లావు నాగేశ్వరరావు

From tewiki
Jump to navigation Jump to search
లావు నాగేశ్వర రావు
జననం(1957-06-08)1957 జూన్ 8
విద్యబీకాం, లా
విద్యాసంస్థటిజేఎస్ కళాశాల, ఏసీ కళాశాల
వృత్తిన్యాయవాది, న్యాయమూర్తి
తల్లిదండ్రులు
  • వెంకటేశ్వర్లు (తండ్రి)
  • శివనాగేంద్రమ్మ (తల్లి)

లావు నాగేశ్వరరావు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయన 1995 నుండి 2014 వరకు వీరు సుప్రీంకోర్టులో రెండుసార్లు అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేసారు.[1] సుప్రీంకోర్టులో సీనియర్‌ లాయర్‌గా 22 ఏళ్లుగా నాగేశ్వరరావు పనిచేస్తున్నారు. ఎన్నో కీలకమైన కేసులను వాదించి మంచి న్యాయకోవిదుడిగా పేరు గడించారు. స్వయంకృషికి, పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. వివిధ కేసుల్లో సుదీర్ఘ వాదనలు వినిపించిన ఆయన అక్కడ సీనియర్ కౌన్సిల్ హోదాను పొందారు. సీనియర్ కౌన్సిల్ హోదా నుంచి ఆయన నేరుగా న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.[2]

జీవిత విశేషాలు

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా లోని పెదనందిపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు, శివనాగేంద్రమ్మ దంపతులకు జూన్ 8 1957 న జన్మించారు.[3] స్థానిక లయోలా పాఠశాలలో ప్రాథమిక విద్యను, గుంటూరులోని టీజేపీఎస్‌ కళాశాల్లో బీకాం డిగ్రీ పూర్తి చేశారు. ఏసీ కళాశాలలో లా చదివారు. ఆయనకు నాటక రంగంలో ఎక్కువగా ఆసక్తి ఉండేది. ఆయనకు నాటకాలతో పాటు సినిమా, క్రికెట్ లు కూడా ఆసక్తికరమైన అంశాలు. ఆయన న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న సమయంలో ప్రతిధ్వని సినిమాలో పోలీసు పాత్ర వేసారు. క్రికెటర్ గా ఆయన ఆంధ్ర జట్టు తరఫున రంజీ ల్లో ఆడారు.

1982నుంచి 1984 వరకూ గుంటూరు జిల్లా కోర్టులోనూ, ఆ తర్వాత 1994వరకూ హైకోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు. 1995 జనవరి నుంచి సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పలు కీలక, ప్రధాన కేసులు వాదిస్తూ జాతీయస్థాయిలో పేరొందారు.[4]

సుప్రీం కోర్టు జడ్జిగా

సుప్రీంకోర్టుకు జడ్జిగా రావాలంటే ముందుగా ఏదైనా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. కానీ నాగేశ్వరరావు మాత్రం ఇప్పటివరకు ఏ స్థాయి కోర్టులోనూ న్యాయమూర్తిగా పనిచేయలేదు. ఇలా కిందిస్థాయిలో ఏ కోర్టులోనూ న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా లావు నాగేశ్వరరావు ఘనత సాధించారు. అంతే కాదు జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే తర్వాత.. నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దక్షిణాది నుంచి ఎన్నికైన రెండో లాయర్ కూడా ఆయనే కావడం విశేషం.[5] వీరు 2016, మే-13వ తేదీ శుక్రవారంనాడు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేసారు.

జన్మభూమి రుణం

ఆయన స్వగ్రామమైన పెదనందిపాడును దత్తత తీసుకున్నారు. అచట అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, యువత ఉపాధికి శ్రీకారం చుట్టారు. ఊరిలో పెద్దఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసారు. పెదనందిపాడు ఎడ్యుకేషనల్‌ సొసైటీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ లు అందజేస్తున్నారు. సంవత్సరానికి రూ.లక్ష వ్యయంతో ఒక విద్యార్థిని చదివిస్తున్నారు. పదవీవిరమణ తరువాత గ్రామంలోనే ఉండి సేవ చే యాలనే తలంపుతో ప్రస్తుతం పెదనందిపాడులో ఇల్లు కట్టిస్తున్నారు.[4]

మూలాలు