రావూరి అర్జునరావు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Ravuri hemalatha and ravuri arjuna rao.jpg
manorama,అర్జునరావు దంపతులు

రావూరి అర్జునరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది. గాంధీ, గోరా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన అర్జునరావు కుల, మత రహిత సమాజం కోసం ఎంతో పరితపించేవాడు. అతను భారతదేశంలోనే తొలి కులాంతర వివాహం చేసుకున్నాడు.

జీవిత విశేషాలు

అతను కృష్ణా జిల్లా వానపాముల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1917 లో జన్మించాడు. అతని తండ్రి వెంకటకృష్ణారావు. అతను ఎనిమిదవ తరగతి వరకు చదివి, హయ్యర్‌గ్రేడ్‌ పరీక్షలో ఉత్తీర్ణులైనాడు. అర్జునరావు విద్యార్థిదశలోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. అస్పృశ్యులనబడే వారి గాలిసోకితేనే మైలుపడిపోతామనే మూఢ విశ్వాసం రాజ్యం చేస్తున్న కాలాన 1948లో సేవాగ్రాం ఆశ్రమంలో గోరా పెద్ద కూతురు మనోరమ ను వివాహం చేసుకున్నాడు.[1] నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామ చంద్రరావు కుమార్తె మనోరమతో ఆయనకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే వివాహానికి రెండేళ్లు గడువు పెటిన గాంధీజీ అర్జునరావును నాగ్‌పూర్‌కు దగ్గరలోని తన సేవాగ్రామ్ ఆశ్రమంలో ఉంచారు. ఈ వివాహానికి అంకుర్పాణ చేసింది మహాత్మాగాంధి. మహాత్మా గాంధీ వారికి సేవాగ్రాంలో వివాహం నిర్వహిస్తానని 1946లో "హరిజన" పత్రికలో ప్రకటించాడు. దురదృష్టవశాత్తు వివాహానికి ముందు గాంధీజీ హత్యకు గురైనాడు. 1948 మార్చి 13వ తేదీన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో జయప్రకాష్‌ నారాయణ్‌, ఆచార్య వినోబాభావే, దక్కర్‌ బాపాల సమక్షంలో ఆ ఆదర్శ వర్ణాంతర వివాహం జరిగింది. [2] మొదట కృష్ణాజిల్లా ముదునూరు గ్రామంలో గోపరాజు రామచంద్రరావు గారి నాస్తిక కేంద్రంలో పనిచేసినప్పుడు అతని చిత్తశుద్ధి, క్రమశిక్షణ తన కుల, మత, వర్గ రహిత సమాజస్ధాపన సిద్ధాంతంపట్ల గల విశ్వాసాలపట్ల సంతృప్తి కలిగి గోరా తన పెద్దకుమార్తెనిచ్చి వివాహం చేసాడు.

తన వివాహానంతరం గోరా, సరస్వతీ గోరాల నుంచి స్ఫూర్తి పొంది సంఘసంస్కరణకు, అస్కృశ్యతా నిర్మూలనే ధ్యేయంగా, మూఢన మ్మకాల నిర్మూలనకు, కుల, మత రహిత సమసమాజ స్ధాపనకు, సెక్యులర్‌ వ్యవస్ధ నిర్మాణానికి నిర్విరామంగా కృషి చేసాడు.

అర్జునరావు దంపతులకు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అతను 'మార్పు' అనే ట్రస్టును ఏర్పాటుచేసి వానపాముల గ్రామంలో వారు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. భారత ప్రభుత్వం ఇరువురికి తామ్రపత్రం అందజేసింది. [3]

మూలాలు

  1. "We Become Atheists By Gora". Archived from the original on 2012-07-17. Retrieved 2008-12-29.
  2. "Vaartha Online Edition". Vaartha (in English). 2017-02-06. Retrieved 2020-06-27.
  3. "స్వాతంత్య్ర సమరానికి సాక్ష్యులు - Manam News Telugu". Dailyhunt (in English). Retrieved 2020-06-27.