీఐ (ఎంఎల్) పార్టీలో చేరిన ఆయన తుపాకీ చేతపట్టి, అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత 1967 నుంచి 1972 వరకు చారు మజుందార్ అనుచరునిగా ఆర్‌వోసీలో పనిచేశారు. జిల్లాలోని పాల్వంచ దండకారణ్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ పేదల విముక్తే ధ్యేయంగా పోరాటం సాగించారు. అదే క్రమంలో 1971 నుంచి చండ్ర పుల్లారెడ్డి, రామనర్సయ్య విప్లవపంథాలో చేరిన సుభాష్‌చంద్రబోస్ పోరాటాన్ని మరింత విస్తృత పరిచారు. 1980లో ప్రజాప్రంధా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎదిగి క్రియాశీల పోరాటాలకు నాయకత్వం వహించారు. 1992లో ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆనాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు కేంద్రకమిటీ సభ్యుడిగా కొనసాగారు.[3]

వ్యక్తిగత జీవితం

ఆయనకు భార్య కె.రమ, కుమార్తె వందన ఉన్నారు. రమ పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.

మరణం

ఖమ్మం జిల్లాలో ఓ రహస్య ప్రాంతంలో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన కుప్పకూలిపోయారు. హుటాహుటిన హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో నకిరేకల్ వద్ద తుదిశ్వాస విడిచారు.[4]

మూలాలు

ఇతర లింకులు