"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు

From tewiki
Jump to navigation Jump to search
కళాప్రపూర్ణ, డాక్టర్

రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు

బహద్దర్
రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
175 px
రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
జననం1885, అక్టోబరు, 5
మరణం1964, మార్చి, 6
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుసాహిత్య చక్రవర్తి
వృత్తిసంస్థానాధీశుడు
క్రియాశీల సంవత్సరాలు1907-1948
Organizationపిఠాపురం సంస్థానం
సురరిచితుడుసాహిత్య పోషకుడు, దాత
జీవిత భాగస్వాములురాణీ చిన్నమాంబా దేవి,
సావిత్రీదేవి
పిల్లలురావు వేంకట గంగాధర రామారావు,
రావు వేంకటసూర్యారావు,
మంగాయమ్మ,
భావయమ్మ,
సీతాదేవి,
కమలాదేవి,
రామరత్నారావు
తల్లిదండ్రులురావు వేంకట మహీపతి గంగాధర రామారావు, మంగాయమ్మ

రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు పిఠాపురం సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు.

జీవిత విశేషాలు

ఇతడు 1885, అక్టోబర్, 5 న మంగాయమ్మ, రావు వేంకట మహీపతి గంగాధర రామారావు దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఇతని తండ్రి మరణించాడు. అప్పుడు గంగాధర రామారావు దత్తపుత్రుడు ఇతడు వారసుడు కాడని, రాజ్యాధికారం తనదే అని కోర్టుకు ఎక్కాడు. ఈ వ్యాజ్యం ఎక్కువ రోజులు నడిచి చివరకు విజయలక్ష్మి ఇతడినే వరించింది. ఈ వ్యాజ్యం కోర్టులో ఉన్నంతకాలం, అనంతరం ఇతనికి మైనారిటీ తీరేవరకు ఈ సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉంది. ఈ సమయంలో ఇతడు మద్రాసు లోని న్యూయింగ్టన్ కళాశాలలో ఉండి విద్యాభ్యాసం చేశాడు. ఈ సమయంలోనే సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళం, ఆంగ్ల భాషలను నేర్చుకుని ఈ ఐదు భాషలలో ఉత్తమ గ్రంథాలను పఠించాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో కవిత్వం చెప్పగలిగే నేర్పును సంపాదించాడు. తర్వాత నూజివీడు సంస్థానాధిపతియైన రాజా వెంకటరంగయ్యప్పారావు ప్రథమ పుత్రిక అయిన ఆండాళమ్మను 1906, ఏప్రిల్ 2 న వివాహం చేసుకున్నాడు. వంశాచారమును బట్టి ఆండాళమ్మ అత్తింటికి వచ్చిన వెంటనే చిన్నమాంబాదేవిగా తన పేరును మార్చుకున్నది. తర్వాత 1907, ఫిబ్రవరి 19పిఠాపురం సంస్థానపు సింహాసనాన్ని అధిష్టించాడు. 1948లో సంస్థానాలు, జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు ఇతడు పిఠాపురం మహారాజుగా వెలుగొందాడు. ఇతడికి చిన్నమాంబాదేవి ద్వారా మొదట 1910లో గంగాధర రామారావు అనే పుత్రుడు జన్మించాడు. తర్వాత వారికి సూర్యారావు అనే కుమారుడు, మంగయమ్మ, భావయమ్మ, సీతాదేవి, కమలాదేవి అనే కుమార్తెలు కలిగారు. ఇతని కుమార్తె సీతాదేవి బరోడా సంస్థానపు మహారాణి అయ్యింది. 1933, మార్చి 12 న రాణీ చిన్నమాంబాదేవి అగ్నిప్రమాదంలో మరణించిన పిదప ఇతడు సావిత్రీదేవిని వివాహం చేసుకుని రామ రత్నారావు అనే పుత్రుడికి జన్మనిచ్చాడు. రాజా సూర్యారావు గారు 79 సంవత్సరాలు జీవించి 1964, మార్చి 6 వ తేదీన మరణించాడు.

దాతృత్వం

ఇతడు తన తండ్రిచేత స్థాపించబడిన పిఠాపురం హైస్కూలు, కాకినాడ కాలేజీలను అమితమైన ధనం వెచ్చించి అభివృద్ధి చేసి దక్షిణ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి విద్యాసంస్థలు మరొకటి లేదనిపించాడు. కాకినాడ కాలేజీని ఫస్ట్ గ్రేడ్‌గా ఉద్ధరించి ఎన్నో భవనాలను కట్టించాడు. ఆ కాలేజీలో చదివే స్త్రీలకు, పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాడు. అంతే కాకుండా పట్టభద్రులై విదేశాలకు వెళ్లి, ఉన్నతవిద్య పొందగోరేవారికి సంపూర్ణ ధనసహాయం చేశాడు. పిఠాపురం హైస్కూలులో హరిజన విద్యార్థినీ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని నెలకొల్పి దానికయ్యే వ్యయాన్ని అంతా తానే భరించాడు. వారికి ప్రైవేటు టీచర్లను కూడా ఏర్పరిచి అనేకమందిని వృద్ధిలోనికి తీసుకువచ్చాడు. రాజమండ్రి లోని వీరేశలింగోన్నత పాఠశాల ఇతని పోషణతోనే నడిచింది. రఘుపతి వేంకటరత్నం నాయుడు ప్రేరణతో కాకినాడలో బ్రహ్మసమాజ ప్రార్థనామందిరాన్ని, అనాథశరణాలయాన్ని ఏర్పాటు చేశాడు. రాణీ చిన్నమాంబాదేవి కోరికపై కాకినాడ లేడీస్ క్లబ్‌కు 40 ఎకరాల స్థలాన్ని ఇచ్చాడు. రాణీ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఘోషా స్కూలును నడిపాడు. 1920 ప్రాంతములో విశ్వకవి రవీంద్రనాథ టాగూరు పిఠాపురం సందర్శించినప్పుడు ఇతడు సుమారు లక్షరూపాయలు పారితోషికంగా ఇచ్చాడు. ప్రాచ్య, పాశ్చాత్య విద్యలను సమదృష్టితో గౌరవించి వాటి అభివృద్ధికై ఎంతో ధనాన్ని వెచ్చించాడు. ఇతని ఔదార్యముతోనే తెలుగుదేశములోని ఆనాటి ప్రతి సాహిత్యసంస్థ అభివృద్ధిని చెందింది. ఆంధ్ర భాషాభివర్ధినీ సమాజము, విజ్ఞానచంద్రికా మండలి, ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలలకు విశేషమైన ధనసహాయం చేశాడు. జయంతి రామయ్య స్థాపించిన ఆంధ్రసాహిత్య పరిషత్తును ప్రోత్సహించి సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణానికి కారకుడైనాడు. అంతే కాకుండా ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిషత్తు ద్వారా లక్షల రూపాయలు వెచ్చించి ముద్రింపజేశాడు.

సూర్యరాయాంధ్ర నిఘంటువు

సూర్యారావు తైలవర్ణపటం

ఇతడు సాహిత్యప్రపంచానికి చేసిన సేవ అంతా ఒక ఎత్తు, నిఘంటు నిర్మాణానికి, ప్రచురణకు పాటుపడటం ఒక ఎత్తు. 1911, మే 12 న జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తు సభలో జయంతి రామయ్య పంతులు నిఘంటు నిర్మాణానికి చేసిన ప్రతిపాదన విని ఇతడు ఆ నిఘంటు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం భరించడానికి సంసిద్ధుడైనాడు. ఆ ప్రకటనకు సభలోని వారంతా ఆనందపడ్డారు. జయంతి రామయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన నిఘంటువుకు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు అని నామకరణం చేశారు. ఈ నిఘంటు నిర్మాణానికి కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి, తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య, పురాణపండ మల్లయ్యశాస్త్రి, పేరి పాపయ్యశాస్త్రి, శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి, కూచి నరసింహం, చర్ల నారాయణశాస్త్రి, పిశుపాటి చిదంబర శాస్త్రి, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, దర్భా సర్వేశ్వరశాస్త్రి, పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి, ప్రయాగ వేంకటరామశాస్త్రి, అమలాపురపు విశ్వేశ్వరశాస్త్రి, బులుసు వేంకటేశ్వర్లు, చిలుకూరి వీరభద్రశాస్త్రి, దువ్వూరి సూర్యనారాయణశాస్త్రి, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, చెఱుకుపల్లి అప్పారాయశాస్త్రి, ఇంద్రగంటి సూర్యనారాయణశాస్త్రి, చిలుకూరి విశ్వనాథశాస్త్రి, ఆకుండి వేంకటశాస్త్రి, ఓలేటి సూర్యనారాయణశాస్త్రి, పాలెపు వెంకటరత్నం, సామవేదం శ్రీరామమూర్తిశాస్త్రి, పన్నాల వేంకటాద్రిభట్టశర్మ, దివాకర్ల వేంకటావధాని మొదలైన పండితులు పాటుపడ్డారు.

కవిపండితపోషణ

పిఠాపుర సంస్థాన చరిత్రలో రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు కాలం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఇతని సంస్థానంలో ఆస్థాన పండితులుగా శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రి (తర్కశాస్త్రం), తాతా సుబ్బరాయశాస్త్రి (వ్యాకరణం), చిలుకూరి నారాయణశాస్త్రి, వేదుల సూర్యనారాయణశాస్త్రి, గుదిమెళ్ల వేంకటరంగాచార్యులు (విశిష్టాద్వైతము), వడలి లక్ష్మీనారాయణశాస్త్రి (వేదం), దెందుకూరి నరసింహశాస్త్రి (వేదాంతం), తుమురాడ సంగమేశ్వరశాస్త్రి (సంగీతం) మొదలైన దిగ్దంతులు ఉండేవారు. ఈ పండితుల సహకారంతో ఇతడు ప్రతియేటా పీఠికాపుర సంస్థాన విద్వత్పరీక్షల పేరుతో విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంలో శాస్త్ర పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని కానుకలతో సత్కరించేవాడు. ప్రబంధ రచనలో కూడా పోటీలు నిర్వహించేవాడు. ఆనాటి సుప్రసిద్ధ పండితులు ఎందరో ఈ పరీక్షలలో బహూకృతులైనవారే. పానుగంటి లక్ష్మీనరసింహారావు, వేంకట రామకృష్ణ కవులు ఇతని ఆస్థానకవులుగా ఉన్నారు. వీరు కాక చిలకమర్తి లక్ష్మీనరసింహం, కందుకూరి వీరేశలింగం, టేకుమళ్ళ అచ్యుతరావు, దేవగుప్తాపు భరద్వాజము, పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి, శొంఠి భద్రాద్రి రామశాస్త్రి, వేంకట పార్వతీశ కవులు, దాసరి లక్ష్మణకవి, వేదుల రామచంద్రకీర్తి, శ్రీరాం వీరబ్రహ్మకవి, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, కూచి నరసింహము, నడకుదుటి వీరరాజు మొదలైన ఎందరో కవులు ఇతనిచేత సన్మాన సత్కారాలను అందుకున్నారు.

అంకితం పొందిన గ్రంథాలు

ఇక్కడ ఇచ్చినవి ఆయన ప్రచురించిన పుస్తకాలలో ఒక పాక్షిక సూచీ మాత్రమే. ఇవి ఆయనకే అంకితమివ్వబడినవి:

సన్మానాలు, సత్కారాలు

ఇవికూడా చదవండి

మూలాలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).